ఐ.పి.ఎల్ మాజీ బాస్, బి.సి.సి.ఐ మాజీ ఉపాధ్యక్షుడు, పారిపోయిన నేరస్ధుడు అయిన లలిత్ మోడి వ్యవహారం రాజస్ధాన్ ముఖ్యమంత్రిని వదిలేట్లు లేదు. రాజస్ధాన్ అసెంబ్లీ ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినా లలిత్ మోడీ వ్యవహారం సదరు క్లీన్ చిట్ ను వెక్కిరిస్తూనే ఉంది.
లలిత్ మోడీపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు, ఐ.పి.సి కేసు దాఖలు కావడంతో ఆయన లండన్ పారిపోయాడు. వలస వచ్చిన పక్షిగా అక్కడే సెటిల్ కావాలని నిర్ణయించుకుని అందుకు దశాబ్దాల నాటి కుటుంబ స్నేహితులైన వసుంధర రాజే సహాయాన్ని కోరారు.
అది 2011 నాటి సంగతి. బి.జె.పి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారీ నేతృత్వంలో అప్పటి ప్రతిపక్ష బి.జె.పి నేతల ప్రతినిధి బృందం యు.కె సందర్శించింది. ఆ బృందంలో సభ్యురాలిగా వెళ్ళిన వసుంధర రాజే (అప్పటి రాజస్ధాన్ శాసన సభ ప్రతిపక్ష నేత), బృందం వెనక్కి బయలుదేరిన తర్వాత కూడా లండన్ లోనే కొద్ది రోజులు ఉండిపోయారు.
ఆ ఉండిపోవడం లలిత్ మోడీకి సహాయ పడేందుకే. బ్రిటన్ కు వలస వచ్చి స్ధిరపడేందుకు లలిత్ మోడి ప్రధానంగా ముగ్గురి అఫిడవిట్ లపై ఆధారపడ్డారని ఆ ముగ్గురిలో రాజే ఒకరని పత్రికల సమాచారం. లలిత్ మోడీ ఇమ్మిగ్రేషన్ కు మద్దతుగా యు.కె ప్రభుత్వానికి అఫిడవిట్ సమర్పించిన ఆమె, తాను లలిత్ మోడీకి సాయం చేసిన విషయం భారత ప్రభుత్వానికి తెలియనివ్వవద్దని యు.కె ప్రభుత్వాన్ని కోరారు.
బి.జె.పి నేతల భారతీయత, దేశభక్తి ఇలా ఉంది!
ఆమె రాజీనామాను కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తుండగా బి.జె.పి అతిరధ మహారధులంతా ఆమెకు మద్దతుగా వచ్చారు. ఆ మద్దతుకు ముందు రాజే సంతకం లేని అఫిడవిట్ కాపీని కాంగ్రెస్ నేతలు బహిరంగం చేశారు. సంతకం లేని పత్రాలు రాజే తప్పుని ఎలా నిర్ధారిస్తాయని బి.జె.పి నేతలు ఎద్దేవా చేశారు కూడా.
తీరా బి.జె.పి మహామహులు అందరూ మాట్లాడాక ఆమె సంతకం ఉన్న పత్రాన్ని కాంగ్రెస్ బైటపెట్టింది. దానితో బి.జె.పి నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిపోయింది.
ఇప్పుడు వెనక్కి వెళ్లలేరు. అలాగని ముందుకు సాగిపోయి వసుంధర చేత రాజీనామా చేయించనూ లేరు. పరిస్ధితిని గమనించిన వసుంధర అప్పుడే బలప్రదర్శనకు దిగారని ఎమ్మెల్యేల సంతకాలు సేకరిస్తున్నారని కొన్ని ఛానెళ్లు చెబుతున్నాయి.
రాజే చేత రాజీనామా చేయిస్తే అది అక్కడితో ఆగబోదని, ఈ సంక్షోభం మరిన్ని తలల్ని బలిగోరుతుందని బి.జె.పి నేతలు భయపడుతున్నట్లుగా అభిజ్ఞవర్గాల భోగట్టా. అదే జరిగితే త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికలు బి.జె.పికి మరో చేదు పాఠాన్ని నేర్పడం ఖాయం.
ఎంత గొడవ జరుగుతున్నా ప్రధాని నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోవడం ఏమిటో తెలియకుంది. మాజీ ప్రధాని మన్మోహన్ ను మౌన ముని అని పదే పదే అపహాస్యం చేసిన మోడి ఇప్పుడు ఎందుకు నోరు తెరవడం లేదు?