వ్యాపం స్కాం విచారణ -ది హిందు ఎడిటోరియల్


Vyapam-Scam accused

[జులై 4 తేదీన ది హిందు పత్రిక ‘The Vyapam scam trail’ శీర్షికన ప్రచురించిన సంపాదకీయానికి యధాతధ అనువాదం.]

మధ్య ప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం 2007 సంవత్సరం నాటిది. 2013లో కొన్ని వివరాలు వెలుగు చూసిన తర్వాతనే కుంభకోణంపై నేర పరిశోధనలు ప్రారంభం అయ్యాయి. మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (వ్యవసాయిక్ పరీక్షా మండల్ లేదా వ్యాపం) కు చెందిన అధికారులు వివిధ కోర్సులకు జరిగే అర్హత పరీక్షలను, ఉద్యోగాల నియామకాలను 6 సంవత్సరాలుగా రిగ్గింగ్ చేస్తున్నట్లుగా వెల్లడి అయింది. బహుశా అంతకంటే ఎక్కువ కాలంగా కూడా ఈ అక్రమం జరుగుతూ ఉండవచ్చు. మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం జరిగే పరీక్షలు, పోలీసు కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయులు, బ్యాంకింగ్ అధికారులు.. మొదలైన ఉద్యోగాలు, వాటి కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్ధులు… ఇవన్నీ కుంభకోణంలో భాగంగా ఉన్నాయి. రు 2,000 కోట్లకు పైగా సొమ్ము లంచాల రూపంలో చేతులు మారిందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర పోలీసులు 2,000 మందికి పైగా కుంభకోణం నిందితులను ఇప్పటిదాకా అరెస్టు చేశారు. మరో 700 మంది నిందితుల కోసం వెతుకుతున్నారు.

కుంభకోణంలో భాగస్వామ్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ అధికారులు ఉన్నారు. గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కార్యాలయం కూడా ఆరోపణలు ఎదుర్కొంటోంది. కుంభకోణం పరిమాణం పరిశీలకులను దిగ్భ్రాంతికి గురి చేసేంత భారీ స్ధాయిలో ఉన్నది. అయినప్పటికీ ఇటీవల కాలంలో వివిధ వార్తలు, ముఖ్యంగా మనసులను కలిచివేసే వార్తలు వెలుగు చూసినప్పటి నుండీ ఇది జాతీయ దృష్టిని ఆకర్షించింది. కేసులో నిందితులుగానో లేదా సాక్షులుగానో ఉన్నవారిలో 40 మందికి పైగా అర్ధాంతరంగా చనిపోయారని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. కుంభకోణాన్ని విచారిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం), ఈ మరణాల్లో కనీసం 23 అసహజ మరణాలేనని మధ్య ప్రదేశ్ హైకోర్టు ముందు అంగీకరించింది. మరణించినవారిలో చాలా మంది 25 నుండి 30 సం.ల వయసువారు. రోడ్డు ప్రమాదాలలోనే వీరిలో అత్యధికులు చనిపోయారు. ఒక తీవ్రమైన, స్ధిరమైన తప్పుడు ఆట సాగుతోందని ఈ పరిణామాలు వేలెత్తి చూపుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నుండి గణనీయ స్ధాయిలో లోపాలు దొర్లాయని నిజాలు సూచిస్తున్నాయి. మొదటిగా చెప్పాలంటే ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మాత్రమే నేరుగా జవాబు చెప్పే ‘ప్రత్యేక కర్తవ్య బలగం’ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) కేసులో పరిశోధన జరుపుతోంది -వరుస అనుమానాస్పద హత్యలకు సమాధానమే లేనట్లు కనిపిస్తోంది. మరింత ఘోరం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల స్పందన కోరినప్పుడు వారి సమాధానం మొండిగా రావడమే కాక ఈ (చావుల) విషయాన్ని చిన్నదిగా కొట్టిపారేయడానికి ప్రయత్నించడం. రాష్ట్ర హోమ్ మంత్రి బాబూ లాల్ గౌర్ వరుస చావులను ‘సహజ మరణాలు’గా కొట్టివేశారు. “పుట్టినవారు ఎవరైనా ఏదో ఒక రోజు చావక తప్పదు కదా” అంటూ బోధించారు కూడా.

ఈ సంవత్సరం మొదట్లో ముఖ్యమంత్రి చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తూ తానే స్వయంగా కుంభకోణంపై విచారణకు ఆదేశించినందున వ్యాపం కుంభకోణంలో జరిగిన పరిణామాలు తన నిజాయితిని నిస్సందేహంగా రుజువు చేశాయని చెప్పుకున్నారు. సదరు గొప్పల్లో ఇపుడిక ఎంతమాత్రం నీళ్ళు లేవు. నీతిమంతమైన సుపరిపాలనకు పేరు గాంచిన చౌహాన్ కీర్తి వ్యాపం కుంభకోణం దరిమిలా దెబ్బ తిన్నందున, చురుకుగా వ్యవహరించి స్వతంత్ర దర్యాప్తుకు తక్షణమే ఆదేశాలు ఇవ్వాలి. ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకరు ముందుకు వచ్చి కుంభకోణంపై సి.బి.ఐ చేత విచారణ జరిపించాలని సుప్రీం కోర్టుకు వెళ్లకముందే, కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలి. ఇప్పటికే తన నైతిక మెరుపులో భారీ మొత్తాన్ని కోల్పోయిన బి.జె.పి ప్రభుత్వానికి అది తీవ్ర అవమానమే కాగలదు.

[సంపాదకీయంలో పేర్కొన్నట్లుగా వ్యాపం కుంభకోణంలో అత్యంత దిగ్భ్రాంతి కలిగించే విషయం: మధ్య ప్రదేశ్ గవర్నర్ కొడుకు శైలేష్ యాదవ్ లాంటి వి.ఐ.పి నిందితులతో పాటు అనేకమంది సాక్షులు అర్ధాంతరంగా చనిపోవడం. సాక్షులు లేకుండా చేస్తే కేసు అనుకున్న వైపుకు తిప్పుకోవచ్చన్నది పాత సూత్రమే. హై ప్రొఫైల్ కేసుల్లో ఈ ‘లేకుండా చేసే’ సూత్రం కాస్తా ‘భూమి పైనే లేకుండా చేసే’ సూత్రంగా మారిపోతుంది. కానీ భారీ సంఖ్యలో నిందితులు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో సాక్షులు ఉన్న వ్యాపం కుంభకోణం కేసులో ఏకంగా డజన్ల కొద్దీ మనుషులను ఒక పద్ధతి ప్రకారం చంపివేయడం మాత్రం నిస్సందేహంగా దిగ్భ్రాంతికరం. ఇది దాదాపు సామూహిక జన హననం (జీనోసైడ్) తో సమానం.

ఇలాంటి సామూహిక జన హననం ఇటీవల కాలంలో ఎప్పుడు జరిగింది? ఉత్తర ప్రదేశ్ ఎన్నికలకు ముందు జరిగిన ముజఫర్ నగర్ మత అల్లర్లలో జరిగిందని గుర్తుకొస్తుంది. కాస్త వెనక్కి వెళితే ఇష్రాత్ జహాన్ బృందం బూటకపు ఎన్ కౌంటర్, సోరాబుద్దీన్ ఎన్ కౌంటర్ అనంతర వరుస ఎన్ కౌంటర్లు గుర్తుకు వస్తాయి. ఇంకా వెనక్కి వెళితే 2002 నాటి గోధ్రా రైలు దహనం అనంతరం జరిగిన ముస్లిం హత్యాకాండ జ్ఞప్తికి వస్తుంది. ఇలాంటి సామూహిక హత్యాకాండలకు తెగించే నిర్దయత, అమానవీయత, ఏం చేసయినా అనుకున్నది సాధించాలన్న పాశవిక తెగింపు ఏ శక్తులకు సాధ్యమో ఇప్పటికే రుజువైన సత్యం కాదా? -విశేఖర్]

4 thoughts on “వ్యాపం స్కాం విచారణ -ది హిందు ఎడిటోరియల్

  1. ఇలాంటి సామూహిక హత్యాకాండలకు తెగించే నిర్దయత, అమానవీయత, ఏం చేసయినా అనుకున్నది సాధించాలన్న పాశవిక తెగింపు ఏ శక్తులకు సాధ్యమో ఇప్పటికే రుజువైన సత్యం కాదా?
    అరాచ(జ)కీయ శక్తులు,ముఖ్యంగా ముఖ్యమంత్రి చౌహాన్ హస్తముందని చెప్పదలిచారా?

  2. మధ్య ప్రదేశ్ గవర్నర్ శైలేష్ యాదవ్ లాంటి వి.ఐ.పి నిందితులతో పాటు అనేకమంది సాక్షులు అర్ధాంతరంగా చనిపోవడం-గవర్నర్ రాం నరెష్ యాదవ్,ఇతని కుమారుడు శైలేష్ యాదవ్; పై వాఖ్యం సరిచేసుకోగలరు.

  3. కానీ ఇంతమందిని ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించడం ….అంటే ఒక డిటెక్టివ్ నవల లాగా ఉంది.వాస్తవం కల్పన కన్నా చిత్రంగా ఉండటం అంటే ఇదే అనుకుంటా..!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s