ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్


FTII

ఎన్.డి.ఏ-1 ప్రభుత్వం లాగానే ఎన్.డి.ఏ-2 ప్రభుత్వం కూడా భారత దేశంలోని వివిధ కళా, సాంస్కృతిక, విద్యా వ్యవస్ధలను కాషాయీకరించే పనిలో పడిపోయింది. చరిత్ర రచనా పద్ధతి (historiography) లోకి జొరబడి భారత దేశ చరిత్రకు సొంత అర్ధాన్ని ఇచ్చే ప్రయత్నంలో ఐ.సి.హెచ్.ఆర్ డైరెక్టర్ నియామకాన్ని చేసిన కేంద్రం తాజాగా పూనె లోని ప్రతిష్టాత్మక ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ కి కూడా అర్హతలు లేని బి.జె.పి నేతను నియమించిన విమర్శలను ఎదుర్కొంటోంది.

మహారాష్ట్రలో పూనే లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందినది. సినిమా, టెలివిజన్ లకు సంబంధించిన వివిధ రంగాలలో ప్రవేశించేందుకు ఈ సంస్ధ శిక్షణ ఇస్తుంది. ఓం పురి, షబానా అజ్మీ, స్మితా పాటిల్ లాంటి సినీ నటులతో ఆదూర్ గోపాల్ కృష్ణన్, బాలూ మహేంద్ర లాంటి ప్రసిద్ధ దర్శకులు ఈ సంస్ధలో శిక్షణ పొందినవారే.

ఇలాంటి సంస్ధకు డైరెక్టర్ గా గజేంద్ర చౌహాన్ ను నియమిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో వివాదం రగులుతోంది. ఆయనకు ఎలాంటి అర్హతలు లేవని ఆయన నియామకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎఫ్.టి.ఐ.ఐ విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. దానితో ఆయన నియామకం విషయంలో కేంద్రం పునరాలోచనలో పడినట్లు వార్తల ద్వారా తెలుస్తోంది.

విద్యార్ధుల ఆందోళనకు కారణం గజేంద్ర చౌహాన్ బి.జె.పి నాయకుడు కావడం తప్ప ఎలాంటి అర్హతలు ఆయనకు లేవని భావించడమే. టి.వి. సీరియల్ ‘మహా భారత్’ లో యుధిష్టరుడు (ధర్మరాజు) పాత్రలో నటించడం తప్ప ఆయనకు ఏ అర్హతా లేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. కేవలం సంస్ధను హిందూత్వ భావజాలం పరిధిలోకి తెచ్చుకునేందుకే గజేంద్ర చౌహాన్ ను అందలం ఎక్కించారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్ధుల ఆందోళన తీవ్రం అవుతుండడం, అది దేశవ్యాపితంగా పలువురు ప్రముఖుల మద్దతు అందుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. గజేంద్ర మాత్రం అప్పుడే “ఎఫ్.టి.ఐ.ఐ ని ప్రక్షాళన కావించి దానికి పునర్వైభవం తెస్తాను” అంటూ ప్రగల్భాలు పలకడం ప్రారంభించారు. పునర్వైభవం అంటే ఏమిటో ఆయన అర్ధం ఏమిటో తెలియరాలేదు.

ఈ నేపధ్యాన్ని పురస్కరించుకుని కార్టూనిస్టు బి.జె.పి కారును ధర్మరాజు ఎక్కిన రధంతో పోల్చారు. (బహుశా కర్ణుడు ఎక్కిన రధం అనుకున్నా తప్పు లేదేమో!)

‘కర్ణుడి చావుకి వేయి కారణాలు’ అన్న నానుడి తెలిసిందే. యుద్ధ విద్యల్లో  పుష్కలమైన ప్రతిభా సంపత్తి ఉన్నప్పటికీ వివిధ సందర్భాల్లో ఆయన పొందిన శాపాల వల్ల అవేవీ ఆయనకు అక్కరకు రాకుండా పోయాయని మహా భారతం చెబుతుంది. కర్ణుడి రధం ఢీకొట్టి ఒక పాప నేతి గిన్నెలో నెయ్యి నేలపాలు కావడం, తనకు కింద పడిన నెయ్యే కావాలని పాప పట్టుబట్టడం, దానితో నేతితో తడిసిన మట్టిని గుప్పిట్లో బిగించి బలంగా పిసకడంతో భూమాతకు ఆగ్రహం వచ్చి శాపం ఇవ్వడం… ఇవన్నీ పై కార్టూన్ కు నేపధ్యం.

భూమాత శాపం వల్ల యుద్ధరంగంలో అప్పటికే శల్య సారధ్యం పీడితుడై ఉన్న కర్ణుడి రధ చక్రం భూమిలో కుంగిపోతుంది. రధ చక్రాన్ని పైకి లేపడానికి సాయం నిరాకరించి వెళ్ళిపోతాడు శల్యుడు. దానితో కర్ణుడు ఒక్కడే కిందికి దిగి రధ చక్రాన్ని పైకి లేపే ప్రయత్నంలో ఉండగానే కృష్ణుడి ఆజ్ఞతో అర్జునుడు బాణం విసిరి కర్ణుడిని చంపేస్తాడు.

ఆధునిక భారతంలో యుధిష్టరుడికి ఎఫ్.టి.ఐ.ఐ సారధ్యం అప్పగించి దుర్యోధనుడికి మల్లెనే బి.జె.పి/కేంద్ర ప్రభుత్వం భంగపడిందని కార్టూనిస్టు సూచిస్తున్నారు. ఎఫ్.టి.ఐ.ఐ గేటు ముందర గొయ్యిలో కూరుకుపోయిన చక్రాన్ని పైకి లేపేందుకు ఆయన్ని నియమించినవారు కూడా సాయం రావడం లేదన్న అర్ధం నిజమా కాదా అన్నది మరికొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది. ఇప్పటికే సుష్మా స్వరాజ్ – లలిత్ మోడి వ్యవహారం (మోడి గేట్) తో తల బొప్పి కట్టిన కేంద్ర ప్రభుత్వానికి కొత్తగా యుధిష్టరుడి సమస్యను నెత్తిపై వేసుకునే ఆలోచన లేనట్లుంది.

One thought on “ఈసారి ధర్మరాజు రధం క్రుంగింది -కార్టూన్

  1. పునే ఫిల్మ్ ఇన్స్టిట్యుట్ కమ్యునిస్ట్ లదా? ఐతే అందులో ప్రతి సంవత్సరం ఎంతో మంది చదువుతారుగదా, వాళ్ళు ఎన్ని కమ్యునిస్ట్ చిత్రాలు తీశారు? అక్కడ చదివిన వారందౌ పనిచేసేది క్రూని కేపిటలిస్ట్ రంగమైన సినేమా,టివి, యాడ్స్ మొదలైన రంగాలలోనే. వాళ్లు హిపోక్రసి ని వాళ్ళే గుర్తించలేక ఉన్నారు. ఆయన ప్రగల్భాలు సరే హిందూ పేపర్ వారి ప్రగల్భాలు గురించి ఎప్పుడు రాయఏమిటి?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s