క్వాలిటీకి తాము అత్యంత ప్రాముఖ్యత ఇస్తామని నెస్లే గ్లోబల్ సి.ఇ.ఓ చెప్పిన మాట! కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని కంపెనీ వార్షిక నివేదికలు (బ్యాలన్స్ షీట్) వెల్లడిస్తున్నాయి. నెస్లే ఇండియా కంపెనీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన మొత్తంలో 5 శాతం కంటే తక్కువే క్వాలిటీ పరీక్షల కోసం ఖర్చు పెడుతోంది.
2014 సంవత్సరంలో నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసే ప్రకటనల కోసం 445 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కానీ ఆ ఉత్పత్తుల క్వాలిటీని ప్రయోగశాలల్లో పరీక్షించేందుకు కేవలం 19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 2014 కోసం కంపెనీ ప్రకటించిన బ్యాలన్స్ షీట్ లో ఈ వివరాలు ఉన్నాయి.
ఒక్క 2014 లోనే కాదు. ప్రతి యేడూ కంపెనీ ఖర్చు ఇలానే ఉందని ది హిందు తెలిపింది. ‘ప్రకటనలు మరియు అమ్మకాల ప్రోత్సాహ ఖర్చు’ పద్దు కింద కంపెనీ పెట్టిన ఖర్చు గత 5 యేళ్లలో రు. 300 నుండి రు. 450 కోట్ల వరకు ఖర్చు చేయగా ‘ప్రయోగశాలలు మరియు క్వాలిటీ పరీక్షల’ పద్దు కింద రు. 12 నుండి 20 కోట్ల వరకు ఖర్చు చేసింది.
2010 నుండి 2014 సంవత్సరాలలో నెస్లే ఇండియా ఖర్చులను పోల్చితే ప్రకటనల కోసం 2010 లో రు. 302 కోట్లు వెచ్చించగా 2014 లో అది రు. 445 కోట్లకు చేరింది. ఇది 47 శాతం పెరుగుదలకు సమానం. అదే ప్రయోగశాలలు మరియు క్వాలిటీ పరీక్షల కోసం అయితే 2010 లో రు. 13 కోట్లు, 2014 లో 19 కోట్లు ఖర్చు చేసింది. ఇది 45 శాతం పెరుగుదలకు సమానం.
ప్రకటనలు, పరీక్షల కోసం పెట్టే ఖర్చులో కనిపించే తీవ్ర అంతరం ఒక్క నెస్లే కంపెనీకి మాత్రమే పరిమితం కాదు. దాదాపు బహుళజాతి కంపెనీలు అన్నీ ఈ అంతరాన్ని కలిగి ఉంటాయి. పైకి చెప్పడానికి వినియోగదారుల విశ్వాసం, నమ్మకమే తమ ప్రాధామ్యం అని చెప్పినప్పటికీ వాస్తవంలో అమ్మకాలు పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కడమే కాకుండా తప్పుడు సమాచారాన్ని వినియోగదారులకు ఇవ్వడానికి అవి వెనుకాడవు.
మ్యాగీలో సీసం, మోనో సోడియం గ్లుటామేట్ లు పరిమితికి మించి ఉన్నాయని, ప్రమాదకర స్ధాయిలో కూడా ఉన్నాయని వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు చేసిన పరీక్షల్లో వెల్లడి అయినప్పటికీ ‘మ్యాగీ భద్రమైన ఆహారమే’ అని కంపెనీ గ్లోబల్ సి.ఇ.ఓ సైతం బొంకడానికి సిద్ధపడడమే ఇందుకు తార్కాణం. మొత్తం 9 రకాల మ్యాగీలు మానవ వినియోగానికి పనికిరావు అని భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్ధ తేల్చిన సంగతిని కంపెనీ అధిపతి ఏమాత్రం పట్టించుకోలేదు.
ఇదిలా ఉండగా అనారోగ్య కారక మ్యాగీ నూడుల్స్ అమ్మకాల రీత్యా కంపెనీ నుండి నష్టపరిహారం పొందేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అన్యాయమైన వాణిజ్య చర్యలకు నెస్లే కంపెనీ పాల్పడిందని కేంద్రం ఆరోపిస్తోంది. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కు ఫిర్యాదు చేయడం ఇందులో భాగమే అని తెలుస్తోంది. అయితే తమకు ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి తాఖీదు రాలేదని కంపెనీ చెప్పడం గమనార్హం.
maggie noodles withdrawal leads to anger in India-BBC News
http://www.bbc.com/news/world-asia-india-33018101