జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినం (International Day of Yoga) గా జరపనున్నారు. గత సంవత్సరం ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తూ ఐరాస యోగా దినం ప్రకటించింది.
సొంత ప్రచారానికి, జబ్బలు చరుచుకోడానికి ఏ చిన్న అవకాశాన్ని వదలని బి.జె.పి, నరేంద్ర మోడిలు ఐ.డి.వై ప్రకటనను కూడా తమ విజయంగా చాటుతున్నారు. ఐ.డి.వై నుండి గరిష్ట ప్రయోజనం పొందడానికి కార్యక్రమాలు రూపొందించారు.
జూన్ 21 తేదీన ఢిల్లీలో అతి పెద్ద యోగా ప్రదర్శన జరిపి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కి ఎక్కడంతో పాటు ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్ధలు అన్నింటికీ కేంద్రం నుండి తాఖీదులు అందాయి, యోగా దినం సందర్భంగా యోగా శిబిరాల్లో పాల్గొవాలని.
తెలుగు దేశం, బి.జె.పి మిత్రపక్షం అయినందున ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా యోగా జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ది హిందు సంపాదకీయం చెప్పినట్లుగా ఆరోగ్య ప్రదాత అయిన యోగా ఆచరణ భారతీయ సంస్కృతీ పరిరక్షకులమైన తమకే లాభిస్తుందని బి.జె.పి నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ యోగా జాతర నేపధ్యంలో ఢిల్లీ గవర్నర్, ముఖ్యమంత్రిలు పడుతున్న సిగపట్లను కార్టూనిస్టు ఇలా సందర్భానుసారం కావించారు. తెరముందు ఢిల్లీ గవర్నర్ నజీబ్ జంగ్ కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక మాత్రం కేంద్ర ప్రభుత్వమే నిలబడి కధ నడిపిస్తోంది.
పార్లమెంటరీ దృక్కోణంలో చూస్తే ఇది ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హోదా కోసం కేంద్ర ప్రభుత్వంతో తలపడుతుండడానికి ప్రతీక! ఢిల్లీకి రాష్ట్ర హోదా వస్తే మరింత స్వతంత్రంగా వ్యవహరించవచ్చు. ఏఏపి ప్రభుత్వం ఎంత స్వతంత్రంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వానికి అంత భయం.
ప్రజల కోణంలో నుంచి చూస్తే ఇది విశాల అవగాహనలో శ్రామిక వర్గాలకు దేశాన్ని పట్టి పీడిస్తున్న సంపన్న వర్గాలకూ జరుగుతున్న ఘర్షణ. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారానే రాజకీయ పార్టీగా అవతరించిన ఆం ఆద్మీ పార్టీ తీసుకునే అవినీతి వ్యతిరేక చర్యలు అనివార్యంగా సంపన్న వర్గాలను దోషులుగా నిలబెడతాయి. వారికి మద్దతు ఇస్తున్న బి.జె.పి, కాంగ్రెస్ తదితర పార్టీల అసలు రంగును కూడా అవి బైటపెడతాయి.
ఢిల్లీ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించి ప్రజానుకూల చర్యలు అమలు చేసేకొద్దీ ఇతర రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, బి.జె.పి లు ఇన్నాళ్లూ జనాన్ని ఎంతగా మోసం చేసాయో జనానికి ఎరుకలోకి వస్తుంది. అదే జరిగితే రాజకీయ పార్టీల కుదుళ్లు కదిలిపోతాయి.
అందువలన ఎట్టి పరిస్ధితుల్లోనూ ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం చట్టాలు ఇచ్చిన అధికారాలు కూడా దక్కకుండా చేయడం కేంద్రానికి అవసరం. ఢిల్లీలో కేంద్రం సాగిస్తున్న అరాచకాన్ని కాంగ్రెస్ మౌనంగా చూస్తూ ఊరుకోవడం కాకతాళీయం కాదు.