నరేంద్ర మోడి నీతిమంతమైన పాలనలో మొదటి ‘గేట్’ తెరుచుకుంది. ‘నా యేడాది పాలనలో ఒక్క కుంభకోణం అయినా జరిగిందా? నాయకుల పిల్లలు, అల్లుళ్ళకు అయాచిత లబ్ది ఒనగూరిందా? గత యేడాదిలో ప్రజలకు మంచి రోజులు వస్తే దేశాన్ని దోచుకునేవారికి చెడ్డ రోజులు వచ్చాయి” అని తమ ప్రభుత్వ వార్షిక దినాన మోడి ప్రకటించిన కొద్ది రోజులకే ‘లలిత్ గేట్’ బట్టబయలయింది. నరేంద్ర మోడి ఎడతెగకుండా చేస్తున్న ‘నీతిమంతమైన పాలన’ చప్పుళ్లను అపహాస్యం చేస్తూ లలిత్ మోడి పాస్ పోర్ట్ కుంభకోణం విదేశీ పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చింది. నరేంద్ర మోడి తనకు తానే ఇచ్చుకునే ‘అవినీతి వ్యతిరేక’ సర్టిఫికేట్ ఒట్టి బూటకం అని ‘లలిత్ గేట్’ బహిరంగంగా తేల్చేసింది.
మనీ లాండరింగ్ మార్గాల ద్వారా పెద్ద మొత్తంలో సొమ్మును విదేశాలకు తరలించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడి లండన్ పారిపోయి అక్కడ శరణు తీసుకుంటున్నాడు. గత యు.పి.ఏ ప్రభుత్వం ఆయన్ను ‘పారిపోయిన నేరస్ధుడు’గా ప్రకటించి పాస్ పోర్ట్ తదితర ప్రయాణ పత్రాలను రద్దు చేసింది. ఆయన్ను ఇండియాకు అప్పగించాలని బ్రిటన్ ను కోరింది. ఆయనపై బ్లూ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. కానీ బి.జె.పి/ఎన్.డి.ఏ-2 ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సిఫారసుతో బ్రిటన్ ప్రభుత్వం లలిత్ మోడీకి తమ సొంత ప్రయాణ పత్రాలను జారీ చేసింది. సదరు పత్రాల ద్వారా లలిత్ మోడీ, ఇండియా తప్ప, దేశాలన్నీ చుట్టేస్తూ ప్రఖ్యాత టూరిస్టు కేంద్రాలను సందర్శిస్తూ, ప్రముఖ అంతర్జాతీయ మోడళ్లతో కలిసి ఫోటో సెషన్ లలో పాల్గొంటూ ఆనందించడం ప్రారంభించాడు.
‘పారిపోయిన నేరస్ధుడి’ని పట్టుకుని విచారించడం, ఆయన అక్రమంగా తరలించిన సొమ్మును తిరిగి దేశానికి రప్పించడం మాని ఆయనకు అధికారికంగా సహకరించడం ద్వారా విందు వినోదాలలో తేలిపోయే అవకాశాన్ని కల్పించడమే ‘లలిత్ గెట్’ లోని ప్రధాన అంశం. ‘లలిత్ గేట్’ అవినీతి/మనీ లాండరింగ్ కుంభకోణంలో తవ్వేకొద్దీ పెద్ద పెద్ద కంకాళాలు బైటపడుతుండడంతో బి.జె.పి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది. బడా నేతలు, కేంద్ర మంత్రులు ఒక్కొక్కరుగా సుష్మా స్వరాజ్ కు మద్దతు వచ్చేకొద్దీ వివిధ పత్రికలు, నేతలు, పార్టీల ద్వారా మరిన్ని అంశాలు వెలుగు చూస్తున్నాయి.
ఈ కుంభకోణం సుష్మా స్వరాజ్ వరకే పరిమితం కాలేదని, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మొదలుకుని కాంగ్రెస్ నేతలు, ఎన్.సి.పి నేతల వరకు లలిత్ మోడీకి సహాయం చేసినవారిలో ఉన్నారని వెల్లడి అయింది. తనతో పాటు, తనకు సాయం చేసిన సుష్మా స్వరాజ్ ను సమర్ధించే ప్రయత్నంలో లలిత్ మోడి స్వయంగా కుంభకోణంలోని మరిన్ని కోణాలను వెల్లడి చేయడం విశేషం. ఈ వ్యవహారం అంతటిలో ప్రధాని నరేంద్ర మోడి నోరు తెరిచి ఇంతవరకు ఒక్క ముక్కా మాట్లాడలేదు. తద్వారా ఆయన తమ మంత్రులు, నేతలు తప్పు చేసిన మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించారు.
ఎవరీ లలిత్ మోడి?
ఐ.పి.ఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) గురించి వినని వారు ఉండరు. ఐ.పి.ఎల్ రూపకర్తగా లలిత్ మోడిని ఇప్పటికీ పత్రికలు చెబుతుంటాయి. నిజానికి ఇండియాలో మొదటి లీగ్ క్రికెట్ సంస్ధ ఐ.సి.ఎల్ (ఇండియన్ క్రికెట్ లీగ్). జీ టి.వి సంస్ధ ప్రమోట్ చేసిన ఐ.సి.ఎల్, బి.సి.సి.ఐ ఆధిపత్యం పరిధికి బైట ఏర్పడింది. టి20 మ్యాచ్ లకు ప్రజాదరణ పెరుగుతున్న నేపధ్యంలో బి.సి.సి.ఐ ఆధిపత్యానికి అవతల ఏర్పడిన ఐ.సి.ఎల్ తమకు పోటీగా మారుతుందని అప్పటి క్రికెట్ (రాజకీయ) పెద్దలు పసిగట్టారు. ఎన్.సి.పి నేత శరద్ పవార్, బి.జె.పి నేత అరుణ్ జైట్లీ, పారిశ్రామికవేత్త శ్రీనివాసన్ లాంటి దళారీ సంపన్నులు ఐ.సి.ఎల్ కు పోటీగా లలిత్ మోడీ సారధ్యంలో ఐ.సి.ఎల్ ను కాపీ కొడుతూ ఐ.పి.ఎల్ ను తెరమీదికి తెచ్చారు.
ఆరంభంలో ఐ.పి.ఎల్ ను తట్టుకుని ఐ.సి.ఎల్ నిలబడినప్పటికీ శరద్ పవార్ ప్రభృతులు నిరంతరం బెదిరింపులు సాగించడం, ఐ.సి.ఎల్ లో పాల్గొనకుండా ఆటగాళ్లను నిరోధించడం, రాష్ట్ర ప్రభుత్వాలు, క్రికెట్ క్లబ్బుల ఆధ్వర్యంలో నడిచే స్టేడియంలు ఐ.సి.ఎల్ పోటీలకు అందకుండా ఆటంకాలు కల్పించడం… మొ.న కుట్రలవల్ల ఐ.సి.ఎల్ మనుగడ కష్టంగా మారింది. 2007 నుండి 2009 వరకు రెండు టోర్నమెంట్ లు నిర్వహించిన ఐ.సి.ఎల్, బి.సి.సి.ఐ కుట్రల ఫలితంగా తనను తాను రద్దు చేసుకొక తప్పలేదు. ఆ విధంగా లలిత్ మోడి సారధ్యంలోని ఐ.పి.ఎల్ ఇండియాలో ఏకైక క్రికెట్ లీగ్ మ్యాచ్ నిర్వహణ కంపెనీగా అవతరించింది. తెరవెనుక రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు ఉండగా తెరముందు మాత్రం ఐ.పి.ఎల్ కమిషనర్ గా, అధిపతిగా లలిత్ మోడి బాధ్యతలు నిర్వహించాడు.
లలిత్ మోడి ఐ.పి.ఎల్ ద్వారా ప్రాచుర్యం పొందినప్పటికీ ఆయన అప్పటికే రాజకీయ సంపన్న వర్గాల్లో చిరపరిచితుడు. కాంగ్రెస్ మాజీ నేత, ఎన్.సి.పి (నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ) వ్యవస్ధాపక నేత అయిన శరద్ పవార్ క్రికెట్ కు సంబంధించినంతవరకు ఆయనకు మార్గదర్శి (మెంటర్). రాజస్ధాన్ రాజవంశీయురాలు, ముఖ్యమంత్రి కూడా అయిన వసుంధర రాజే తమ కుటుంబ స్నేహితురాలు (ఫ్యామిలీ ఫ్రెండ్) అని లలిత్ మోడీయే వెల్లడించారు. ఎల్.కె.అద్వానీ శిష్యురాలు, నరేంద్ర మోడి మంత్రివర్గంలో ‘అద్వానీ తరపు ముల్లు’గా మోడి అనుచర వర్గం భావించే సుష్మా స్వరాజ్ కూడా లలిత్ మోడీకి స్నేహితులు.
భారత ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లలిత్ మోడీ పై నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో లలిత్ తరపున సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, కూతురు బన్సూరి కౌశల్ వాదిస్తున్నారు. ఇంకా ఘోరం ఏమిటంటే 2009, 2013 సంవత్సరాల్లో మధ్య ప్రదేశ్ లోని బి.జె.పి (శివరాజ్ సింగ్ చౌహాన్) ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్లీడర్లుగా సుష్మా స్వరాజ్ భర్త, కూతుళ్లను నియమించడం. సమాచారహక్కు చట్టం ద్వారా ఈ సంగతి ఇటీవలే వెలుగులోకి వచ్చింది. సుష్మా స్వరాజ్, శివరాజ్ సింగ్ చౌహాన్ లు బి.జె.పిలో ఎల్.కె.అద్వానీ శిబిరంలో సభ్యులుగా ప్రచారం పొందిన సంగతి ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవచ్చు. బి.జె.పిలో తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకోవడానికీ, మధ్య ప్రదేశ్ ప్రొఫెషనల్ ఎక్జామినేషన్ బోర్డ్ కుంభకోణంలో తన పాత్ర బైటపడిన దరిమిలా తన కుర్చీ కాపాడుకోవడానికీ శివరాజ్ ఈ నియామకాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.
లలిత్ మోడి సంపన్న కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబం ‘మోడి ఎంటర్ ప్రైజెస్’ పేరుతో ఒక పారిశ్రామిక గ్రూపు సంస్ధను నిర్వహిస్తోంది. ఇండియాలో అతి పెద్ద పొగాకు కంపెనీల్లో ఒకటయిన గాడ్ ఫ్రే ఫిలిప్ ఇండియా కంపెనీకి దాదాపు ఇరవై యేళ్ళ నుండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా లలిత్ పని చేస్తున్నాడు. బహుళజాతి పొగాకు కంపెనీ ‘ఫిలిప్ మోరిస్ ఇంటర్నేషనల్’, ‘మోడీ ఎంటర్ ప్రైజెస్’ కంపెనీలు సంయుక్తంగా గాడ్ ఫ్రే ఫిలిప్ ఇండియా కంపెనీని నడుపుతున్నాయి. ఇ.ఎస్.పి.ఎన్ స్పొర్ట్స్ చానెల్ కు భారత వ్యాపిత పంపిణీదారుగా పదేళ్ళు పని చేశారు. మోడీ ఎంటర్టైన్మెంట్ నెట్ వర్క్ కంపెనీ ద్వారా ఫ్యాషన్ టి.విని ప్రసారం చేస్తున్నారు. సిక్సో పేరుతో కేరళలో ఆన్ లైన్ లాటరీ వ్యాపారం నిర్వహించారు. రాజస్ధాన్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ ప్రవేశించాడు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, రాజస్ధాన్ క్రికెట్ అసోసియేషన్, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లలో అధ్యక్షుడుగా, బోర్డు సభ్యుడుగా పదవులు నిర్వహించాడు. చివరికి శరద్ పవార్ ఆశీస్సులతో బి.సి.సి.ఐ ఉపాధ్యక్షుడుగా నియమితుడై ఐ.పి.ఎల్ కి సారధ్యం వహించాడు. ఆయన నేతృత్వంలో బి.సి.సి.ఐ ప్రపంచంలోనే సంపన్నమైన క్రికెట్ సంస్ధగా ఆవిర్భవించిందని పత్రికలు తరచూ చెబుతాయి.
ఈ వాస్తవాలన్నీ భారత సంపన్న పాలకవర్గాలలో లలిత్ మోడి స్ధానం ఏమిటో వివరిస్తాయి. ‘మోడి ఎంటర్ ప్రైజెస్’ అనే తన కుటుంబ కంపెనీ ఆలంబనగా లలిత్ మోడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తారం కావించుకోవడానికి క్రికెట్ ఆధారిత మీడియాని ప్రధాన సాధనంగా వినియోగించాడు. క్రికెట్ పట్ల భారత ప్రజల్లో అత్యధికులకు ఉన్న పిచ్చిని సొమ్ము చేసుకునే వ్యూహాలను రచించాడు. తద్వారా తన ఆర్ధిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడమే కాకుండా కాంగ్రెస్, బి.జె.పి ఇరు పార్టీలలోని అనేకమంది రాజకీయవేత్తలకు డబ్బు మూటలు సంపాదించిపెట్టాడు.
ఇలాంటి వ్యక్తి కేవలం ఒకే ఒక్క ఐ.పి.ఎల్ సీజన్ (సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఐ.పి.ఎల్ 2) ద్వారా రు. 500 నుండి రు. 700 కోట్ల వరకు పైగా నల్ల ధనాన్ని విదేశాలకు తరలించడం పెద్ద విషయం ఏమీ కాదు. లలిత్ గేట్ నుండి భారత ప్రజలు గ్రహించవలసిన అసలు విషయం భారత ఆశ్రిత పెట్టుబడిదారీ (క్రోనీ కేపిటలిస్టు) వ్యవస్ధలో ఆర్.ఎస్.ఎస్-బి.జె.పి అనే బూటకపు హిందూ జాతీయ వాద సంస్ధల గుంపు కూడా విడదీయరాని భాగం అన్నదే. ఈ గుంపుకు భారత ప్రజలను మోసం చేసి వారి ఓట్లను కొల్లగొట్టడానికే హిందూత్వ కావాలి. ఓట్ల జాతరలో అధికారం చేపట్టడానికి, హిందూత్వ భావజాలం మాటున తమ ఓటు బ్యాంకును సుస్ధిరం కావించడం మాత్రమే వారికి కావాలి. అంతే తప్ప భారత ప్రజల ప్రయోజనాలు ఏవీ వారికి పట్టవు. నరేంద్ర మోడీ కొనసాగిస్తున్న కాంగ్రెస్ విధానాలే అందుకు తిరుగులేని రుజువు.
ఎలా వెల్లడి అయింది?
దేశంలోని సమస్త అంగాలు ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉన్నప్పుడు లోలోపల జరిగే అక్రమాలు చట్టబద్ధ సంస్ధల ద్వారా వెల్లడి కావడం జరగనే జరగదు. రాజ్యంలోని వివిధ అంగాల ద్వారా దేశంలోని సహజ సంపదలను సొంతానికి పంచుకునే క్రమంలో ఆధిపత్య వర్గాల మధ్య విభేదాలు తలెత్తినప్పుడే ఉపరితలం కింద దాగిన అక్రమాలు వెలుగులోకి వస్తాయి. లలిత్ మోడి – సుష్మా స్వరాజ్ ల అక్రమ ప్రయాణ పత్రాల జారీ కుంభకోణం కూడా ఈ విధంగానే వెలుగులోకి వచ్చింది.
లలిత్ మోడీ స్వయంగా ఆరోపించిన దాని ప్రకారం టి20 ఛాంపియన్స్ లీగ్ ప్రాయోజితం కావిస్తున్న మీడియా బ్యారన్ రూపర్డ్ మర్దోక్ కు సదరు కాంట్రాక్టు భారంగా పరిణమించింది. వివిధ దేశాల్లోని క్రికెట్ లీగ్ లలో మొదటి, రెండవ స్ధానాల్లో నిలిచిన ఫ్రాంఛైజీలతో టి20 చాంపియన్స్ లీగ్ ను నిర్వహిస్తున్నారు. దీనికి కూడా లలిత్ మోడీయే రూపకర్త. ఐ.పి.ఎల్ ద్వారా ఇండియాలో బి.సి.సి.ఐ నేతలు, రాజకీయ వర్గాలు సంపదల రాశుల్ని పోగేసుకుంటున్న నేపధ్యంలో ఛాంపియన్స్ లీగ్ కూడా లాభసాటిగా ఉంటుందని స్టార్ స్పోర్ట్స్ అధినేత రూపర్డ్ మర్డోఖ్ ఆశించాడు ఆ ఆశతోనే లీగ్ స్పాన్సర్ షిప్ హక్కులు కొనుగోలు చేశాడు.
కానీ అనుకున్న ఆదాయం ఆయనకు దక్కలేదు. నష్టాలు మాత్రమే దక్కాయి. దానితో కాంట్రాక్టు నుండి బైటపడాలని రూపర్ట్ భావించాడు. కానీ కాంట్రాక్టు ఒప్పందంలో స్పాన్సర్ షిప్ నుండి బైటపడే మార్గం ఏమీ లేదు. ఆ సంగతి లలిత్ మోడి బహిరంగం చేయడంతో కాంట్రాక్టు నుండి బైటపడే మార్గం మూసుకుపోయింది. దానితో ఆగ్రహించిన రూపర్ట్ మర్డోఖ్ సుష్మా స్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్, లలిత్ మోడి, బ్రిటన్ ఎం.పి కీత్ వాజ్ తదితరుల మధ్య నడిచిన ఈ మెయిల్ సంభాషణలను తన బ్రిటిష్ పత్రిక సండే టైమ్స్ లో ప్రచురించాడు. వాటిని భారత పత్రిక టైమ్స్ నౌ చానెల్ ఇండియాలో యధావిధిగా ప్రసారం చేయడంతో రాజకీయ తుఫాను మొదలైంది.
లలిత్ మోడిని సాధించడానికి అంతర్జాతీయ మీడియా టైకూన్ విసిరిన పాచిక ఆ విధంగా సుష్మా స్వరాజ్ మెడకు చుట్టుకుంది. లలిత్ మోడి ఇండియా నుండి పారిపోయిన ఆర్ధిక నేరస్ధుడు. ఆయన్ను వెనక్కి పంపాలని కోరుతూ యు.పి.ఏ 2 ప్రభుత్వం, ముఖ్యంగా చిదంబరం నేతృత్వంలోని గ్రూపు బ్రిటిష్ ప్రభుత్వంతో బేరాలు సాగించింది. ఆయన పాస్ పోర్ట్ ను రద్దు చేసింది. తద్వారా బ్రిటన్ నుండి మరో దేశానికి వెళ్లకుండా నిరోధించింది. ఆయనను అప్పగించకపోతే బ్రిటన్ తో ఇండియా సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని కూడా 2013లో హెచ్చరించారు.
ఈలోపు ప్రభుత్వం మారిపోయింది. బి.జె.పి చేసిన వాగ్దానాల్లో ఒకటి కాంగ్రెస్ అవినీతిని కూకటివేళ్ళతో పెకలించడం. 60 యేళ్ళ అవినీతి నుండి దేశాన్ని విముక్తి చేయడం, విదేశాల్లో భారత సంపన్నులు దాచిన లక్షల కోట్ల నల్ల ధనాన్ని వెనక్కి రప్పించడం కూడా నరేంద్ర మోడి వాగ్దానాలలో కొన్ని. తన ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా తన యేడాది పాలన స్వచ్ఛం అని కూడా ప్రధాని మోడి చాటుకున్నారు. తీరా చూస్తే ఈ మొదటి యేడాదిలోనే నరేంద్ర మోడి మంత్రివర్గం లోని విదేశీ మంత్రి, ఫెమా (విదేశీ మార్గ ద్రవ్య నిర్వహణ చట్టం) చట్టాన్ని ఉల్లంఘించి అరెస్టు ఎగవేస్తున్న నేరస్ధుడికి కొత్త బ్రిటిష్ పాస్ పోర్టు జారీ చేయడానికి భారత ప్రభుత్వం నుండి ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా సిఫారసు లేఖ రాశారు.
భారత చట్ట సంస్ధల విచారణ నుండి తప్పించుకునేందుకు విదేశాల్లో తలదాచుకున్న ఆర్ధిక నేరస్ధుడి పాస్ పోర్ట్ ను ఇండియా రద్దు చేయగా దానికి ప్రత్యామ్నాయంగా బ్రిటన్ పోస్ పోర్ట్ ఇవ్వొచ్చని అందుకు భారత ప్రభుత్వానికి అభ్యంతరం లేదని భారత విదేశాంగ మంత్రి ఎలా సిఫారసు చేయగలరు? సుష్మా స్వరాజ్ తప్పు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ దానిని చూసేందుకు బి.జె.పి నేతలు, ప్రభుత్వ పెద్దలు నిరాకరిస్తూ ఉష్ట్ర పక్షులను తలపిస్తున్నారు. లలిత్ మోడి భార్యకు పోర్చుగల్ లోని ఓ కేన్సర్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందని, ఆమె ఆపరేషన్ కు దగ్గర ఉండేందుకే మానవతా హృదయంతో లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇవ్వాలని సిఫారసు చేశానని సుష్మా తన చర్యను సమర్ధించుకోగా ఇతర ప్రభుత్వ పెద్దలు బి.జె.పి నేతలు దానికి వంత పాడుతున్నారు.
(……………………ఇంకా ఉంది)