సామాజిక మరియు సైద్ధాంతీక సమస్యలపై ఒక విద్యార్ధి సంస్ధ చేపట్టిన చురుకైన అవగాహన ఆధారంగా ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ పాలన కింద నడిచే పేరు ప్రతిష్టలు కలిగిన ఓ సంస్ధ అధికారులు ఆ విద్యార్ధి సంస్ధ గుర్తింపును రద్దు చేయడానికి నిర్ణయిస్తే గనుక అపుడా ప్రతిష్టాత్మక సంస్ధ వైఖరిలోనే ఏదో తీవ్రమైన దోషం ఉన్నట్లే. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు ఇస్తూ, మరి కొన్ని ఇతర అంశాలతో కూడిన కరపత్రాలను పంచుతోంది. పేదల వ్యతిరేక విధానాలను, హిందూత్వ విధానాలను అమలు చేస్తున్నందుకు అభ్యంతరం చెబుతూ నరేంద్ర మోడి, ఆయన ప్రభుత్వాల పట్ల కూడా స్టడీ సర్కిల్ తీవ్ర విమర్శనాయుత వైఖరి అవలంబిస్తోంది. ఎ.పి.ఎస్.సిని నిందిస్తున్నవారు, అందుకు ప్రతిగా, సంస్ధ వైఖరి ‘కులతత్వం’తో కూడి ఉందనీ, ‘రాజకీయ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరుతోందని’ ప్రతి విమర్శ చేస్తున్నారు.
(ఈ నేపధ్యంలో) తమకు అందిన ‘ఆకాశ రామన్న’ ఫిర్యాదును కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఐ.ఐ.టి-మద్రాస్ యాజమాన్యానికి పంపింది. సదరు ఫిర్యాదు అందిందే తడవుగా, ఉన్నపళాన ప్రతిస్పందిస్తూ ఎ.పి.ఎస్.సి గుర్తింపును రద్దు చేస్తూ యాజమాన్యం నిర్ణయం ప్రకటించింది. (ఐ.ఐ.టి) సంస్ధ అనుమతి లేకుండా విద్యార్ధి సంస్ధలు (తమ టైటిల్ లో) ఐ.ఐ.టి సంస్ధ పేరును ఉపయోగించడం నియమావళికి విరుద్ధమని అందుకు కారణం చూపింది. తమ నిర్ణయాన్ని సమీక్ష చేయాలని ఎ.పి.ఎస్.సి కోరవచ్చని తమ ఉత్తర్వుల్లో తెలిపింది. రాజకీయ వాతావరణం, నిండా దట్టించబడి ఉన్న నేటి పరిస్ధితుల్లో ఈ ఘటన జాతీయ స్ధాయి పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్న నేపధ్యంలో… ఈ చర్యను భావ ప్రకటనా స్వేచ్చపై తీవ్రమైన దాడిగా నాయకులు, వ్యాఖ్యాతలు పరిగణిస్తున్నారు. వారా వైఖరి తీసుకోవడం సరైనది మరియు న్యాయమైనదే.
ఐ.ఐ.టి-మద్రాస్ సంస్ధ తమ క్యాంపస్ లో రాజకీయ కార్యకలాపాలను గానీ, రాజకీయ అనుబంధ యూనియన్ లను గానీ అనుమతించదు. క్యాంపస్ లో ఆరోగ్యకరమైన చర్చలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎ.పి.ఎస్.సి తో సహా వివిధ విద్యార్ధి సంస్ధలకు ఐ.ఐ.టి-మద్రాస్ గుర్తింపు ఇచ్చింది. అటువంటి సంస్ధల ద్వారా రాజకీయ పార్టీలు దొడ్డిదారిన క్యాంపస్ లోకి ప్రవేశిస్తాయన్న భయాలు ఉన్నప్పటికీ ఎ.పి.ఎస్.సి ఇప్పటివరకు ఎలాంటి రాజకీయ పార్టీతోనూ అనుబంధితం కాలేదు. ఇప్పటి సందర్భానికి వస్తే, ఎ.పి.ఎస్.సి కొన్ని రాజకీయ పార్టీలను పేరు పెట్టి సంబోధిస్తూ వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది. మతపరమైన సాంప్రదాయతకు వ్యతిరేక వైఖరిని చేపట్టింది. చివరికి సంఘటిత మతశక్తులను కూడా ప్రశ్నించింది. హేతుబద్ధ రాజకీయ భావజాలానికి నిలయం అయిన తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి తీవ్ర (ర్యాడికల్) అవగాహనలు ఎవరినీ ఆశ్చర్యపరిచి ఉండకూడదు.
ఎ.పి.ఎస్.సి చురుకుదనాన్ని దాని వ్యతిరేకులు విమర్శించారు. సంస్ధ అవగాహనను ‘విద్వేష ప్రసంగం’తో సమానంగా చూడాలని సైతం కోరారు. కానీ మతపర సాంప్రదాయబద్ధతను, సంప్రదాయ పరిరక్షణ వాదాన్ని విమర్శించడం విద్వేష ప్రసంగం ఎంత మాత్రం కాజాలదు. అందువలన వారి (ఎ.పి.ఎస్.సి) వైఖరిని విద్వేష ప్రసంగంగా ముద్ర వేయడం కృత్రిమం, అప్రామాణికం. విద్వేష ప్రసంగం లక్షణం ఉద్దేశ్యపూర్వకంగా ప్రజా సమూహాలను (కమ్యూనిటీస్) లక్ష్యం చేసుకోవడమే తప్ప నమ్మకాలను లక్ష్యం చేసుకోవడం కాదు. ఐ.ఐ.టి-మద్రాస్ యాజమాన్యం చేయవలసింది ఏమిటంటే రాజకీయ చర్చలు, వాద ప్రతివాదాలు దూషణలతో నిండిన దాడులుగా, విద్వేష ప్రసంగంగా దిగజారకుండా చూడాలని కోరడమే. అందుకు బదులుగా, ఉన్నపళాన నిషేధం విధించి, దానిని “తాత్కాలిక గుర్తింపు రద్దు”గా చెలామణి చేయడం ద్వారా ఐ.ఐ.టి-మద్రాస్ యాజమాన్యం హ్రస్వ దృష్టి కలిగిన విమర్శకుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. విద్యా విషయక ఉత్కృష్టత, భావ ప్రకటనా మరియు ప్రసంగ స్వేచ్ఛ, సంఘాలుగా కూడే స్వేచ్ఛ… ఇవన్నీ చేయి చేయి కలిపి నడవవలసినవే గాని పరస్పరం ఒకదానినొకటి మినహాయించుకునేవిగా చూడరాదు.
[ఐ.ఐ.టి-మద్రాస్ లో విద్యార్ధి సంఘాలు నిషేధం. ఎ.పి.ఎస్.సి తన టైటిల్ లో ఐ.ఐ.టి-మద్రాస్ పేరును వినియోగించడాన్ని యాజమాన్యం నిషేదించింది. ఈ రెండూ కలిపి చూస్తే ఎ.పి.ఎస్.సి ని క్యాంపస్ లో కార్యకలాపాలు నిర్వహించుకోనివ్వకుండా యాజమాన్యం నిషేదించిందని అర్ధం చేసుకోవచ్చు. ఎ.పి.ఎస్.సి హిందూత్వకు అనుకూల ప్రచారం చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు. అది జీవన విధానం గానూ, దేశ ప్రజల విశ్వాసం గానూ సమర్ధన పొంది మరింత ప్రోత్సాహం అందుకుని ఉండేది. అలా లేకపోగా హిందూత్వను విమర్శించడమే కాకుండా ‘బ్రాహ్మణీయ పీడన’ వ్యతిరేక వైఖరి తీసుకోవడమే ఎ.పి.ఎస్.సి నిషేధానికి దారి తీసింది. హిందూత్వ పాలనలో దేశంలో మరోసారి ప్రజాస్వామిక హక్కులు మృగ్యం అవుతున్నాయని, విద్యా వ్యవస్ధను వెనక్కి ప్రయాణం కట్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐ.ఐ.టి-మద్రాస్ ఘటన రుజువు చేస్తోంది. -విశేఖర్]
ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి.అవి-
1.ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – మద్రాస్ లోని అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఎ.పి.ఎస్.సి) ‘బ్రాహ్మణీయ పీడన’ ను తొలగించాలని పిలుపు ఇస్తూ, మరి కొన్ని ఇతర అంశాలతో కూడిన కరపత్రాలను పంచుతోంది.
2.పేదల వ్యతిరేక విధానాలను, హిందూత్వ విధానాలను అమలు చేస్తున్నందుకు అభ్యంతరం చెబుతూ నరేంద్ర మోడి, ఆయన ప్రభుత్వాల పట్ల కూడా స్టడీ సర్కిల్ తీవ్ర విమర్శనాయుత వైఖరి అవలంబిస్తోంది.
మొదటివిషయంలో ఎక్కువమందికి అభ్యంతరం ఉండకపోవచ్చును(కనీసం బయటికి ప్రకటించడానికి)-ఎందుకంటే సంస్థ వైఖరి సంస్ధ వైఖరి ‘కులతత్వం’తో కూడి ఉందని అందుకు పెద్దగా వ్యత్తిరేకత ప్రకటించడానికి అవకాశం పెద్దగాలేదు.
కానీ,రెండవ విషయంలో ఎ.పి.యస్.సి ని నిలదీయడానికి సంధు బాగా దొరికింది.ఎందుకంటే సంస్థ వ్యక్తపరచిన భావజాలం ‘రాజకీయ సందేశాన్ని వ్యాప్తి చేయాలని కోరుతోందని’ విమర్షించడానికి అవకాశం దొరికింది.
ఐ.ఐ.టి సంస్ధ అనుమతి లేకుండా విద్యార్ధి సంస్ధలు సంస్ధ పేరును ఉపయోగించడం నియమావళికి విరుద్ధమని అందుకు కారణం చూపింది-ఈ కారణంకూడా సూటిగా,స్పస్టంగాలేదు.(పైవాళ్ళు అమలుచేయమన్న ఆదేశానుసారం-డొంకతిరుగుడుతనానికి నిదర్శనం.)
ఐ.ఐ.టి-మద్రాస్ సంస్ధ తమ క్యాంపస్ లో రాజకీయ కార్యకలాపాలను గానీ, రాజకీయ అనుబంధ యూనియన్ లను గానీ అనుమతించదు-ఈ కారణం హేతుబద్దమైనది.కానీ,ఎ.పి.యస్.సి ఇటువంటి చర్యలను నిర్వహించలేదే!
హేతుబద్ధ రాజకీయ భావజాలానికి నిలయం అయిన తమిళనాడు రాష్ట్రంలో ఇలాంటి తీవ్ర (ర్యాడికల్) అవగాహనలు ఎవరినీ ఆశ్చర్యపరిచి ఉండకూడదు-హిందు పత్రిక సంపాదకీయానికి తమ మాతృరాష్ట్రం మీద అతిప్రేమ ఉన్నట్లున్నది.
ఏదేమైనప్పటికి,స్వతంత్ర విద్యసంస్థ వ్యవహారాలలో రాజకీయ జోక్యం పనికిరాదు.ముఖ్యంగా ఇటువంటి చైతన్యభావజాల వ్యాప్తిలో.