మానవతా సాయం?
అయితే ‘మానవతా సాయం’ వాదనలోని డొల్లతనం త్వరలోనే బైటపడింది. లలిత్ మోడీ ‘ఇన్ స్టా గ్రామ్’ అనే ఫోటో షేరింగ్ సోషల్ వెబ్ సైట్ లో అప్పటి తేదీలలో ప్రచురించిన ఫోటోలు లలిత్ మోడీ విందు, విలాసాలలో తేలియాడుతున్న సంగతినే వెల్లడించాయి తప్ప ఆయన భార్య కేన్సర్ చికిత్స పొందుతున్న సంగతిని చూచాయగా నైనా తెలియజేయలేదు. బ్రిటిష్ పాస్ పోర్ట్ జారీ అయ్యేలా సాయం చేసిన బ్రిటన్, ఇండియా రాజకీయ పెద్దలకు తాను ఎంత కృతజ్ఞుడినో ప్రశంసలు కురిపిస్తూ రాతలు రాసిన లలిత్ మోడి తన భార్య ఆరోగ్యం/అనారోగ్యం గురించిన ఒక్క వివరాన్ని కూడా రాయలేదు. తన జీవితంలో చీమ చిటుక్కుమన్నా సోషల్ నెట్ వర్క్ వెబ్ సైట్లలో ఆరబోసుకునే లలిత్ మోడీ పోర్చుగల్ సందర్శించిన రోజుల్లో కూడా తన భార్య చికిత్స గురించి ప్రస్తావించలేదు.
సుష్మా స్వరాజ్ లలిత్ మోడి పాస్ పోర్ట్ కోసం విదేశీ మంత్రిగా సాయం చేయడాన్ని సమర్ధించుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం వినిపించిన వాదన అంతా ‘మానవతా సాయం’ పైనే కేంద్రీకృతం అయింది. తన భార్య మినాల్ చికిత్సకోసం లలిత్ మోడి ఆసుపత్రిలో హాజరు కావలసి ఉన్నందునే ‘మానవతా దృక్పధంతో’ పాస్ పోర్ట్ ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి సిఫారసు చేశానని సుష్మా స్వరాజ్ కూడా పదే పదే చెప్పుకున్నారు. మానవతా కోణంలో పాస్ పోర్ట్ ఇవ్వడమే కరెక్ట్ అయితే అదేదో భారత ప్రభుత్వం నుండే ఇవ్వవచ్చు కదా! యు.కె (బ్రిటన్) ను దేబిరించడం దేనికి? యు.పి.ఏ రద్దు చేసిన పాస్ పోర్ట్ ను పునరుద్ధరిస్తే సరిపోయి ఉండేది. అలా చేస్తే దేశంలో విమర్శలు వస్తాయి కనుకనే విదేశీ మంత్రి యు.కె ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నది కాస్తా లలిత్ మోడి – రూపర్ట్ మర్దోఖ్ ల మధ్య తలెత్తిన వైరం వల్ల విదేశీ మంత్రి మానవతా సాయం బండారం బైటికి వచ్చింది.
[లలిత్ మోడి తన పాస్ పోర్ట్ ను ఎందుకు వినియోగించాడో ఆయన పోస్ట్ చేసిన కింది ఫోటోలు, సంభాషణలు చెబుతాయి.]
నిజానికి ఇండియాలో వలె పోర్చుగల్ లో భార్య ఆపరేషన్ కు భర్త సంతకం అవసరం లేదు. అటువంటి నిబంధన ఏదీ పోర్చుగల్ ఆసుపత్రులు విధించవు. పైగా ఆపరేషన్ జరిగిందని చెప్పిన రోజుల్లోనే లలిత్ మోడీ ప్లే బాయ్ తరహాలో బీచ్ లలో అమ్మాయిలతో ఫోజులు ఇస్తూ ఫోటోలు దిగి వాటిని ఇంటర్నెట్ లో సైతం పెట్టాడు. బ్రిటిష్ పాస్ పోర్ట్ అందిన వెంటనే దాని ఫోటోను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు. కానీ ఆ పాస్ పోర్టు తన భార్య కేన్సర్ చికిత్సకు హాజరు అయేందుకు దోహదపడుతుందని మాత్రం లలిత్ మోడి చెప్పలేదు. 4 సం.ల 2 నెలల 14 రోజుల పాటు విమాన ప్రయాణానికి నోచుకోని తాను బ్రిటిష్ పాస్ పోర్ట్ లభించడంతో ఎంతో ధ్రిల్ అయ్యానని చెప్పడమే గాని భార్య కేన్సర్ చికిత్స గురించి రాయలేదు.
పోర్చుగల్ రాజధాని లిస్బన్ లో భారతీయ ఆర్కిటెక్ట్ చార్లెస్ కొరియా డిజైన్ చేసిన కేన్సర్ సంస్ధ భవనం ‘చంపాలిమూడ్ సెంటర్ ఫర్ అన్ నోన్’ ను సందర్శించానని చెబుతూ భవనం ముందు దిగిన తన ఫోటోను ఆయన పోస్ట్ చేశారు. లిస్బన్ లోని వివిధ టూరిస్టు కేంద్రాలను సందర్శించిన ఫోటోలను, స్పెయిన్ బీచ్ లలో స్విమ్ సూట్ లలో ఉన్న నవోమి కేంప్ బెల్, ప్యారిస్ హిల్టన్ లాంటి ఇంటర్నేషనల్ మోడళ్లతో కలిసి దిగిన ఫోటోలను సైతం ప్రచురించారు. కానీ ఎక్కడా భార్య చికిత్స గురించిన ప్రస్తావనే లేదు. అసలు అంతవరకు ఎందుకు! లలిత్ మోడి భార్య చికిత్స కోసమే పాస్ పోర్ట్ జారీ అయితే 2016 సం. వరకూ పనిచేసేలా పాస్ పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకుంటుంది?
ఈ నేపధ్యంలో మానవతా దృక్పధంతో లలిత్ మోడీకి సాయం చేశామన్న బి.జె.పి ప్రభుత్వ వాదన సమర్ధన కోసం చేస్తున్నదే తప్ప వాస్తవాలతో కూడినది కాదని స్పష్టం అవుతోంది. అది కాకపోతే ఏది వాస్తవం అన్న ప్రశ్నకు సమాధానం: క్విడ్-ప్రొ-కొ (నీకిది-నాకది). యు.పి.ఏ-2 ప్రభుత్వం పునాదుల్ని కదిలించిన ‘క్విడ్-ప్రొ-కొ’ అవినీతి సూత్రమే లలిత్ మోడీకి విదేశీ మంత్రి చేసిన సహాయానికి కారణం. ఈ సూత్రం ప్రాతిపదికన సుష్మా స్వరాజ్, లలిత్ మోడీలు పరస్పరం సాయం చేసుకోవడమే అసలు వాస్తవం. సుష్మా స్వరాజ్ కు లలిత్ మోడి చేసిన సాయం ఏమిటో సండే టైమ్స్ పత్రిక, టైమ్స్ నౌ ఛానెల్ బైట పెట్టిన ఈ మెయిళ్ల ద్వారానే వెల్లడి అయింది.
అమెరికాకు చెందిన హఫింగ్టన్ పోస్ట్ పత్రిక యొక్క ఇండియా విభాగం కీత్ వాజ్-స్వరాజ్ కౌశల్-లలిత్ మోడీ ల మధ్య సాగిన ఈ మెయిళ్ల స్క్రీన్ షాట్ లను ప్రచురించింది కూడా. వీటి ప్రకారం ఆగస్టు 26, 2013 తేదీన సుష్మా భర్త స్వరాజ్ కౌశల్ తన సోదరుని కొడుకు జ్యోతిర్మయ్ కౌశల్ కు సస్సెక్స్ యూనివర్సిటీలో లా సీటు ఇప్పించాల్సిందిగా లలిత్ మోడిని కోరారు. ఆ తర్వాత 3 రోజులకు సుష్మా స్వరాజ్ స్వయంగా లలిత్ మోడీకి ఫోన్ చేసి తన తోబుట్టువు కూతురు సస్సెక్స్ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించే సీటు ఇప్పించాలని కోరారు. ఈ సంగతి లలిత్ మోడి భారతీయ సంతతి బ్రిటిష్ ఎం.పి కీత్ వాజ్ కు పంపిన ఈ మెయిల్ లో తెలిపాడు. దానికి కీత్ వాజ్ తప్పకుండా సాయం చేద్దాం అని చెప్పి సి.వి తదితర పత్రాలు పంపమని మోడిని కోరాడు. ఆ విధంగా లలిత్ మోడి సాయంతో తన బంధువుకు సస్సెక్స్ యూనివర్సిటీలో లా కోర్సులో చేర్పించడంలో సుష్మా స్వరాజ్ సఫలం అయ్యారు.
కాల చక్రాన్ని ఓ సంవత్సరం పాటు గిర్రున తిప్పేస్తే జులై 31, 2014 తేదీన మరో ఈ మెయిల్ మనకు దర్శనం ఇస్తుంది. ఇది కీత్ వాజ్, యు.కె హోమ్ శాఖ కార్యాలయం అధికారి సారా రాప్సన్ కు పంపినది. దీని ప్రకారం భారత విదేశీ మంత్రి కీత్ వాజ్ తో నేరుగా మాట్లాడారు. యు.కె ప్రభుత్వం లలిత్ మోడీకి ట్రావెల్ డాక్యుమెంట్లు ఇస్తే భారత ప్రభుత్వానికి అభ్యంతరం ఏమీ ఉండబోదని ఆమె తనకు చెప్పారని కీత్ వాజ్ సారాకు మెయిల్ లో తెలిపారు. భారత ప్రభుత్వం గతంలో (యు.పి.ఏ-2 హయాంలో) ఇందుకు నిరాకరించినప్పటికీ అనేకమంది పెద్ద మనుషులు ఈ వ్యవహారంలో ఉన్నందున పాస్ పోర్ట్ ఇవ్వచ్చని కీత్ వాజ్ చెప్పాడు. ఇండియాలో బ్రిటిష్ రాయబారి జేమ్స్ బేవాన్ తో కూడా సుష్మా మాట్లాడారని, ఐరాస అధిపతి బాన్-కి-మూన్ కూడా ఇందులో ఉన్నారని కీత్ వాజ్ ఈ మెయిల్ లో పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజే పాస్ పోర్ట్ తదితర పత్రాలను జారీ చేసినట్లుగా సారా రాప్సన్ కీత్ వాజ్ కి సమాచారం ఇస్తూ మెయిల్ రాసింది.
అదే రోజు మోడి తనకు పాస్ పోర్ట్ ఇప్పించినందుకు ధన్యవాదాలు చెబుతూ అనేకమందికి ఒకే ఈ మెయిల్ పంపాడు. తనకు పాస్ పోర్ట్ రావడానికి ఇండియా, మాల్టా, పోర్చుగల్, వర్జీనియా వాటర్స్, టెల్ అవీవ్ (ఇజ్రాయెల్ రాజధాని), లిస్బన్, లియాన్… మొ.న అనేక చోట్ల నుండి మిత్రులు కృషి చేశారని చెబుతూ అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు లలిత్ మోడి. ఈ ఈమెయిల్ అందుకున్న వారిలో అంతర్జాతీయ మోడల్ నవోమి కాంప్ బెల్ కూడా ఒకరు. స్పెయిన్ బీచ్ లలో లలిత్ మోడి నవోమితో కలిసి ఫోటోలు దిగడాన్ని గుర్తుకు తెచ్చుకుంటే ఆమెకు మెయిల్ పంపడం ఎందుకో అర్ధం అవుతుంది. ఇంత రాసిన మోడి పాస్ పోర్ట్ వల్ల తన భార్య ఆపరేషన్ వద్ద హాజరయ్యే అవకాశం దక్కిందని మాత్రం రాయలేదు. అసలు అది కారణం అయితే కదా రాయడానికి!
మోడి ధన్యవాదాలకు కీత్ వాజ్ ఇచ్చిన రిప్లై మెయిల్ చూస్తే భారత విదేశాంగ మంత్రికి విదేశాల్లో ఉన్న గౌరవం ఏమిటో అర్ధం అవుతుంది. “From the horses mouth! I will do a thank you we will need her again” అని కీత్ వాజ్ రిప్లై ఇచ్చాడు. ‘Straight from the horse’s mouth’ అన్నది ఆంగ్ల సామెత. అత్యున్నత అధికార స్ధానాల నుండి వచ్చిన సమాచారమే గనుక నమ్మదగిందే అని దీనర్ధం. భారత విదేశాంగ మంత్రి గారే స్వయంగా ఫోన్ చేసి పాస్ పోర్ట్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఎలా ఉంటారని, పైగా ఆమెతో ఇంకా అవసరం ఉందనీ కీత్ వాజ్ తన మెయిల్ లో వ్యాఖ్యానించారు. లలిత్ మోడీ పాస్ పోర్ట్ వ్యవహారం అడ్డం పెట్టుకుని మరిన్ని పనులు సుష్మా స్వరాజ్ నుండి సాధించవచ్చని కీత్ వాజ్ సూచించారు. భారత ప్రజల ప్రయోజనాలను నెరవేర్చవలసిన విదేశీ మంత్రి సొంత కుటుంబ సభ్యుల ప్రయోజనాలను, దేశం నుండి పారిపోయిన అవినీతిపరుడి ప్రయోజనాలను నెరవేర్చే కృషిలో నిమగ్నం కావడం ఎలాంటి భారతీయతో బి.జె.పి, తదితర హిందూత్వ గణాలు చెప్పాల్సి ఉంది.
[ఈ మెయిళ్ల స్క్రీన్ షాట్ లు: హఫింగ్టన్ పోస్ట్ నుండి]
భారతీయత గురించి భారత దేశం గొప్పతనం గురించి అలుపు లేకుండా ఉపన్యాసాలు దంచే బి.జె.పి నేతలు తమ కూతుళ్ళు, కొడుకులు, బంధువుల పిల్లలను మాత్రం విదేశీ యూనివర్శిటీలలో చదివించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని కూడా సుష్మా-లలిత్ ఉదంతం తెలియజేస్తోంది. సుష్మా లాంటి భారతీయ వనితల వల్లనే భారత దేశం సుభిక్షంగా వర్ధిల్లుతోందని హిందూత్వ అభిమాన గణం మురిపెంగా చెబుతుంటారు. సుభిక్షం సంగతేమో గానీ విదేశీ మోజు విషయంలో బి.జె.పి నేతలు ఏ మాత్రం తక్కువ కారని అర్ధం చేసుకోవలసివస్తోంది.
హిందూత్వ అభిమానులు పూజించే మరో భారతీయ వనిత వసుంధర రాజే. ఆమె అయితే ఇంకా ఘోరం. లలిత్ మోడీ లండన్ కు పారిపోవడానికి ఆమె సహకరించారు. అప్పటికి రాజస్ధాన్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్న వసుంధర లలిత్ మోడీ యు.కె (బ్రిటన్) వలస వెళ్ళేందుకు అవసరమైన పత్రాలపై సంతకాలు చేశారు. తాను సంతకం చేసిన సంగతిని భారత ప్రభుత్వానికి తెలియనివ్వకూడదని యు.కె అధికారులను కోరి మరీ ఆమె సంతకాలు చేశారు. ఆమె సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్ నేతలు విలేఖరుల ముందు ప్రదర్శించారు కూడా. అయినప్పటికీ తనకు సంతకం చేసిన గుర్తు లేదని వసుంధర చెబుతున్నారు.
బి.జె.పిలోనే రెండు గ్రూపులు ఉన్నాయని వారి ఘర్షణలో భాగంగానే సుష్మా స్వరాజ్ ను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం జరుగుతోందని కీర్తి ఆజాద్ లాంటి బి.జె.పి ఎం.పి లు సూచిస్తున్నారు. సుష్మా స్వరాజ్ ఎల్.కె అద్వానీ శిబిరంలోని వ్యక్తి గనుక ఆమెను ముల్లుగా నరేంద్ర మోడి-జైట్లీ శిబిరం భావిస్తోందని అందుకే పొమ్మనలేక పొగపెట్టారని కొన్ని పత్రికలు సైతం సూచిస్తున్నాయి. గ్రూపులు ఉండడం, వారు కలహించుకోవడం ఉంటే ఉండవచ్చు. కానీ సుష్మా అవినీతి, ఆశ్రిత పక్షపాతంలకు ఇది సమర్ధన కాజాలదు. పైగా సుష్మా, వసుంధరలు ఏ తప్పూ చేయలేదని వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆర్.ఎస్.ఎస్ తో సహా బి.జె.పి మంత్రులు, నేతలు అందరూ వాదిస్తున్నారు. కనుక బి.జె.పి ప్రభుత్వ లక్షణం ఏమిటో స్పష్టమే. అది కాంగ్రెస్ ప్రభుత్వం కంటే భిన్నం ఏమీ కాదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ విధానాలను మరింత నిర్దయగా, ఆర్డినెన్స్ లతో అమలు చేస్తున్న కర్కశ ప్రభుత్వాన్ని బి.జె.పి నడుపుతోంది.
బి.జె.పి నేతల అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, విదేశీ మోజు, విదేశీ పెట్టుబడులకు మోకరిల్లడం, దేశ వనరుల అమ్మకం… ఇత్యాదివన్నీ కొత్త ఏమీ కాదు. ఎన్.డి.ఏ -1 హయాంలో భారత దేశ ఆర్ధిక వ్యవస్ధకు వెన్నెముకగా పని చేసిన ప్రభుత్వ రంగ సంస్ధలను అయినకాడికి అమ్మివేయడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసిన ఘనత బి.జె.పి సొంతం. తెంపు లేకుండా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ మోడి ప్రభుత్వం ఆర్ధిక చట్టాలను తిరగరాస్తోంది. మరోవైపు భారత శ్రామిక ప్రజల హక్కులను హరించే విధంగా కార్మిక చట్టాలను బలహీనం చేసి కాలరాసేందుకు సరికొత్త చట్టాలకు, సవరణలకు పదును పెడుతోంది. ఇలాంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వం లలిత్ మోడీ లాంటి సంపన్న-నల్లడబ్బు-ఘరానా-నేరగాళ్లకు అండగా నిలవకపోతేనే ఆశ్చర్యం.
ఉపసంహారం
భారత ప్రజల సమయాన్ని చెదపురుగు వలె తినిపారేస్తూ సామాజిక పరిసర జ్ఞానం నుండి దూరంగా నెట్టివేస్తున్న క్రికెట్ ఆట ఒకప్పటి భారత వలస పాలకులైన బ్రిటిష్ కులీనులకు బెట్టింగ్ క్రీడ! బ్రిటిష్ అరిస్టోక్రాట్ సమాజానికి ఆటవిడుపు ఆటగా కూడా భాసిల్లిన క్రికెట్ ను బ్రిటిష్ పాలకులు పనిగట్టుకుని మరీ తమ వలసలకు ఈ ఆటను విస్తరింపజేశారు. మొట్టమొదటి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ అమెరికా-కెనడాల మధ్య జరిగినప్పటికీ అక్కడ క్రికెట్ ఆనవాళ్ళు కూడా లేకపోవడం గమనార్హం. క్రికెట్ ఆటగా ఉన్నంత వరకూ ఆస్వాదించవచ్చు. కానీ ఇప్పుడది నల్లడబ్బు నేరగాళ్లకు స్ధావరం అయింది. మ్యాచ్ ఫిక్సింగ్ ల నుండి స్పాట్ ఫిక్సింగ్ ల వరకూ క్రికెట్ ను ఈ నేరగాళ్ళు అభివృద్ధి చేశారు.
జూదంగా మారి నేరగాళ్లకు ఆలవాలం అయిన క్రికెట్ నేడు ఒక పక్క భారత దేశ జనసామాన్యాన్ని ఇతర అన్ని పనులు మరిచిపోయే మత్తు సాధనంగా పని చేస్తూ మరోపక్క ఆ జనాన్ని వేధించుకు తింటున్న దోపిడీ వర్గాలకు డబ్బు మూటలు పంచే వికృత క్రీడగా కూడా పని చేస్తోంది. జనాదరణను జనహనన సాధనంగా మార్చే పాలకుల కుట్రలను ప్రజలు గమనించాలి. తమ దైనందిన సమస్యలపై ఉద్యమించే చైతన్యాన్ని మొద్దుబార్చే సాధనంగా క్రికెట్ ను మార్చివేసిన సత్యాన్ని వారు గ్రహించాలి.
……………….అయిపోయింది
@శేఖర్ గారు…చివరి లైన్ లో ముద్దుబార్చే ….మార్చండి…
పారిపోయిన నేరస్థుడు అయిన లలిత్ మోడీపై జారీ అయిన బ్లూ కార్నెర్ నోటీస్ కు సుష్మా స్వరాజ్ ఏం సమాధానం చెబుతుందో చూడాలి?
ఐ.సి.యల్ ను పడగొట్టి ఐ.పి.యల్ ఏర్పరిచీ,భారీ అవినీతికి ఎలా అంకురార్పణ జరిగిందో నేడూ కూడా మరోసారి ఐ.సి.యల్ య్వవస్థాపకులు అయిన ఎస్సార్ గ్రూప్ మరో ప్రతిపాదనతో ముందుకు వస్తోంది(1970ల నాటి కెర్రీ ప్యాకర్ సిరీస్ లాంటిది).
దీనిని బి.సి.సి.ఐ ఎలా అడ్డుకుంటుందో చూడాలి? తద్వారా మరో అవినీతికి కేంద్రమైన వ్యవస్థరూపకల్పనకు పూనుకోవచ్చు!
అద్వానీ తరపు ముల్లు-సుష్మా స్వరాజ్ ను కేవలం పై ఉధాంతం ఆధరంగానైతే తొలగించే అవకాశంలేదు.ఎందుకంటే ఇందులో భారీకుంభకోనాలు లాంటి వేవీ కనిపించడంలేదు.సుష్మా స్వరాజ్ భందువులకు ప్రయోజనం కలిగించినదుకు లలిత్ మోడీకి తాను ప్రయోజనం కలిగించింది.(క్విడ్-ప్రోకో తరహా).మంత్రిగా తానుచేశిన ప్రమాణాన్ని మీరి తన ప్రయోజనాలకు తన మంత్రిత్వశాఖను వాడుకొంది.ఇప్పటిరోజులలో చూసుకొంటే ఇదేమంత పెద్ద అవినీతిగా పరిగణించే అవకాశంలేదని చెప్పవలసివస్తుంది.ఎందుకంటే ఈ వ్యవహారంలో వందలకోట్లరూపాయిల అవినీతి జరగలేదనిపిస్తోంది గనుక! ఆవిడ ఆశ్రితపక్షపాతం చూపించింది గనుక తనరాజకీయజీవితంలో ఈ ఘఠన చిన్న ఎదురుదెబ్బ మాత్రమే!
వసుంధర రాజేది కూడా దాదాపు ఇదేపరిస్థితి,అప్పుడు తాను ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నదిగనుక.
వీరిరువరికీ తమ పదవులకు ఎసరతెచ్చే పరిస్థితి లేదనే చెప్పవచ్చు.
నరేంద్ర మోడీ మహా అయితే చట్టం తనపని తాను చేసుకుపోతుంది-వంటి రొడ్డకొట్టుడు మాట ఒకటి చెప్పవచ్చు.దీనిని చూపించి వారి అనుచరగణం చూశారా! మా మోడీ అవినీతిని ఉపేక్షించడు వంటి భాజాబజంత్రీలు మోగిస్తారు. మోడీ పాలనలో సంవత్సరం గడిచిందోలేదో అప్పుడే ఒక గేటు తెరుచుకుంది,మరన్ని తెరుచుకోవడానికి సిద్ధంగా ఉంటాయి!
ఈ ఉదంతం లలిత్ మోడీ-మల్డోక్ ల ప్రయోజనాల ఘర్షణ ఫలితంగా బయటపడిందిగానీ మన దర్యాప్తు అధికారుల పాత్రగానీ,చట్టబద్ధ సంస్థల పాత్రగానీ ఏమాత్రం లేదు.
లలిత్ మోడీ తన భార్యకు కేన్సర్ నిమిత్తం పాస్ పొర్ట్ పొందడానికి ఒక సాకు చూపాడు.అయినత మాత్రాన ఆవిడకు పొర్చుగల్ లో కేన్సర్ చికిత్స జరగలేదని చెప్పలేము.మోడీ ట్వీట్ చేసిన ఒక ఫొటోలో కేన్సర్ చికిత్స చేసే కేంద్రం ముందు తాన్నున్నట్లు చూపాడు.
మరో విషయం కొన్ని సంవత్సరాల క్రితం లలిత్ మోడీపై క్రిస్ కెయిన్స్ (న్యూజిలాండ్ ఆటగాడు) బ్రిటన్ కోర్టులో పరువునష్టం దావా వేశాడు.ఆ కేస్ లో మోడీ ఓడిపోయాడు.కోర్టు అతనికి భారీ జరిమానా విధించింది.అప్పుడు మోడీ ఇండియాలో ఉన్నాడు గనుక ఆ తీర్పు తనకు వర్తిచవని చెప్పాడు. మరి,గత 4-5 సంవత్సరాలనుండి మోడీ బ్రిటన్లోనే ఉన్నాడు కదా! ఆ కేస్ సంగతి ఏమైందొ!
ఇప్పటి వ్యవస్థలో ఒక క్రిమినల్ మరో క్రిమినల్ కు సాయం చేయడం పెద్దవిష్యం కాదేమో!
ప్రజలను మొద్దుబార్చే సాధనాలు-మత సంభందమైనవి,కాలక్షేప సంభందమైనవి(క్రికెట్,సినిమా మొ,,).వీటి నుండి బయట పడడం చాలా చాలా కష్టం.
Shekar garu,
Thanks for the marathon write up, with 360 degree analysis on this issue.
ఈ అవినీతి కేసును ఆసరాగా చేసుకుని, మోడీ ముల్లును(సుష్మ) తొలగించుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ, రాజే ను పదవి నుంచి దింపటం మోడీ వల్ల అవుతుందా అనేది సందేహాస్పదమే. ఎందుకంటే, రాజే కు రాజస్థాన్ బీజేపీ లో సొంత పట్టు ఉంది. ఇప్పటికే తన అనుచరులతో బలప్రదర్శన కూడా చేయించింది. పార్టీ అధిష్టానం ఆమె మీద చర్యలకు ఉపక్రమిస్తే, ఆమె సొంత కుంపటి పెట్టుకునే వరకూ పరిస్తితులు వెల్లొచ్చు. ఈ భయంతో కూడా, మోడీ-షాలు ఎవరి మీదా ఎలాంటి చర్యలూ చేపట్టకుండా, దాటవేత వైఖరిని అవలంబిస్తున్నట్లుంది.
excellent analysis sir…it proves that the government has changed in india but not the attitudes of leaders and the sorrows of the common man will remain same or may increase. education is the only weapon we have.