[Two states, one challenge శీర్షికన ఈ రోజు ప్రచురితం అయిన ది హిందు ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
*********************
తాము ఏర్పడిన ఏడాది తర్వాత కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు శక్తి, నీరు ఇతర ఆస్తులు లాంటి వనరుల పంపకం సమస్యలతో సతమతం అవడం కొనసాగుతూనే ఉంది. అవిభాజ్య రాష్ట్ర ఆదాయంలో 22 శాతం వాటా కలిగి ఉన్న హైద్రాబాద్ నుండి రెవిన్యూ ప్రవాహం లేకపోవడంతో, గత యు.పి.ఏ ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రత్యేక హోదా సైతం అందకుండా ఊరిస్తుండగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బి.జె.పి మిత్రపక్షంగా ఆంద్ర ప్రదేశ్ ను పాలిస్తున్న తెలుగు దేశం పార్టీ స్పెషల్ గ్రాంటు వస్తుందని ఆశిస్తోంది. కానీ అనేక ఇతర రాష్ట్రాలు కూడా అదే తరహా ప్యాకేజీలను కోరుతుండడంతో అది కూడా సుదూర స్వప్నంగానే మిగిలిపోయింది.
నీటి పంపకం అంశం కూడా, ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న అదే తరహా సమస్య వలెనే, ఇరు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్నది. విభజనానంతర వాస్తవంతో ప్రజా సామాన్యం సర్దుబాటు చేసుకున్నప్పటికీ, ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్న రాజకీయ ప్రతిష్టాత్మకతే నిజానికి ఇరు రాష్ట్రాలు `సామరస్యంగా సహజీవనం సాగించడానికి ఆటంకంగా ఉన్న అంశం. ఉదాహరణకి ఏప్రిల్ లో తెలంగాణ ప్రభుత్వం అవతలివైపు ఆందోళనను పట్టించుకోకుండా తన సొంత మోటారు వాహన పన్ను విధించింది. అది సచివాలయ ప్రాంగణ విభజన కావచ్చు, ప్రభుత్వరంగ సంస్ధలు కావచ్చు, రాష్ట్ర కేడర్ అధికారుల విభజన లేదా హై కోర్టు విభజన అయినా కావచ్చు -ప్రతి ఒక్క అంశమూ వివాదాలకు కేంద్రం అవుతోంది.
వివాదం తలెత్తినప్పుడల్లా ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం నెరపాలంటూ కేంద్రం తలుపు తడుతున్నాయి. కానీ నిజం ఏమిటంటే, ఏ సమస్యపైనైనా నచ్చజెప్పే మార్గంలో ప్రయత్నాలు చేయడం మినహా న్యూ ఢిల్లీ చేయగలిగిన పిసరంత కృషి కూడా ఏమీ లేదు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మౌలిక నిర్మాణాల రంగంలో తలపెట్టిన గొప్ప ప్రాజెక్టుల సాధనకు నిధులను సమీకరించడానికి మార్గాలను అన్వేషించాలి. కేంద్రం హామీ ఇచ్చిన నిధుల మొత్తాన్ని పొందడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజధాని ప్రాంత అభివృద్ధి పధకాలను సాకారం చేసుకునేందుకు మరియు విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, స్మార్ట్ సిటీల నిర్మాణానికి ప్రైవేటు మరియు విదేశీ వనరుల నుండి నిధులను పొందే అవకాశాలను అన్వేషించాలి. ఐ.టి మరియు ఐ.టి.ఇ.ఎస్ (Information Technology enabled Services) ఎగుమతుల ఆదాయంలో 99 శాతం హైద్రాబాద్ నుండే రావడం వల్ల రెండు రాష్ట్రాలకు రెవిన్యూ విషయంలో హైదరాబాదే ప్రధాన అంశం అయింది.
ఈ వాస్తవం రెండు ప్రభుత్వాలు 2014-15, 2015-16 సం.లకు గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ లలోనే ప్రతిబింబించింది. తెలంగాణ ఈ కాలాల్లో వరుసగా రు. 301 కోట్లు, రు. 531 కోట్లు ల మిగులు చూపగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం వరుసగా రు. 6,064 కోట్లు, రు. 7,300 కోట్ల లోటును చూపింది. అయితే కె.చంద్రశేఖర్ రావు నేతృత్వం లోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఎదుట ఉన్న సవాలు రాష్ట్రం అంతటా సమాన ప్రగతి విస్తరించేలా చూడడం. ముఖ్యంగా వరంగల్, ఆదిలాబాద్, కరీం నగర్, నిజామాబాద్ జిల్లాలు చారిత్రకంగా తయారీ రంగంలో ఎన్నడూ ఎలాంటి ప్రగతిని చవి చూసింది లేదు. లోపలి ప్రాంతాల ప్రధాన వనరులు మైనింగ్, పౌల్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్, డెయిరీ మరియు వ్యవసాయం. ప్రగతి పధాన ముందుకు సాగాలంటే విభజన ముందరి నాటి పరస్పర అపనమ్మకం, విరోధాలను వెనక్కి నెట్టి వాస్తవ అంశాలపై కేంద్రీకరించడమే అవసరం.