ఎల్-నినో: ఋతుపవనాలు ఆలస్యం


Men ride on a motorbike through a busy road.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్-నినో వాతావరణ ప్రభావం ఫలితంగా ఈ యేడు భారత దేశానికి ఋతుపవనాలు ఆలస్యంగా వస్తున్నాయి. జూన్ 1 తేదీకల్లా నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఇంతవరకు వాటి జాడలేదు. ఐదు రోజులు ఆలస్యంగా జూన్ 5,6 తేదీల్లో కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశించవచ్చని వాతావరణ సంస్ధ అధికారులు ఈ రోజు (జూన్ 1) తెలిపారు.

మూడింట రెండు వంతుల జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత దేశంలో నీటి పారుదల వసతులు కలిగిన భూములు తక్కువ. నీటిపారుదల వసతి కలిగిన భూములు 30 శాతం నుండి 50 శాతం వరకు ఉంటాయని వివిధ అంచనాలు తెలియజేస్తున్నాయి. అంచనా వేసేవారి అవసరాన్ని బట్టి ఈ సంఖ్య 30% – 50% మధ్య కదులుతూ ఉంటుంది. ప్రభుత్వాలు నడిపే వర్గాలకు ఈ సంఖ్యను పెద్దది చేసుకోవడం అవసరం. ప్రజల తరపున పని చేసేవారికి వాస్తవ సంఖ్యలు అవసరం.

సగం భూములకు నీటిపారుదల వసతి ఉన్నదని భావించినా మిగిలిన సగం భూముల్లో వ్యవసాయాన్ని పూర్తిగా ఋతుపవనాలే శాసిస్తాయి. నీటిపారుదల వసతి కలిగిన భూములకు కూడా ఋతుపవన వర్షాలే నీళ్ళు ఇవ్వాలి. ఋతుపవనాలు సమయానికి వస్తేనే అదును సమయంలో కాలవలు, చెరువులు, రిజర్వాయర్ల నుండి నీరు పొందడానికి వీలు ఉంటుంది గనుక. కనుక దేశంలో వ్యవసాయ రంగం అంతా ఋతుపవనాల రాకకు ఎదురు చూడవలసిందే.

ఋతుపవనాలు సమయానికి వచ్చి తగినంత వర్షపాతం ఇస్తే పంటలు పండడమే కాకుండా కోట్లాది గ్రామీణ కూలీలకు పని కల్పించబడుతుంది. రైతుల ఇంట గాదెలు నిండుతాయి. రైతు కూలీల ఆదాయం మార్కెట్లో సరుకుల కొనుగోళ్ళు పెంచుతాయి. అనగా ఋతుపవనాలు రైతు కూలీల కొనుగోలు శక్తి పెంచుతాయి. అంతేకాదు. అనేక రకాల పరిశ్రమలకు వ్యవసాయరంగం ముడి సరుకులను సమకూర్చిపెడుతుంది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర ద్రవ్య, సేవల రంగాలు కూడా రైతు, కూలీలు కళకళలాడితేనే వ్యాపారం పొందగలుగుతాయి. అనగా వ్యవసాయరంగం దేశ ఆర్ధిక వ్యవస్ధకు పునాది రంగం. ఈ పునాది రంగానికి ఋతుపవనాలు ఆధారం.

భారత దేశంలో 1.2 బిలియన్ల జనాభా నివసిస్తున్నందున వారి కొనుగోలు శక్తి పెరగడం అంటే వ్యాపారాలకు మార్కెట్ అవకాశాలు (market potential) వృద్ధి కావడం. ఈ మార్కెట్ అవకాశాల కోసం ప్రపంచ వ్యాపితంగా పలు దేశాల లోని కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. వ్యవసాయ ఆదాయం చైన్ రియాక్షన్ తరహాలో పలు దేశ, విదేశీ వ్యాపార కంపెనీల కార్యకలాపాలను పెంచి ఆదాయం సమకూర్చుతుంది. అందువల్ల భారత దేశంలో ఋతుపవనాల రాక అంతర్జాతీయ పత్రికలు, వార్తా సంస్ధలకు కూడా ఒక ముఖ్యమైన వార్తే.

అలాంటి నైరుతి ఋతుపవనాలు ఎల్-నినో వల్ల ఈ యేడు ఆలస్యం కావడం మార్కెట్ వర్గాలకు ఒకింత ఆశనిపాతం అయింది. వాస్తవానికి ఈ యేడు ఋతుపవనాలు ఎప్పుడూ వచ్చే జూన్ 1 తేదీకు రెండు రోజుల ముందే దేశంలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ మొదట అంచనా వేసింది. సమయం కంటే ముందే వచ్చినా, ఎల్-నినో వల్ల తక్కువ వర్షపాతం ఇస్తాయని భారత వాతావరణ సంస్ధ అంచనా వేసింది. కానీ వారి అంచనాను ఋతుపవనాలు వెక్కిరించాయి. 2 రోజులు ముందుగా బదులు 5 రోజులు ఆలస్యంగా ఇండియాలో ప్రవేశించనున్నాయి.

“కేరళ తీరంలో జూన్ 5 తేదీన ఋతుపవనాలు ప్రవేశించవచ్చు. ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత క్రమంగా సానుకూలంగా పరిస్ధితి మారుతుందని ఆశిస్తున్నాము” అని ఇండియా మీటియొరలాజికల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ బి.పి.యాదవ్ చెప్పారని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. గత సంవత్సరం కూడా ఋతుపవనాలు జూన్ 1 తేదీనే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేయగా 6 రోజులు ఆలస్యంగా జూన్ 6 తేదీన ప్రవేశించాయి. ఆలస్యంగా రావడంతో పాటు వర్షపాతమూ ఎప్పటి స్ధాయిలో ఇవ్వలేదు. ఆ మేరకు గత సం. ధాన్యం దిగుబడి కూడా తగ్గిపోయింది.

ఋతుపవనాలు సాధారణంగా జూన్ మధ్య నాటికి దేశంలో సగం భాగాన్ని కవర్ చేస్తాయి. కాగా జులై మద్య నాటికి అవి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి. వరి, సోయాబీన్, చెరకు, పత్తి మొదలైన పంటలను ఈ కాలంలో పండిస్తారు. వర్షపాతం తగ్గినట్లయితే ఏర్పడే పరిస్ధితిని ఎదుర్కోవడానికి సిబ్బందిని తగిన సహాయ కార్యకలాపాలతో సిద్ధంగా ఉంచామని వాతావరణ సంస్ధ అధికారులు చెప్పడం విశేషం.

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s