భారత దేశాన్ని, అందునా దక్షిణ భారతాన్ని, అందులోనూ తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వేడి గాలులు పట్టి ఊపేస్తున్నాయి. గత వారం రోజుల్లోనే వెయ్యికి పైగా ప్రజలు వడగాలులకు బలైపోగా మొత్తం మీద ఈ వేసవి కాలంలో వడదెబ్బకు గురై మరణించినవారి సంఖ్య 1100 దాటి పోయిందని జాతీయ, అంతర్జాతీయ పత్రికలు తెలిపాయి. దాదాపు ప్రతి అంతర్జాతీయ వార్తా సంస్ధ భారత దేశంలో వేడి గాలుల గురించి గత కొద్ది రోజులుగా తప్పనిసరిగా వార్తలు ప్రచురిస్తున్నాయంటే దేశంలో ఎండల తీవ్రతను అంచనా వేయవచ్చు.
బి.బి.సి వార్తా సంస్ధ ప్రకారం ఇప్పటివరకు ఇండియాలో వేడి గాలుల తీవ్రతకు 1118 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. ఎ.పిలో చండ ప్రచండంగా వీస్తున్న వడగాలులకు 852 మంది చనిపోయారని బి.బి.సి తెలిపింది. తెలంగాణలో మృతుల సంఖ్య 266 అని ఆ సంస్ధ తెలిపింది. భారత వాతావరణ శాఖ ఇచ్చిన గణాంకాల ద్వారా ఈ సమాచారం ఇస్తున్నామని బి.బి.సి తెలిపింది. సి.ఎన్.ఎన్ వార్తా సంస్ధ కూడా ఇవే అంకెలను ఉటంకించింది.
భారత పత్రికలు ఇచ్చిన గణాంకాలు ఇందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రకారం ఎ.పి లో 850 మంది చనిపోగా తెలంగాణలో 250 మంది చనిపోయారు. ఎ.పి లో 867 మంది తెలంగాణలో 200 మంది చనిపోయారని ది హిందు పత్రిక తెలిపింది. మే 18 నుండి ఇప్పటివరకు ఆంధ్ర ప్రదేశ్ లో మృతుల సంఖ్య 900 వరకు నమోదయిందని ఖతార్ వార్తా సంస్ధ ఆల్-జజీరా చెప్పడం గమనార్హం. తమ గణాంకాలకు ఆధారం ఏమిటో ఈ సంస్ధ చెప్పలేదు.
ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలు కాకుండా తూర్పు కోస్తా రాష్ట్రాలు ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లలోనూ, పశ్చిమ కోస్తా రాష్ట్రం గుజరాత్ లోనూ వేడిగాలులకు మరణించినట్లు వివిధ వార్తా సంస్ధలు తెలిపాయి. ది హిందు ప్రకారం ఒరిస్సాలో 67 మంది వేడి గాలులకు బలై చనిపోగా పశ్చిమ బెంగాల్ లో 6గురు చనిపోయారు. తెలుగు రాష్ట్రాలతో పోల్చితే ఇతర రాష్ట్రాలలో మృతుల సంఖ్య స్వల్పంగానే ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తున్న సంగతి.
మృతుల సంఖ్య అధికారులు నివేదించేదాని కన్నా చాలా ఎక్కువ ఉండవచ్చని ఎన్.డి.టి.వి సైన్స్ ఎడిటర్ పల్లవ్ బగ్లా చెప్పారు. “ఒక వ్యక్తి నిజంగా వడగాలి లేదా వేడి గాలుల వల్ల చనిపోయారా లేక మరే ఇతర కారణం వల్లనా అన్న సంగతిని శాస్త్రీయంగా నమోదు చేస్తున్న పద్ధతి ఏమీ అమలులో లేదు. అధికారులు చెపుతున్న సంఖ్య ప్రధానంగా ఆసుపత్రుల్లో చికిత్సకోసం చేరి ఎండ దెబ్బకు గురైనట్లు డాక్టర్లు ధృవీకరించినవారు మాత్రమే” అని పల్లవ్ వివరించారు. ఆసుపత్రిలో చేరకుండా నేరుగా శ్మశానానికి చేరినవారి సంఖ్యను కూడా పరిగణిస్తే మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆయన సూచించారు.
ఇప్పటివరకు ఖమ్మంలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్ ఉషోగ్రత నమోదయిందని బి.బి.సి, సి.ఎన్.ఎన్ లు తెలిపాయి. అయితే ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయిందని టైమ్ పత్రిక తెలిపింది. ది హిందు పత్రిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తెలంగాణలో 46 డిగ్రీలు, ఒరిస్సాలో 47.6 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది.
ఢిల్లీలోనూ అసాధారణ ఉషోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వివిధ పత్రికలు తెలిపాయి. ఢిల్లీలో ఆస్ఫాల్ట్ తో వేసిన రోడ్లు ఎండవేడిమికి కరిగి రూపం మారిపోయిన ఫోటోలను పలువురు ట్విట్టర్ లో ప్రచురించారు. రోడ్లు రూపం కోల్పోవడం పాదాచారులు రోడ్లను దాటడానికి వినియోగించే జీబ్రా లైన్ల దగ్గర స్పష్టంగా కనిపించింది. క్రమపద్ధతిలో ఉండవలసిన జీబ్రా లైన్లు కొన్ని చోట్ల వంకరగా మారిపోగా కొన్ని చోట్ల అసలుకే అదృశ్యమైనాయి. ఈ ఫోటోలను పలు అంతర్జాతీయ వార్తా సంస్ధలు ప్రముఖంగా ప్రచురించాయి.
వేడి గాలులకు గురై మరణించినవారందరూ పేదలే. ప్రకృతి ప్రకోపాన్ని తట్టుకుని బతకాలంటే వివిధ సౌకర్యాలు అందుబాటులో ఉంటే తప్ప సాధ్యం కాదు. ఎ.సిలు, వాటర్ కూలర్లు ఇప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి కాదు. శక్తివంతమైన ఎ.సి మిషన్లు కూడా తీవ్ర వేడి వాతావరణం మధ్య గదుల్ని చల్లగా ఉంచడంలో విఫలం అవుతున్నాయి. వాటర్ కూలర్లు తిరిగి వేడి గాలినే వినియోగదారుల మీదికి మళ్లిస్తున్న పరిస్ధితి. పైగా వాటర్ కూలర్లు తగిన ఫలితం ఇవ్వాలంటే కాస్త విశాలమైన చోటు ఉండవలసిందే.
నివాసానికి వీలయిన చోట్లన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారుల లాభ దాహం రీత్యా అందనంత ఎత్తుకు చేరడంతో కొద్ది చోటులోనే చిన్న చిన్న ఇళ్ళు పక్కపక్కనే, ఇరుకుగా కట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొని ఉంది. ఇలాంటి క్రిక్కిరిసిన చోటుల్లో వాటర్ కూలర్లు పనిచేయకపోగా మరింత ఉడుకు వాతావరణాన్ని సృష్టిస్తాయి, వాటర్ కూలర్ లేకపోతేనే నయం అనుకునేంతగా! ఈ పరిస్ధితుల్లో ఆదాయంలో అత్యధిక భాగం తిండికి, నివాసానికి, రోగాలకు ఖర్చైపోగా ఎ.సి మిషన్లు కొనుక్కోగల స్తోమత పేదవారికి లభించే అవకాశమే లేదు.
అందువల్ల మృతుల్లో అత్యధికులు నడి ఎండల్లో సైతం పని చేయక తప్పని పరిస్ధితిని ఎదుర్కొనే నిర్మాణ కార్మికులు, ఇళ్ళు లేక నీటి తూముల్లో, చెట్ల కింద, పేవ్ మెంట్ల పైన నివసించే కడు పేదలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వ లెక్కల్లో తెలుస్తున్న చేదు వాస్తవం. పేద వర్గాలలో కూడా చిన్న పిల్లలు, వయసు పైబడిన వాళ్ళు, కొన్నిచోట్ల స్త్రీలు ఎక్కువగా ఎండవాత పడి మరణిస్తున్నారు. పల్లెల్లో వ్యవసాయ కూలీల మరణాలు అసలు లెక్కలోకే రాని పరిస్ధితి! ప్రకృతి ప్రకోపానికి కూడా వర్గ దృష్టి ఉన్నదని దేశంలో సంభవిస్తున్న వేడి గాలుల స్పష్టం చేస్తున్నాయి.
ఇంత వేడి వాతావరణానికి కారణం ఏమిటి అంటే, సమాధానం ‘ఎల్-నినో’. ఈ ఎల్-నినో దానికదే అసాధారణం ఏమీ కాదు. ఇది శతాబ్దాల నాటి నుండి ఉన్న పరిస్ధితే. అయితే గతంతో పోల్చితే ఎల్-నినో వాతావరణ పరిస్ధితి రాను రానూ తీవ్రంగా పరిణమించడమే గమనించవలసిన విషయం. ఎల్-నినో ఇలా తీవ్రంగా పరిణమించడానికి కారణం మానవ కృత్యమే. ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తూ, కాంక్రీటు అరణ్యాలను భూమిపై విస్తరింప జేస్తూ ప్రాకృతిక వాతావరణానికి స్ధానం లేకుండా చేస్తున్న ఫలితంగా భూమి వేడెక్కడం వల్లనే ఎల్-నినో కూడా రాను రానూ తీవ్ర రూపం దాల్చుతోంది.
ఎల్-నినో దానికదే ప్రకృతి విరుద్ధమైనది కాదు. అది సహజ ప్రక్రియే. మానవ సమాజ కార్యకలాపాల వల్ల భూ ఉష్ణోగ్రతలు తీవ్రమైనందున ఎల్-నినో తీవ్ర దిశలో ప్రభావితం కావడమే ప్రకృతి విరుద్ధమైనది. అనగా మొన్నటి వరకు అమెరికా ప్రజలు గానీ, నేడు భారత ప్రజలు గానీ అనుభవిస్తున్న ఎండ ప్రకోపం మానవ సృష్టి మాత్రమే. మానవుల్లోని కొద్ది మంది ప్రకృతి వనరులను తమ స్వార్ధపర లాభార్జనా ప్రయోజనాల కోసం విచక్షణారహితంగా కొల్లగుడుతున్నందునే ఈ పరిస్ధితి దాపురించింది.
విద్యుత్ తీగల కోసం అనీ, టెలిఫోన్ తీగల కోసం అనీ ఇంకా అనేకానేక ఆధునిక సౌకర్యాలకు అడ్డం వస్తున్నాయని ప్రతి ఊరిలోనూ బంగారం లాంటి పచ్చని చెట్లను నరికివేస్తున్నారు. ఒకపక్క చెట్లను పెంచండి అని ప్రభుత్వ విభాగాలు ప్రచారం చేస్తుంటే అదే ప్రభుత్వానికి చెందిన ఇతర విభాగాలు చెట్లను నరికివేస్తున్న పరిస్ధితి. పాలనా వ్యవస్ధలో నెలకొన్న ఉదాసీనత, సమన్వయ లోపం, జనంలో వ్యక్తిగత స్వార్ధం పెంచి పోషించే మార్కెటీకరణ… ఇవన్నీ భూమిపై పచ్చదనం లేకుండా చేస్తున్నాయి. తద్వారా ప్రజల జీవితాల్లోని పచ్చదనం కూడా హరించివేయబడుతోంది. ఈ పరిస్ధితి మారాలంటే ప్రణాళికాబద్ధంగా, స్వార్ధరహితంగా, దేశ ప్రయోజనాలే పరమావధిగా పనిచేసే ప్రభుత్వాలు తప్పనిసరి అవసరం. కానీ మనకు లేనిదే అది. అందువల్ల ప్రజలు ప్రత్యామ్నాయాలు వెతుక్కోక తప్పని పరిస్ధితి!
కింది ఫోటోలు వివిధ పత్రికల నుండి సేకరించినవి.
వడగాలులకు తెలుగు రాష్ట్రలలోని ప్రజలు తీవ్రసమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది.కానీ,మరణాల సంఖ్యవిషయంలో విశ్వనీయతలేదనే చెప్పవలసి ఉంటున్నది.ఎందుకంటే ఈ మరణాలను ప్రభుత్వవర్గాలు ఆరోగ్యాలయాలనుండి సేకరించిచెబుతున్న సమాచరంకాదు.పత్రికలలో వచ్చే(తెలుగుపత్రికలలో) సమాచారం మీదే అవి ఆధారపడుతున్నాయి!తగకొన్ని సం,,రాలలో మరణాల సంఖ్యవిషయంలో తెలుగు పత్రికలు అతిచేస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసినదే!
దేశంలో వడగాలులకు ప్రధానంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు దక్షిణభారతదేశం,రాజస్తాన్ దానికి ఆనుకునిఉండే రాష్ట్రాలు.కానీ,మరణాలను ప్రధానంగా కొన్నిరాష్ట్రాలలోనే సంభవించినట్లు చూపెడుతున్నారు.
కొద్దిరోజులక్రితం ద.భా.రాష్ట్రాలు వడగాలుల వలన సంభవించే మరణాలను జాతీయవిపత్తులకింద పరిగణించమని కోరాయి(ఉ.భా.రాష్ట్రాలలో చలిగాలుల వలన సంభవించే మరణాలకు కేంద్రప్రభుత్వం పరిహారమిస్తున్నది).అందుకు ప్రభుత్వవర్గాలు నిరాకరించాయి.
వాస్తవానికి అధికారులు చెప్తున్న దానికన్నా ఎండలు ఎక్కువే ఉంటున్నాయి.మూలగారు చెప్పినట్లు పత్రికల లెక్కలు నమ్మలేము.ఎండాకాలంలో ఏటా వారం రోజులు వార్తల్లో చదవడం తప్ప..సహాయక చర్యలు తక్కువ.