టెర్రాకొట్ట యుద్ధ వీరులు చైనాకు మాత్రమే ప్రత్యేకం. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో బతికిన మొట్ట మొదటి ఎంపరర్ షిన్ షి హువాంగ్ చనిపోయినపుడు ఆయనకు మరణానంతరం కూడా రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో తయారు చేసినవే టెర్రాకొట్ట యుద్ధ వీరుల విగ్రహాలు. ఈ విగ్రహాలను ఎంపరర్ తో కలిపి ఒక క్రమ పద్ధతిలో పూడ్చిపెట్టారు.
1974లో మొదటిసారి ఇవి రైతుల కంట బడ్డాయి. అనంతరం జాగ్రత్తగా తవ్వకాలు జరిపి కొన్ని విగ్రహాలను బైటికి తీసి మ్యూజియంలో భద్రపరిచారు. తవ్వి తీసినవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా విగ్రహాలు కప్పబడే ఉన్నాయి. తవ్వి తీసిన విగ్రహాలను ఇటీవల మమ్మీ-3 సినిమాలో వినియోగించుకున్నారు.
భారత ప్రధాని మోడి చైనా పర్యటనలో ఉన్నారు. తన పర్యటనలో ఆయన గ్జియాన్ లోని టెర్రాకొట్ట విగ్రహాల మ్యూజియంను సందర్శించారు. ఆయన మ్యూజియంను సందర్శించిన ఫోటోలను జాతీయ, అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.
ఈ నేపధ్యంలో గీసిన ఈ కార్టూన్ భారత కేంద్ర ప్రభుత్వం లోని మంత్రులు, ఇతర బి.జె.పి నేతల శక్తియుక్తుల పైన చేసిన వ్యాఖ్య. టెర్రాకొట్ట యుద్ధవీరులు ప్రాణం ఉన్నవారేమీ కాదు. వారు పుట్టకతోనే విగ్రహాలు. మరణించిన చక్రవర్తికి మరణానంతరం రక్షణ కల్పిస్తారన్న మూఢ నమ్మకంతో తయారు చేసిన బొమ్మలు.
ప్రధాని మోడి నాయకత్వంలోని మంత్రివర్గం, ఆయన లెఫ్టినెంట్ అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ నేతలు మోడికి కాపలా ఉన్న టెర్రాకొట్ట బొమ్మలతో సమానం అని కార్టూనిస్టు వ్యంగ్యీకరించారు. ప్రభుత్వం లోనూ, పార్టీ లోనూ మోడీకే సర్వాధికారాలు అప్పగించబడ్డాయని ఇతర నేతలు, మంత్రులు అందరూ ఉత్సవ విగ్రహాలు మాత్రమేనని సొంతగా నిర్ణయాలు చేయగల శక్తి వారి నుండి లాక్కోబడిందని కార్టూనిస్టు ఎత్తి చూపారు.
లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర జోషి లాంటి హేమాహేమీ నాయకులను తీసి పక్కనబెట్టి జూనియర్ నేతలను మంత్రులుగా, పార్టీ నేతలుగా ప్రమోట్ చేసిన మోడి-అమిత్ షా ద్వయం ఇతరులను డమ్మీలు చేశారన్నది మొదటి నుండీ వినవస్తున్న విమర్శ! ఆ విమర్శనే కార్టూనిస్టు మోడి చైనా పర్యటన సందర్భానికి ఇలా ఆపాదించారు.
జైట్లీ, వెంకయ్యనాయుడు లాంటి సీనియర్ నేతలు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ వారు మోడి మాట జవదాటేవారు కాదని కార్టూన్ పరోక్షంగా సూచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబాన్ని అంటిపెట్టుకుని బండి లాగించేస్తోంది. మోడికి అనంతరం బి.జె.పి పరిస్ధితి ఏమిటన్నది ఒక ఆసక్తికరమైన చర్చ.
కార్టూన్ లో వివిధ మంత్రులకు ఆపాదించిన భావాలు ప్రత్యేకంగా గమనించదగ్గవి. మోడి ప్రధాని మంత్రిత్వాన్ని మొదటి నుండీ సమర్ధిస్తూ వచ్చిన జైట్లీ మోడి వైపు మురిపెంగా చూస్తుంటే మోడి అదుపాజ్ఞలకు లొంగడం ఇష్టం లేదని పేరు పడ్డ రాజ్ నాధ్ సింగ్ మొఖం చిట్లించి తన పరిస్ధితి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా ఉన్నారు. అద్వానీ అనుచరిగా పేరు పడిన సుష్మా స్వరాజ్ ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేస్తున్నట్లు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారిది పైకి బింకం, లోపల అసంతృప్తి. బి.జె.పి మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కారీ మొఖంలో ఏ భావమూ లేదు. ఆయన ప్రాప్తకాలజ్ఞులు కదా!