బి.జె.పి పితామహుడు మనసులో మాట కక్కేశారు. లలిత్ మోడి అవినీతి కుంభకోణం నుండి బైటపడే మార్గం ఏమిటో తన పార్టీ నాయకులకు చూపారు. వివిధ అవినీతి మరియు అనైతిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తదితర బి.జె.పి మంత్రులు తక్షణమే తొక్కవలసిన బాట ఏమిటో ఆయన స్పష్టంగా చూపారు. వీరందరికీ మార్గం చూపడం అంటే వారికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడి, అమిత్ షాలకు కూడా మార్గం చూపినట్లే.
“ఒక రాజకీయ నాయకునికి ప్రజల నమ్మకం చూరగొనడం అత్యంత పెద్ద బాధ్యత. నైతిక బాధ్యత ‘రాజధర్మం’ నిర్వహించమని డిమాండ్ చేస్తుంది. ప్రజా జీవితంలో హుందాతనంతో మెలగాలి” అని బి.జె.పి వ్యవస్ధాపక నేత ఎల్.కె.అద్వానీ తన పార్టీ నేతలకు హితబోధ చేశారు. బెంగాలీ పత్రిక ఆనందబజార్ కు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ఈ మాటలు చెప్పారు. లలిత్ మోడి పాస్ పోర్ట్ కుంభకోణం, రు. 206 కోట్ల మహారాష్ట్ర అంగన్వాడి కుంభకోణం, మధ్య ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణం… ఇత్యాది కుంభకోణాలలో బి.జె.పి ప్రభుత్వాల కూరుకుని ఉన్న నేపధ్యంలో అద్వానీ మాటలు యధాలాపంగా చెప్పినవి కాబోవు.
విదేశీ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు లలిత్ మోడి పాస్ పోర్ట్ కుంభకోణంలో పీకలలోతు కూరుకునిపోగా మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీ 2009 ఎన్నికల అఫిడవిట్ లో ఒక డిగ్రీ క్వాలిఫికేషన్, 2014 ఎన్నికల అఫిడవిట్ లో మరొక డిగ్రీ క్వాలిఫికేషన్ ను చెప్పుకుని కోర్టు కేసు ఎదుర్కొంటోంది. మహా రాష్ట్ర చట్టాల ప్రకారం రు 3 లక్షల పైబడిన కొనుగోళ్లన్నీ ఈ-టెండర్ల ద్వారా జరపవలసి ఉండగా ఒకే రోజు 24 ప్రభుత్వ ఆదేశాల ద్వారా రు. 206 కోట్ల కొనుగోళ్ళు జరిపిన ఆరోపణలను పంకజ ముండే ఎదుర్కొంటోంది.
వీళ్ళంతా స్త్రీలే కావడంతో ‘మహిళలు’ కనుకనే కాంగ్రెస్ దాడి చేస్తోందని బి.జె.పి ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసింది. కానీ వారి పధకం పారలేదు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా మహిళే అనీ, అలాగని ఆమెపై నిరంతర దాడి చేయకుండా బి.జె.పి ఊరుకుందా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడంతో బి.జె.పి నేతలు మారు మాట్లాడలేదు. తాము ఎన్నడూ సోనియా గాంధీ మహిళ కనుకనే బి.జె.పి దాడి చేసిందన్న వాదనకు దిగలేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. అంతటితో ‘మహిళలే కాబట్టి’ అన్న ఆత్మ రక్షణను బి.జె.పి వదిలేసింది.
సుష్మా స్వరాజ్, వసుంధర రాజేలు లలిత్ గేట్ లో పాత్ర వహించడం గురించి వ్యాఖ్యానించమని కోరగా అద్వానీ అందుకు నిరాకరించారు. “నేను వాటన్నిటికీ దూరంగా ఉన్నాను. కనుక వ్యాఖ్యానించడానికి నాకు అవకాశం లేదు. నిర్ణయాలు చేసే పాత్రలో నేను లేనందున ఈ అంశాల్లో నేను వ్యాఖ్యానించలేను” అని అద్వానీ చెప్పారు. అద్వానీ తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగానే చెప్పారని, అంత పెద్ద మనిషి వ్యాఖ్యల అర్ధాన్ని మనమే స్వీకరించాలని కాంగ్రెస్ నేతలు వివరిస్తున్నారు. కాంగ్రెస్ నేతల వివరణకు అద్వానీ ఇంతవరకు స్పందించలేదు.
1996లో తనపై హవాలా కుంభకోణం ఆరోపణలు వచ్చిన సంగతిని అద్వానీ గుర్తు చేశారు. “జైన్ డైరీల ఆధారంగా నాపై ఆరోపణలు తలెత్తిన రోజు సాయంత్రమే నేను పండారా లోని మా ఇంట్లో కూర్చొని ఎం.పిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. అది ఎవరి నిర్ణయమూ కాదు. కేవలం నా నిర్ణయం మాత్రమే. ఆ వెంటనే వాజ్ పేయికి ఫోన్ చేసి నా నిర్ణయం గురించి తెలిపాను. రాజీనామా చేయవద్దని ఆయన వారించారు కానీ నేను ఎవరి మాటా వినలేదు. ప్రజలు ఎన్నికల్లో మనకు ఓట్లు వేశారు. కనుక ప్రజల పట్ల నిబద్ధత చాలా ముఖ్యం” అని అద్వానీ వాకృచ్చారు.
అద్వానీ చేస్తున్న నీ(టి)తి బోధలు ఆయన నిజంగా పాటించారా అన్నది వివాదాస్పదం. ఆనంద బజార్ పత్రికకు ఆయనే చెప్పినట్లు బి.జె.పి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో కూడా అత్యున్నత నేతగా తనకు ఎలాంటి పదవి అప్పజెప్పని మోడి ప్రభుత్వం పట్ల ఆయనకు ఉన్న అభిప్రాయాలు ఏమిటో తెలిసిందే. తనకు దక్కవలసిన ప్రధాని పదవి దక్కకుండా సైంధవుడిలా అడ్డుపడిన నరేంద్ర మోడిని అద్వానీ క్షమించడం కల్ల అని ఆయన అప్పుడప్పుడూ విసిరే చెణుకులూ, బాణాలు తెలియజేస్తాయి. ఏకంగా పార్టీ నుండి రాజీనామా చేసి ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో సద్దుమణిగిన అద్వానీ తన అసంతృప్తిని ఈసారి ‘రాజకీయ హుందాతనం’ వ్యాఖ్యల ద్వారా మరోసారి వెళ్ళగక్కారు.
లేకుంటే బాబ్రీ మసీదు కూల్చివేత కోసం సాగించిన రధయాత్ర పొడవునా మతకల్లోలాల మంటలను రగిల్చి వేలాది ప్రాణాలను బలిగొని బి.జె.పి బలాన్ని పార్లమెంటులో 2 సీట్ల నుండి 80 సీట్లకు పెంచుకున్న అద్వానీ ‘రాజకీయ హుందాతనం’ గురించి ఇప్పుడు లెక్చర్లు ఇవ్వడం ఏమిటి? ‘ఔర్ ఏక్ ఢక్కా మారో’ అంటూ బాబ్రీ కూల్చివేతను దగ్గరుండి ప్రోత్సహించిన అద్వానీ లిబర్హాన్ కమిషన్ ముందు మాత్రం ‘రామ రామ నాకా గొడవే తెలియదు. నేనక్కడ లేను’ అని బొంకిన అద్వానీ ఇప్పుడు ‘ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని’ బోధించడం ఏమిటి?
కాగా, వరుస కుంభకోణాలు వెలుగు చూస్తున్నప్పటికీ ‘నా యేడాది పాలనలో ఒక్క అవినీతి కుంభకోణం అన్నా వెలుగు చూసిందా?’ అని ప్రశ్నించిన ప్రధాని నరేంద్ర మోడి ఇప్పుడెందుకు నోరు మెదపరు చెప్మా?!
Namsate saar, Greece Problems gurinchi rastara ani asistunnanu.
రామారావు గారు, త్వరలో రాస్తాను.
namaste sar pawan kalyan gurinchi spandinchandi. please