ప్రజా సమూహాలు అన్నీ ఒకే మాదిరిగా, ఒకే భావాన్ని కలిగించేవిగా ఉండవు. కొన్ని సమూహాలు అబ్బురపరిస్తే కొన్ని సమూహాలు చీదర పుట్టిస్తాయి. కొన్ని సమూహాలు ఔరా! అనిపిస్తే మరికొన్ని ఇదెలా సాధ్యం అని విస్తుపోయేలా చేస్తాయి.
సమూహంలో క్రమ శిక్షణ ఉంటే ఆ సమూహానికి ఎనలేని అందం వచ్చి చేరుతుంది. అది మిలటరీ క్రమ శిక్షణ అయితే చెప్పనే అవసరం లేదు. క్రమబద్ధమైన కదలికలతో మిలట్రీ సమూహాలు చేసే విన్యాసాలు చూడముచ్చట గొలుపుతూ విసుగు అనేది తెలియకుండా అలా గుడ్లు అప్పగించుకుని చూసేలా చేస్తాయి.
సమూహ ప్రదర్శనలో రంగులు కలిస్తే ఆ అందమే వేరు. ఒలింపిక్స్ లాంటి ప్రపంచ స్ధాయి క్రీడలకు ముందు చేసే సామూహిక విన్యాసాలు ఈ కారణం వల్లనే కనువిందు చేస్తాయి. అవి ఆయా దేశాల సాంస్కృతిక విశిష్టతకు ప్రతీకగా కూడా నిలవడం కద్దు.
ది అట్లాంటిక్ పత్రిక ఫోటోగ్రాఫర్ గత కొన్ని యేళ్లుగా చైనాలో సమూహాలను పరిశీలిస్తూ వస్తున్నారట. తాను గుర్తించిన సమూహాలను ఫోటో దృశ్యాలలో భద్రం చేస్తూ వచ్చారట. తాను సేకరించిన చైనా సమూహాల ఫోటోలను ‘The Chinese Art of the Crowd’ శీర్షికతో మే 6 తేదీన అట్లాంటిక్ పత్రికలో ప్రచురించారు. ఆ ఫోటోలే ఇవి.
ఇందులో మిలట్రీ విన్యాసాలతో పాటు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కడానికి చైనా ప్రజలు సామూహికంగా ప్రయత్నించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఒలింపిక్స్ సందర్భంగా చైనీయ కళాకారులు ప్రదర్శించిన విన్యాసాలూ ఉన్నాయి.