“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడమే తేలిక…”
*************
గత యేడాదిలో పార్లమెంటు సమావేశాలకు అతి తక్కువ సార్లు హాజరైన ప్రధాన మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న ప్రధాని నరేంద్ర మోడి అదే సమయంలో ఒకే సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో విదేశాలు పర్యటించిన ఘనతను కూడా దక్కించుకున్నారు.
సంవత్సర కాలంలో ప్రధాని నరేంద్ర మోడి 18 దేశాలు పర్యటించడం మున్నేన్నడూ ఎరగనిది. ఆయన ముఖ్యమంత్రి ఉన్న పదేళ్ళ కాలంలో ఏయే దేశాలైతే ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించాయో ఆ దేశాలను లక్ష్యం చేసుకుని ‘ప్రతీకార వాంఛ’తో మోడి పర్యటించారని సి.పి.ఎం నాయకులు సీతారాం యేచూరి విమర్శించడం విశేషం.
సి.పి.ఎం అవగాహనలో నిజం ఎంతో తెలియనప్పటికీ దేశానికి అత్యున్నత మరియు అత్యంత బాధ్యతాయుత పదవి అయిన ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తన పదవీ కాలంలోని మొదటి సంవత్సరంలోనే 18 దేశాలు పర్యటించి రావడం అసాధారణం అనడంలో సందేహం లేదు.
గత యు.పి.ఏ ప్రభుత్వ కాలంలో మొదటి ప్రభుత్వ కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించిన ప్రతిభ దేవిసింగ్ పాటిల్ కూడా ఇవే విమర్శలు ఎదుర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో సహా ఇష్టారీతిన విదేశాలు పర్యటించి వందల కోట్ల ప్రజా ధనాన్ని ఆమె దుర్వినియోగం చేశారని ఆర్.టి.ఐ చట్టం సహాయంతో కొందరు కార్యకర్తలు వెల్లడి చేసిన లెక్కల ఆధారంగా పత్రికలు విమర్శించాయి.
ఈ విమర్శలకు సమాధానంగా గత రాష్ట్రపతిలతో పోల్చితే తన విదేశీ పర్యటనలు ఎక్కువ ఏమీ కావని గణాంకాలతో సహా వివరించారు. ఈ గణాంకాల ప్రకారం ఐదేళ్ల పదవీ కాలంలో మాజీ రాష్టపతులు అబ్దుల్ కలాం 17 దేశాలు పర్యటించగా కె.ఆర్.నారాయణన్ 13 దేశాలు పర్యటించారు. ఆర్.వెంకట్రామన్ 21 దేశాలు, వి.వి.గిరి 22 దేశాలు పర్యటించారు. కాగా ప్రతిభా పాటిల్ సైతం 22 దేశాలు పర్యటించారు.
వీరంతా ఈ దేశాలను ఐదేళ్ల కాలంలో పర్యటించారు. కానీ ప్రధాని మోడి మాత్రం ఒకే ఒక్క సంవత్సరంలో 18 దేశాలు పర్యటించడం అసాధారణం అనడంలో సందేహం లేదు. పైగా తన విదేశీ పర్యటనల వల్లనే భారత కీర్తి పతాకం ప్రపంచంలో రెపరెప లాడుతోందని బి.జె.పి ప్రచారం చేయడం ఒక విడ్డూరం.
జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల నేతలు తమ తమ జాతీయ-బహుళజాతీయ కంపెనీలకు ఇండియాలో మార్కెట్ అవకాశాలను కల్పించాలని ఇండియాకు వచ్చినప్పుడు కోరడం మనకు తెలిసిన విషయం. మన ప్రధాన మంత్రి కూడా విదేశీ పర్యటనల్లో అదే తరహాలో భారత వాణిజ్య సంబంధాలు పెంపొందించి వాణిజ్య మిగులు పెరుకోవడానికి దోహదం చేస్తే ఆ పర్యటనలు ఉపయోగమే.
కానీ అందుకు విరుద్ధంగా మన ప్రధాని వెళ్ళిన చోటల్లా అక్కడి కంపెనీలను ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి అందినకాడికి నొల్లుకుపొమ్మని చెప్పడం, అందునా విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని అనేక కార్మిక చట్టాలను రద్దు చేశామని, బలహీనపరిచామని ఉత్సాహంగా చెప్పడం భారత దేశానికి ఏ విధంగా ప్రయోజనం కలిగిస్తుందో తర్కించవలసిన విషయం. భారత శ్రామిక ప్రజల దశాబ్దాల తరబడి అనేక త్యాగాలకు ఓర్చి సాధించుకున్న కార్మిక హక్కుల చట్టాలను ఒక్క ఉదుటున రద్దు చెయ్యడం ఏ వర్గ ప్రయోజనాలకు?
ఇలాంటి పర్యటనలను విజయవంతమైన సూపర్ హీరో పర్యటనలుగా అధికార పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. భారత ప్రజలకు అచ్చే దిన్ తెస్తానని, దేశాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని, ఉద్యోగాలు కుప్పలుగా సృష్టిస్తానని హామీ ఇచ్చి మోడి అధికారం చేపట్టారు. ఆచరణలో ఉన్న ఉద్యోగాలు హరించే చర్యలు అమలు చేస్తున్నారు. ఆయన అమలు చేస్తున్న అభివృద్ధి పంధా మీద విదేశీ కంపెనీలు దర్జాగా దూసుకు వస్తున్నాయి తప్ప దానిపై భారత ప్రజలకు నడిచే యోగ్యం కూడా లేదు. అనేక సంక్షేమ పధకాల్లో కోత పెట్టి ఆ నిధుల్ని మౌలిక రంగాల అభివృద్ధి పేరుతో విదేశీ పెట్టుబడులు డిమాండ్ చేసిన రంగాలకు తరలించారు.
ఈ విధంగా భారత ప్రజలు ప్రధాని మోడిపై పెట్టుకున్న గొప్ప ఆశలన్నీ పటాపంచలు అవుతున్న పరిస్ధితి నెలకొంది. ఆ సంగతినే ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా అక్కడి శ్రామిక ప్రజలు, తమ ఓటు దెబ్బ ద్వారా చాటిచెప్పారు. అప్పటి నుండి ప్రధాని పేద ప్రజలగురించి మాట్లాడడం చేస్తున్నారు తప్పితే వారి కోసం చర్యలు తీసుకున్నది లేదు. చనిపోతే ఇస్తామనే భీమా సౌకర్యం తప్ప బ్రతికున్న కోట్ల మందికి ఏమి చేస్తున్నదీ చెప్పింది లేదు.
ఆ విధంగా రైతులు, దేశీయ పెట్టుబడిదారులు, ఉద్యోగులు, విద్యార్ధులు పెట్టుకున్న “గొప్ప ఆశలన్నీ” ఇప్పుడు సూపర్ హీరో గారు అత్యంత తేలికగా వేగంగా విదేశాలు పరిభ్రమించడంగానే మిగిలిపోయాయి తప్ప నెరవేరింది లేదు. సూపర్ హీరో గారు భూమి మీదకు దిగి ‘భారత’ ప్రజల ఆశల్ని, కనీసం ‘దేశీయ’ (దేశీయంగా కనిపించే దేశీయ దళారీ పెట్టుబడిదారులు కాదు సుమా!) పెట్టుబడిదారుల ఆశల్ని అయినా, నెరవేర్చేది ఎప్పుడో తెలియకుంది. అసలాయన భూమి మీదకు దిగుతారా?!
ఒకప్పుడు పెట్టుబడిదారుడు పదం వాడాలంటే ప్రభుత్వాలు భయపడేవి ప్రస్తుతం మాత్రం నాయకులు పెట్టుబడిదారులు వస్తున్నారంటే అదో గొప్పతనంగా భావిస్తున్నారు. అది వీదేశీయుడైతే ఇక చెప్పాల్సిన పన్లేదు.. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక శాఖను పెట్టుకున్న దేశం ఏ వైపు వెళ్తుంది??? ప్రజల్ని మార్కెట్ సరకుగా మార్చేసిన ఈ ప్రభుత్వాలు ఎప్పుడో సంక్షేమమంటూ బిచ్చం వేస్తున్నాయి.
“80 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టి రావడం ఇంత సులువా…”…. విశేఖర్ గారు, ఇది సరిఅయిన అనువాదం కాదు అనుకుంటాను.సామాన్యుల సమస్యలను పరిస్కరించడం కంటే విదేశీ పర్యటనలే సులభం అని మోడీ అనుకుంటున్నట్లు ఉంది .మోడీ గారి విదేశీ పర్యటనల వలన సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు అనే అంతర్లీన అర్థం ఉందేమో
చంద్ర గారు, నిజమే మీరు చెప్పిందే కరెక్ట్. వ్యాఖ్యలోని was ని నేను మిస్ అయ్యాను.