నిజంగా చాలా అద్భుతమైన కార్టూన్. కాసిన్ని గీతల్లో ఎంతో విశాలమైన అర్ధాన్ని పొదిగిన ఇలాంటి కార్టూన్ లను చాలా కొద్ది మంది మాత్రమే గీయగలుగుతారు.
ఎందుకంటే ఇలాంటి అర్ధవంతమైన కార్టూన్ లు గీయాలంటే చరిత్ర జ్ఞానం కావాలి. ఒట్టి చరిత్ర జ్ఞానం ఉన్నా చాలదు. ఆ జ్ఞానం సరైన దిశలో చూస్తూ ఉండాలి. సమకాలీన పరిమాణాలపైనా, వర్తమానం లోని వివిధ రాజకీయ, ఆర్ధిక, సామాజిక ఘటనల పైనా తగిన పట్టు కలిగి ఉండాలి. అన్నీ కుదిరాక వాటిని సరైన దృక్పధంలో పెట్టగల నేర్పు ఉండాలి. అందుకే ఇలాంటివి కొందరు కార్టూనిస్టులకే సాధ్యం.
మోడి చైనా పర్యటనే అనేక అంశాల రీత్యా చాలా ప్రాధాన్యత ఉన్న పరిణామం. ఈ ప్రాధాన్యత చైనా ఆర్ధిక శక్తి వల్ల వచ్చింది కాదు. ఇండియా ఆర్ధిక అవసరాల వల్ల వచ్చింది కూడా కాదు.
కొన్ని ముఖ్యమైన చారిత్రక పరిణామాలు, ఘటనల వల్ల చైనా-ఇండియాల మధ్య నెలకొని ఉన్న అనుమానపూరిత వాతావరణం వల్ల వచ్చి చేరిన ప్రాధాన్యత అది.
ప్రధాని మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, దాని ముందరి జనసంఘ్ పార్టీ, ఈ పార్టీల మాతృ సంస్ధ ఆర్.ఎస్.ఎస్ లు కలిగి ఉన్న చారిత్రక, రాజకీయ, తాత్విక భావజాలాల రీత్యా మోడి చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతే కాదు. ఒకప్పుడు చైనా కమ్యూనిస్టు దేశం కావడం మూలాన, చైనా కమ్యూనిస్టు దేశమే అని హిందూత్వ సంస్ధలు ఇప్పటికీ భావిస్తున్నందున కూడా మోడి చైనా సందర్శనకు ప్రత్యేకత వచ్చి చేరింది.
కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యతిరేకించే, నిజానికి ద్వేషించే ఆర్.ఎస్.ఎస్/హిందూత్వ సంస్ధలు, ఆ సంస్ధల నుండి రాజకీయ జన్మ పొందిన నరేంద్ర మోడిల రాజకీయ భావజాలంలో కమ్యూనిస్టు చైనా వ్యతిరేకత ఒక ముఖ్యమైన భాగం.
అందువల్ల చైనాతో స్నేహం చేసినందుకు నెహ్రూని, చైనా సరిహద్దు వివాదం, నీటి పంపకం వివాదాల రీత్యా కాంగ్రెస్ ను పడదిట్టి పోసే బి.జె.పి మరియు మోడీలు తీరా అధికారంలోకి వచ్చాక అదే చైనాను ఆబగా కావలించుకుంటున్న తీరు వల్ల కూడా మోడి చైనా పర్యటనకు ప్రాధాన్యత ఉన్నది.
చైనాపై సకల విధాలుగా వ్యతిరేకత, ద్వేషం అటు తమ కార్యకర్తల్లోనూ, ఇటు ప్రజానీకంలోనూ పోగు చేయడమే కాకుండా తమ ఓటు బ్యాంకు రాజకీయాల్లోనూ ఆ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే బి.జె.పి మరియు మోడీలు అధికార తీరం చేరాక చైనా వ్యతిరేకతను తీసుకెళ్లి దక్షిణ చైనా సముద్రంలో కలిపేస్తుంటే అంతకు మించిన వార్త ఏమి ఉంటుంది?
జనంలో చైనా వ్యతిరేకతను పెంచి పోషించిన బి.జె.పి, మోడిలు చైనా పర్యటనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ ను సైతం చైనా నూడుల్స్ తరహాలో నమిలి మింగేశారని కార్టూనిస్టు ప్రతిభావంతంగా చూపారు.
ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటే ఇక్కడ చైనా-ఇండియాల మధ్య నెలకొని ఉన్న ఘర్షణ వాతావరణం. ఈ వాతావరణాన్ని మరింత చిక్కన కావించి గోడను ఇంకా బలవత్తరం కావించిన బి.జె.పి, మోడిలు చైనా నూడుల్స్ భుజించడం ద్వారా తాము శక్తివంతం చేసిన గోడను తామే పగలగొడుతున్నారని కార్టూనిస్టు చూపారు.
ఈ కార్టూన్ లో వ్యంగ్యం ఉంది. అదే పాటున మెచ్చుకోలు కూడా ఉంది.
కార్టూన్ లో చరిత్ర దాగి ఉంది. దేశీయ రాజకీయం ఉన్నది. దశాబ్దాల నాటి భారత విదేశీ విధాన నేపధ్యం ఉన్నది. తాత్విక ఘర్షణను ఎత్తి చూపడమూ ఉంది.
తమ పునాదిగా చెప్పుకునే హిందూత్వ, తమ ఆర్ధిక వర్గ ప్రయోజనాల ముందు వెలతెలా పోవలసిందేనన్న తాత్విక స్మరణ, ఎత్తిపొడుపూ దాగి ఉన్నాయి.
విమర్శ ఉంది, పరామర్శ ఉంది, పొగడ్త ఉంది, తెగడ్త ఉంది. ప్రాప్తకాలజ్ఞతపై ఎక్కుపెట్టిన బాణమూ ఉన్నది. కేశవ్ గారికి అభినందనలు!
నిజమే సార్ ..మీరు వివరించాక ఈ కార్టూన్ లో చాలా విషయం ఉందని తెలుస్తోంది. ఇక్కడో సందేహం. మీరు ఒక్క హిందూ వే కాకుండా మిగతా పేపర్ల కార్టూన్ లను కూడా పరిశీలించగలరు
చందుతులసి గారూ మీ సూచన గమనంలో ఉంచుకుంటాను.