మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్: దర్యాప్తు ఇక ముగింపుకు వస్తోంది!
******************
‘వ్యవసాయిక్ పరీక్షా మండల్’ అన్నది మధ్య ప్రదేశ్ లో వివిధ కోర్సులకు, ఉద్యోగాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ. ఆంగ్లంలో దీని పేరు: మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు. పొడి అక్షరాల్లో ఎం.పి.పి.ఇ.బి గా దీన్ని పిలుస్తారు. ప్రి-ఇంజనీరింగ్, ప్రి-మెడికల్, ఎం.సి.ఏ, టీచింగ్, పోలీస్ తదితర కోర్సులు, ఉద్యోగాల అభ్యర్ధులకు పరీక్షలు నిర్వహించడం ఈ సంస్ధ పని.
ఈ సంస్ధలోని ఉన్నతాధికారులు అనేక అవకతవకలకు పాల్పడుతూ పరీక్షలను, అభ్యర్ధులను కూడా రిగ్గింగ్ చేస్తున్నట్లు 2013లో వెలుగులోకి వచ్చింది. అభ్యర్ధుల నుండి లక్షల రూపాయల లంచాలు వసూలు చేసి అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడి అయింది. ఈ అవినీతి వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారని క్రమంగా వెల్లడి అయింది. చివరికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన భార్య సాధనా సింగ్, రాష్ట్ర గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్, గవర్నర్ పుత్రుడు శైలేష్ యాదవ్ లు కూడా ఈ కుంభకోణంలో నిందితులుగా తేలారు.
ఈ కేసులో మొట్ట మొదట ఈల వేసిన వ్యక్తి (విజిల్ బ్లోయర్) ఇండోర్ కి చెందిన ఒక ఐ.టి. నిపుణుడు. కుంభకోణంలో ప్రధాన నిందితుడు సుధీర్ శర్మ. ఆయన మైనింగ్ లో కోట్లు ఆర్జించాడు. అది సరిపోలేదో లేక కాలక్షేపంగా పెట్టుకున్న వ్యాపకమో తెలియదు గాని , కాలేజీ సీట్లు, ఉద్యోగాల పంపకంలో మధ్యవర్తిగా (బ్రోకర్ గా) అవతారం ఎత్తాడు. ఆయన కంప్యూటర్ ను దర్యాప్తుకై నియోగించిన ఎస్.టి.ఎఫ్ స్వాధీనం చేసుకుంది. కంప్యూటర్ లో దాగిన వివిధ ఫైళ్లను బైటికి తీసే పనిని ఎస్.టి.ఎఫ్, ఐ.టి నిపుణుడిని వినియోగించుకుంది. ఆ నిపుణుడే మొదటిసారి ఈల ఊదాడు. అందుకు ఫలితాన్ని ఆయన అనుభవించాడు కూడా. పోలీసులు ఆయన్ను అనేకసార్లు అక్రమంగా అరెస్టు చేసి హింసలు పెట్టి నోరు తెరవనని మాట తీసుకున్నారు. కానీ ఆయన నోరు తెరవడం మాత్రం మానలేదు.
కుంభకోణం వెలువడ్డాక అక్రమంగా మెడికల్ సీట్లు సంపాదించిన విద్యార్ధులను వెతికే కార్యక్రమాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజ్ (జబల్ పూర్) మాజీ డీన్ డి.కె.సకల్లే చేపట్టారు. ఆయన అక్రమంగా అడ్మిషన్ పొందిన విద్యార్ధుల జాబితాను తయారు చేస్తున్న క్రమంలో అనూహ్యంగా, ఒళ్ళంతా కాలిన గాయాలతో 2014 జులై నెలలో మరణించాడు. ఆయన తర్వాత డీన్ గా అరుణ్ శర్మ నియుక్తం అయ్యారు. ఆయన కూడా అక్రమ విద్యార్ధుల జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. కానీ ఆయన కూడా నిన్న అనగా జులై 5వ తేదీన ఢిల్లీలోని ఉప్పల్ హోటల్ లో శవమై కనిపించారు. ఆయన ఒంటిపై ఎలాంటి గాయము లేదని, కనుక ఆయనది సహజ మరణంగా భావిస్తున్నామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. ఈ ఢిల్లీ పోలీసులే బి.జె.పి కేంద్ర ప్రభుత్వం తరపున ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధిస్తున్న సంగతి గుర్తు చేసుకోవచ్చు.
అక్షయ్ సింగ్ ఇండియా టుడే గ్రూపుకు చెందిన టి.వి టుడే చానెల్ కి పని చేస్తున్న విలేఖరి. వ్యాపం కుంభకోణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు ఆయన కృషి చేస్తున్నారు. తన కృషిలో భాగంగా వ్యాపం కుంభకోణంలో లబ్దిదారుగా ఉన్న ఒక విద్యార్ధిని అనూహ్య పరిస్ధితుల్లో చనిపోవడం గురించి ఆయన ఆరా తీస్తున్నారు. విద్యార్ధిని తల్లిదండ్రులను ఆయన ఇంటర్వ్యూ చేసి బైటికి వచ్చారో లేదా అకస్మాత్తుగా కిందపడి చనిపోయారు. జులై 4 తేదీన జరిగిందీ దుర్ఘటన!
మధ్య ప్రదేశ్ గవర్నర్ తనయుడు శైలేష్ యాదవ్ కూడా ఇలాగే అనూహ్య పరిస్ధితుల్లో చనిపోయాడు. లక్నో లోని తన అధికార నివాసంలోనే ఆయన చనిపోయి ఉండగా కనుగొన్నారు. 50 సం.ల శైలేష్ మధుమేహ వ్యాధి పీడితుడని, ఆయన ఒంటరిగా తన గదిలో నిద్రిస్తారని, ఆయన రక్తంలో చక్కెర స్ధాయి పెరిగిపోయి బ్రెయిన్ హెమరేజి (మెదడులో రక్తం గడ్డకట్టుకోవడం) కి గురై చనిపోయి ఉండవచ్చని కుటుంబ సభ్యులు చెప్పినట్లుగా వార్తలు చెబుతున్నాయి. ఒక సంపన్న రాజకీయ నాయకుడు మధుమేహం వ్యాధితో చనిపోవడం సాధ్యమేనా? అనంతరం జరిగిన పోస్టుమార్టం రిపోర్ట్ లో ఆయన చావుకి కారణం ఏమిటో తెలియలేదని చెప్పారు తప్ప బ్రెయిన్ హెమరేజి గురించి చెప్పలేదు. పైగా ఆయన తలపై లోతైన గాయం ఉన్నదని తేల్చారు.
ఐ.టి నిపుణుని ప్రకారం బ్రోకర్ సుధీర్ శర్మ తన కంప్యూటర్ లో ఏయే ప్రముఖులు ఏయే అభ్యర్ధులను సిఫారసు చేశారో వివరాలను ఒక ఎక్సెల్ షీట్ లో పొందుపరిచాడు. సదరు ఎక్సెల్ షీట్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు, ఆయన సిఫారసు చేసిన అభ్యర్ధుల పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఎస్.టి.ఎఫ్ దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్ లో మాత్రం ఆయన పేరు మాయమైపోయింది. ఐ.టి నిపుణుడి నుండి కంప్యూటర్ ఫైళ్లను స్వాధీనం చేసుకున్న తర్వాతనే ఆయన పేరు స్ధానంలో సి.ఎం, ఉమాభారతీజీ అన్న పేర్లు వచ్చి చేరాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఐ.టి నిపుణుడు కూడా ముఖ్యమంత్రి పేరు ఎక్సెల్ షీట్ లో ఉన్నదని ఢంకా భజాయించి చెపుతున్నారు. అందుకే కేసును సి.బి.ఐ కి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు కూడా.
నిందితుల్లో అధికులు అధికార స్ధానాల్లో ఉన్నవారే. కనుకనే జైల్లో ఉన్న నిందితులు, జైలు బయట ఉన్న సాక్షులు అనూహ్య పరిస్ధితుల్లో అంతు చిక్కని వ్యాధి బారినపడి చనిపోతున్నారు. ‘పుట్టిన ప్రతి ఒక్కరూ చావక తప్పదు కదా’ అని హోమ్ మంత్రి బాబూ లాల్ గౌర్ వ్యాఖ్యానించడం బట్టి చావుల వెనుక హస్తం ఎవరిదో స్పష్టం కావడం లేదా? బీమారు రాష్ట్రాల్లో ఒకటయిన మధ్య ప్రదేశ్ ను అభివృద్ధి పధంలో పరుగులు తీయిస్తున్నాడని బి.జె.పి భీష్ముడు అద్వానీ చేత ప్రశంసలు అందుకున్న మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి చౌహాన్ పాలన ఇలా ఉంది.
వ్యాపం కుంభకోణం త్వరలోనే ముగింపుకు వస్తుందన్న ముఖ్యమంత్రి చౌహాన్ హామీలో అంతరార్ధం ఏమిటో కార్టూన్ చెబుతోంది.
విశేఖర్ గారు, నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, మీ ప్రస్తుత టెంప్లేట్ అంత బాగా లేదు. దీని కంటే మీరు చాలా కాలం ఉపయోగించిన టెంప్లేట్ బాగుంది(మీరు చాలాకాలం ఉపయోగించారు కదా, అదినేను చెప్పేది). ఇప్పుడు ఉన్న టెంప్లేట్ హడావిడి ఎక్కువగానూ ఉన్నట్లనిపిస్తోంది కానీ అంత కన్వీనియంట్ గా లేదు. ఇది కేవలం నా అభిప్రాయం. మీ సైటులో సెర్చ్ బటన్ చూడండి వెతికితే గానీ కనిపించడంలేదు. పైన ఉన్న లింకులు కూడా అంత స్పస్టంగా కనిపించట్లేదు. పాత టెంప్లేట్ చక్కగా ఒక పుస్తకం చదువుతున్నట్లు ఉండేది, ఇందులో టెక్నికల్ హంగమ ఎక్కువగానూ, స్పస్టత తక్కువగానూ అనిపిస్తోంది.
I second the above comment. It’s very hard to read the blog in this template. its not even opening properly in firefox. Please have a look at this issue,
ఇప్పుడు బాగుందండి సైటు…