కేరళ హై కోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించింది. జస్టిస్ చిన్నపరెడ్డి (కిష్టయ్య, బాలాగౌడ్ కేసు), జస్టిస్ తార్కుండే (ప్రభుత్వోద్యోగుల రాజకీయ భావాలు) లాంటి గొప్ప న్యాయమూర్తుల తీర్పుల సరసన చేర్చగల ఈ తీర్పు ప్రకారం కేవలం మావోయిస్టుగా ఉండడమే నేరం కాదు. దేశంలో అమలులో ఉన్న చట్టాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యకు పాల్పడనంతవరకు మావోయిస్టు భావజాలం ఒక వ్యక్తిని నేరస్ధుడిగా చేయబోదని తీర్పు పేర్కొంది.
మావోయిస్టు భావజాలం దేశంలో ఉనికిలో ఉన్న రాజ్యాంగబద్ధ రాజ్యపాలన (constitutional polity) లో ఇమడని మాట నిజమే అయినా కేవలం ఆ భావజాలం కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తిని అరెస్టు చేయడం చట్ట సమ్మతం కాదని కోర్టు స్పష్టం చేసింది.
కేరళ హై కోర్టు తీర్పు దేశంలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ఇబ్బందిగా పరిణమించవచ్చు. ఇలాంటి ప్రజానుకూల తీర్పులను త్రోసిరాజని యధావిధిగా అణచివేత విధానాలను అమలు చేయగల (అ)నైతిక ధృతి భారత పాలకుల సొంతం కావచ్చు గానీ ప్రజలు, ప్రజాస్వామికవాదుల చేతికి ఒక నైతిక ఆయుధం ఈ తీర్పు ద్వారా సంక్రమిస్తుందన్నది వాస్తవం.
పాలక వర్గాల దోపిడి విధానాలకు, అణచివేత చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించినప్పుడల్లా ఆ ఉద్యమం లోకి మావోయిస్టులు చొరబడ్డారన్న సాకు చూపుతూ జనం పైకి పోలీసులను ఉసి గొల్పడం పాలకులకు ఉన్న అలవాటు. ఈ అలవాటుకు కేరళ హై కోర్టు తీర్పుతో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.
“మావోయిస్టు రాజకీయ సిద్ధాంతం మన రాజ్యాంగబద్ధ రాజ్యపాలనకు అనుగుణంగా లేకపోవచ్చు. అంత మాత్రాన కేవలం మావోయిస్టుగా ఉండడమే నేరం కాదు… ఒక వ్యక్తి మావోయిస్టు అయినంత మాత్రానే పోలీసులు అతనిని అరెస్టు చేయలేరు. అతని కార్యకలాపాలు చట్టవిరుద్ధం అనడానికి సకారణమైన అభిప్రాయాన్ని పోలీసులు స్ధాపించినప్పుడే అరెస్టు చేయగలరు” అని కేరళ హై కోర్టు ఒక వ్యక్తి అరెస్టు కేసులో తీర్పు చెప్పింది.
చట్టవిరుద్ధంగా అరెస్టు చేసినందుకు గాను వేనాడ్ కు చెందిన శ్యామ్ బాలకృష్ణన్ కు ఒక లక్ష పది వేల రూపాయలు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చట్టవిరుద్ధ అరెస్టుకు పరిహారంగా లక్ష రూపాయలు, లిటిగేషన్ ఖర్చులకు పది వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. కేరళ హై కోర్టు జడ్జి జస్టిస్ ఎ.ముహమద్ ముస్తాక్ శుక్రవారం ఈ తీర్పు వెలువరించారు. ప్రస్తుత కేసులో పిటిషనర్ చేసిన నేరం ఏమిటో పోలీసులు చెప్పలేకపోయారని జడ్జి ఎత్తిచూపారు. మావోయిస్టు అన్న అనుమానంతో ఆయనను అరెస్టు చేశామని చెప్పడం చట్ట సమ్మతం కాదని స్పష్టం చేశారు.
“చట్టం ప్రకారం మావోయిస్టు సంస్ధ నిషేదితం అయినట్లయితే మావోయిస్టు సంస్ధ కార్యకలాపాలను అడ్డుకోవచ్చు. ఒక వ్యక్తి గానీ లేదా సంస్ధ గానీ వ్యవస్ధను వ్యతిరేకిస్తూ భౌతిక హింసకు పాల్పడితే చట్ట సంస్ధలు ఆ వ్యక్తిని లేదా సంస్ధను అడ్డుకోవడం గానీ వారిపై చర్యలు తీసుకోవడం గానీ చేయవచ్చు… ఈ కేసులోని వాస్తవాలను బట్టి చూస్తే పిటిషనర్ మావోయిస్టు అన్న అనుమానంతో మాత్రమే అరెస్టు చేశారని స్పష్టం అవుతోంది. అరెస్టు చేసిన సందర్భంలో పిటిషనర్ చేసిన నేరం ఏమిటో పోలీసులకు తెలియదు. పిటిషనర్ ని అరెస్టు చేయడానికి ఏకైక కారణం ఆయన మావోయిస్టు అని అనుమానించడమే. తమ తప్పును గ్రహించి ఎలాంటి కేసు రిజిష్టర్ చేయకుండానే ఆయనను పోలీసులు విడుదల చేశారనడంలో ఎలాంటి సందేహము లేదు” అని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
“చట్టం ప్రకారం శిక్షించదగిన నేరంగా గుర్తించదగిన ఎలాంటి నేరంలోనైనా పిటిషనర్ పాల్గొన్నట్లుగా సంతృప్తికర సమాధానం పొందకుండానే పిటిషనర్ ను అరెస్టు చేయడం ద్వారా పోలీసులు అతని స్వేచ్ఛను హరించారు. ఆగ్రహావేశాలతో జమకూడిన గుంపు నుండి పిటిషనర్ ను రక్షించామన్న పోలీసుల వాదన నమ్మలేనిది. జనరల్ డైరీ, పిటిషనర్ ఇంటిని సోదా చేయడం లాంటి పోలీసుల చర్యలను బట్టి చూస్తే ఆయన మావోయిస్టు అన్న అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నారని స్పష్టంగా అర్ధం అవుతోంది” అని తీర్పు పేర్కొంది.
పోలీసుల ఆధిపత్య చర్యను వెనకేసుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కోర్టు అక్షింతలు వేసింది. “మావోయిస్టులను ఎదుర్కొనే కర్తవ్యనిర్వహణలో భాగంగానే పోలీసులు చర్య తీసుకున్నారని చెబుతూ ప్రభుత్వం పోలీసులను దృఢంగా సమర్ధించింది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను అది ఎంత చిన్నది లేదా పెద్దది అయినప్పటికీ, కాపాడవలసిందే. పోలీసులు తమకు అప్పగించబడిన అధికారాన్ని అమలు చేయడంలో సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ తమ తెలివికి పని చెప్పవలసి ఉంటుంది. తమ అధికార విధి నిర్వహణలో ఏదైనా అపభ్రంశం జరిగి పొరబాటుగానైనా సరే (వ్యక్తుల) స్వేచ్ఛను హరించడం జరిగితే అలాంటి తప్పును కూడా ప్రభుత్వం బాధ్యతాయుతంగా తమ సొంతం చేసుకోవాలి. తద్వారా ఒక పౌరుడిని గౌరవించడానికి జవాబుదారీతనంతో వ్యవహరించామన్న స్పృహను కలిగించాలి” అని తీర్పు పేర్కొంది.
పిటిషనర్ బాలకృష్ణన్ ఒక తత్వశాస్త్ర విద్యార్ధి. రిటైర్డ్ జడ్జి బాలకృష్ణన్ నాయర్ కుమారుడు. స్వగ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న సేద్యగాడు. గత సంవత్సరం (2014) మే 20 తేదీన ఆయన ఒక టూ వీలర్ పై ప్రయాణిస్తుండగా పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. 9 గంటల పాటు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఆయనను ఇంటరాగేట్ చేస్తూనే ఆయన ఇంటిపై దాడి చేశారు. సోదా పేరుతో భయోత్పాతం సృష్టించారు. ఎలాంటి సాక్ష్యాలు లభించక ఆయనను విడుదల చేశారు. ఈ లోపు తనను చిత్రహింసలకు గురి చేశారని మావోయిస్టుగా అనుమానిస్తున్న తన మిత్రుడు, ఆయన భార్య గురించి చెప్పాలని ఒత్తిడి చేశారని బాలకృష్ణన్ ఆరోపించారు. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆయన పోలీసులపై కోర్టుకు వెళ్లారు.
కేరళలో మావోయిస్టు అనుమానితులంటూ దాడులు చేయడం, అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడం పోలీసులకు మామూలు కార్యక్రమంగా మారిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది. కేరళ పోలీసుల పద్ధతి ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్ ఘర్, జార్ఖండ్ లాంటి పలు రాష్ట్రాల పోలీసులకు కూడా మామూలే. కాగా కేరళ హై కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడం ఒక విచిత్రం. అణచివేతదారులే ప్రగతిశీల ఫోజులు పెట్టడం అన్నమాట! అదే స్వరంతో కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని వెనకేసుకు రావడం మరో విచిత్రం. ఒక పక్క కోర్టు తీర్పును స్వాగతిస్తూ, మరో పక్క ఆ తీర్పులో ప్రతివాది అయిన ప్రభుత్వం తప్పు లేదని చెప్పడం రెండు నాల్కల నేతలకే చెల్లు!
మావోయిస్టు భావజాలం దేశంలో ఉనికిలో ఉన్న రాజ్యాంగబద్ధ రాజ్యపాలన (చొన్స్తితుతిఒనల్ పొలిత్య్) లో ఇమడని మాట నిజమే అయినా కేవలం ఆ భావజాలం కలిగి ఉండడం వల్ల ఒక వ్యక్తిని అరెస్టు చేయడం చట్ట సమ్మతం కాదని కోర్టు స్పష్టం చేసింది.
అంటే అరెస్ట్ చేయకూడదుగానీ,అతని(అనుమానితుల) కదలికలమీద నీఘా పెట్టవచ్చునన్నమాట!