నువ్వు ముస్లింవి.. ఉద్యోగం ఇవ్వం ఫో!


Hari Krishna Exports Pvt Ltd.

సరస్వతీ శిశు మందిర్ పాఠశాలల్లో ఒక కులం వారికి తప్ప ఉద్యోగం ఇవ్వరు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో ఇప్పటికీ ఆ కులం వారికే ఎక్కువ ఉద్యోగాలు దక్కడం ఒక చేదు నిజం. దేశంలో దళితులకు దూరం నుండి నీళ్ళు వొంచి పోసే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. దళితులకు ఇల్లు అద్దెకు ఇవ్వని మురికి మనసుల కుటుంబాలు ప్రతి పల్లె, పట్టణంలోనూ ఉన్నాయి. ముంబైలో ముస్లింలకు కూడా ఇళ్ళు అద్దెకు లభించవు. ఇప్పుడు అదే ముంబైలో పేరు మోసిన కంపెనీ ఒకటి అన్ని అర్హతలు ఉన్న ముస్లింకి ఉద్యోగం ఇవ్వను పొమ్మని మొఖం మీదే/తిరుగు(ఈ)టపాలోనే చెప్పేసింది.

నిజానికి అభ్యర్ధి ముస్లిం గనుక ఉద్యోగం ఇవ్వదలుచుకోకపోతే బుర్ర, బుద్ధి ఉన్నవాడు ఎవ్వడూ ఆ విషయం చెబుతూ ఉద్యోగం నిరాకరించడు. ముస్లిం విద్వేషం లోపల దాచుకుని పైకి మాత్రం అర్హతలు లేవని సాకు చూపుతారు. కనీసం అలాంటి దాపరికపు మర్యాద సైతం చూపలేనంత తీవ్ర మత విద్వేషంతో కుళ్లిపోయేవారు మాత్రమే “నువ్వు ముస్లింవి గనుక నీకు ఉద్యోగం ఇవ్వలేము” అని చెప్పగలరు.

ముంబైలో ఇక ప్రముఖ వజ్రాల ఎగుమతి కంపెనీ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఈ కంపెనీ పేరు -హరి కృష్ణ ఎక్స్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్! వ్యాపారాలకు, కంపెనీలకు దేవుళ్ళ పేర్లు పెట్టుకుని తమ దేవుళ్ళ కరుణా కటాక్షాలకోసం దేవుళ్లాడడం మన దేశంలో ఏమీ కొత్త కాదు. కానీ తమ మతాభిమానాన్ని వ్యాపారంలోకి కూడా చొప్పించి వివక్ష చూపడమే తీవ్ర అభ్యంతరకరం.

“మీ దరఖాస్తుకు కృతజ్ఞతలు. మేము ముస్లిమేతర అభ్యర్ధులను మాత్రమే ఉద్యోగంలోకి తీసుకుంటాము” అని తాను దరఖాస్తు చేసిన 20 నిమిషాల్లోనే తిరుగు టపా (ఈ మెయిల్) వచ్చిందని ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఎం.బి.ఏ గ్రాడ్యుయేట్ జీషన్ ఆలీ ఖాన్ చెప్పారు.

జీషన్ ఆలీ ఖాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో ఎం.బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. ఆయన తన మిత్రులతో కలిసి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ ఉన్నాడు. తన స్పెషలైజేషన్ చదువు రీత్యా అతనికి ఎగుమతి వ్యాపార సంస్ధల్లో ఉద్యోగం లభించే అవకాశం ఎక్కువ. అందువలన అతను తన రెస్యూమేను అంతర్జాతీయంగా వజ్రాల వ్యాపారం నిర్వహించే హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ లిమిటెడ్ కంపెనీకి ఈ మెయిల్ చేశాడు.

“ఇంకా కొంతమంది స్నేహితులతో పాటుగా నా రెస్యూమేను కంపెనీకి మెయిల్ చేశాను. నా మిత్రుల్లో సగం మందికి

Zeshan Ali Khan

Zeshan Ali Khan

వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. నా దరఖాస్తుకు మాత్రం మెయిల్ చేసిన 20 నిమిషాల్లోనే రిప్లై వచ్చింది. దాన్ని చదివి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను” అని జీషన్ ఆలీ ఖాన్ తన అనుభవాన్ని వివరించారని ది హిందు పత్రిక తెలిపింది.

తనకు వచ్చిన రిప్లై ఒక జోక్ ఏమో అని జీషన్ మొదట అనుకున్నారట. అది నిజమే అని క్రమక్రమంగా అతనికి అర్ధం అయింది. “నేను మొదట అది జోక్ అనుకున్నా. నా దరఖాస్తుని నిరాకరించదలుచుకుంటే వాళ్ళు ఇంకేదైనా కారణం చూపుతారు కదా…” అని జీషన్ ఆలీ తన నిరసన వ్యక్తం చేశాడు.

సారీ!

జీషన్ ఆలీ ఖాన్ అంతటితో ఊరుకోలేదు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ ఫేస్ బుక్ లో ఒక పేజీ తెరిచాడు. సదరు పేజీకి వెంటనే ప్రతి స్పందన లభించింది. అనేకమంది అతనికి సానుభూతి ప్రకటిస్తూ కంపెనీ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దానితో కంపెనీ నుండి జీషన్ కి మరో మెయిల్ వచ్చింది, సారీ చెబుతూ.

కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ నుండి ‘సారీ’ మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. “జెండర్, కులం, మతం మొదలైన అంశాల ఆధారంగా అభ్యర్ధుల పట్ల వివక్ష చూపడం కంపెనీ విధానం కాదని స్పష్టం చేస్తున్నాను. ఈ విషయంలో మిమ్మల్ని ఏమన్నా బాధపెట్టినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను” అని సదరు మెయిల్ లో సీనియర్ అధికారి మహేంద్ర ఎస్. దేశముఖ్ పేర్కొన్నారు. కంపెనీలో ఆయన అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ గానూ, హెచ్.ఆర్ హెడ్ గానూ పని చేస్తున్నారట.

దేశముఖ్ గారి ఈ మెయిల్ తమ మొదటి మెయిల్ నెపాన్ని కొత్తగా చేరిన ఉద్యోగి మీదకి నెట్టివేసింది. కంపెనీ చేసిన తప్పును ఒక చిన్న, కొత్త ఉద్యోగి చేసిన తప్పుగా కుదించివేసింది. “ఇలాంటి తప్పుడు ఈ మెయిల్ మా కొలీగ్ అయిన శ్రీమతి దీపిక టికే పంపింది. ఆమె ఇటీవలే కొత్తగా కంపెనీలో చేరారు. ఆమె ఇంకా ట్రయినింగ్ లోనే ఉన్నారు” అని కంపెనీ అధికారి మెయిల్ పేర్కొంది.

కంపెనీ విధానాన్ని కొత్తగా చేరిన ట్రయినీ ఉద్యోగి తప్పుగా చెప్పడం బొత్తిగా అర్ధం చేసుకోలేనిదిగా ఉంది. అసలు విషయం ఏమి ఉంటుందంటే కంపెనీ విధానాన్ని మర్యాదపూర్వకమైన సాకుల వెనుక దాచిపెట్టడం కొత్త ఉద్యోగికి చేతగాలేదు. ఆమెకు కంపెనీ విధానం అర్ధం అయింది గానీ దానికి ఒక మాస్క్ తొడిగి ప్రదర్శించాలన్న అవగాహన లేకుండా పోయింది, కొత్త ఉద్యోగి కనుక! సంస్ధలు/వ్యవస్ధలు చేసే తప్పుని కప్పిపుచ్చడానికి బలిపశువుని ఎంచుకుని వారిమీదికి నెట్టివేయడం మామూలు విషయమే.

జీషన్ అలీ ఖాన్ ఇప్పుడు నేషనల్ మైనారిటీస్ కమిషన్ కు ఫిర్యాదు చేసేందుకు ఉద్యుక్తుడు అవుతున్నట్లు తెలుస్తోంది. ముంబైలో ఒక పోలీసు స్టేషన్ లో ఎఫ్.ఐ.ఆర్ సైతం దాఖలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బహుశా అందుకే కంపెనీ నుండి విచారం వ్యక్తం అయి ఉండవచ్చు.

భారత దేశంలో భూస్వామ్య భావజాలంలో భాగమైన కుల, మతాలు ఆర్ధిక పునాది నుండి వైదొలగడానికి బదులు మరింతగా చొరబడుతున్నాయని ఈ ఘటన చాటుతోంది. పునాది ఆర్ధిక వర్గాలు ఏ మాత్రం మారలేదని అవి ప్రవేశించిన పెట్టుబడిలోనూ ప్రభావం చూపుతున్నాయని కూడా ఈ ఘటన చెబుతోంది. అర్ధ-భూస్వామ్య పునాదులపై భారత దళారీల, సామ్రాజ్యవాదుల పెట్టుబడి నిలబడి లబ్ది పొందుతున్న వాస్తవాన్ని జీషన్ ఆలీ ఖాన్ అనుభవం లేశమాత్రంగానైనా చాటిచెబుతోంది.

4 thoughts on “నువ్వు ముస్లింవి.. ఉద్యోగం ఇవ్వం ఫో!

  1. రతన్ టాటా హిందువు కాదు, అతను పార్సీ మతస్తుడు. భాజపా ఆహ్వానించే విదేశీ పెట్టుబడిదారుల్లో అయితే హిందువులు ఒక్కరు కూడా ఉండరు. ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రమే మతం అడ్డు రావడం ఒక జోకే.

    సరస్వతి శిశు మందిర్‌లో ముస్లింలకి ఉద్యోగాలు ఇవ్వరు కానీ ముస్లిం విద్యార్థుల్ని చేర్చుకుంటారు. నాకు తెలిసిన ఒక ముస్లిం సరస్వతి శిశు మందిర్‌లో చదివాడు. అతనికి ముస్లిం పండగలకి సెలవు ఉండేది కాదు.

  2. In North India, forward caste Hindus invite well-to-do Muslims to their weddings, but they do not invite Hindu dalits. Here the company owners seem to be much mangled. Therefore they denied job to a Muslim.

  3. ఈ దేశంలో ముస్లింలు 15% ఉన్నారు. అసలు ఇంతవరకు ఆ కంపనీలో మొత్తం ఉద్యోగులు ఎంతమంది. వాళ్ళలో ముస్లింలు ఎంతమంది లెక్కలు బయటకు తీయండి. అక్కడ ఇప్పటివరకు ముస్లింలకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఏ మాత్రం సిగ్గు శరం ఆ కంపనీ కి ఉన్నా ముస్లింలకు ఇవ్వవలసిన 15% ఉద్యోగాలు ఇచ్చి తన ప్రాతివత్యం (secular అని) నిరూపించుకోవాలి.

  4. ‘మొదులుకి లేదు మొగుడా అంటే, పెసర పప్పు పెళ్ళామా’ అన్నట్లుంది తమరి వెటకారం. సంపదల సమాన పంపిణీ ప్రభుత్వాల కర్తవ్యం అని సొ కాల్డ్ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యాంగంలో రాసుకున్నాయి. కొద్ది శాతం మంది చేతుల్లో భూములు, పరిశ్రమలు, ఉద్యోగాలు కేంద్రీకృతం చెయ్యడం అమలులో ఉన్న వాస్తవం. ఈ పరిస్ధితి మారాలంటే ఏమి చెయ్యాలో మీ లాంటి బుర్రలు ఎప్పటికీ ఆలోచించవు. ఇంకొకళ్ళ పేరు పెట్టుకుని వెటకారాలకి మాత్రం రెడీ. అదేదో గొప్ప పాతివ్రత్యం అయినట్లు!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s