వాలుకి విరుద్ధంగా… -ది హిందు ఎడిట్..


Against the grain

Against the grain

[జూన్ 4 నాటి ది హిందు ఎడిటోరియల్ ‘Against the grain’ కు ఇది యధాతధ అనువాదం. ఈ శీర్షిక ఆంగ్లంలో ఒక సామెత. కట్టెను వాలుగా కొస్తే త్వరగా తెగుతుంది తప్ప అడ్డంగా కోస్తే అనుకున్న ఫలితం రాదని ఈ సామెత సూచిస్తుంది. ఈ సామెత ప్రస్తావించడంలోనే ది హిందు ఉద్దేశ్యం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. కానీ ఎడిటోరియల్ లో గమనార్హమైన పరిశీలనలు ఉన్నాయి.]

*****************

“న్యాయమైన నష్టపరిహారం పొందే హక్కు మరియు భూ సేకరణ, పునరావాసం, పునర్నివాసం లలో పారదర్శకత (రెండవ సవరణ) బిల్లు -2015” [Right to Fair Compensation and Transparency in Land Acquisition, Rehabilitation and Resettlement (Second Amendment) Bill – 2015] ను పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలిస్తుండగానే ఆర్డినెన్స్ ను -మూడవ సారి- జారీ చేయడం బట్టి, ప్రజాస్వామిక ప్రమాణాల పట్ల నరేంద్ర మోడి ప్రభుత్వానికి ఉన్న పరిమిత గౌరవాన్ని చూపుతోంది. మోడి సైతం బహిరంగంగా (బిల్లుకు) విరుద్ధమైన వ్యక్తీకరణలు చూపుతున్నప్పటికీ 2013 చట్టంలో సమగ్ర భాగమైన ప్రజా సమ్మతి మరియు సామాజిక ప్రభావ మదింపు అంశాలకు సంబంధించిన క్లాజులను తిరిగి బిల్లులో చేర్చాలని ప్రతిపక్షం చేస్తున్న కీలక డిమాండ్లకు, బి.జె.పి నేతృత్వంలోని ఎన్.డి.ఏ ప్రభుత్వం విముఖంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కావున సంయుక్త కమిటీలో సభ్యులుగా ఉన్న ప్రతిపక్ష ఎం.పిలు సదరు కమిటీ నుండి బైటికి రావడానికి ఆలోచన చేయడంలో ఆశ్చర్యం లేదు.

ఆర్డినెన్స్ ను మళ్ళీ (మూడవ సారి) జారీ చేయడాన్ని “ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా బొత్తిగా సాధ్యపడనిది”గా సి.పి.ఐ(ఎం) ప్రధాన కార్యదర్శి మరియు ఎం.పి అయిన సీతారాం యేచూరి అభివర్ణించారు. పాలనా నిర్వహణ వ్యవస్ధ మెత్తబడే సూచనలు ఏ మాత్రం చూపని పరిస్ధితి కొనసాగుతుండగానే బి.జె.పి పార్టీలో సైతం అసంతుష్ట గొణుగుడు, ముఖ్యంగా గ్రామీణ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎం.పిల నుండి, వినవస్తోంది. నిజానికి, ప్రతిపాదిత మార్పుల వల్ల దొర్లిపడే రాజకీయ ప్రభావం పట్ల వ్యాకులపడుతున్న కొందరు బి.జె.పి సభ్యులు, మొట్టమొదటి సంయుక్త కమిటీ సమావేశంలోనే తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఎన్.డి.ఏ లో బి.జె.పి భాగస్వాములైన శిరోమణి అకాలీ దళ్, శివ సేన పార్టీలు కూడా అభాసుపాలవుతున్న అటువంటి నిర్ణయంపై మొండి పట్టు పట్టడంలోని విజ్ఞతపై ప్రశ్నలు లేవనెత్తాయి.

సంకేతాలను మోడీ ప్రభుత్వం తప్పుగా చదువుతోందని స్పష్టంగా అగుపిస్తోంది: ప్రతిపాదిత మార్పుల్లో తగు యోగ్యత ఉందని భావిస్తున్న సీనియర్ అధికారులు (భూసేకరణను సులభతరం చేస్తుందని, మౌలిక నిర్మాణాల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయేందుకు సవరణల చట్టం దోహదం చేస్తుందని వారు భావిస్తున్నారు) కూడా, బిల్లును తెచ్చే ముందు ప్రతిపక్షాలతో చర్చలు జరిపి ఉండాల్సిందని చెబుతున్నారు. అసలు మార్పులు చేయడానికి ప్రయత్నాలు ఆరంభించక మునుపే దేశవ్యాపితంగా అభిప్రాయాలను-తయారుచేసే కార్యక్రమాలను (opinion-making exercises) నిర్వహించి ఉండాల్సిందని కూడా వారు చెబుతున్నారు. ఇప్పుడు, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలకు ప్రభుత్వ-ప్రాయోజిత మార్పులకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు తగిన సమయం దొరికింది. ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా గ్రామీణ పేదలకు వ్యతిరేకమైనదని, రైతు వ్యతిరేకమని దేశ ప్రజానీకంలోని గణనీయ మొత్తం నమ్ముతోందని జనత నుండి వస్తున్న నివేదికలు సూచిస్తున్నాయి.

దురదృష్టవశాత్తూ, ప్రభుత్వానికి పంటలను నాశనం చేసిన అకాల వర్షాలు మరియు ఎరువుల ధరల పెంపుల సమయంలోనే ఇదంతా జరుగుతోంది. అయినప్పటికీ, పంటలకు కనీస మద్దతు ధరలు కూడా తదనుగుణంగా పెరగలేదు. ఇవన్నీ కలిసి వెలువరిస్తున్న సందేశం ఏమిటయ్యా అంటే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్లుప్తీకరించినట్లుగా, ఇది వ్యవసాయ వర్గాల ప్రయోజనాలు ఏ మాత్రం లక్ష్య పెట్టని సూటు బూటు బాబుల ప్రభుత్వం (సూట్-బూట్-కీ-సర్కార్) అని; ఈ ప్రభుత్వానికి కార్పొరేట్ ధనిక వర్గాలకు మేలు చేసే భూ చట్టం మాత్రమే కావాలనీ. ప్రస్తుత భూసేకరణ బిల్లు రాజ్య సభలో ఓటమికి గురైనాక, ఉభయ సభల సంయుక్త సమావేశం జరపాలని  పాలక ప్రభుత్వం వేసుకున్న పధకం ఆశావాద రాజకీయాల మొఖం మీద చాచికొట్టింది. ఏమంటే అది ప్రతిపక్షానికి మరింత మందుగుండునే సరఫరా చేసింది మరి. ఇక మిగిలిన వివరణల్లా లోక్ సభలో తనకు గల సంఖ్య దేశంలో సర్వవ్యాపితమై నెలకొన్న జాతీయ చిత్తాన్ని చూడలేని గుడ్డిదిగా ప్రభుత్వాన్ని మార్చివేసిందని మాత్రమే!

*******************

[అసలు మార్పులు చేయడానికి ప్రయత్నాలు ఆరంభించక మునుపే దేశవ్యాపితంగా అభిప్రాయాలను-తయారుచేసే కార్యక్రమాలను (opinion-making exercises) నిర్వహించి ఉండాల్సిందని సీనియర్ అధికారులు చెప్పారన్న సంగతి ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. భారత దేశంలోని బ్యూరోక్రసీ స్వభావాన్ని ఇది పట్టిస్తుంది. భారత దేశం లాంటి ప్రజలకు ఎలాంటి స్వామ్యమూ లేని ప్రజాస్వామ్య వ్యవస్ధల్లో బ్యూరోక్రసీ నిరంకుశంగా వ్యవహరిస్తుంది. వారికి వివిధ ట్రైనింగ్ ల ద్వారా నేర్పిన పాలనా సూత్రాలే పరమమైనవి. ప్రజల వాస్తవ స్ధితిగతులు, సహస్రాబ్దాల నాటి అసమాన వ్యవస్ధ ప్రజా సామాన్యానికి వారసత్వంగా అందించిన అవిద్య, అసమానతలు వారికి పట్టవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధలో వారు శకుని పాత్ర పోషిస్తారు.

అందుకే బిల్లు ఆమోదం పొందాలంటే అభిప్రాయాలను-తయారుచేసే-కార్యక్రమాలు నిర్వహించి ఉండాల్సిందని సూచిస్తున్నారు. అభిప్రాయాలు సేకరించడం ఉంటుంది గానీ తయారు చేయడం ఉంటుందా? సేకరించడం అంటే ప్రజల వాస్తవ అభిప్రాయాలను తెలుసుకోవడం. తయారు చేసుకోవడం అంటే ప్రభుత్వం తలపెట్టిన మార్పులకు అనుగుణంగా ప్రజల అభిప్రాయాల్ని మలచుకోవడం. మొదటిది నీతి కాగా రెండవది మోసం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇలాంటి అభిప్రాయాల్ని తయారు చేసుకునే ప్రక్రియలను మహ బాగా నిర్వహించింది. జనానికి చెడు చేసే మద్యపాన నిషేధ ఎత్తివేతను జనం చేతనే అవుననిపించిన ఘనత అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సాధించింది. ఇలాంటి ఎత్తులనే ‘సమ్మతి తయారీ’ (manufacturing consent) అని విశ్వ విఖ్యాత అమెరికన్ భాషావేత్త, ప్రపంచ రాజకీయ పరిశీలకులు అయిన నోమ్ ఛోమ్ స్కీ అభివర్ణించారు. అదే తరహా ఎత్తులు వేయాలని, మొండితనం పనికిరాదని బ్యూరోక్రసీలోని సీనియర్లు చెప్పడం బట్టి వారు ఎవరి పక్షమో గ్రహించాలి తప్ప వారేదో ప్రజల కోసం మొండితనం వీడాలని చెప్పడం కాదు. -విశేఖర్]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s