ప్రపంచవ్యాపితంగా పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు 100 మంది ఉంటే అందులో 25 మంది భారత దేశంలోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్ధ (UNFAO) నివేదిక తెలిపింది. ఈ రోజు వెలువడిన నివేదిక ప్రకారం ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారి సంఖ్య అత్యధికంగా ఇండియాలోనే ఉన్నారు. ఇండియా తర్వాత స్ధానంలో జి.డి.పిలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా నిలవడం గమనార్హం. 21వ దశాబ్దం ఆరంభంలో ఇండియా, చైనాలు సాధించిన వేగవంతమైన జి.డి.పి వృద్ధి ఆ దేశాల్లో పేదలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.
ప్రపంచం మొత్తం మీద పోషక లోపం ఉన్నవారి సంఖ్య 794.6 మిలియన్లని యూఎన్‌ఎఫ్‌ఏఓ తెలిపింది. అనగా 79.46 కోట్లు. వారిలో 194.6 మిలియన్ల మంది లేదా 19.46 కోట్ల మంది భారతీయులే. మరే దేశంలోనూ ఇంత దరిద్రం లేదు, మనకంటే అధిక జనాభా ఉన్న చైనాలో కూడా ఇంత దరిద్రం లేదు. చైనాలో పోషక లోపం ఉన్నవారి సంఖ్య 133.8 మిలియన్లని నివేదిక తెలిపింది.
దేశీయ జనాభా నిష్పత్తి ప్రకారం తీసుకుంటే భారత జనాభాలో పోషక లోపం బాధితుల నిష్పత్తి 15.2 శాతం కాగా చైనాలో ఇది 9.3 శాతం. ఇండియా, చైనా రెండు దేశాల్లోనూ జి.డి.పి వృద్ధి ప్రధానంగా ధనిక వర్గాలకే చేరింది తప్ప ప్రజలందరికీ చేరలేదు. మన్మోహన్ సింగ్, చిదంబరం, యశ్వంత్ సిన్హా, అరుణ్ జైట్లీ ఇత్యాది పండితులు చెప్పే సమ్మిళిత అభివృద్ధి (Inclusive Growth) సంస్కరణ విధానాల వల్ల ఏ మాత్రం జరగక పోగా పరిస్ధితి మరింతగా దిగజారుతోందని ఐరాస అధ్యయన నివేదిక స్పష్టం చేసింది.
ఐరాస ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు పెట్టుకున్న మిలీనియం డవలప్ మెంట్ గోల్స్ గానీ, ప్రపంచ ఆహార సదస్సు (World Food Summit) నిర్దేశించిన లక్ష్యాలను గానీ నెరవేర్చడంలో ఇండియా ఘోరంగా విఫలం అయిందని నివేదిక ఎత్తి చూపింది. ఇండియా, చైనాలు సాధించిన జి.డి.పి వృద్ధి ఆ దేశాల ప్రజలకు సమానంగా అందలేదని కూడా నివేదిక స్పష్టం చేయడం విశేషం. ఒక దేశంలో జి.డి.పి పైకి ఎగబాకితే ఆ దేశంలోని శ్రామిక పేదలు కూడా ఆటోమేటిగ్గా పైకి ఎగబాకుతారన్న పెట్టుబడిదారీ ప్రకటిత సిద్ధాంతాన్ని ఐరాస నివేదిక ఇలా పూర్వపక్షం చేసింది. పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు ఇలాంటి అవసరమైన సందర్భాల్లో సమాధానం చెప్పేందుకు సాహసించరు. వారివద్ద సమాధానం ఉండదు కనుక!
2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం ఫలితాల గురించి విప్లవ వామపక్ష మేధావులు ఏయే అంచనాలనైతే వేశారో అవే అంచనాలను నేడు ఐరాస ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్ధ తన అధ్యయన నివేదికలో వాస్తవాలుగా చెప్పడం ముఖ్యంగా గుర్తించవలసిన సంగతి.
2008 నాటి సంక్షోభం సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్ధలోని మౌలిక వైరుధ్యం వల్ల వచ్చిన ఫలితమేనని, ఇది మరింతగా క్షీణించడమే తప్ప మెరుగుపడదని మార్క్సిస్టు-లెనినిస్టు మేధావులు మొదటి నుండి చెబుతున్న మాట! శ్రామిక ప్రజలకు దక్కవలసిన న్యాయమైన వేతనాలను దక్కనివ్వకుండా అంతకంతకు కోతలు, రద్దులు, పన్ను పెంపులు అప్పజెపుతున్న ఫలితంగా సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని, సంక్షోభ ఫలితాన్ని చివరికి శ్రామిక పేదలే అనుభవిస్తారని, సంక్షోభాన్ని సృష్టించిన పెట్టుబడిదారీ కంపెనీలు సంక్షోభ భారాన్ని ఏ మాత్రం మోయవని మార్క్సిస్టు-లెనినిస్టు పరిశీలకులు చెప్పిన సంగతి. గురువారం (మే 28) విడుదల అయిన ఐరాస నివేదిక ఈ అంశాలనే ధ్రువపరిచింది.
- Top ten hunger countries
- Uneven distribution
“అధిక ఆర్ధిక వృద్ధి పూర్తిగా అధిక ఆహార వినియోగం లోకి అనువదించబడలేదు. అందరికి మెరుగైన ఆహారం అన్న ఆదర్శం గురించి చెప్పుకోకపోవడమే మేలు. మొత్తం మీద ఆర్ధిక వృద్ధి ఫలితాలను పేదలు, ఆకలిగొన్నవారు పొందడంలో విఫలం అయ్యారని దీని ద్వారా స్పష్టం అవుతోంది” అని నివేదిక స్పష్టంగా చెప్పడం విశేషం.
ఆర్ధిక వృద్ధి సమ్మిళితం కాకపోవడమే దీనికి కారణమని నివేదిక తేల్చడం ఒకింత ఆశ్చర్యకరం. వాస్తవాలను నిరాకరించలేని పరిస్ధితి పెట్టుబడిదారీ సంస్ధలకు సైతం దాపురించిందని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆకలిగొన్నవారు, పోషక లోపంతో బాధపడుతున్నవారు అత్యధిక శాతం గ్రామీణ ప్రజలే. కనుక సమ్మిళత అభివృద్ధిని ప్రోత్సహించే వ్యూహంలో వ్యవసాయం మరియు గ్రామీణ రంగాలలో మెరుగైన వృద్ధి సాధించేలా ప్రయత్నాలు ముమ్మరం చేయడం అవసరం” అని నివేదిక నిర్ధారించింది.
భారత దేశం ప్రధానంగా గ్రామాల్లోనే ఉన్నదని స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పినప్పటి నుండి రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజా సంఘాలు చెపుతూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో భారత దేశం పట్టణాలవైపు తరలి వెళ్తోందని, పట్టణీకరణ తీవ్రం అయిందని, వ్యవసాయంపై ఆధారపడేవారి సంఖ్య తగ్గిపోయిందని నడమంత్రపు సిద్ధాంతాలు బయలుదేరాయి. వాస్తవానికి భారత దేశం ఇప్పటికీ గ్రామాలలో కొనసాగుతోందని, వ్యవసాయ మరియు గ్రామీణ రంగాలను వృద్ధి వ్యూహంలో భాగం చేయకపోతే సమ్మిళిత వృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేస్తున్న ఐరాస నివేదిక ఈ సిద్ధాంతాలను సైతం పూర్వపక్షం చేయడం గమనార్హం.
ప్రపంచంలో పోషక లోపాన్ని దూరం చేయాలంటే ప్రపంచంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభ పరిస్ధితులు ప్రధాన సవాలుగా పరిణమించాయని నివేదిక స్పష్టం చేసింది. సంక్షోభ కారకులు పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త కంపెనీలే అన్న సంగతిని గుర్తుంచుకుంటే ప్రపంచంలోని దరిద్రానికి కారకులు ఎవరో గ్రహించడానికి సిద్ధాంతవేత్తలు కానవసరం లేదు. “నిలకడలేని సరుకుల ధరలు, అధిక ఆహార మరియు ఇంధన ధరలు, పెరిగిపోతున్న నిరుద్యోగం, పాక్షిక ఉపాధి ఇవన్నీ సమ్మిళిత వృద్ధికి సవాళ్ళుగా ఉన్నాయి” అని నివేదిక స్పష్టం చేసింది. “2008 నాటి ప్రపంచ స్ధాయి మాంద్యం, ప్రకృతి వైపరీత్యాలు, వివిధ ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ అస్ధిర పరిస్ధితులు ఇవీ సమ్మిళిత వృద్ధికి ఆటంకాలు” అని నివేదిక స్పష్టంగా పేర్కొంది.
ఈనాడు సంభవిస్తూన్న ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా మానవ నిర్మితమే. సహజ వనరుల విచ్చలవిడి దోపిడి భూతాపానికి దారి తీసి ప్రకృతి ప్రకోపానికి బాటలు వేస్తోంది. రాజకీయ అస్ధిర పరిస్ధితులు అమెరికా, పశ్చిమ రాజ్యాలు స్వార్ధ ప్రయోజనాల కోసం సృష్టిస్తున్నవే. 2008 నాటి మాంద్యం పెట్టుబడిదారీ సంక్షోభం ఫలితం. వెరసి ప్రపంచంలో నెలకొన్న పోషకాహార లేమి, దారిద్ర్యం, పేదరికం మొదలైన సమస్యలకు ప్రధాన హేతువు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ కంపెనీలకు అనుకూలంగా అమలు చేస్తున్న విధానాలే అని ఐరాస నివేదిక చాటుతున్న సత్యం. ప్రపంచంలో నెలకొన్న సమస్యలకు ఇప్పటి సామాజికార్ధిక వ్యవస్ధలే అని చెప్పేందుకు ఇప్పుడిక మార్క్సిస్టు-లెనినిస్టు మేధావులు కానవసరం లేదు. ఆ సంగతిని ఐరాస నివేదికలే చెబుతున్నాయి కనుక.