[మే 27 నాటి ది హిందు ఎడిటోరియల్ “Modi reaches out” కు యధాతధ అనువాదం. -విశేఖర్]
***************
సాధారణ ప్రజాస్వామిక పద్ధతులు నెలకొని ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడి మరియు డా.మన్మోహన్ సింగ్ ల మధ్య జరిగిన లాంటి సమావేశం ఎలాంటి విమర్శలకు తావు లేకుండా జరిగిపోతుంది. ఒకసారి ఎన్నికల వేడి, శతృత్వాలు అంతరించడం అంటూ జరిగిన తర్వాత ప్రభుత్వ పాలన ఇక సహకార సంస్ధ తరహాలో మారిపోతుంది. అధికారం చేపట్టిన వ్యక్తి సలహా, సూచనల కోసం, సమాచారం కోసం తన ముందరి ప్రధానిని సంప్రదిస్తూ ఉంటారు. ఉదాహరణకి అతల్ బిహారీ వాజ్ పేయి అనేకమంది కాంగ్రెస్ నాయకులతో గౌరవ సంబంధాలు నెరపడంలో పేరు పొందారు. అనేక యేళ్లపాటు ప్రభుత్వం నిర్వహించిన వారి సుదీర్ఘ అనుభవం నుండి తాను లబ్ది పొందదలిచానని కూడా ఆయన వారితో చెప్పేవారు.
ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తే కూడా ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తనకు ముందు ఆర్ధిక మంత్రులుగా పని చేసిన పి.చిదంబరం, డా. మన్మోహన్ సింగ్ లను ఆర్ధిక విషయాల్లో సంప్రదించడం ద్వారా ఆ ఒరవడిని పాటిస్తున్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆచరణ. మోడి మరియు డా. సింగ్ లు, అనంతరం వెలుగులోకి వచ్చినట్లుగా, ఆర్ధిక వ్యవస్ధ మరియు విదేశాంగ విధానాలపై చర్చించినట్లయితే తనకు ముందు ప్రధాని కార్యాలయంలో పని చేసిన, గౌరవనీయ ఆర్ధికవేత్త కూడా అయిన వ్యక్తితో స్నేహ హస్తం చాచినందుకు ప్రధాన మంత్రిని నిస్సందేహంగా అభినందించవచ్చు.
సమావేశం గురించి మోడి ట్వీట్ చేసినపుడు తానే సమావేశానికి చొరవ చూపిన సంగతిని ఆయన చెప్పకుండా వదిలేశారు. అనేక ఊహాగానాలు చేలెరెగేందుకు అది తావిచ్చింది. అది కూడా ఇరువురూ బహిరంగంగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్న గంటల లోపే సమావేశం జరిగింది మరి. ప్రభుత్వం అధికారం చేపట్టి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో బి.జె.పి నాయకులు తాము సాధించిన దానిని ప్రధానం చేసి చెప్పుకోవడం కంటే యు.పి.ఏ ప్రభుత్వంపై దాడిపైనే ఎక్కువ సమయాన్ని గడిపేశారు. ఒక రోజు ముందు, ట్రాయ్ మాజీ ఛైర్మన్, 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో తప్పు చేశారని డా. సింగ్ ను నిందించడం, రెండు నెలల క్రితమే బొగ్గు కుంభకోణంలో ఆయనను ప్రశ్నించడం… నేపధ్యంలో (జరిగిన సమావేశం) మరో వరుస ఊహాగానాలు ప్రాణం పోసుకున్నాయి.
జరుగుతున్నది ఏమిటో ఆ రోజు సాయంత్రం కాంగ్రెస్ గ్రహించిన తర్వాతనే ప్రధాన మంత్రి ఆహ్వానం మేరకే డా. మన్మోహన్ సింగ్ 7 రేస్ కోర్స్ రోడ్ కు వెళ్లారని ఆ పార్టీ నేతలు వివరించారు. సమావేశంలో ఆర్ధిక వ్యవస్ధ, విదేశీ విధానాలను మాత్రమే చర్చించారని వారు చెప్పిన తర్వాత మాత్రమే విషయం ఏమిటో స్పష్టం అయింది. అసలు సమావేశం ఎందుకు జరగవలసి వచ్చిందో మోడి మొదటే ఎందుకు చెప్పలేదో ఇంకా స్పష్టం కాలేదు. అయితే ప్రధాన మంత్రి ఈ తరుణంలో మెరుగైన పబ్లిక్ ఇమేజి కావలసిన అవసరంలో ఉన్నారని మాత్రం స్పష్టం అయింది. సంవత్సరం క్రితం ఉన్న ఉన్నత స్ధానంలో (స్వీట్ స్పాట్) ఇప్పుడాయన ఎంతమాత్రం లేరు. ఆశించినంత గొప్పగా ఆర్ధిక వ్యవస్ధ నడవడం లేదు; అనుకున్నంత స్ధాయిలో పెట్టుబడులు ఏవీ రావడం లేదు; ఢిల్లీ ఎన్నికల్లో ఎదురైన అత్యంత ఘోరమైన ఓటమి నుండి, ప్రధాని మోడి ఫ్యాషన్ దుస్తుల ఎంపికపై వస్తున్న పరిహాసాల నుండి బి.జె.పి ఇంకా కోలుకోనేలేదు. భూసేకరణ బిల్లు విషయంలో ప్రతిపక్షం ప్రభుత్వాన్ని లేవకుండా నొక్కి ఉంచింది.
ఇవన్నీ కలిసి ప్రభుత్వం నుండి మెరుపు వెలుగుల్ని తోడివేశాయి. అలంకారాలతో నిండిన వక్తృత్వాన్ని -ఖాళీ హామీలను ఉద్దేశిస్తూ బి.జె.పి అధ్యక్షుడు ఇటీవల ప్రయోగించిన ‘జుమ్లా’ లను అప్పుడప్పుడూనైనా- ఎన్నికల ప్రచార వేడిలో క్షమించి వదిలిపెట్టవచ్చు. కానీ ఎన్నికయిన నేత, ఆయన పటాలమూ ఇంకా ఎన్నికల ధోరణిలోనే ఉన్నట్లు కనిపిస్తున్న నేపధ్యంలో ప్రజలు ప్రశ్నించడం ప్రారంభించారు: మనం ఓట్లు వేసి గెలిపించిన పార్టీ నిజమైన ప్రభుత్వ పాలనలోకి ఎప్పుడు దిగుతుంది? అని. వాస్తవ పరిస్ధితిని మార్చలేకపోయినా, మోడి కనీసం పైకి కనిపిస్తున్న దృశ్యాన్నయినా మార్చవలసిన అవసరం ఉంది. ఈ సమావేశం ఆ దిశలో వేసిన మొదటి అడుగు కావచ్చు.