ఈ కార్టూన్ ను రెండు విధాలుగా అర్ధం చేసుకోవచ్చు.
ఒకటి: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను మరోసారి చేపట్టిన జయలలితకు ఆమెను జైలు జీవితం నుండి బైటపడడానికి కోర్టులే సహకరించాయన్న అర్ధం ఈ కార్టూన్ లో ద్యోతకం అవుతోంది.
రెండు: ఇన్నాళ్లూ ఆమె ముఖ్య మంత్రిగా కారులో ప్రయాణించకపోవడానికి కోర్టు కేసులు ఆటంకంగా, అడ్డంగా ఉన్నాయని లాయర్లు శ్రమించి ఆ ఆటంకాన్ని తొలగించి సిగ్నల్ ఇవ్వడంతో ఆమె తిరిగి ప్రయాణం ప్రారంభించారని మరో అర్ధం.
ఈ రెండు అర్ధాల్లోనూ జయలలిత విజయవంతంగా కోర్టు కేసుల నుండి బైటపడేందుకు కోర్టులే ఇంజన్లుగా పని చేశాయన్న అంశం ఉమ్మడిగా కనిపిస్తోంది.
గతంలో ఈ బ్లాగ్ లో వివరించినట్లుగా కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి జయలలిత ఏ విధంగా నేరానికి పాల్పడ్డారన్న అంశం పైన కంటే ఆమె ఏ విధంగా నేరం చేయలేదో కనిపెట్టే అంశం పైనే దృష్టి సారించారు.
అతి కష్టం మీద కింది కోర్టు వేసిన లెక్కలలో తప్పులను పట్టుకుని, అవినీతి ఆదాయాన్ని తగ్గించే ఫార్ములాను కనిపెట్టి ఆదాయంలో అవినీతి మొత్తం 10 శాతం కంటే తక్కువ ఉంది కాబట్టి ఆమె విడుదలకు అర్హురాలు అని తీర్మానించారు. ఆ విధంగా కోర్టే ఇంజనై జయలలిత కారు ముందుకు పరుగెత్తడానికి పని చేసింది.
కనుక కార్టూన్ లో వ్యక్తం అయిన అర్ధం సరైనదే అని గ్రహించవచ్చు.