శారీరక, మానసిక శ్రేయస్సుకు దోహదం చేసే ప్రయోజక శాస్త్రంగా ప్రపంచవ్యాపితంగా యోగా అంతకంతకూ అధిక గుర్తింపు పొందుతున్న సమయంలోనే, ఈ భారతీయ ప్రాచీన పద్ధతి, ప్రధానంగా నరేంద్ర మోడి ప్రభుత్వం యొక్క దూకుడుమారి ప్రోత్సాహం కారణంగా, అనవసర వివాదంలో చిక్కుకోవడం విచారకరం. (యోగా అమలుపై) ప్రభుత్వం అతిశయాత్మక ఆసక్తి చూపుతోందనీ తన ఉద్యోగులు మరియు సంస్ధలను తన సొంత దృక్పధంతో కూడిన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రచారం చేసేందుకు వినియోగించే ధోరణిలో ఉన్నదన్న భావనలు కలగకుండా ఉండడం చాలా కష్టతరంగా మారింది. ఒక భావనకు ప్రోత్సాహం కల్పించేందుకు సిబ్బందిని, విద్యార్ధులను కదిలించడం ఈ ప్రభుత్వ హయాం పద్ధతిగా కనిపిస్తోంది. గత సంవత్సరం క్రిస్టమస్ దినం ‘మంచి పాలనా దినం’ (గుడ్ గవర్నెన్స్ డే) కాగా ఈ యేడు జూన్21వ తేదీ ‘అంతర్జాతీయ యోగా దినం’ కానున్నది.
సెప్టెంబర్ 2014 లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రధాన మంత్రి మోడి ఇచ్చిన ప్రసంగం, యోగా ప్రాముఖ్యాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించేందుకు తగిన వేదికను ఏర్పరిచిందన్నది వాస్తవమే. డిసెంబర్ నెలలో 170 దేశాలకు పైగా మద్దతుతో జూన్ 21 తేదీని అంతర్జాతీయ యోగా దినంగా గుర్తించాలన్న ప్రతిపాదనను ఐరాస జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. యోగా వల్ల కలిగే లాభాలను విస్తృతంగా వ్యాప్తి చెందించాలనడంలో సందేహం లేదు. అయితే, దానిని ప్రమోట్ చేసేందుకు భారీ ప్రదర్శన కోసం అని చెబుతూ పదుల వేల మందిని రాజ్ పధ్, ఢిల్లీ వద్దకు కదిలించవలసిన అవసరం ఉన్నదా? ఓ ఆదివారం నాడు సంబంధిత కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా, అది తప్పనిసరి కానప్పటికి, ఉద్యోగులు, విద్యార్ధులను కోరతారన్న, భయాలు నెలకొని ఉన్నాయి.
ఒకే ఒక అతిపెద్ద యోగా ప్రదర్శనగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్ధానం సంపాదించే లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం పెట్టుకుంది. ప్రోత్సాహకర కార్యకలాపాల వెనుక అంతర్జాతీయ ప్రభావాన్ని పడవేయడమే కీలక లక్ష్యంగా కనిపిస్తోంది. యోగా నిజంగా ఆరోగ్యం, శాంతి మరియు సామరస్యతలకు సంబంధించినదే అయితే నిజానికి ప్రదర్శనా పూర్వక వైఖరిని అవలంబించవలసిన అవసరం లేదు. యోగా ప్రోత్సాహంలో రాజ్యం పాత్ర స్పష్టంగా అగుపడే విధంగా ఉన్నట్లయితే అది దానిని ప్రజా ఉద్యమంగా మలచడానికి వ్యతిరేకంగా మాత్రమే పని చేస్తుంది. దానికి బదులు, ప్రభుత్వం తన కింద ఉన్న వివిధ సంస్ధలలో యోగాను ఆచరించడానికి తగిన వసతులను కల్పించడం వరకు పరిమితమై యోగా లాభాల గురించిన సమాచారాన్ని వ్యాప్తి చెందేలా చూడడం ఉపయోగకరం.
యోగా ప్రచారానికి సంబంధించి విచ్ఛిన్నకర కోణాన్ని చేర్చిన అంశంగా యోగా ఆచరణ, ముఖ్యంగా అందులో భాగమైన సూర్య నమస్కారాలు, ఇస్లాం బోధనలకు విరుద్ధమన్న అవగాహన ముందుకు వచ్చింది. దీనిని గుర్తించిన ప్రభుత్వం జూన్ 21 తేదీన ప్రదర్శించవలసిన ఆసనాల జాబితా నుండి సూర్య నమస్కారాలను తొలగించింది. యోగా విస్తారమైన వారసత్వంలో భాగం కావడంతో పాటు వివిధ మతావలంబకుల నుండి కూడా ఆచరణ శీలురను ఆకర్షిస్తుందన్నది వాస్తవం. కాగా ప్రభుత్వం తన కార్యక్రమాలు మతము మరియు సంస్కృతులతో సంబంధం లేనిదని అందరికీ నచ్చజెప్పలేక పోతోందన్నది స్పష్టమే. తన చొరవలను వివాదపూరిత వ్యవహారాల నుండి తప్పించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. తద్వారా సార్వజనీన విలువ కలిగిన కార్యక్రమాలకు కూడా తన భావజాలం యొక్క వర్ణాన్ని అద్దకుండా నివారించాలి.
**********************
[ఇదే అంశంపై ఈ బ్లాగ్ లో ప్రచురితం అయిన ఆర్టికల్ ను ఇంకా చూడనట్లయితే కింది లింక్ లోకి వెళ్లగలరు.
“సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)”
]