దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కితే రాళ్ళు పడతాయ్!


Dalit groom Pavan Malaviya with helmet protection!

Dalit groom Pavan Malaviya with helmet protection!

రిజర్వేషన్లు ఇంకానా? అని ప్రశ్నించే అమాయకోత్తములకు తామున్న బావి నుండి బైటికి వచ్చి లోకం చూడాలని పిలుపు ఇచ్చే ఘటన ఇది! దళిత కులానికి చెందిన ఓ పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి ఊరేగేందుకు వీలు లేదని శాసించిన ఉన్నత కులాలు తమ శాసనాన్ని మీరినందుకు రాళ్ళతో దాడి చేశారు. గుర్రాన్ని లాక్కెళ్ళారు. మరో గుర్రం తెచ్చుకున్న పెళ్లి కొడుకు రక్షణ కోసం పోలీసులు అతని తలకి హెల్మెట్ తొడగడం బట్టి దేశంలో కుల రక్కసి ఇంకా ఎలా విలయతాండవం చేస్తున్నదో అర్ధం చేసుకోవచ్చు.

మధ్య ప్రదేశ్ లో రత్లాం జిల్లాలోని నేగ్రాన్ గ్రామంలో జరిగిందీ దారుణం. సో కాల్డ్ ఉన్నత కులస్ధులు జరిపిన రాళ్ళ దాడిలో అదనపు తాసీల్దారుతో పాటు స్ధానిక తాల్ పోలీసు స్టేషన్ అధికారి సైతం గాయపడ్డారు. పెళ్లి కొడుకు ఊరేగింపుకు పోలీసులు రక్షణ కల్పించినప్పటికీ, రెవిన్యూ యంత్రాంగం కూడా సహాయం వచ్చినప్పటికీ కుల అహంకారం మరింత పేట్రేగిపోయిందే తప్ప వెనక్కి తగ్గలేదు.

మే 10 తేదీ రాత్రి జరిగిన పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు పవన్ బంధువులు తమ వరుడిని గుర్రం ఎక్కించి ఊరేగించాలని ముచ్చటపడ్డారు. అందుకోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ గ్రామంలోని అగ్ర కులాల వారికి ఈ సంగతి తెలిసింది. వాళ్ళ కులాహంకారం ఆ వార్తను ఒక పట్టాన మింగలేకపోయింది. దళిత పెళ్లి కొడుకూ గుర్రం ఎక్కి ఊరేగితే అతనికీ తమ పెళ్లి కొడుక్కీ తేడా ఏం ఉంటుందన్న ప్రశ్న నాగుపాములా బుసకొడుతూ వారి ముందు నిలబడింది.

దానితో పెళ్లి కొడుకు తండ్రి పూరా లాల్ కు అగ్రకులాల వాళ్ళు కబురు పంపారు. పెళ్లి కొడుకు గుర్రంపైన ఊరేగడానికి వీలు లేదని ఆదేశించారు. లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అగ్ర కులస్ధుల ఆదేశాలతో కీడు శంకించిన దళిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈసారి సానుకూలంగా స్పందించారు. పెళ్ళికి మూడు రోజుల ముందే గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు.

పోలీసులు అగ్ర కుల పెద్దలు, పెళ్లి కొడుకు కుటుంబానికి మధ్య చర్చలు జరిపి మధ్యే మార్గం వెతికే ప్రయత్నం చేశారు. దళితులు వెనక్కి తగ్గలేదు. చట్టాల గురించి పోలీసులు వివరించి చెప్పడంతో  చివరికి ఒక ఏర్పాటుకు అగ్ర కులాల ప్రజలు అంగీకరించారు. దాని ప్రకారం పెళ్లి కొడుకు గుర్రం ఎక్కి ఊరేగుతాడు. అయితే గుర్రం తమ ఇళ్లమీదుగా వెళ్ళేటప్పుడు అగ్ర కులస్ధులు తమ ఇళ్ల తలుపులు వేసేసుకుంటారు. ఒక దళితుడు తమ ముందే గుర్రం ఎక్కి ఊరేగడమా అన్న అహంతో వాళ్ళు తమపై తాము విధించుకున్న స్వయం నిషేధం అన్నమాట! దళితులు సరే అన్నారు. తమ ఊరేగింపును చూసి తీరాలని మరొకరిని బలవంతపెట్టలేమన్న జ్ఞానం వారికి ఉన్నది మరి!

ఈ ఒప్పందం జరిగినా దళితులకు అనుమానాలు పీడిస్తూనే ఉన్నాయి. పోలీసులు రక్షణ ఉన్నప్పటికీ ఏం జరుగుతుందో అని వారు భయపడుతూనే ఉన్నారని పెళ్లి కొడుకు తండ్రి మాటల్లో తెలుస్తుంది. “సమస్య ఎదురు కావచ్చన్న అనుమానంతో మేము పోలీసులకు సమాచారం ఇచ్చాము. దానితో వారు తమ బలగాలతో వచ్చారు. ఊరేగింపు ప్రశాంతంగా జరిగేలా చూసేందుకు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, ఎస్.డి.ఓ.పి (సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్) లు కూడా వచ్చి బందోబస్తు నిర్వహించారు. అయినా మమ్మల్ని అనుమానాలు పీడిస్తూనే ఉన్నాయి. చివరికి అనుమానించినట్లుగానే జరిగింది” అని పూరా లాల్ చెప్పారని పత్రికలు తెలిపాయి.

Dalit groomపోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ, ఒప్పందానికి వచ్చినప్పటికీ అగ్రకులాల వాళ్ళు ఊరేగింపు వద్దకి వచ్చి తగాదా పడ్డారు. కొందరు పెళ్లి కొడుకుపైకి రాళ్ళు విసిరారు. అంతటితో ఆగకుండా గుర్రాన్ని బలవంతంగా లాక్కుపోయారు. ఎన్.డి.టి.వి ప్రకారం అగ్ర కులస్ధులు గుర్రం యజమానిని ముందే హెచ్చరించారు. గుర్రం ఇవ్వొద్దని గట్టిగా చెప్పారు. బహుశా ఈ సంగతి తెలుసుకుని మరో గుర్రాన్ని పెళ్లి వారు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. గుర్రాన్ని లాక్కెల్లిన తర్వాత మరో గుర్రంతో ఊరేగింపు మొదలు పెట్టారు.

ఊరేగింపు అగ్రకులాల ఇళ్ల వద్దకు చేరగానే పెళ్లి కొడుకు పైకి మళ్ళీ రాళ్ళ వర్షం మొదలయింది. ఈ రాళ్ళు తగిలి పెళ్లి బృందంలో ఉన్న పలువురికి గాయాలయ్యాయి. పోలీసులూ గాయపడ్డారు. దానితో పోలీసులు పెళ్లి కొడుకు రక్షణకు నడుం బిగించారు. నారింజ రంగులో అతను తయారు చేసుకున్న తలపాగా తీసేసి హెల్మెట్ తొడిగారు. ‘ఇక పద, ఎవరేం చేస్తారో చూద్దాం!’ అన్నట్లుగా పోలీసులు వెంట రాగా ఊరేగింపు భయం భయంగా ముందుకు కదిలి వెళ్లింది.

అనంతరం పెళ్లి కొడుకు తండ్రి టాల్ పోలీసు స్టేషన్ కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చారు. తాసీల్దారుతో సహా అయిదుగురికి రాళ్ళ గాయాలు అయ్యాక పోలీసులకు కూడా అది పరువు సమస్య. ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు 72 మందిని (ఎన్.డి.టి.వి) అరెస్టు చేశారని కొన్ని పత్రికలు చెబుతుండగా, కొన్ని పత్రికలు ఆ సంఖ్యను 27 గా (ఐ.బి.ఎన్ లైవ్) చెబుతున్నాయి. 72 మందిపై కేసు పెట్టి ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారని ది హిందు తెలిపింది. అమెరికా పత్రిక ద హఫింగ్టన్ పోస్ట్ ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది.

దళిత పెళ్లి ఊరేగింపుపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదు. గత ఫిబ్రవరిలో నైతే ఏకంగా దేశ రాజధానిలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. బగ్గీ ఎక్కి ఊరేగుతున్న ఒక దళిత పెళ్లి కొడుకును జాట్ లు కిందికి ఈడ్చి చితకగొట్టారు. అప్పటిదాకా కారులో వస్తున్న పెళ్లి కొడుకును అందరూ చూసేందుకు అన్నట్లుగా కారు దింపి గుర్రపు బగ్గీ ఎక్కించారు.

ఇంతలోకే ఎక్కడ నుంచి ఊడిపడ్డారో ఇద్దరు జాట్ కులస్ధులు బగ్గీ పైకి లంఘించి రోడ్డు మీదికి లాగి బూతులు తిడుతూ కొట్టడం మొదలు పెట్టారు. కులం పేరుతో తిడుతూ ‘ముందు నువ్వు మురుగు కాలవలు శుభ్రం చెయ్యి. ఆ తర్వాతే నీకు పెళ్లి చేసుకునే అర్హత!’ అని తిట్టారు. ‘దళితులకి బగ్గీలో ఊరేగే అర్హత లేదని’ అరిచారు. వారు పెళ్లి కొడుకును కొడుతుండగా బంధువులు వచ్చి పెళ్లి కొడుకును రక్షించవలసి వచ్చింది.

ఈ దారుణం జరుగుతుండగానే పెళ్లి బృందం వాళ్ళు ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు. పదే పదే ఫోన్ చేసినా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ తప్పుకున్నారు గానీ పెళ్లి ఊరేగింపు వద్దకి రాలేదు. పోలీసులకు చెందిన పి.సి.ఆర్ వ్యాన్ అటుగా వచ్చింది. వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ‘ఇది బీటు కానిస్టేబుల్ చూడాల్సిన వ్యవహారం’ అని చెప్పి వారు చక్కా పోయారు. దక్షిణ ఢిల్లీలోని మైదాన్ ఘరిలో పెళ్లి జరగ్గా ఊరేగింపు పక్కనే ఉన్న పోష్ లోకాలిటీ ‘సైనిక్ ఫార్మ్స్’ లోకాలిటీ లోకి ప్రవేశించడం జాట్ వ్యక్తులకు నచ్చలేదు.

ఆ తర్వాత ఫిర్యాదు తీసుకోక తప్పని పరిస్ధితి వచ్చాక ‘రాజీ పడాలని’ పోలీసులు ఒత్తిడి తెచ్చారు. పెళ్లి కొడుకు సుమిత్ సింగ్ కుటుంబం అందుకు నిరాకరించారు. దానితో ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీస్ కేసు నమోదు చేశారు. జాట్ సోదరుల గొడవ వల్ల సుమిత్ పెళ్లి ఆలస్యంగా జరిగింది. ఈ గొడవ వల్ల పెళ్లి కొడుకు బృందాన్ని పెళ్లిలో కొనసాగించడానికి పెళ్లి కూతురు తరపువారు నానా అగచాట్లు పడవలసి వచ్చింది. కులాధిపత్యంలో మళ్ళీ మగాధిపత్యం అన్నమాట! ‘బానిసకొక బానిసవోయ్ బానిసా!’ అని స్త్రీలను ఉద్దేశించి శ్రీ శ్రీ అన్నారంటే అనరూ!

ఢిల్లీ ఒక కార్పొరేట్ నగరం. ఈ దేశ రాజధాని నగరం. కాగా నేగ్రాన్ ఢిల్లీకి వేల కిలో మీటర్ల ఆవల మధ్య ప్రదేశ్ లోని ఒక కుగ్రామం. రెండు చోట్లా ఒకే పరిస్ధితి! గ్రామం ఢిల్లీకి వచ్చిందా లేక ఢిల్లీయే గ్రామాన్ని దాటి రాలేదా? భారత దేశంలో కులం బాగా బలహీనపడింది అని బోధిస్తున్న పెద్దలు ఆలోచించవలసిన ప్రశ్న ఇది!

4 thoughts on “దళిత పెళ్ళి కొడుకు గుర్రం ఎక్కితే రాళ్ళు పడతాయ్!

  1. Vyasam lo modati line mee bhava avesaani , chuvanistic bhavalanu pratibibhisthunnai. Desam lo Reservation ki, jarigina sanghatanaku polika undha? Reservation ni konasaginchadam valana ilanti sanghatanalu punravrutham kakunda untaya? Reservation vallane ee amasya ki parishakaram dorkuthundi ante mari inni samvatsaralu lo reservation valla jarigina marpemi. ??? Labham ledhu kada prathibhavanthluku pedhalaku nijamga reservation avasaram ayina dalitha januluku poorthi anyayam jaruguthunnadi. Ilanti samsayalaku kavalsindi samijika paripakvatha kani rrservation valla idhi parishkaram avuthunda mire alochinchandi. Vyasam lo mee uddheshalu bagunnappatiki amayakotthamuli ani varninchadam chala badhakaram. Prabuthva udyagallo , parlamentu ichina reservation lu valla aardhikam ga abhivruddi chendina dalithule malli labdi ponduthunna thapithe, vuri chivara dalithawadalu inka alage unnayi

  2. ఉద్యోగానికి ఇంతర్వ్యూకి వెళ్ళినప్పుడు వి.వి.గిరి ఇంటి పేరు, ఇందిరా గాంధీ పుట్టిన తేదీ వగైరా సంబంధం లేని ప్రశ్నలు అడుగుతారు. జి.కె. పుస్తకాలు కొనుక్కుని చదివే డబ్బున్నవాళ్ళ పిల్లలకే అవి తెలుస్తాయి కానీ దళితుల పిల్లలకి అవి తెలియవు. నిరుద్యోగుల్ని ఫూల్ చేసే విధానాలు పోయినా చాలా మంది దళితులకి ఉద్యోగాలు వస్తాయి.

  3. మన తెలుగు బ్లాగుల్లోనే ఒకాయన డబ్బున్నవాళ్ళ పిల్లలు రిజర్వేషన్‌లు ఉపయోగించుకోవడాన్ని సమర్థించాడు. “నీకు లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తే వద్దంటావా? అటువంటప్పుడు మీ నాన్నకి ఉద్యోగం ఉంది కదా అని నువ్వు రిజర్వేషన్ ఎలా వదులుకుంటావు?” అని నన్ను అడిగాడు. మన విశేఖర్ గారే ఓ సారి అన్నారు “నీతి అనేది కులాన్ని బట్టి ఉండదు. అగ్రకులాలవాళ్ళు రిజర్వేషన్‌లని ఎందుకు వ్యతిరేకిస్తారో, డబ్బున్న దళితులు కూడా క్రీమీలేయర్ అమలుని అందుకే వ్యతిరేకిస్తారు” అని. ఇంతా తెలిసిన తరువాత రిజర్వేషన్ వ్యవస్థని కొనసాగించాలనే తపన అనవసరం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s