‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్


Yoga of Politicsచూడ్డానికి సామాన్యంగా కనిపిస్తున్న ఈ కార్టూన్ లో లోతైన అర్ధం దాగి ఉంది.

ప్రధాన మంత్రి పదవి లాంటి ముళ్ళ కుర్చీని యోగాసనాల సహాయంతో నరేంద్ర మోడి అవలీలగా నిర్వహిస్తున్నారని ఈ కార్టూన్ చెబుతున్నట్లు మొదటి చూపులో అనిపిస్తుంది.

కానీ ‘డెవిల్ ఇన్ ద డీటైల్స్’ అన్నట్లుగా కార్టూన్ అంతరార్ధం అంతా ఆ నాలుగు పదాల కార్టూన్ వ్యాఖ్యానంలో దాగి ఉంది.

ఆ నాలుగు పదాల వ్యాఖ్య: THE YOGA OF POLITICS:

ఏమిటి ఈ వ్యాఖ్య అర్ధం? క్లుప్తంగా చెప్పాలంటే, ఈ బ్లాగ్ మొదటి నుండి చెబుతున్నట్లు, యోగాను రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోడి వినియోగిస్తున్నారని.

కార్టూన్ లో పదవీ పీఠంపై కనిపిస్తున్న ముళ్ళు అధికారంలో ఉన్న నరేంద్ర మోడి ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రతిపక్షం నుండి ఎదురవుతున్న వివిధ రాజకీయ సమస్యలతో పాటుగా ప్రధాని మరియు బి.జె.పి లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తాము చేసిన ‘అఛ్చే దిన్’ వాగ్దానం నెరవేర్చలేకపోవడం.

నిజానికి వాగ్దానం నెరవేర్చలేకపోవడం వారికి సమస్య కాదు. తాము ఇచ్చే వాగ్దానాలు కేవలం ఓట్ల కోసమూ, తద్వారా వచ్చే అధికారం కోసమూ మాత్రమేనని వారికి ముందే తెలుసు గనక వారికది సమస్య కాదు. అలాంటి వాగ్దాన ఉల్లంఘన నుండి, తాము చేస్తున్న మోసం నుండి ప్రజల దృష్టిని ఎలా మళ్లించాలన్నదే వారి సమస్య తప్ప ‘అయ్యో వాగ్దానం నెరవేర్చలేదే’ అన్నది కాదు.

ఆరంభంలో దేశ దేశాల నుండీ, విదేశీ, ముఖ్యంగా పశ్చిమ దేశాల, పత్రికల నుండి పొగడ్తల వర్షంలో తడిసి ముద్దైపోతూ ‘ఆ సంస్కరణ తెస్తాం, ఈ సంస్కరణ చేసేస్తాం’ అని అదుపు లేకుండా ఉపన్యాసాలు దంచిన ప్రధాని తీరా అవన్నీ ప్రజా వ్యతిరేక సంస్కరణలు అన్న సంగతి ప్రజలకూ తెలిసిపోయిందని గ్రహించి నాలుక్కరుచుకున్నారు. వారు నాలుక్కారుచుకునేలా చేసినవి ఢిల్లీ ఎన్నికలు!

అప్పటిదాకా ఆర్ధిక వ్యవస్ధను విదేశీ పెట్టుబడులకు స్వర్గధామంగా చేసేస్తామని, ఆటంకాలు తొలగించేస్తామని, ఎలాంటి కార్మిక సమస్యలు లేకుండా చట్టాలు చేస్తామని ఇంటా, బయటా ఎక్కడంటే అక్కడ మాట్లాడేసిన ప్రధాని ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో స్వరం కాస్తా మార్చారు. ఈసారి దేశాన్ని పెట్టుబడులకు స్వర్గం చేస్తామని చెబుతూనే అది ‘పేదల కోసమే’ అని తన ఉపన్యాసాల చివర తోక తగిలించడం మొదలు పెట్టారు.

ఎన్ని చేసినా భూసేకరణ చట్టం సవరణలు రైతులకు బద్ధ వ్యతిరేకం అన్న సంగతి జనానికి అర్ధమై పోయింది. బి.జె.పి ప్రభుత్వానికి అదొక పెద్ద సమస్యగా మారింది.

ఉపాధి హామీ పధకానికి నిధులు పెంచాం అని బడ్జెట్ లో ఘనంగా చాటిన ప్రభుత్వం ఆచరణలో అనేక పనులను పధకం పరిధి నుండి తప్పించి భారం దించుకున్నారు. ఉపాధి దక్కని జనం తాము చేసిన తప్పేమిటో గ్రహించడం ప్రారంభించారు.

నా హయాంలో ఒక్క కుంభకోణం అన్నా జరిగిందా అని ప్రశ్నించిన మోడి మధ్య ప్రదేశ్ ప్రొఫెషనల్ బోర్డు కుంభకోణం, మహా రాష్ట్ర అంగన్వాడీ కుంభకోణం, సుష్మా స్వరాజ్-లలిత్ మోడి-వసుంధర రాజే లతో కూడిన లలిత్ గేట్…. ఇలా వరుసగా బయల్పడుతున్న కంకాళాలకు సమాధానం లేక, ఇవ్వలేక ‘మౌన ముని’ గా మారిపోయారు.

ఇలాంటి ‘ముళ్ళ సందడి’ ని మరిపించడానికి అక్కరకు వచ్చిన మంత్రమైంది ‘యోగా’! పోయిన సంవత్సరం ‘స్వచ్చ భారత్’ అంటూ హడావుడి చేసి జనానికి ఎందుకూ పనికిరాని జాతరలో ముంచి తేల్చారు. రెండో సంవత్సరం ‘యోగా జాతర’కు తెర లేపారు.

మనసును ప్రశాంతతలో ముంచి ఉంచే గొప్ప యోగా! శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే బ్రహ్మాండమైన యోగా! మనుషుల మధ్యా, దేశాల మధ్యా శాంతిని పరిఢవిల్లజేసే ప్రాచీన భారతీయ యోగా! సర్వరోగ నివారిణి ఇప్పుడిక జిందా తిలిస్మాత్ కాదు, భారత ప్రాచీన యోగా!

ఆ విధంగా తన బతుకు తాను బతుకుతూ, చేరదీసినవారిని ఎంతోకొంత బతికిస్తున్న యోగా రాజకీయ మకిలిలో చిక్కుకుని మసకబారే ప్రమాదాన్ని ఎదుర్కొంది. ఏనాడూ యోగా గురించి మాట్లాడని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అది ఇస్లాం-వ్యతిరేకం అని ప్రకటనలు ఇచ్చారు. ఏనాడూ బైటికి రాని ఉప రాష్ట్రపతి వ్యక్తిగత యోగా అలవాటు బజారుకు ఈడ్వబడింది. వ్యక్తిగత ఆచరణగా, గౌరవప్రదమైన అలవాటుగా, ఆరోగ్య ప్రదాయనిగా ఉండవలసిన యోగా ‘మత రాజకీయం’ మురికిలోకి ఈడ్వబడుతోంది.

అధికార సోపానంలో పైపైకి ఎగబాకేందుకు అక్కరకు వచ్చిన మత విశ్వాసం రంగు మాసి వెలిసిపోవడంతో రాజకీయ కంటికి ఇంపుగా కనపడినదానికి మతాన్ని పులిమి జనంలోకి వదిలేస్తున్నారు.

అధికారం లోకి రావడానికి మతం! ఆ అధికారాన్ని నిలుపుకోవడానికి మతం రంగు పులిమిన ప్రాచీన ఆరోగ్య శాస్త్రం యోగా!!

THE YOGA OF POLITICS అంటే ఇదే!

5 thoughts on “‘రాజకీయం’ అను యోగాసనం -కార్టూన్

 1. ఇంతకీ సుసుష్మా భర్త లలిత్ మోడి కి లాయర్ గా ఉన్నాడని 5 సం క్రితం ఎందుకు గోల చేయలేదు ? Sushma, రాజే ఎన్ని లక్షల కోట్ల కుంభ కోణం చేశారు? బోడి యల్.కె.జి. అడ్మిషన్ కొరకు రెకమెండేషన్ లెటర్ కొరకు ప్రయత్నించే దేశం లో, లా సీట్ కొరకు సుష్మ మోడి సహయం తీసుకొంటె తప్పా? లలిత్ మోడి కుటుంబనికి 20ఏళ్లు గా ఆమే భర్త లాయర్ గా ఉన్నాడు , సూహ్మా మొదటి నుంచి రాజకీయాలలో మే ఉన్నాది.

  ఈ రోజు లలిత్ మోడి పై వచిన ఆరోపణలను దృష్టి లో పెట్టుకొని ఆమేదో దశాబ్దాలుగా గోల్మాల్ క్షేస్తుందనే విధం గ ప్రచారం చేస్తే విలువ ఇస్తారా? అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడు లేవనెత్తితే ఎవ్వరు పట్టింకోరు. లలిత్ మోడి ట్విటర్లో 10 లక్షల మందిపైగా ఫాలో అవుతున్నరు. వాస్తవాలు అందరికి తెలుస్తున్నాయి. పగలు రాత్రి మోడి మీద అబద్దాలు రాయటమే మీరు జీవితధ్యేయం గా పెట్టుటుకొవటం శోచనీయం.

 2. తన బతుకు తాను బతుకుతూ, చేరదీసినవారిని ఎంతోకొంత బతికిస్తున్న యోగా-ఎంతో కొంతేమిఖర్మ యోగాని న(అ)మ్ముకుంటూ పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలే వెలిశాయి.

 3. Hi Srinivas,

  మోడి గారి పైన ఈగ వాలకుండా చూడడమే పనిగా పగలు, రాత్రి మీరు కృషి చేయడం కడు శోచనీయం.

  లలిత్ మోడి ఫాలోయర్స్ సంఖ్య పై ఉన్న శ్రద్ధ ఆయన అవినీతిపై పెడితే మీరూ కళ్ళు తెరవచ్చు. ఏమో, గుర్రం ఎగరావచ్చు!

  ఇంతకీ ఎప్పుడో బాబర్ మసీదు కూల్చినపుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకో చెప్పగలరా?

 4. / బోడి యల్.కె.జి. అడ్మిషన్ కొరకు రెకమెండేషన్ లెటర్ కొరకు ప్రయత్నించే దేశం లో/
  అవును నిజమే, గొమ్గటిలొ తింటూ వెంట్రుకలు ఉన్నాయనటమ్ సబబు గాదు, శ్రీనివాసు గారు చాలా అందంగా చెప్పారు. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s