ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు


Public Cabinet meeting in Delhi

ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతి కేసులో ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఢిల్లీలోని ఎఎపి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎఎపి మొదటి గెలుపు నమోదు చేసింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ద్వారా ఎఎపి ప్రభుత్వం చేతుల్లో నుండి అధికారాలు గుంజుకోవడానికి గత కొద్ది వారాలుగా మోడి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన తాజా తీర్పు కళ్ళెం వేసింది. ఢిల్లీ పోలీసులపై అవినీతి కేసు నమోదు చేసి విచారించే అధికారం ఢిల్లీ ప్రభుత్వం ఆధీనం లోని యాంటీ కరప్షన్ బ్యూరో సంస్ధకు ఉన్నదని ఢిల్లీ హై కోర్టు తీర్పు చెప్పింది.

ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ అనీల్ కుమార్ ను లంచం తీసుకున్న కేసులో అరెస్టు చేశారు. ఒక ఇనుప తుక్కు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ ఎసిబి హెడ్ కానిస్టేబుల్ ను అరెస్టు చేసింది.  నిందితుడికి బెయిల్ ఇవ్వడంపై హై కోర్టులో వాదప్రతివాదాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ ఎసిబి కి ఢిల్లీ పోలీసుల అవినీతిపై విచారణ చేపట్టే అధికారం ఉన్నదా లేదా అన్న అంశంపై హై కోర్టు ఒక రూలింగు ఇచ్చింది. ఈ రూలింగ్ ప్రకారం ఢిల్లీ పోలీసుల అవినీతిని విచారించే అధికారం ఢిల్లీ ఎసిబి కి ఉన్నది.

కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం (2014) ఆగస్టు నెలలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెరవేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ ఎసిబి కి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిని విచారించే అధికారం మాత్రమే ఉన్నది తప్ప ఢిల్లీ పోలీసుల అవినీతిని విచారించే హక్కు లేదు. ఈ నోటిఫికేషన్ ని అడ్డం పెట్టుకుని ఢిల్లీ పోలీసులు తమ హెడ్ కానిస్టేబుల్ అవినీతిని వెనకేసుకు వచ్చారు. ఆయన భార్య నుండి ఫిర్యాదు తీసుకుని ఎసిబి పైన కిడ్నాప్ కేసు నమోదు చేశారు. పైగా కిడ్నాప్ కేసు విచారణలో పాల్గొనవచ్చని ఎసిబి కి ఆహ్వానం పంపారు.

హెడ్ కానిస్టేబుల్ బెయిల్ విచారణ సందర్భంగా హై కోర్టులో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ ను తమకు సమర్ధనగా ఢిల్లీ పోలీసులు తెచ్చుకున్నారు. ఈ వాదనను ఢిల్లీ హై కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ పోలీసుల చర్యను తీవ్రంగా తప్పు పట్టింది. ఢిల్లీ పోలీసుల అవినీతిపై కేసు మోపి విచారించే హక్కు ఢిల్లీ ఎసిబికి ఉన్నదని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్ చెల్లదని అది అనుమానాస్పదం అని స్పష్టం చేసింది. అది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది.

“ఎలాంటి ఎక్జిక్యూటివ్ చర్య ద్వారా నైనా కేంద్ర ప్రభుత్వం నేషనల్ కేపిటల్ టెరిటరీ కి చెందిన శాసన సభ అధికారాల్లోకి చొరబడడానికి వీలు లేదు. శాసన సభకు అధికారాలు కలిగిన అంశాలలోకి కేంద్ర ప్రభుత్వం చొరబడేందుకు వీలు లేదు. పార్లమెంటు స్వయంగా చేసిన GNCTD చట్టం (రెడ్ విత్ ఆర్టికల్ 239AA) రాష్ట్రపతి యొక్క ఎక్జిక్యూటివ్ అధికారాలకు బంధనం విధించింది” అని ఢిల్లీ హై కోర్టు రూలింగ్ ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలన్నీ రాష్ట్రపతి ద్వారానే సంక్రమిస్తాయి. రాష్ట్రపతి కేవలం కేంద్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకే వ్యవహరిస్తారు. కనుక ఢిల్లీ ఎల్.జి జారీ చేసే ఆదేశాలన్నీ నేరుగా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేవే. అందువలన ఢిల్లీ హై కోర్టు ఇచ్చిన రూలింగు కేంద్రం లోని మోడి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.

రాజ్యాంగం ప్రకారం ఢిల్లీ రాష్ట్ర జాబితాలో ఉన్న 1వ (పబ్లిక్ ఆర్డర్) మరియు 2వ (పోలీసు) ఎంట్రీలు రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో లేవని కనుక హెడ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి విచారించే అధికారం ఎసిబి కి లేదని ఢిల్లీ పోలీసులు వాదించారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ లాయర్ తమ అధికారం ఢిల్లీ రాష్ట్ర జాబితా నుండి సంక్రమించినది కాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా నుండి సంక్రమించిందని వాదించారు. ఉమ్మడి జాబితా లోని 1వ, 2వ ఎంట్రీల మేరకు నేర చట్టం, ఐ.పి.సి, సి.ఆర్.పి.సి చట్టాల కిందకు వచ్చే నేరాలన్నీ విచారించే అధికారం ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్నదని వాదించారు. ఈ వాదనతో హై కోర్టు ఏకీభవించింది. హెడ్ కానిస్టేబుల్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

ఈ తీర్పుతో ఎఎపి-1 ప్రభుత్వం పడిపోయినప్పటి నుండీ విధించిన రాష్ట్రపతి పాలన ద్వారా ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కత్తిరిస్తూ మోడి ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల బండారం బట్టబయలు అయింది. ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి స్ధాయి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు కల్పిస్తామని బి.జె.పి తన మేనిఫెస్టో లో ఇచ్చిన వాగ్దానానికి తానే తూట్లు పొడిచిన సంగతి వెలుగులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ, వీరప్ప మొయిలీ లపై ఎఎపి-1 ప్రభుత్వం మోపిన అవినీతి కేసు లాంటివి మరోసారి నమోదు కాకుండా బి.జె.పి/మోడి ప్రభుత్వం జాగ్రత్త పడిందని వెల్లడి అయింది. మోడి ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా నిలవడానికి బదులు కార్పొరేట్ కంపెనీల అవినీతిని కాపాడేందుకే పని చేస్తున్న సంగతిని వెల్లడి చేసింది.

ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ఎఎపి ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శులను సైతం ఇష్టారీతిన మార్చివేస్తూ ఎఎపి చేతులను కట్టివేసి తద్వారా ఢిల్లీ ప్రభుత్వం తలపెట్టిన అవినీతి వ్యతిరేక చర్యలకు కళ్ళెం వేయడానికి కేంద్రం ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన వ్యక్తిగత కార్యదర్శులను నియమించుకునే అధికారం కూడా ముఖ్యమంత్రికి లేదని ఆ అధికారం తనకే ఉన్నదని చెబుతూ ఎల్.జి (లెఫ్టినెంట్ గవర్నర్) నజీబ్ జంగ్, ముఖ్యమంత్రి చేసిన నియామకాలను రద్దు చేస్తూ వస్తున్నారు.

ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వం, ఎల్.జి ల మధ్య కొద్ది రోజులుగా తీవ్రస్ధాయిలో సంఘర్షణ సాగుతోంది. తెరపై ఉండడానికి ఎల్.జి ఉన్నప్పటికీ వాస్తవంలో ఆయన వెనుక పని చేస్తున్నది కేంద్రం లోని మోడి ప్రభుత్వమే. కేంద్ర మంత్రివర్గం సలహా సంప్రతింపుల మేరకే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నడుచుకుంటారు. కనుక ఎల్.జి తీసుకునే ప్రతి చర్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో మాత్రమే తీసుకోబడుతుంది.

ఈ వ్యవహారానికి అంతటికీ మూలం ఎఎపి – 1 ప్రభుత్వ కాలంలో కేజ్రీవాల్ తీసుకున్న సంచలన నిర్ణయం. భారత దేశంలో అతి పెద్ద ధనికుడుగా విరాజిల్లుతున్న ముఖేష్ అంబానీపై ఢిల్లీ ఎసిబి అవినీతి కేసును నమోదు చేసింది. అంబానీ ఆధ్వర్యం లోని విద్యుత్ పంపిణీ సంస్ధలు ఇష్టారీతిన ధరలు నిర్ణయించి ప్రజలను దోపిడి చేస్తున్నాయని, అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ ప్రజలకు చెందిన గ్యాస్ వనరులను తవ్వి తీస్తూ సదరు గ్యాస్ కోసం అత్యధిక ధరలను ప్రజల నుండి వసూలు చేస్తున్నదని ఆరోపిస్తూ రిలయన్స్ పై అవినీతి కేసును నమోదు చేసింది. ఈ కేసును విచారించాలని తన అధీనం లోని ఎసిబి ని పురమాయించింది. అప్పటి చమురు మంత్రి వీరప్ప మొయిలీ రిలయన్స్ తో కుమ్మక్కై అధిక ధరలను నిర్ణయించడంలో భాగస్వామ్యం వహించినందున ఆయనపై కూడా ఎసిబి కేసు పెట్టి విచారణ చేయాలని కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేశాడు.

అప్పటి ఎఎపి ప్రభుత్వానికి సభలో మెజారిటీ లేకపోవడం, మెజారిటీ కోసం కాంగ్రెస్ పై ఆధారపడడంతో ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులు ఓటమి పాలయ్యాయి. సభలో బి.జె.పి, కాంగ్రెస్ లు ఒక్కటై ప్రభుత్వ బిల్లును ఓడించాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో బిల్లును గట్టెక్కించుకోలేకపోతే అది ప్రభుత్వ ఉనికిని ప్రశ్నార్ధకంలో పడవేస్తుంది. నైతికంగా ఆ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఉండదు. ముఖేష్ అంబానీ కంపెనీ పైనా, కాంగ్రెస్ కేంద్ర మంత్రుల పైనా ఢిల్లీ ఎసిబి అవినీతి కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించడం వల్లనే బి.జె.పి, కాంగ్రెస్ లు కుమ్మక్కై తమ బిల్లును ఓడించాయని అప్పటి ఎఎపి ప్రభుత్వం ఆరోపించింది. బి.జె.పి, కాంగ్రెస్ లు ఎన్ని సాకులు చెప్పినప్పటికీ ఎఎపి ప్రభుత్వం చేసిన ఆరోపణ వాస్తవం.

ఈ నేపధ్యంలో ఎఎపి అత్యధిక మెజారిటీతో తిరిగి ప్రభుత్వంలోకి రావడం రిలయన్స్ లాంటి కంపెనీలకు సహజంగానే చెమట్లు పట్టించింది. ఎఎపి ప్రభుత్వానికి అధికారాలు అప్పగిస్తే అది ఏమైనా చేయగలదు. కొద్ది రోజుల పాలనలోనే, అది కూడా మెజారిటీ లేని రోజుల్లోనే ఈ దేశానికి రారాజుగా వెలుగొందుతున్న రిలయన్స్ కంపెనీని ఎఎపి ఢీ కొట్టింది. అలాంటిది పూర్తి స్ధాయి మెజారిటీ పొందడమే కాకుండా ప్రతిపక్షం అన్నదే లేని పరిస్ధితిలో ఎఎపి ప్రభుత్వం ఏమైనా చేయగలదు.

కనుక ఎఎపి ప్రభుత్వ అధికారాలను ఏదో వంకతో కత్తిరించాలి. అందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రహ్మాస్త్రంగా మోడి ప్రభుత్వానికి లభించాడు. ఆయన్ని వినియోగించి ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యం లోని ఎసిబికి ఎలాంటి అధికారాలు లేకుండా చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించారు. దాని ఫలితమే ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఎల్.జి ల మధ్య చెలరేగిన ఘర్షణ.

ఇది పైకి చూసేందుకు గవర్నర్ అధికారాలకు, ముఖ్యమంత్రి అధికారాలకు మధ్య ఘర్షణగా కనిపిస్తున్నది. వాస్తవంలో బి.జె.పి ఆధ్వర్యం లోని కేంద్ర ప్రభుత్వం వెనుక ఉన్న రిలయన్స్ కంపెనీకి, సదరు కంపెనీ అవినీతిపై యుద్ధం ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణ. ఈ ఘర్షణలో ఒకవైపు పాత్రలు ఎవరో (ఎఎపి ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ ఎసిబి) స్పష్టంగానే కనిపిస్తున్నారు. మరోవైపు పాత్రధారులుగా కనిపిస్తున్న ఎల్.జి నజీబ్ జంగ్ మాత్రం అసలు పాత్రధారి కాదు. ఆయన వెనుక ఉన్నది మోడి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వెనుక ఉన్నది రిలయన్స్ మరియు ఇంకా అనేక కార్పొరేట్ కంపెనీలు.

ఢిల్లీ హై కోర్టు తన తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టడం గమనార్హం. ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యం లోని అవినీతి వ్యతిరేక విభాగం (ఎసిబి) అధికారాలకు కత్తెర వేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పు పట్టింది. పైన చెప్పినట్లుగా ఉమ్మడి జాబితాలోని 1వ 2వ ఎంట్రీలలోని అంశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అంశాల్లాపై లెఫ్టినెంట్ గవర్నర్ తన ఇష్టానుసారం వ్యవహరించే అధికారం లేదని రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల సలహా సంప్రదింపుల మేరకే ఆయన వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం గత యేడు ఆగస్టులో జారీ చేసిన నోటిఫికేషన్ ను జారీ చేసి ఉండాల్సింది కాదని హై కోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎసిబి ద్వారా అవినీతిని అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న అధికారాలను కేంద్రం కట్టడి చేసిందని ఇది రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎక్జిక్యూటివ్ చర్యలను తీసుకోజాలదని స్పష్టం చేసింది. గత సం. ఆగస్టు నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ మాత్రమే కాకుండా వారం రోజుల క్రితం మే 21 తేదీన కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్ కూడా ‘అనుమానాస్పదం’ కిందికే వస్తుందని హై కోర్టు రూలింగ్ ఇచ్చింది.
“శాసన సభ సభ్యులు ఢిల్లీ నేషనల్ కేపిటల్ టెరిటరీ (ఎన్.సి.టి) పరిధిలోని  పౌరుల చేత నేరుగా ఎన్నుకోబడినవారు. రాష్ట్ర మంత్రి వర్గం శాసన సభకు బాధ్యత వహిస్తారు. ప్రజలు తమ తీర్పు ద్వారా సార్వభౌమ అధికారాన్ని సంక్రమింపజేసిన వారిని లెఫ్టినెంట్ గవర్నర్ తగిన రీతిన గౌరవించి తీరాలి” అని ఢిల్లీ హై కోర్టు లెఫ్టినెంట్ గవర్నర్ కూ, కేంద్ర ప్రభుత్వానికీ బలమైన మొట్టికాయలు తగిలించింది.

తాము అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని బి.జె.పి, మోడిలు చెప్పే కబుర్లు నిజమే అయితే ఢిల్లీ హై కోర్టు తీర్పును గౌరవించి తదనుగుణంగా నడుచుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతు ఇవ్వాలి. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసే చర్యలను కట్టిపెట్టాలి.

కానీ కేంద్ర ప్రభుత్వం సరిగ్గా ఇందుకు విరుద్ధంగా నడుస్తోంది. ఢిల్లీ హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తద్వారా తాము చెప్పే అవినీతి వ్యతిరేక కబుర్లు ఒట్టి గాలి కబుర్లేనని స్పష్టంగా చాటుతోంది. పైకి అవినీతి వ్యతిరేక కబుర్లు దంచుతూ ఆచరణలో సరిగ్గా వాటికి విరుద్ధంగా నడుస్తోంది. కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వ చర్యను సహించలేని మోడి ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతున్న కార్పొరేట్ కంపెనీల అవినీతిని, విదేశీ నల్లధనాన్ని కేంద్ర ఎలా అరికడుతుందో ఊహకు అందని సంగతి.

One thought on “ఢిల్లీ కోర్టు రూలింగ్: మోడిపై ఎఎపి గెలుపు

  1. మోదీ,ప్రభుత్వం(అన్నింటా తానే కనిపిస్తున్నాడు) అనుకూల ప్రసారమాధ్యమాలలో విస్తృతంగా ప్రచారానికి పూనుకొంటున్నది.కానీ,అదంతా డొల్లేనని కనీస పరిజ్ఞానమున్నవారెవరికైనా ఇట్టే తెలిసిపోతున్నది.
    గత పాలనలో(49 రోజులపాలనలో) తీసుకొన్నటువంటి దూకుడునిర్ణయాలు ఈ పాలనలో ఒక్కటికూడా కనబడలేదు.ఐనప్పటికీ డిల్లీ హైకోర్టులో ఆప్ ప్రభుత్వానికి అనుకూలనిర్ణయం వెలువడింది-తద్వారా ఆప్ మరోసారి దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించింది.
    ఉన్నతన్యాయస్థానంలో ఈ కేసు ఎటువంటి మార్పులకు లోనౌతుందో చూడాలి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s