[మే 21 తేదీన ఉత్తర కాశ్మీర్ లోని పల్హాలాన్ గ్రామంలో గ్రామ ప్రజలు మీర్వాయిజ్ మౌల్వీ ఫరూక్ 25వ వర్ధంతి సందర్భంగా ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు ఊరేగింపు పైకి పంప్ గన్ పెల్లెట్లు పేల్చారు. నాన్-లెధల్ వెపన్ పేరుతో కాశ్మీర్ భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న ఈ ఆయుధాల వల్ల వందలమంది తీవ్ర గాయాలపాలై కంటి చూపు కోల్పోతున్నారు. నాన్-లెధల్ అని చెప్పినప్పటికీ పదుల సంఖ్యలో వీటి బారినపడి మరణించారు. మే 21 తేదీన ట్యూషన్ కి వెళుతూ ఊరేగింపు పక్కన వెళ్ళడం తటస్ధిటించిన హమీద్ నజీర్ భట్ పైకి పోలీసులు పెల్లెట్లు (చిన్న చిన్న ఇనప గుండ్లు) ప్రయోగించడంతో అతని కుడి కన్ను తీవ్రంగా దెబ్బ తిన్నది. వందకు పైగా ఇనుప గుండ్లు హమీద్ కపాలం, దవడ, పెదాలు, ముక్కు, మెదడు లోకి చొచ్చుకు వెళ్ళాయని డాక్టర్లు చెప్పారు. అతనికి ఇక కుడికంటి చూపు ఉండదని వారు చెప్పారు. రెండు అడుగుల దూరం లోపలి నుండే పెల్లెట్లు ప్రయోగించడంతో కొన్ని వందల మంది ఇదే తరహా గాయాలతో ఆసుపత్రిలో చేరారని డాక్టర్లు చెప్పారు. ఈ అంశంపై ఈ రోజు అనగా మే 27 తేదీన ‘A hevy hand in Kashmir’ శీర్షికన ది హిందు పత్రిక ప్రచురించిన ఎడిటోరియల్ కు ఇది యధాతధ అనువాదం. -విశేఖర్]
**********
2010లో కాశ్మీర్ లో భద్రతా బలగాలు అనేకమంది నిరాయుధ నిరసనకారులను చంపివేయడంపై పెల్లుబికిన నిరసనకు ప్రతిస్పందనగా యు.పి.ఏ ప్రభుత్వం కాశ్మీర్ లో నియోగించిన భద్రతా బలగాలు మరియు పోలీసుల వినియోగం కోసం “ప్రాణాంతకం కాని ఆయుధాలను” సేకరించడం ద్వారా పంధా మార్చడానికి ఆలస్యంగా పూనుకుంది. నిరసనలను అణచివేసే సందర్భంలో భద్రతా బలగాల చేతుల్లో సంభవిస్తున్న మరణాల సంఖ్యను సాధ్యమైనంతగా తగ్గించేందుకు ఈ ‘ప్రాణాంతకం కాని ఆయుధాల సేకరణ’ను ఉద్దేశించారు. ప్రభుత్వం పెప్పర్ గ్రేనేడ్ లను, వరసపెట్టి ఉక్కు గుండులను వదిలే పంప్ గన్ లను సేకరించింది. కాశ్మీర్ లాంటి సందర్భాలలో కొన్ని ప్రాణాంతక ఆయుధాలను సమకూర్చడం వల్ల సత్ఫలితాలు వస్తాయని ఎవరూ ఆశించలేదు.
పెల్లెట్ (ఇనప గుండ్లు) గన్ లు చేతబట్టిన పారామిలట్రీ బలగాలు, J&K పోలీసులు నిరసనకారుల ఛాతీలు, తలల్ని లక్ష్యంగా చేసుకుని దగ్గరి నుండి ప్రయోగిస్తున్నారు. పెల్లెట్ గన్లు ‘ప్రాణాంతకం కాని ఆయుధాలు” అనడం ఎంతటి వంచనో ఆగస్టు 2010లో వాటిని మొదటిసారి ప్రయోగించినప్పుడే స్పష్టం అయింది. అనంతనాగ్ లో 9 సంవత్సరాల ఇర్షాద్ అహ్మద్ ప్యారీ ఛాతీ, పొత్తికడుపు భాగాల్లో పెల్లెట్లు తగలడం వల్ల అయిన గాయాలతో చనిపోయాడు. ఈ ఇనప గుండు తుపాకుల వల్ల మరణం సంభవించనప్పుడు గాయపడినవారు కంటి చూపు కోల్పోయి చీకటి ప్రపంచంలోకి నెట్టివేయబడుతున్నారు.
పెల్లెట్ గన్ గాయాల వల్ల కంటి చూపు కోల్పోయినవారు ఎంతమందో ఖచ్చితంగా లెక్కించనప్పటికీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2010-13 మధ్య కాలంలో రెండు ప్రధాన ఆసుపత్రులలో చికిత్స పొందిన బాధితుల్లో 36 మంది తీవ్ర స్ధాయి కంటి గాయాలకు గురయ్యారు. 2010లో 12 మంది పూర్తిగా కంటి చూపు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా గత వారంలో బారాముల్లా జిల్లాలోని పల్హాలాన్ గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్ధి హమీద్ నజీర్ భట్ పెల్లెట్ గాయాలకు బాధితుడుగా మిగిలాడు. జమ్ము & కాశ్మీర్ పోలీసులు ప్రయోగించిన పెల్లెట్ల వలన అతని కుడి కన్ను పూర్తిగా నాశనం అయింది.
గత సంవత్సరమే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పి.డి.పి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి, ఆమె సహచర శాసన సభ్యులు దక్షిణ కాశ్మీర్ లోని షోపియన్ లో నిరాయుధ నిరసనకారులపై జమ్ము & కాశ్మీర్ పోలీసులు విచక్షణారహితంగా పెల్లెట్ గన్ లు ప్రయోగించి గుడ్డివారిని చేసినందుకు నిరసనగా అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు. బి.జె.పితో కలిసి పి.డి.పి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినాక మెహబూబా ముఫ్తి, ఆమె తండ్రి మరియు ముఖ్యమంత్రి ముఫ్తి మహమద్ సయీద్ లు, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉండగా పెల్లెట్ గన్ లు ప్రయోగించి కాశ్మీరీలను అంధులుగా మార్చడంపై వ్యక్తం చేసిన ఆగ్రావేశాలను మర్చిపోయినట్లు కనిపిస్తోంది.
1990లలో కాశ్మీర్ రాజకీయాలలో సయీద్ ను పునర్దర్శనం కావించడానికి తోడ్పడిన హామీ నినాదం “స్వస్ధత స్పర్శ” ను ఆచరణయుత చర్యలలో అమలు చేయకపోతే ఆ నినాదం విశ్వసనీయతను కోల్పోతుంది. 16 యేళ్ళ హమీద్ విషయంలో సయీద్ దిగ్భ్రాంతికరమైన మౌనాన్ని పాటిస్తున్నారు. కానీ ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జావేద్ గిలానీ శ్రీనగర్ నుండి వెలువడే ఒక వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెల్లెట్ గన్ ల ద్వారా అంధులను చేసే చర్యను సమర్చుంచుకున్నారు. “అలా చేయకపోతే ఒక బెదురు (భయం)ను ఎలా కలిగించగలం? రాళ్ళు విసిరేవారిని ఎలా అపగలం?” అని ఆయన ప్రశ్నించారు. అటువంటి కాఠిన్య వైఖరి గాయపడిన శరీరానికి మరిన్ని గాయాలను జోడించడమే అవుతుంది. ఆ వైఖరి కాశ్మీర్ ను మళ్ళీ అంచు మీదికి నెట్టివేస్తుంది.
వందకు పైగా ఇనుప గుండ్లు హమీద్ కపాలం, దవడ, పెదాలు, ముక్కు, మెదడు లోకి చొచ్చుకు వెళ్ళాయని డాక్టర్లు చెప్పారు
ఫొటో చూస్తుంటే హమీద్ కు తగిలిన గాయాల తీవ్రత తెలుస్తోంది. కానీ,ఇనుపగుండ్లు మెదడులోకి చొచ్చుకు వెళ్ళాయనే పదప్రయోగం సరైనదికాదేమో ఓసారి చూస్తారా?