ఎల్-నినో పుణ్యమాని ఈ సంవత్సరం దేశంలో వర్షపాతం సగటు కంటే చాలా తక్కువ ఉండవచ్చని భారత వాతావరణ విభాగం (ఇండియన్ మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ -ఐ.ఎం.డి) తాజా అంచనాలో తెలియజేసింది. 93 శాతం వర్షపాతం మాత్రమే కురుస్తుందని ఏప్రిల్ నెలలో ఐ.ఎం.డి అంచనా వేసింది. అంత కూడా ఉండదని జూన్ 2 తేదీన వేసిన అంచనాలో తెలిపింది. సగటులో 88 శాతం కురిస్తే గొప్ప అని ప్రకటించింది.
తాజా అంచనాలో 88 శాతం వర్షపాతం ఉండవచ్చని తెలిపిన ఐ.ఎం.డి ఈ అంకెకు +/- 4 శాతం తప్పు (ఎర్రర్) జత చేసింది. అనగా 2015లో నైరుతి ఋతుపవనాల వల్ల దేశంలో వర్షపాతం దీర్ఘకాల సగటు వర్షపాతంలో అధమం 84 శాతం (88 – 4 = 84), మహా కురిస్తే 92 శాతం (88 + 4 = 92) కురియవచ్చు. ఈ మేరకు కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు.
దీర్ఘకాల సగటు అంటే లాంగ్-పీరియడ్ యావరేజ్ (LPA) అని అర్ధం. అయితే ఈ లాంగ్-పీరియడ్ అంటే ఎంత కాలం అన్నదీ వివరాలు లభ్యం కాలేదు. బిజినెస్ స్టాండర్ద్ పత్రిక ద్వారా లాంగ్-పీరియడ్ అంటే 50 సంవత్సరాలు అయి ఉండవచ్చని పరోక్షంగా తెలుస్తోంది. నేరుగా అర్ధాన్ని వివరించే సమాచారం మాత్రం దొరకలేదు.
మంత్రి ప్రకటన ప్రకారం 2015 నైరుతి ఋతుపవన సీజన్ (జూన్ నుండి సెప్టెంబర్ వరకు) లో దేశంలో వర్షపాతం లోటు ఉంటుంది. ఎల్.పి.ఏ లో 90 శాతం కంటే తక్కువ వర్షపాతం కురిస్తే అది లోటు (Deficient) వర్షపాతం అవుతుంది. 2014 లో కూడా నైరుతి ఋతుపవన వర్షపాతం 88 శాతం నమోదు కావడం గమనార్హం.
ప్రాంతాల వారీగా చూస్తే 2015లో నైరుతి వర్షపాతం వాయవ్య భారతంలో ఎల్.పి.ఏ లో 85 శాతం వర్షపాతం ఇస్తుంది. మధ్య భారతంలో 90 శాతం, దక్షిణ భారత దేశంలో 92 శాతం వర్షపాతం నైరుతి ఋతుపవనాలు ఇవ్వవచ్చు. ఈ గణాంకాలను +/-8 శాతం ఎర్రర్ తో పరిగణించాలని మంత్రి ప్రకటన పేర్కొంది. అనగా ప్రతి అంచనాలోను వాస్తవంగా +8% వర్షపాతం గాని -8% వర్షపాతం గాని కురవచ్చు.
జూన్ నుండి సెప్టెంబర్ వరకు నెలవారీగా వర్షపాతం చూస్తే జులై లో ఎల్.పి.ఏ లో 92 శాతం, ఆగస్టులో 90 శాతం వర్షపాతం కురవచ్చు. ఈ అంకెలను +/-9% ఎర్రర్ తో పరిగణించాలని ప్రకటన సూచించిందని ది హిందు తెలిపింది.
లోటు వర్షపాతం వల్ల ఖరీఫ్ సీజన్ లో వ్యవసాయ ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది. ఫలితంగా ఆహార ధరలు పైకి ఎగబాకుతాయి. అకాల వర్షాల వల్ల ఇప్పటికే కాపు మీద ఉన్న పంటలకు నష్టం వాటిల్లిన దృష్ట్యా ఆహార ధరలు పెరగవచ్చని ఇప్పటికే అంచనా వేస్తున్నారు. లోటు వర్షపాతం ధరలను మరింతగా పైకి నెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే ద్రవ్యోల్బణం తమవల్లనే తగ్గిందని బాకాలు ఊదుతున్న బి.జె.పి/మోడి ప్రభుత్వానికి కళ్ళెం లేని ధరలకు ఏ కారణం చెబుతారో చూడాల్సి ఉంది. నెపాన్ని ప్రకృతి మీదకు నెట్టివేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు?
అయితే ప్రభుత్వం వద్ద ధాన్యం నిల్వలు అవసరానికి మించి ఉన్నందున భయం లేదని బిజినెస్ స్టాండర్ద్ పత్రిక ఊరడించింది. 41.12 మిలియన్ టన్నుల ఆహార నిల్వలు అవసరం కాగా మే 1 నాటికి గోదాముల్లో 59.13 మిలియన్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయని పత్రిక తెలిపింది. ఇవి ప్రజలకు సరసమైన ధరలకు అందివస్తాయా అన్నది అనుమానమే.
లోటు వర్షపాతం వల్ల బాగా దెబ్బ తినే ప్రాంతం పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్ధాన్ లతో కూడిన వాయవ్య భారతమేనని ఐ.ఎం.డి వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. తాజాగా వేసిన వాతావరణ అంచనా నిజం కాకూడదని దేవుడ్ని ప్రార్ధిద్దాం అని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి కూడా అయిన హర్ష వర్ధన్ వ్యాఖ్యానించడం విశేషం.