నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్


Mount Everest

ఏప్రిల్ 25, 2015 తేదీన నేపాల్ ప్రజల్ని కొద్ది సెకన్ల కాలంలోనే భారీ వినాశనంలోకి నెట్టివేసిన భూకంపం అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా ప్రభావితం చేయకుండా వదల్లేదు. భూకంప లేఖిని (రిక్టర్ స్కేల్) పై 7.9 పరిమాణాన్ని నమోదు చేసిన నేపాల్ భూకంపం వల్ల ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ పర్వతాన్ని నైరుతి దిశగా, అనగా ఇండియా వైపుకి 3 సెంటీ మీటర్ల మేరకు కదిలిందని చైనా శాస్త్రవేత్తలు వెల్లడి చేశారు.

నేపాల్ భూకంపం వల్ల భారత భూఖండం లిప్తపాటు కాలంలోనే ఒక అడుగు నుండి 10 అడుగుల వరకు నేపాల్ భూఖండం కిందికి వెళ్లిపోయిందని గత ఏప్రిల్ చివరి వారంలో అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడి చేయడం గమనార్హం. అమెరికా శాస్త్రవేత్తల పరిశీలన మరియు చైనా శాస్త్రవేత్తల పరిశీలన రెండూ ఒకే కదలికలో భాగమా అన్నది చైనా శాస్త్రవేత్తలు చెప్పలేదు.

సాధారణంగా ఎవరెస్టు పర్వతం ఎలాంటి ప్రకృతి ఉత్పాతాలతో సంబంధం లేకుండానే ప్రతి సంవత్సరం కొద్ది సెంటీమీటర్ల చొప్పున కదులుతోందని శాస్త్రవేత్తలు లెక్కిస్తున్నారు. అయితే ఈ కదలిక ఈశాన్య దిశ (North-East) లో ఉండడం ఆసక్తికరమైన విషయం. ఎందుకు ఆసక్తికరం అంటే చైనా శాస్త్రవేత్తలు చెప్పిన ఎవరెస్టు కదలిక సరిగ్గా ఈశాన్య దిశకు వ్యతిరేకం అయిన నైరుతి దిశ (South-West) లో ఉండడం వల్ల.

భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఎవరెస్టు పర్వతం ప్రతి సంవత్సరం స్ధిరంగా ఈశాన్య దిశలో అనగా చైనా వైపుగా కదులుతోంది. గత 10 సంవత్సరాల్లో ఎవరెస్ట్ పర్వతం 40 సెంటీ మీటర్ల మేర ఈశాన్య దశలో ప్రయాణించిందని వారు అంచనా వేశారు. అనగా సంవత్సరానికి 4 సెంటీమీటర్ల చొప్పున ఎవరెస్టు పర్వతం చైనా వైపు కదులుతోంది. ఇది భూగర్భంలోని టెక్టోనిక్ పలకల కదలికల ఫలితమే.

అయితే నేపాల్ భూకంపం ఎవరెస్టు పర్వత గమనాన్ని కొద్ది సెకన్లలోనే వెనక్కి నెట్టేసింది. సంవత్సరానికి 4 సెంటీ మీటర్లు కదలడం అంటే 3 సెంటీ మీటర్ల కదలికకు 9 నెలల సమయం ఎవరెస్టు పర్వతానికి పడుతుంది. కనుక 9 నెలలు కష్టపడి ఈశాన్య దిశ వైపు ఎవరెస్టు వేసిన అడుగులను నేపాల్ భూకంపం కాస్తా కొద్ది సెకన్లలోనే తుడిచిపెట్టింది. 9 నెలల ఎవరెస్టు శ్రమను బూడిదపాలు చేసిందన్నమాట!

చైనాకు చెందిన నేషనల్ సర్వేయింగ్, మ్యాపింగ్ అండ్ జియోఇన్ఫర్మేషన్ సంస్ధ ఈ వివరాలను ప్రకటించింది. ఈ సంస్ధ 2005 నుండి ఎవరెస్టు పర్వతానికి ఉత్తరం వైపు శాటిలైట్ జియోసెంట్రిక్ సర్వే పాయింట్లను నెలకొల్పుతూ వస్తోంది. ఈ పాయింట్ల ఆధారంగా ఎవరెస్టు పర్వతం భాగంగా ఉన్న టెక్టోనిక్ పలక కదలికను నమోదు చేస్తున్నారు.

“(ఎవరెస్టు) పర్వతం స్ధిరంగా ఈశాన్య దిశలో కదులుతోంది. భూకంపం దానిని వ్యతిరేక దిశలో ఎగిరిపడేలా ప్రభావితం చేసింది” అని బీజింగ్ లోని చైనా భూకంప పరిశీలనా సంస్ధలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ ఉప అధిపతి గ్జు గ్జివీ వివరించారు. మే 12 తేదీన 7.5 పరిమాణంలో సంభవించిన భూకంపం ఎవరెస్టుపై ప్రభావం చూపలేదని ఆయన తెలిపారు.

అమెరికా శాస్త్రవేత్తల ప్రకారం ఏప్రిల్ 25 నాటి భూకంపం వలన భారత భూఖండం నేపాల్ భూభాగం కిందికి చొచ్చుకుని వెళ్లింది. బీహార్ లో నేపాల్ కు ఆనుకుని ఉన్న 1000 నుండి 2000 చదరపు మైళ్ళ విశాల ప్రాంతం ఈ కదలికలో భాగం వహించిందని వారు తెలిపారు. కొలంబియా యూనివర్సిటీలోని లామోంట్-దోహర్టి ఎర్త్ అబ్జర్వేటరీలో రీసర్చ్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న కొలిన్ క్లార్క్ ఈ వివరాలను వెల్లడించారు.

“బీహార్ లోని భరత్ పూర్ నుండి హెటౌడా మీదుగా జనక్ పూర్ వరకూ ఉన్న ప్రాంతంలోని కొంత భాగం నేపాల్ కిందికి వెళ్లింది” అని కొలిన్ క్లార్క్ తెలిపారు.

నేపాల్ భూకంపం గురించి అమెరికా శాస్త్రవేత్తలు ఒక అంశాన్ని వెల్లడి చేస్తే చైనా శాస్త్రవేత్తలు మరొక అంశాన్ని వెల్లడి చేశారు. బహుశా… శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ తాము అమెరికాతో పోటీపడగలమని చైనా చెప్పదలిచిందా అన్నది ఇలాంటి అంశాలను మరిన్ని పరిశీలిస్తే గాని తెలియదు. శాస్త్ర, సాంకేతిక అభివృద్ధి విషయానికి వస్తే చైనా వర్తమానంలో జీవిస్తుంటే ఇండియా మాత్రం ఇప్పటికీ వేదాల వైపు చూస్తుండడం విచారకరమైన విషయం.

సహస్రాబ్దాల నాటి వేదజ్ఞానాన్ని అప్పటికంటే అనేక వేల రెట్లు అభివృద్ధి చెందిన నేటి శాస్త్రజ్ఞానంతో పోటీపెట్టి సంతృప్తిపడడం వల్ల ఆత్మ సంతృప్తి కలగవచ్చునేమో గానీ ప్రపంచాన్ని, శాస్త్రాలను సంతృప్తిపరచడం సాధ్యం కాదు.

బడ్జెట్ లో విద్యా రంగానికి కేటాయింపులు పెంచి, శాస్త్ర పరిశోధనా రంగంలో ప్రవేశించేందుకు విద్యార్ధులకు, స్కాలర్లకు తగిన ప్రోత్సాహకాలు కల్పించి వారు పని చేసేందుకు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ శ్రేణి సంస్ధలను నిర్మిస్తే ఇప్పటికీ వేదాలను తలచుకునే దుర్గతి తప్పుతుంది. భారత మేధో సంపత్తికి సాక్ష్యంగా భరత గడ్డకు బదులు సిలికాన్ వ్యాలీని చూపే దౌర్భాగ్యమూ తప్పుతుంది. ఆ వైపుగా ఆలోచన చేయగల పాలకులే మనకు లేరు!

పిడకల వేట: ఎవరెస్టు కదలికలో ఎవరి ఒత్తిడి లేదు. చైనా-ఇండియా తగాదాలు దానికి పట్టవు. కమ్యూనిస్టు ద్వేషం దానికి అసలే తెలియదు. అందువల్ల అలవాటుగా.., ‘ఎర్ర చైనా’ వైపు కదిలిపోతోంది గనక బాబ్రీ మసీదుని కూల్చినట్లు ఎవరెస్టుని కూడా కూల్చేయాలని భావిస్తే బహుశా ఎవరెస్టు అందుకు ఒప్పుకోకపోవచ్చు.

5 thoughts on “నేపాల్ భూకంపం: ఇండియావైపు కదిలిన ఎవరెస్ట్

  1. /సహస్రాబ్దాల నాటి వేదజ్ఞానాన్ని అప్పటికంటే అనేక వేల రెట్లు అభివృద్ధి చెందిన నేటి శాస్త్రజ్ఞానంతో పోటీపెట్టి సంతృప్తిపడడం వల్ల ఆత్మ సంతృప్తి కలగవచ్చునేమో గానీ ప్రపంచాన్ని, శాస్త్రాలను సంతృప్తిపరచడం సాధ్యం కాదు. /
    చల్ల మంచి మాట చెప్పారు. కాని, పాలకులకు కావాలసింది ఇది ప్రజలమీద రుద్దడం వరకే! వారి భౌతిక జీవనానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞాన పరిదిలో ముమ్దడుగులోంజే ఉన్నారు. ఇక్కడ భావ వాదులే భౌతొక జీవితాని జాగ్రత్త పడతారు. భౌతిక వాదులే ఆజాగ్రత్తలో ఉండరు.

  2. Budjet lo nidhulu penchi, entha protshanni andinchina mana vallu research vypu vellaru. Endukante mana samajam publish chesina journals kante vache salary ne ekkuva viluvaindi ga bhavisthundi. Paiga parisodhanallo kalam gadipe varikante week end selavu undi , darajaga karlalo tiraga galige kurralake pellilu jarige avakasalu ekkuva.kanuka yuvatha ekkuva ga thama jnanni ammukovadam thappa aa jananni abhivruddi chese alochana ledhu. Yedho koddhi mandhi ki thappa. Ex. Mana iit engineer(s) . so prabuthava prothsaham tho patu samajam lo parivarthana dwaara e marpu ragaladu ani nenu antunna. Meeru emi antaru sekhar garu?

  3. అర్జున్ గారూ మీరు లేఖిని సాయంతో తెలుగులోనే వ్యాఖ్య రాయవచ్చు గదా! ఆంగ్ల లిపిలో తెలుగు చదవడం చాలా కష్టం. అందువల్ల పాఠకులు మీ వ్యాఖ్యను పైపైన చూసి వదిలేసే అవకాశం ఎక్కువ. మీరు అనేదేదో తెలుగు లిపిలో అనండి. ఆ తర్వాత నేనూ ఏదో ఒకటి అంటాను. 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s