నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ – 2 అధికారం చేపట్టి ఏడాది అవుతోంది. అవడానికి ఎన్.డి.ఏ పాలన అయినప్పటికీ ఆచరణలో ఇది పూర్తిగా బి.జె.పి పాలన. ఈ ప్రభుత్వంపై వాజ్ పేయి భరించిన కూటమి ఒత్తిళ్ళు ఏమీ లేవు. శివసేన లాంటి నోరుగలిగిన భాగస్వాములను సైతం తొక్కి పెట్టగలిగిన ఎన్.డి.ఏ-2 పాలన పూర్తిగా బి.జె.పి పాలనగా చెప్పుకున్నా తప్పు లేదు.
ఈ ఏడాది పాలన ఒట్టి గాలి కబుర్ల పాలనగా సాగిపోయిందని కార్టూనిస్టు సరిగ్గా చెప్పారు. ఇంకా చెప్పాలంటే మోడి ఏడాది పాలన స్వదేశీ, విదేశీ ప్రైవేటు పెట్టుబడులకు వనరులు, నిధులు అప్పగిస్తే, తమను గద్దె ఎక్కించిన సామాన్య భారతానికి మాత్రం నిధుల కోతలు, ధరల వడ్డింపులు, పధకాల రద్దులను కృతజ్ఞతగా ఇచ్చింది. ఇలాంటి కృతజ్ఞతను, కృతఘ్నత అంటారని తెలిసిందే.
విదేశీ పర్యటనలలో కూడా స్వదేశీ ప్రతిపక్షాన్ని తిట్టిపోసే వింత భారతీయతను దేశ ప్రధాని ప్రదర్శించడం గత 67 యేళ్లలో భారత ప్రజలు చూసి ఎరుగరు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతిపక్షం నిర్మాణాత్మక పోషిస్తుందన్న ప్రజాస్వామిక సూత్రాన్ని సైతం విస్మరించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో ప్రజలకు తెలియవలసి ఉంది. ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికి విదేశీ పర్యటనను కూడా వదలకపోవడం ఒక ఎత్తయితే ‘భారతీయులుగా గర్వించడాని’కీ ‘ఒక రాజకీయ పార్టీ పాలన’కూ ముడి పెట్టడం మరో ఎత్తు.
ఇటీవలవరకూ విదేశాల్లోని భారతీయులు స్వదేశంలోని పాలనను చూసి ‘ఇదేమి దేశం, ఇదేమి పాలన, ఇదేమి పరిస్ధితి’ అని ఈసడించుకుంటూ ‘ఛీ, భారతీయుడుగా జన్మించడం ఎంత ఘోరం!’ అని వాపోయారనీ, గత సంవత్సర కాలంగా కొత్త ప్రభుత్వం రావడంతో ‘హమ్మయ్య, భారతీయులుగా పుట్టినందుకు ఇక గర్వించవచ్చు’ అని సంబరబడుతున్నారని ప్రధాని మోడి చైనా పర్యటనలో ఎన్.ఆర్.ఐ ల సమావేశంలో అన్నారు.
‘దేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఉంటే మాకేమిటి? మా దేశభక్తి రాజకీయాలకు అతీతం’ అని ఎన్.ఆర్.ఐ లు చెప్పుకోగలరా లేదా అన్నది ఒక ప్రశ్న. #ModiInsultsIndia అనే హ్యాష్ టాగ్ నిన్న ట్రెండింగ్ టాపిక్ గా నిలిచిందని పత్రికలు చెప్పినప్పటికీ అది అలా ట్రెండ్ గా ఉండడానికి కారణం కాంగ్రెస్ మద్దతుదారులు లేదా కాంగ్రెస్ నేతలే అని బి.జె.పి సమర్ధకులు ఆరోపించినందున ఈ ప్రశ్న సందర్భోచితం అయింది.
వాక్ ద టాక్ (walk the talk) అన్నది ఆంగ్లంలో ఒక పదబంధం (phrase). సామెత (idiom) కూడా. ‘చేతలతో కూడిన మాటలు’ అని దీని అర్ధం. అనగా ఒట్టి మాటలు చెప్పడమే కాకుండా చెప్పిన మాటల్ని ఆచరణలు చేసి చూపడం. మోడి ఏడాది పాలనలో ఇది రివర్స్ అయిందని కార్టూన్ సూచిస్తోంది. చేతలు మాటల్ని రుజువు చేయడానికి బదులు చేతల్ని కూడా మాటలే ఆక్రమించాయని సూచిస్తోంది. ఆ విధంగా మాటలే అన్నీ అయినప్పుడు పాద ముద్రల జాడ పట్టుకోలేనంత సూక్ష్మ పరిణామంలో ఉంటాయని కార్టూనిస్టు సూచిస్తున్నట్లు కనిపిస్తోంది.
జనానికి ‘అచ్చే దిన్’ తెస్తానని హామీ ఇచ్చిన ప్రధాని మోడి మంచి రోజులను ధనిక వర్గాలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రజలకు మేలు చేసే పధకాలకు నిధులు కత్తిరించి మౌలిక నిర్మాణాల పేరుతో భారీ మొత్తాన్ని కంపెనీలకు అప్పగించే బడ్జెట్ ని రచించారు. చివరికి చిన్న పిల్లలకు పోషకాహార లోపాన్ని నివారించే పధకాలకు కూడా నిధులు కోత పెట్టడం వలన భారీ రాజకీయ మూల్యం చెల్లించుకోవలసిరావచ్చని మోడి కేబినెట్ లోని మంత్రి మేనకా గాంధీ యే గత ఏప్రిల్ లో హెచ్చరించడం బట్టి కార్టూన్ ఎంత వాస్తవమో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విధంగా మాటలగారడికి,మాయమాటలతో సాగించే పాలనకు ఏడాది గడిచిపోయింది.
సీతారాం ఏచూరి గారు అన్నట్లు మోదీగారు ఇంకా ఎన్నికల ప్రచారపర్వంలోనే ఉన్నట్లున్నారు!
ఢిల్లీలో తగిలినటువంటిదెబ్బ మిగతారాష్ట్రాలలో కూడా తగిలితే అప్పుడైనా మోదీగారి ఆలోచనలలో మార్పువస్తుందేమో!
లేకపోతే కుక్కతోకవంకరమాదిరిగా అలానే ఉంటారేమో,చూడాలి!
ఎన్.డి.ఏ-2 అంటే నేషనల్ డెమొక్రటిక్ అలియన్స్ కదా!
మీరు నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్-2 అన్నారేమిటి?
http://blog.marxistleninist.in/2015/05/narendra-modis-fan-before-his-admission.html