సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!


School students perform Surya Namaskar in Jaipur -TOI

School students perform Surya Namaskar in Jaipur -TOI

శాస్త్ర బద్ధ అంశాలకు మతాన్ని జోడిస్తే వచ్చే దుష్ఫలితం ఇది! మానవ ఆరోగ్యానికి ఇతోధికంగా దోహదం చేసే ‘యోగా’, ‘సూర్య నమాస్కారాలు’ ఇస్లాం కి వ్యతిరేకం కాబట్టి వాటిని పాఠశాలల్లో బోధించకూడదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేస్తోంది. తద్వారా బ్రూనోను తగలబెట్టిన క్రైస్తవాన్ని, వేదాలు వినకుండా పంచముల చెవుల్లో సీసం పోసిన మనువాదాన్ని ముస్లిం బోర్డు స్ఫురణకు తెస్తోంది.

రాజస్ధాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లోని బి.జె.పి ప్రభుత్వాలు ఇటీవల తమ పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాల బోధనను తప్పనిసరి చేశాయి. మొదట మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో వీటి బోధనను తప్పనిసరి చేసింది. గత ఫిబ్రవరి నెలలో రాజస్ధాన్ ప్రభుత్వం మరింత ముందుకు వెళ్లింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా తప్పనిసరిగా యోగా, సూర్య నమస్కారాలు బోధించాలని ఆదేశించి అమలు చేస్తోంది.

ఈ నేపధ్యంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఆలస్యంగా) స్పందించింది. పాఠశాలల్లో యోగా, సూర్య నమస్కారాలను తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా దేశ వ్యాపిత ప్రచారం చేయనున్నట్లు బోర్డు నేతలు చెప్పారు. ఈ మేరకు బోర్డు నుండి లిఖిత ప్రకటన ఏదీ వెలువడకపోయినప్పటికి ఆదివారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని బోర్డు సభ్యులు చెప్పారని ది హిందు తెలిపింది.

ముస్లింలకు చెందిన అంశాలపై పత్రికలతో ఎప్పటికప్పుడు మాట్లాడేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పిన బోర్డు సభ్యులు యోగా, సూర్య నమాస్కారాలపైన బోర్డు అభిప్రాయాలను ఈ కమిటీ దేశం ముందుకు తెస్తుందని తెలిపారు.

“సూర్య నమస్కారాలు, యోగా.. ఈ అంశాలపై బోర్డు దృక్పధాన్ని కమిటీ వివరిస్తుంది. అవి ముస్లింల నమ్మకాలకు ఎందుకు వ్యతిరేకమో కూడా కమిటీ వివరిస్తుంది. వాటిని పిల్లలపై బలవంతంగా ఎందుకు రుద్ద కూడదో వివరణ ఇస్తుంది” అని బోర్డు సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ ది హిందు పత్రికకు చెప్పారు.

“ప్రభుత్వ పాఠశాలల్లో సూర్య నమస్కారాలను తప్పనిసరి చేయకూడదు. ఎందుకంటే ముస్లింలు కేవలం అల్లా ముందు మాత్రమే తల వంచుతారు. ఇలాంటి ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళే అవకాశాన్ని బోర్డు పరిశీలిస్తుంది. ఉద్యమాన్ని నడిపే అంశాన్ని పరిశీలిస్తుంది” అని మరో సభ్యుడు కమాల్ ఫరూఖి చెప్పారు.

సూర్యుడిని హిందూ మతం దేవుడిగా చేయడం వల్లనే ఈ తంటా వచ్చినట్లు కనిపిస్తోంది. సూర్యుడు దేవుడు కాదని అది మండుతున్న అగ్ని గోళం అని ఈ మత పెద్దలకు కొత్తగా చెప్పవలసింది ఎవరు? మనిషి ఆరోగ్య సంపాదనలో సూర్య కిరణాలు గొప్ప పాత్ర పోషిస్తాయి.

ఉదయం పూట వెలువడే కిరణాలు ఒంటికి, చర్మానికి వివిధ రకాల పోషణ ఇస్తాయని విజ్ఞాన శాస్త్రాలు రుజువు చేశాయి. దేహానికి రక్షణ ఇచ్చే మెలనిన్ కణాలకు ప్రధాన పోషణ సూర్య రశ్మియే సమకూర్చుతుంది. అందుకే సూర్య కిరణాల తీక్షణత తక్కువగా ఉండే ఉదయం పూట శరీర వ్యాయామం చేస్తే వ్యాయామం ద్వారా సమకూరే ఆరోగ్యంతో పాటు సూర్య రశ్మి ద్వారా సమకూరే ఆరోగ్యం కూడా శరీరానికి అందుతుంది.

యోగా అన్నది భారత దేశంలో పుట్టడడం వల్ల, ఈ దేశంలో ప్రతి సానుకూల అంశానికి దైవత్వాన్ని ఆపాదించే అలవాటు ఉండడం వల్ల అది ఒక మతానికి సొంతమైన ఆచారంగా పరిణమించింది. యోగాను మతం నుండి విడదీసి ఆచరిస్తే దానివల్ల ఆరోగ్యం మెండుగా లభిస్తుందన్నది నిర్వివాదాంశం. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం లేకుండానే యోగా ఇప్పుడు విశ్వవ్యాపితంగా ఆదరణ పొందడం అసాధ్యం.

యోగాను ఆలోపతి వైద్యం లోని ఫిజియోధెరపీతో పోల్చవచ్చు. మానవుడి శరీరం లోని వివిధ సాధనాలు (నరాలు, ఎముకలు, కీళ్ళు, నాడులు మొ.వి) ఎప్పటికప్పుడు కదలికలో ఉంటేనే అవి సరిగ్గా పనిచేసే పరిస్ధితిలో ఉంటాయి. రోజులో ఎక్కువ కాలం శరీరానికి కదలిక లేకుండా అవసరం వచ్చినపుడు కదలడం ప్రారంభిస్తే అవి సహకరించవు. యంత్రాలకు తుప్పు పట్టినట్లే శరీర సాధనాలు కూడా కదలిక లేనప్పుడు బిగుసుకుని పోతాయి. ఇలా జరగకుండా శరీరం మన స్వాధీనంలో ఉండేందుకు యోగా గొప్పగా సహకరిస్తుంది. యోగాను మతపరమైన ఉత్పత్తిగా కాకుండా శరీర వ్యాయామ కార్యంగా చూడవలసిన అవసరం ఉంది.

కానీ వాస్తవంలో యోగా బోధనను హిందు మత ఆచరణలో భాగంగా అనేక మంది బోధిస్తున్నారు. నిజానికి హిందూ మత కార్యాల పట్ల పెద్దగా నమ్మకం లేని అనేకమంది గురువులు కూడా యోగాను జనం చేత ఆచరింప జేయడం కోసం దానికి దైవత్వాన్ని ఆపాదిస్తున్నారు. ప్రాచీన సాంప్రదాయత, భారతీయ వారసత్వం అంటూ అనవసరమైన భావజాలాన్ని యోగా, సూర్య నమస్కారాల చుట్టూ చేర్చి అదేదో దైవకార్యంగా మార్చివేశారు.

యోగా భారత దేశం కనిపెట్టినదే కావచ్చు (ఇందులో భేధాభిప్రాయాలు ఉన్నాయి). అంతమాత్రాన ఈ దేశ మతాచరణలో దాన్ని భాగం చేసి బోధించవలసిన అవసరం లేదు. భారత గణిత శాస్త్రవేత్తలు కనిపెట్టిన 0 (సున్న) కు మతం లేనట్లే యోగా, సూర్య నమస్కారాలకు కూడా మతం లేదు. హోమియోపతి ప్రపంచానికి జర్మనీ ప్రసాదించిన వరం అని జర్మనీ చెప్పుకోగా ఎప్పుడన్నా విన్నామా? ఆలోపతీ వైద్యం బ్రిటన్ ప్రసాదించిన వరదాయని అని చెప్పుకోగా విన్నామా? అందుకు బదులుగా వారు ఆ వైద్య విధానాలను శాస్త్రంగా అభివృద్ధి చేశారు. వారూ, వీరూ అని లేకుండా అందరికీ అందుబాటులో ఉండే వైద్యంగా చేశారు. అందుకే అవి ప్రపంచ వ్యాపితంగా విస్తరించాయి.

యోగా, సూర్య నమస్కారాలు కూడా శరీర వ్యాయామంలో భాగంగా, క్రమబద్ధమైన పరిశోధనల ఫలితంగా ప్రపంచం ముందుకు, ప్రజల ముందుకు తీసుకురావాలి తప్ప భారతీయత గొప్పతనంగా, హిందూ వారసత్వంగా కాదు.

ఈ తేడాను ముస్లిం పర్సనల్ లా బోర్డు గుర్తించకపోవడంలో బహుశా వింత లేకపోవచ్చు. ప్రకృతిసిద్ధమైన శరీరధర్మాలకు మతం లేనట్లే, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రక్రియలకు కూడా మతం ఉండదు. యోగా హిందువుకి ఎంతటి ఆరోగ్యం ఇస్తుందో, ముస్లింకీ అంతే ఆరోగ్యం ఇస్తుంది. బాల్యం నుండే యోగాను అభ్యసించగలిగితే అది పిల్లలకు ప్రయోజనమే గానీ నష్టకరం కాదు.

ఈ సత్యాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎంత త్వరగా గ్రహిస్తే అంత ప్రయోజనం. అంతే కాకుండా బి.జె.పి ప్రభుత్వాలు యోగా, సూర్య నమస్కారాలను హిందు మతంలో భాగంగా కాకుండా పిల్లల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నేర్పే పనికి పూనుకోవాలి. తద్వారా అనవసర రాద్ధాంతాలకు చోటు ఇవ్వకుండా నిరోధించాలి.

2 thoughts on “సూర్య నమస్కారం ఇస్లాంకి వ్యతిరేకం(ట)!

  1. ఈ భూమండలంపై సమస్త ప్రాణికోటి మనుగడకు సూర్యుడు అనబడే ఒక నక్షత్రం కారణమని గుర్తించగలిగి,దానివలన కలిగే అపరిమితప్రయోజనాలలో కనీసం కొన్ని ప్రయోజనాలు పొందగలగాలనే కనీస స్పృహలేకపోతే ఎలా? సూర్యనమస్కరాలనికాకుండా చంద్రనమష్కారాలని పేరుపెడితే ఫర్వాలేదా?

  2. in christianity and islam creater must be worshipped but the creation shall not be worshipped. Hence worshippinf sun comes under worshipping the creation not the creater who created sun. hence sun worship is not accepted in christianity aND islam

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s