విభజన రాజకీయాలు పూర్తి స్ధాయిలో సాగుతున్న కాలంలో, కేవలం సంవత్సర కాలం క్రితమే, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇప్పటి బి.జె.పి ప్రభుత్వం గానీ ఇవ్వని వాగ్దానం లేదు. నూతన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అనేక సంస్ధలు, నిధులు వాగ్దానం చేసినా అవేవీ అమలు కాకపోగా, కనీసం అమలు చేస్తామన్న నమ్మకం కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతోంది.
రాష్ట్ర విభజనలో తమది కూడా గణనీయమైన పాత్రే అని చెప్పుకోవడం బి.జె.పికి ఇష్టం. అటు తెలంగాణ ప్రజలకేమో తమ నాయకురాలు సుష్మా స్వరాజ్ వల్లనే విభజన సాధ్యం అయిందని ఆ పార్టీ చెబుతుంది. ఇటు ఆంద్ర ప్రజలకేమో తమ నేత వెంకయ్య నాయుడు వల్లనే అనేక వరాలు ఆంధ్ర ప్రజలకు కురిసాయని చెబుతుంది.
తీరా చూస్తే ఆంధ్ర ప్రదేశ్ రాజధానికి భూమి పూజ జరుగుతున్న రోజున బండకు కొట్టి నెత్తిన జల్లుకునేందుకు కొబ్బరి చిప్పను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కార్టూనిస్టు వ్యంగ్యంగా చెబుతున్నారు. ‘ప్రత్యేక హోదా’ అనే సంజీవని పర్వతాన్ని మోసుకొస్తారని ఆశిస్తుంటే మన ఆంధ్ర కేంద్ర మంత్రి కొబ్బరి కాయతో సరిపెట్టడం బి.జె.పి ప్రభుత్వం తాను ఇచ్చిన వాగ్దానాల నుండి వెనక్కి తగ్గిందనేందుకు ప్రతీక.
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా అప్పటి, ఇప్పటి పాలక పక్షాలు ప్రకటించాయి. బడ్జెట్ లో చూస్తే ముష్టి 100 కోట్లు విదిలించి చేతులు దులుపుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఒత్తిడి తెచ్చి మరో 1,000 కోట్లకు వాగ్దానం తీసుకున్నారని టి.డి.పి నేతలు చెప్పడమే గానీ ఆ నిధులు వచ్చేదాకా గ్యారంటీ లేదు.
విభజన వల్ల కొంత ఆదాయం కోల్పోతుంది గనకా, నూతన రాజధాని నిర్మాణానికి నిధులు అవసరం అవుతుంది గనుక ప్రతి యెడూ బడ్జెట్ లోటు పూడ్చుకునేందుకు వేల కోట్లు ఇస్తామని చెప్పారు. ఆ ఊసే ఇంతవరకు లేదు. అదిగో ఐ.ఐ.టి అన్నారు. ఇదిగో ఎ.ఐ.ఐ.ఎం.ఎస్ అంటున్నారు. ఎన్.ఐ.టిని ప్రైవేటు కాలేజీలో పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
చివరికి చంద్రబాబు వాగ్దానం ఇచ్చిన ఋణ మాఫీ ‘పంచ పాండవులు అంటే మంచం కోళ్ళ లాగా ముగ్గురు’ అన్నట్లుగా కేంద్రం వాగ్దానాలు ఆచరణలోకి వచ్చే అవకాశమే ఎక్కువ కనిపిస్తోంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎ.పి కి ఇచ్చిన వాగ్దానాల విషయంలో సరిగ్గా వర్కవుట్ చేయలేదని ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ‘ప్రత్యేక హోదా’ విషయమై వ్యాఖ్యానిస్తూ అనడమే ఇందుకు నిదర్శనం.
‘ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు’ అంటూ విచిత్ర నినాదాన్ని ఎ.పి లోని అన్నీ పార్టీలు అందుకునే పరిస్ధితి ఇప్పుడు నెలకొని ఉంది. భారత దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణించే ఆంధ్ర ప్రదేశ్ కు ‘వెనుకబడ్డ హక్కు’ ను ప్రసాదించేందుకు మన రాజకీయ నేతలు సిద్ధపడుతుండడం ఒక వింత పరిణామం. అసమాన అభివృద్ధిని, అసమానతలను కాపాడుతూ వచ్చిన రాజకీయ పార్టీలు జనం నెత్తిపై ఉన్నప్పుడు ఇలాంటి వింతలకు కొదవ ఉండదు.
మీ ఉద్దేశ్యం ఏంటి , ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యెక హోదా అవసరం లేదనా ?
దీని తర్వాత పోస్టు ఒకసారి చూడండి. రాష్ట్రాలకు ఏ పేరుతో నిధులు వచ్చినా తీసుకోవలసిందే. దానితో పాటు ప్రత్యేక హోదా రాజకీయాలను అర్ధం చేసుకోవాలని నా సూచన.