కింద పడ్డా పై చేయి మాదే -మ్యాగి


Paul Bulcke, Nestle Global CEO

భారత దేశంలో ఎల్లెడలా ఒత్తిడి తీవ్రం కావడంతో స్విట్జర్లాండ్ బహుళజాతి కంపెనీ నెస్లే (Nestle) వెనక్కి తగ్గింది. దేశ వ్యాపితంగా అన్ని దుకాణాల నుండి మ్యాగి నిల్వలను వెనక్కి తీసుకుంటున్నట్లు కంపెనీ అధిపతి ప్రకటించాడు. అయితే కింద పడ్డా పై చేయి తనదే అని చెబుతున్నట్లుగా మ్యాగీలో మోనో సోడియం గ్లుటామెట్ (ఎం.ఎస్.జి) ని కలప లేదని బొంకడం మాత్రం మానలేదు.

దేశంలో మెజారిటీ రాష్ట్ర ప్రభుత్వాలు మ్యాగి శాంపిళ్లను పరీక్షకు పంపుతూ తమ తమ రాష్ట్ర ప్రజల ఆందోళనలను తాము వింటున్నామని సందేశం పంపాయి. గోవా, పశ్చిమ బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాలు మ్యాగిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని తమ పరీక్షల్లో తేలినట్లు చెప్పాయి. 5 రాష్ట్రాలు ఇప్పటికే మ్యాగీని నిషేధించాయి. విద్యార్ధి, యువజన సంఘాలు పాఠశాల పిల్లలతో మ్యాగీకి వ్యతిరేకంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహించడంతో శుక్రవారం నుండి మ్యాగీ వ్యతిరేక వాతావరణం మరింత వేడెక్కింది.

చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా రంగం లోకి దిగి మ్యాగీ పైన వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయడం ఒక వింత పరిణామం. భారత ప్రజలను తప్పుడు ప్రచారంతో మోసగించడమే కాకుండా పిల్లలు ఇష్టపడే ఆహారంలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్న విదేశీ కంపెనీపై నిశ్చయాత్మక చర్య తీసుకోవాల్సిన స్ధానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తానే వినియోగదారుడికి మల్లె తన అంగాల్లో ఒకటైన కన్స్యూమర్ ఫోరంలో ఫిర్యాదు చేస్తే ఇక జనం ఎవరికి చెప్పుకోవాలి? దేశంలోని సమస్త అంగాలను నియంత్రించే అధికారాలను దగ్గర పెట్టుకుని క్యూలో నిలబడ్డ ఫిర్యాదిదారుగా కేంద్ర ప్రభుత్వం మారడం ఎవరిని నమ్మించడానికి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి (మూడ్) ని అందిపుచ్చుకున్న ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ (భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్ధ) మ్యాగీని ప్యాకెట్లను మార్కెట్ నుండి వెనక్కి తీసుకోవాలని కంపెనీని ఆదేశించింది. మ్యాగీ నూడుల్స్ మానవ వినియోగానికి హానికరం, ప్రమాదకరం అని ప్రకటించింది. దానితో నెస్లే కంపెనీ గ్లోబల్ సి.ఇ.ఓ పాల్ బ్లూక్ న్యూ ఢిల్లీ వచ్చి శుక్రవారం పత్రికల సమావేశం ఏర్పాటు చేశాడు. మ్యాగీ నూడుల్స్ లో హానికర పదార్ధాలు ఏమీ లేవని నమ్మబలికాడు. తమ నూడుల్స్ లో అసలు రుచికారక ఎం.ఎస్.జి లేనేలేదని స్పష్టం చేశాడు.

పౌల్ బ్లూక్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భారత విలేఖరుల ప్రశ్నల పట్ల పశ్చిమ వార్తా సంస్ధలు అసహనం వ్యక్తం చేశాయి. రాయిటర్స్ అయితే భారతీయ విలేఖరులు పౌల్ బ్లూక్ తో రౌడీల్లా ప్రవర్తించారని, కాకి గోల చేశారని రాసింది. భారత దేశం నుండి దిగుమతి అయ్యే సరుకులు తమ మార్కెట్లను ఆక్రమించినట్లయితే ఆ సరుకుల భద్రత పైన చిలవలు పలవలు చేసి ప్రచారం చేసే పశ్చిమ వార్తా సంస్ధలు తమ ప్రాంతానికి చెందిన కంపెనీపై ఇంత పెద్ద వ్యతిరేక ప్రచారాన్ని మింగలేకపోతున్నాయి, అది వాస్తవం అయినా సరే.

నెస్లే కంపెనీకి మ్యాగీ అమ్మకాలు పెద్ద విషయం కాదు. భారత దేశంలో మ్యాగీ ఆదాయం కోల్పోవడం కంపెనీకి పెద్ద లెక్కలోనిది కాదు. రాయిటర్స్ ప్రకారం ప్రపంచ వ్యాపితంగా నెస్లే కంపెనీకి వివిధ ఉత్పత్తుల ద్వారా 92 బిలియన్ స్విస్ ఫ్రాంకులు లేదా 98.6 బిలియన్ డాలర్లు లేదా రమారమి 6.21 లక్షల కోట్ల రూపాయల రెవిన్యూ ఆదాయం ప్రతి యెడూ కంపెనీకి వస్తుంది. మ్యాగీ ఆదాయం కోల్పోతే నెస్లే కంపెనీకి మహా అయితే 0.005 శాతం ఆదాయం పోతుందని రాయిటర్స్ తెలిపింది.

కానీ ఎన్.డి.టి.వి ప్రాఫిట్ లెక్క వేరుగా ఉంది. దాని ప్రకారం మ్యాగీ వల్ల నెస్లేకి ఇండియాలో 2014లో వచ్చిన రెవిన్యూ రు. 9,800 కోట్లు. ఇది నేసే వార్షిక రెవిన్యూలో 1.5 శాతం పైనే ఉంది. ఎన్.డి.టి.వి లెక్క నిజం అనుకున్నా అదేమంత భారీ ఆదాయం కాదు. కానీ ఈ గొడవ వల్ల నెస్లే ప్రతిష్ట తీవ్రంగా దెబ్బ తింటుంది. దీని ప్రభావం ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాపితంగా ఉండవచ్చు.

మ్యాగీ గొడవ కారణంగా ఇండియా షేర్ మార్కెట్ లో నెస్లే షేర్లు భారీగా నష్టపోయాయి. మే 28 తేదీన మ్యాగీ షేర్ విలువ రు 7,038 లు ఉంటే జూన్ 5 తేదీకల్లా రు 5,997 కు పడిపోయింది. ఈ లెక్కన నేస్లే కంపెనీ ఈ కొద్ది రోజుల్లోనే రు 10.000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయిందని ఎన్.డి.టి.వి ప్రాఫిట్ అంచనా వేసింది. ఇలాంటి నష్టాన్ని చవి చూడడం తిరిగి పూడ్చుకోవడం బహుళజాతి కంపెనీలకు మామూలే. దానికంటే ముఖ్యమైనది బ్య్రాండ్ విలువ. బ్రాండ్ విలువను కోల్పోతే దానిని తిరిగి పూడ్చుకోవడం కష్టం. అనేక యేళ్లపాటు అనేక బిలియన్లు ఖర్చు పెట్టి బహుళజాతి కంపెనీలు తమ బ్రాండ్ విలువను సుస్ధిరం చేసుకుంటాయి.

అలాంటి బ్రాండు విలువను మ్యాగీ లాంటి చిన్న ఉత్పత్తి వల్ల కోల్పోవలసి వస్తే అది నెస్లే కంపెనీకి మింగుడు పడని వ్యవహారం. ఆరు నూరైనా తమ బ్రాండు విలువను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కంపెనీ గ్లోబల్ సి.ఇ.ఓ న్యూ ఢిల్లీ వచ్చి మ్యాగీ భయాలు నిరాధారం అని కొట్టిపారేసేందుకు పూనుకున్నాడు. మ్యాగీ సరుకు అంతటిని వెనక్కి తీసుకుంటున్నాం అని చెబుతూనే భారత ప్రయోగశాలలు పరీక్ష చేసి తేల్చిన వాస్తవాలను అవాస్తవాలుగా కొట్టిపారేశాడు.

నెస్లే కంపెనీ ఇండియాలో మొత్తం 9 రకాల (రుచుల) మ్యాగీ న్యూడుల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 9 రకాలలోనూ హానికర రసాయనాలు ఉన్నాయని ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ చెప్పింది. తక్షణమే అన్నీ వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. వాటితో పాటు మ్యాగీ వొట్స్ నూడుల్స్ ను అనుమతి తీసుకోకుండానే భారత మార్కెట్ లోకి నెస్లే ప్రవేశపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ఉత్పత్తిని ఉపసంహరించాలని ఆదేశించింది.

భారత ఆహార భద్రతా అధికారులకు తగిన వివరణ ఇచ్చి వారిని అన్ని విధాలుగా సంతృప్తి పరిచాక (?) మళ్ళీ నూడుల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెడతామని పాల్ బ్లూక్ చెప్పడం విశేషం. అయినప్పటికీ మ్యాగీ వ్యవహారం వల్ల రెండు మూడు త్రైమాసికాల పాటు మ్యాగీ ఆదాయాన్ని నెస్లే కోల్పోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పలు షేర్ బ్రోకర్ కంపెనీలు నెస్లే షేర్ విలువపై తమ అంచనాను కిందికి సవరించుకున్నాయి. మదుపుదారులు నెస్లే షేర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఆందోళన సద్దుమణిగే వరకు నెస్లే షేర్ నుండి దూరంగా ఉండడమే మంచిదని హెచ్చరించాయి.

నెస్లే కంపెనీ ఆందోళన కూడా ఇదే. ఇంటర్నెట్, సోషల్ నెట్ వర్క్ యుగంలో కూడా భారత దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం మ్యాగీలో రసాయనాల పట్ల ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ త్వరితగతిన స్పందించడంలో కంపెనీ విఫలం అయింది. బహుశా, గొడవ దానంతట అదే సద్దుమణుగుతుందని ఆశించింది. మ్యాగీ వ్యవహారం భవిష్యత్తులో పశ్చిమ దేశాల్లో భారత ఉత్పత్తుల మార్కెట్ పై ప్రభావం పడవేస్తుందేమో వేచి చూడవలసిన విషయం.

2 thoughts on “కింద పడ్డా పై చేయి మాదే -మ్యాగి

 1. ఇంకాస్త వివరణ కోసం ఈ వ్యాఖ్య:

  మ్యాగీ బ్రాండ్ వదులుకుని కొత్త బ్రాండ్ తో జనం ముందుకు నెస్లే రావచ్చన్న అనుమానం కలగవచ్చు. అట్లా చేయడం కంపెనీకి లాభసాటి కాదు. ఆర్టికల్ లో చెప్పినట్లుగా మ్యాగీ రెవిన్యూ కంపెనీకి లెక్క కాదు. ఒకవేళ రూపం మార్చుకుని వచ్చినా రెవిన్యూలో పెరుగుదల ఉండదు. పైగా కొత్త బ్రాండు కోసం బాగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇండియా నూడుల్స్ మార్కెట్ లో మ్యాగీ వాటా 50 శాతం పైనే. పేరు మార్చితే మళ్ళీ మొదలు ఎత్తుకోవాలి. కనుక మార్కెట్ గ్యారంటీ ఉండకపోవచ్చు. అందువల్ల ఉన్నదాన్నే నడిపించే అవకాశం ఉంది. కాకపోతే అమ్మకాలు పుంజుకోవడానికి సమయం పడుతుంది. జనం పెప్సీ-కోక్ లను మర్చిపోయినట్లే మ్యాగీ విషయమూ మర్చిపోతారు.

  పాఠకులు గమనిస్తే ఇతర నూడుల్స్ బ్రాండ్ లను కూడా ప్రయోగశాలల్లో పరీక్షిస్తామని ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ ప్రకటించింది. ‘ఒక్క మ్యాగీయే ఎందుకు బలి కావాలి?’ అని సంస్ధ డైరెక్టర్ ప్రశ్నిస్తున్నాడు. అంటే మ్యాగీ మార్కెట్ ను ఇతర నూడుల్ బ్రాండ్ లు కైవసం చేసుకోకుండా ప్రభుత్వమే పాచిక విసురుతోంది. బ్రాండులన్నీ నష్టపోతే మ్యాగీకి కోలుకోవడం తేలిక కదా. బహుశా నెస్లే బ్రాండ్ పడిపోకుండా యూరోపియన్ యూనియన్ ఇప్పటికే రంగంలోకి దిగి ఉన్నా ఆశ్చర్యం లేదు.

  నెస్లే ప్రయోజనం బ్రాడ్ గా చూస్తే సామ్రాజ్యవాద ప్రయోజనం. అందువల్ల జనాన్ని మభ్య పెట్టడానికి తెరవెనుక కసరత్తు బాగా జరుగుతుంది. అసలీ వివాదం ఇంత స్ధాయికి రావడమే గొప్ప. ఏయే అంశాలు పని చేసాయో భవిష్యత్తులోనన్నా తెలియకపోదు.

 2. భారత ఆహార భద్రతా అధికారులకు తగిన వివరణ ఇచ్చి వారిని అన్ని విధాలుగా సంతృప్తి పరిచాక (?) మళ్ళీ నూడుల్స్ ను మార్కెట్ లో ప్రవేశపెడతామని పాల్ బ్లూక్ చెప్పడం విశేషం
  ఖచ్చితంగా ఇదే జరుగుతుంది!దశాబ్దం క్రితం శీతల పానీయాలలో జరిగిన తతంగం తెలిసిందేకదా!వారికి ప్రచారం పెట్టి వాటి ఉత్పత్తులను పెంచడానికి మనదగ్గర స్టార్లు సదా సిద్ధం! అటు-ఇటుగా మాగి విషయంలో కూడా ఇదే తంతు జరుగుతుంది.
  కేంద్ర ప్రభుత్వం గూర్చి,దాని ఆధీనంలో ఉన్న భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్ధ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఉ.ప్ర.లో ఫూడ్ ఇన్స్పెక్టర్ ఎందుకు మాగి మీద అనుమానం వచ్చిందొ,ఆ సాంపిల్స్ ఫలితాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పరిగణలోకి తీసుకుందో తెలియాల్సిన విషయం.
  నెస్లే సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తులమీద(ఆ మాటకొస్తే దేశంలో చెలామనిలో ఉన్న అన్ని బహులజాతిసంస్థల ఉత్పత్తులపైనా) భద్రత పరీక్షలను మరలా జరిపితే వాటి ప్రమాణాలు అందరికీ తెలుస్థాయి!
  పై ఉత్పత్తులకన్నా దేశీయంగా(స్థానికంగా) తయారుచేస్తున్న తినుబండారాలే ఎన్నో రెట్లు నయం!
  ఆమాటకొస్తే మనదేశ ప్రజలలో వీటివిషయాలలో పెద్దగా చైతన్యం ఉండదు!పైనుండి ఆకర్షనీయమైన ప్రకటనలు వస్తే మరలా వాటిని కొనుగోలు చేస్తూనే ఉంటారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s