ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం -ది హిందు ఎడిట్..


Kurdish people in Kobani watching ISIS attack

Kurdish people in Kobani watching ISIS attack

ఇరాక్ లోని ప్రధాన నగరం మోసుల్ ని స్వాధీనం చేసుకున్న సంవత్సరం తర్వాత, పశ్చిమ ఆసియాలో ఒక బలీయమైన శక్తిగా ఇస్లామిక్ స్టేట్ కొనసాగుతూనే ఉంది. అమెరికా నేతృత్వంలో సాగుతున్న బాంబింగ్ దాని ఊపును అడ్డుకుంటున్న జాడ లేదు. కుర్దిష్ మరియు షియా మిలీషియాల చేతుల్లో ఎదురైన కొన్ని ఓటములు తప్పితే, గత సంవత్సర కాలంలో ఐ.ఎస్ తన ప్రభావ ప్రాంతాన్ని సిరాక్ (Syraq = Syria + Iraq) లోని తన (ప్రధాన) స్ధావరం కంటే మించి విస్తరించింది. ఇటీవల కాలంలో అది ఇరాక్ లోని అంబర్ రాష్ట్ర రాజధాని రమాది, సిరియా నగరం పామిరాలను స్వాధీనం చేసుకుంది. దానికి ఇప్పుడు లెబనాన్, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, నైజీరియాలలో కూడా శాఖలు ఏర్పడ్డాయి.

మోసుల్ ఆక్రమణ జరిగి సంవత్సరం పూర్తయిన జూన్ 10 తారీఖున అప్పటికే ఇరాక్ లో ఉన్న తమ 3,500 మంది బలగాలకు తోడుగా 450 మంది మిలటరీ సలహాదారులను పంపేందుకు ఆదేశాలు జారీ చేయడం ద్వారా అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా తన ఐ.ఎస్-వ్యతిరేక వ్యూహం పని చేయడం లేదని దాదాపు అంగీకరించారు. నిజం చెప్పాలంటే యుద్ధరంగంలో ఐ.ఎస్ శత్రువులకు కొదవ లేదు. సిరియా మరియు ఇరాక్ సైన్యాలు ఐ.ఎస్ పై యుద్ధం ప్రకటించాయి; ఐ.ఎస్ స్ధావరాలపై అమెరికా కూటమి జరుపుతున్న బాంబింగ్ లో గల్ఫ్ రాచరికాలు కూడా భాగస్వామ్యం వహిస్తున్నాయి; లిబియాలో ఐ.ఎస్ మిలిటెంట్లపై ఈజిప్టు దాడి చేసింది; లెబనాన్-సిరియా సరిహద్దు వెంబడి ఐ.ఎస్ తో తాము తలపడతామని లెబనీస్ షియా మిలీషియా అయిన హిజ్బొల్లా ప్రకటించింది. అయినప్పటికీ ఐ.ఎస్ భయంకర శక్తిగా ఎలా కొనసాగుతోంది?

బహుశా ఐ.ఎస్ కి ఉన్న సానుకూలత ఏమిటంటే దాని శత్రువులకు సమన్వయంతో కూడిన వ్యూహం ఏమీ లేకపోవడమే కావచ్చు: తమ ఉమ్మడి శత్రువును ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంతో కాకుండా తమ స్వప్రయోజనాలు మరియు విభేదాత్మక లెక్కలతో అవి పని చేస్తున్నాయి. సిరియాలో ఐ.ఎస్ కు వ్యతిరేక శక్తులలో అత్యంత బలమైనది బషర్ ఆల్-అస్సాద్ నేతృత్వంలోని ప్రభుత్వం. కానీ అమెరికా, దాని మిత్రులైన సౌదీ అరేబియా, ఖతార్ లు డమాస్కస్ లో ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నాయి. సిరియా ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి సౌదీ అరేబియా, టర్కీలు సాగిస్తున్న ప్రయత్నాలు ఐ.ఎస్ వృద్ధి చెందేందుకు దోహదం చేస్తున్నాయి. ఇరాక్ లో అమెరికా చేత రద్దుకాబడి పునరుద్ధరించబడిన సైన్యం ప్రధానంగా విచ్ఛిన్నకర (సెక్టేరియన్) స్వభావం కలిగినది. దానికి సొంతగా ఒక పెద్ద దాడి చేయగల సామర్ధ్యం లేదు. ఐ.ఎస్ నుండి లెబనీస్-సిరియన్ సరిహద్దును రక్షించుకోగల సామర్ధ్యం హిజ్బొల్లాకు ఉన్నదిగానీ అమెరికా ఆ సంస్ధను టెర్రరిస్టు సంస్ధగా ముద్ర వేయగా సౌదీ అరేబియా ఇరాన్ బంటుగా పరిగణిస్తుంది.

సిరియా మరియు టర్కీ సరిహద్దు ప్రాంతాల్లో కుర్దిష్ గెరిల్లాలు ఐ.ఎస్ ను సమర్ధవంతంగా నిలువరించారు. కానీ ఐ.ఎస్ వ్యతిరేక కూటమిలో వారిని కలుపుకునేందుకు టర్కీ ఇష్టపడడం లేదు. యుద్ధరంగంలో ముందు భాగానికి ఇరాన్ తన షియా మిలీషియా గ్రూపులను పంపించింది. కానీ ఇరాక్ లోని సున్నీ ఆధిపత్య ప్రాంతాల్లో, విచ్ఛిన్నకర కారణాల రీత్యా, వారిని అనుమానంతో చూస్తున్నారు. ఈ సంక్లిష్ట విచ్ఛిన్నకర భౌగోళిక రాజకీయ క్రీడలోనే ఐ.ఎస్ కు తగిన పోషణ లభిస్తోంది. తన ఆటవికత మరియు తీవ్రవాదాలతో బాధితులపై తన పట్టు బిగిస్తోంది. కానీ దీనంతటి అర్ధం ఐ.ఎస్ ను అజేయమని చెప్పడం కాదు: కొబేన్, టిక్రీట్ లో చూపినట్లుగా దానిని ఓడించవచ్చు. కానీ అటువంటి అడపా దడపా విజయాలను సమగ్రమైన గెలుపుగా మార్చాలంటే ఐ.ఎస్ తో తలపడుతున్న శక్తులు తమ సెక్టేరియన్ ప్రయోజనాలకు అతీతంగా పరస్పర సంయోగకరమైన వ్యూహంతో ముందుకు రావాలి. అది జరిగేవరకూ పశ్చిమ ఆసియా మరింత రక్తపాతాన్ని చూడడం కొనసాగుతూనే ఉంటుంది.

******************

[సంపాదకీయం విస్మరించిన అత్యంత ముఖ్యమైన అంశం ఇస్లామిక్ స్టేట్ అన్నది అమెరికా సామ్రాజ్యవాదం తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం నిర్మించి నడుపుతున్న పేట్ ప్రాజెక్ట్ అని. అమెరికా తెరవెనుక మంత్రాంగమే లేకపోతే ఇస్లామిక్ స్టేట్ ను మట్టి కరిపించడం చిటికెలో పని. సరిగ్గా గమనిస్తే ఈ వాస్తవం సంపాదకీయంలోనే దాగి ఉండడాన్ని గమనించవచ్చు.

ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చిన షియా-ఇరాన్ అనుకూల ప్రభుత్వాలు అమెరికా సైన్యాన్ని అక్కడినుండి పంపేశాయి. ఇరాక్ యుద్ధ నేరాలకు గాను అమెరికా సైనికులను విచారిస్తామని ప్రకటించడంతో అమెరికా తన సైన్యాన్ని తప్పనిసరి పరిస్ధితుల్లో ఉపసంహరించుకుంది. అంతటితో ఊరుకుంటే అది అమెరికా సామ్రాజ్యవాది ఎలా అవుతుంది. అనేక కుట్రలు పన్ని షియా-ఇరాన్ అనుకూల ప్రభుత్వాలను కూల్చివేసింది. వారి స్ధానంలో తన అనుకూల అధ్యక్షుడిని పదవిలో కూర్చోబెట్టింది. ఇరాక్ లోని ఈ అంతర్గత ఘర్షణ కాలంలోనే ఐ.ఎస్ ను అమెరికా ప్రతిష్టించింది. తన మాట వినే బూచిని తానే ప్రవేశపెట్టి ఆ బూచిని వదిలిస్తానని సైన్యాన్ని దించడం అమెరికా ఎప్పుడూ పన్నే వ్యూహమే. ఆ విధంగా ఐ.ఎస్ ను ప్రవేశపెట్టి దాన్ని ఎదుర్కొనే పేరుతో ఇరాక్ లో తన సైన్యాన్ని మళ్ళీ ప్రవేశపెట్టి వారి సంఖ్యను పెంచుతూ పోతోంది. ఈ వివరాలను గతంలో వివిధ ఆర్టికల్స్ లో ఇవ్వడం జరిగింది.

అమెరికా వ్యూహంలో భాగం కనుకనే ఐ.ఎస్ ను ఓడించలేని పరిస్ధితి ఉన్నది తప్ప అదేదో గొప్ప శక్తి అయినందువల్ల కాదు. ఐ.ఎస్ తో స్ధిరంగా పోరాడుతున్నది ఒక్క సిరియా-ఇరాన్-లెబనాన్ ప్రతిఘటన అక్షం (Axis of resistance) మాత్రమే. మొన్నటివరకు వివిధ పేర్లతో సిరియాలో రక్తపాతం సృష్టించిన కిరాయి బలగాలే ఈ రోజు ఐ.ఎస్ రూపంలో ఉన్నాయి. వారికి అప్పుడూ, ఇప్పుడూ ఆయుధాలు అందిస్తున్నది, శిక్షణ ఇస్తున్నది అమెరికా, పశ్చిమ రాజ్యాలే. ఈ వాస్తవాన్ని పశ్చిమ పత్రికలు ఎలాగూ చెప్పవు. కాస్త స్వతంత్రత కనబరిచే పత్రికలేమో వివిధ భయాలు, కారణాల వల్ల వాస్తవం చెప్పడానికి ముందుకు రావు. ఫ్రంట్ లైన్ పత్రిక అప్పుడప్పుడూ పశ్చిమాసియాలో సాగుతున్న సామ్రాజ్యవాద యుద్ధ క్రీడపై సరైన అవగాహన ఇచ్చే ఆర్టికల్స్ ను ప్రచురిస్తోంది. -విశేఖర్]

4 thoughts on “ఇస్లామిక్ స్టేట్ తో యుద్ధం -ది హిందు ఎడిట్..

 1. 2001-2015,గత 15 సంవత్సరాలుగా ప.దే నాయకత్వంలోని కంపెనీను ముఖ్యంగా ముస్లిం దేశాలలోని ప్రజలకు(తన ప్రయోజనాలకు అనుగునంగా నడుచుకోని ప్రభత్వాలను) అన్నివిధాలుగా కష్టాలకు గురిచేస్తున్నాయి.ఇవన్నీ చూస్తుంటే –
  17,18 శతాభాలలో వ్యాపారవిస్తరణ కాంక్షలో భాగంగా ఉపఖండంలోని రాజ్యాలకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఇతర రాజ్యాలతో యుద్ధాలు చేయిస్తూ తమరాజ్యాల(ఐరోపా రాజ్యాల) ప్రయోజనాలకనుగునంగా ఎలా వ్యవహరించిందీ గడిచిన చరిత్ర.
  1857లో అప్పటి ఉపఖండంలోని హిందూ-ముస్లిం ప్రజలు ఉమ్మడిగా ఈస్ట్ ఇండియా కంపనీకి వ్యతిరేఖంగా పోరాడితే తదననంతరం వారిమీద బేధాలు పెడుతూ ఐక్యపోరాటలు చేయకుండా ఏలా అణచివేసిందీ తెలిసిందే!
  బ్రిటిష్ వాడికి వ్యతిరేఖంగా పోరాడడంలో ఏర్పడిన అతివాద గ్రూప్ ని అణచివేసి,ఒక ఫేక్ మితవాద గ్రూప్ ద్వార మెజారిటీ ప్రజలను తన ప్రయోజలాలకు భంగం కలగకుండా వ్యవహరించిన పద్ధతి తెలిసిందే.
  అప్పుడు ఐరోపాలోని వివిద రాజ్యాల కనుగునంగా నడుచుకున్న కంపనీలు,ఇప్పుడు ఉమ్మడిగా ఈ ముస్లిం దేశాలమీద పెత్తనంకోసం సాగిస్తున్న ఈ ఆట ఎటువంటి మలుపులు తిరగబోతోంది?
  ముస్లిం ప్రజలలోని వివిద వర్గాలమధ్య ఎలా పోరుపెడుతోందో నడుస్తున్న వర్తమానం తెలియజేస్తున్నది.
  తమ ఉమ్మడి శతృవుని ఐఖ్యంగా అవి ఎందుకు ఎదుర్కోలేక పోతున్నాయి?
  వారందరినీ సంఘటితపరచి ముందుకు నడిపించడానికి ఎవరు భాధ్యత తీసుకోవాలి?
  అప్పటి మనలాగానే వారుకూడా ఫ్యూడలిజంలో ఉండడంవలన ప.దే వారు ముస్లిం ప్రజలను సులువుగా అణచివేయగలుగుతున్నారని భావించవచ్చునా?
  దీనికి అంతం ఎలా ఉండబోతోంది? అతిశయోక్తి అయినప్పటికీ ఎవరైనా సరైనకోణంలో ఊహించి చెప్పగలరా?

 2. కష్టాలన్నీ ముస్లిం దేశాలకే ఎందుకు వస్తాయో , ఎవరైనా వివరించి చెప్తే బాగుండు .
  కాస్త అమెరికా వైపు నుండి కాకుండా మరో వైపు నుండి చెప్పండి .

 3. @VENKI : ఖచ్చితంగా చెప్పలేను గానీ.. బహుశా అక్కడ ఉన్న చమురు సంపద ఒక కారణం కావచ్చు.. ఇంకా అలోచిస్తే మన తమిళనాదు ప్రజల లాగా ఈ దేశాలలో ప్రజలు కూడా మొండి వాళ్ళు అయ్యి ఉండవచ్చు (తమ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో హిందువుల లాగా అంత తొందరగా లొంగిపోయే రకాలు కాకపోవచ్చు)…

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s