ఎన్.రామారావు:
ఈ మధ్య సిల్క్ రోడ్ అన్న పేరు తరచుగా వినిపిస్తోంది. ఆ పేరు ఎందుకు వచ్చింది? అంత విశిష్టత ఎందుకు?
సమాధానం:
ప్రాచీన నాగరికతలు విలసిల్లిన దేశాలలో చైనా, భారత ఉపఖండం, మెసపోటేమియా (ఇరాక్), గ్రీసు, రోమన్ (ఇటలీ)లు ముఖ్యమైనవి. చైనా నుండి ఈ ప్రదేశాలకు భూమార్గంలో అతి పొడవైన వాణిజ్య మార్గం ఉండేది. ఈ మార్గం గుండా జరిగే వాణిజ్యంలో సిల్క్ వాణిజ్యం భాగం ఎక్కువగా ఉండేది. దానిని దృష్టిలో పెట్టుకుని 1877లో జర్మనీ జియోగ్రాఫర్ ఫెర్దినాండ్ వొన్ రిష్తోఫెన్ ఈ వాణిజ్య మార్గానికి ‘సిల్క్ రోడ్’ అని పిలిచాడు. అప్పటి నుండి ఇది సిల్క్ రోడ్ గా ప్రసిద్ధి చెందింది. యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాల్లో సిల్క్ రోడ్ ఒకటి.
చైనాలో టెర్రాకొట్టా యుద్ధ వీరుల విగ్రహాలు బయల్పడిన గ్జియాన్ నుండి మొదలయ్యే సిల్క్ రోడ్ రోమ్ వరకూ విస్తరించి ఉండేది. మార్గ మధ్యంలో భారత ఉపఖండం, అరేబియా, పర్షియాలను కలుపుతూ ఐరోపా కేంద్రం అయిన రోమన్ సామ్రాజ్యం వరకు ప్రయాణించే సిల్క్ రోడ్ ఆనాటి ప్రధాన నాగరికతల సంస్కృతుల మధ్య వారధిగా పని చేసింది. ఒకరి సంస్కృతి గురించి మరొకరు తెలుసుకుని ఇతరులకు చెందిన కొన్ని సంస్కృతీ విలువలను స్వీకరించే క్రమానికి కూడా సిల్క్ రోడ్ బాటలు వేసింది.
చైనా కనిపెట్టిన నాలుగు గొప్ప ఆవిష్కరణలు ప్రపంచం అంతా విస్తరించింది సిల్క్ రోడ్ వల్లనే అంటే అతిశయోక్తి కాదు. కాగితం తయారీ, గన్ పౌడర్, ముద్రణ, దిక్సూచి (కాంపాస్)… ఈ నాలుగూ ప్రాచీన చైనా నాగరికత ఆవిష్కరణలు. ఈ ఆవిష్కరణల ఫలితాన్ని ప్రపంచం అంతా విస్తరించడానికి, ప్రపంచం మొత్తం అభివృద్ధి పధంలో ఒక్క గెంతు లాంటి పురోగతి సాధించడానికి దోహదపడింది కూడా సిల్క్ రోడ్డే.
ఆనాటి చాంగాన్ (ఇప్పటి గ్జియాన్) నుండి మొదలయిన సిల్క్ రోడ్డు హెక్సీ కారిడార్ ద్వారా దున్ హువాంగ్ కు వెళ్ళి అక్కడి నుండి మూడు దారుల్లో చీలి ఉండేది. దక్షిణ, మధ్య, ఉత్తర రోడ్లుగా ఈ చీలిన రోడ్లను పిలిచేవారు. స్వయంప్రతిపత్తి ప్రాంతం అయిన గ్జిన్ గియాంగ్ యుఘుర్ లో అనేక మార్గాలుగా విస్తరించి అక్కడి నుండి ఇప్పటి పాకిస్తాన్, ఇండియాలకు, మధ్యధరా సముద్ర తీరం రోమ్ వరకు వెళ్ళేది.
భూమార్గంలో వెళ్ళే సిల్క్ రోడ్ తో పాటు సముద్ర మార్గంలో వెళ్ళే వాణిజ్య మార్గాలకు కూడా సిల్క్ రోడ్ గా పిలిచేవారు. భూమార్గం లో వెళ్ళే సిల్క్ రోడ్ నుండి వేరుపరచడానికి 1960ల్లో జపాన్ స్కాలర్లు సముద్ర మార్గ సిల్క్ రోడ్ (Silk Road on the Sea) అని పిలవడం ప్రారంభించారు. సముద్ర సిల్క్ రోడ్ మార్గాలు రెండు. ఒకటి తూర్పు చైనా సముద్రం మీదుగా జపాన్ కు వెళ్తుంది. మరొకటి దక్షిణ చైనా సముద్రం గుండా హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి అక్కడి నుండి ఇండియాను చుట్టి అరేబియా సముద్రం గుండా పర్షియన్ అఖాతం తీరాన ఉన్న వివిధ దేశాలకు వెళ్తుంది.
సముద్ర మార్గ సిల్క్ రోడ్లు కూడా ప్రాచీన కాలం నుండి ఉన్నవే. తూర్పు చైనా సముద్ర సిల్క్ రోడ్ కు 3,000 యేళ్లకు పైగా చరిత్ర ఉన్నది. ఝౌ రాజవంశం కాలంలో తూర్పు చైనా సముద్ర సిల్క్ రోడ్ ప్రారంభం అయింది. టాంగ్ వంశ పాలనలో చైనాలోని జియాంగ్సు, ఝెఝియాంగ్ రాష్ట్రాల్లో తయారైన సిల్కును సముద్ర మార్గంలో నేరుగా జపాన్ కు ఎగుమతి చేయడం ప్రారంభించారు.
గువాంగ్ ఝౌ నుండి బయలుదేరే దక్షిణ చైనా సిల్కు రూటు లోనూ ప్రధానంగా చైనా సిల్కు, చైనా టీ లు రావాణా అయ్యేవి. దక్షిణ చైనా సముద్ర రూటును ప్రాచీన షిన్, హాన్ సామ్రాజ్యాలు వినియోగించాయి. 8వ శతాబ్దంలో పశ్చిమ, వాయవ్య చైనా అంతటా తీవ్ర స్ధాయిలో తిరుగుబాట్లు, యుద్ధాలు చెలరేగడంతో భూమార్గ సిల్క్ రోడ్ లో వాణిజ్యం ప్రమాదకరంగా మారింది. దానితో సముద్రమార్గ సిల్క్ రోడ్ లలో వాణిజ్యం అభివృద్ధి చెందింది. ఈ యుద్ధాలు, దారి దోపిడీల వల్లనే యూరోపియన్లు సైతం ఇండియాకు సముద్ర మార్గం కనిపెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ చరిత్ర అందరికి తెలిసిందే.
ప్రస్తుత చైనా అధ్యక్షుడు గ్జి జిన్ పింగ్ మేరీటైమ్ సిల్క్ రోడ్ (ఎం.ఎస్.ఆర్) పేరుతో పాత సముద్ర మార్గ సిల్క్ రూట్ ను పునరుద్ధరించేందుకు నడుం బిగించాడు. చైనాను సైనికంగా చుట్టుముట్టి అదుపులో ఉంచేందుకు అమెరికా ప్రకటించిన ‘ఆసియా-పివోట్ వ్యూహం’ ను తిప్పి కొట్టే కృషిలో భాగమే ఎం.ఎస్.ఆర్ అభివృద్ధి. ఎం.ఎస్.ఆర్ లో భాగంగా శ్రీలంక, పాకిస్తాన్, ఇరాన్ భూభాగాలపై రేవు పట్టణాలను అభివృద్ధి చైనా అభివృద్ధి చేస్తోంది. రేవు పట్టణాల నుండి ఆయా దేశాల లోపలి ప్రాంతాలకు రోడ్డు మార్గాలను కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఈ కార్యకలాపాలను తమకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవేనని భారత పాలకులు చెప్పుకుంటారు. ఈ నేపధ్యంలోనే ప్రధాని మోడి చైనా పర్యటన పశ్చిమ దేశాలకు కంటగింపు అయింది. చైనాకు మోడి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడాన్ని అమెరికా తప్పు పడుతూ పరోక్షంగా హెచ్చరిస్తోంది కూడా.