అక్రమ ఆస్తుల కేసులో నిర్దోషిగా జయలలిత బైటకు వచ్చేశారు. ఇప్పుడామె మళ్ళీ ఎన్నికల్లో గెలిచినంత సంబరాలు తమిళనాడులో జరుగుతున్నాయి. ఈ సంబరాల్లో జయలిత అభిమానులు మునిగిపోతే ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా, చివరికి సి.పి.ఐతో సహా, జయలలిత అభిమానుల ఆనందంలో భాగం పంచుకోవడమే విచిత్రం. ప్రధాని మోడి సైతం ఆమెకు అభినందనలు తెలిపారట!
ట్రయల్ కోర్టు తీర్పును కొట్టివేస్తూ కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పు ఒక వింత సంగతిని బైటికి తెచ్చింది. అదేమిటంటే ఎవరైనా సరే, తమ ఆదాయంలో 10 శాతం మొత్తాన్ని అక్రమ ఆస్తిగా కలిగి ఉండవచ్చు. లేదా తమ ఆదాయంలో 10 శాతానికి మించకుండా అక్రమంగా ఆస్తుల్ని కూడబెట్టుకోవచ్చు. ఇలాగని గతంలో సుప్రీం కోర్టు ఓ సారి తీర్పు ఇచ్చిందట!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఓసారి ఒక వ్యక్తి ఆదాయంలో ఆ వ్యక్తికి ఆపాదించబడిన అక్రమ ఆస్తి 20 శాతం దాటకపోతే అది అక్రమ ఆస్తిగా పరిగణించకూడదని ఎప్పుడో ఒక సర్క్యులర్ జారీ చేసిందట. ఈ రెండు అంశాల ప్రాతిపదికన “జయలలిత నిర్దోషిగా విడుదల అయేందుకు అర్హురాలు” అని కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పింది.
ఈ లెక్కన ఎంత ధనవంతుడైతే అంత మొత్తంలో అక్రమ ఆస్తుల్ని కూడబెట్టుకోవచ్చు. అక్రమ ఆస్తులు అంటే ఆ ఆస్తి ఎలా వచ్చిందో ప్రభుత్వానికి/ఆదాయ పన్ను శాఖకు లెక్కలు ఇవ్వలేని ఆస్తి. కోర్టు తీర్పు ప్రకారం ఎవరికైనా 100 కోట్ల ఆదాయం ఉంటే ఆ వ్యక్తి 10 కోట్లు అక్రమ ఆస్తి కలిగి ఉండొచ్చు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సర్క్యులర్ ప్రకారం అయితే అదే వ్యక్తి 20 కోట్ల మేర అక్రమ ఆస్తి కూడబెట్టవచ్చు. ఆ 10/20 కోట్ల జోలికి ఆదాయపన్ను శాఖ రాకూడదు. ఒకవేళ వస్తే కోర్టులు ‘ఆదాయంలో 10 శాతం కంటే తక్కువే ఉంది కదోయ్!’ అని మొట్టికాయ వేస్తాయి.
కేసును విచారించిన కర్ణాటక హై కోర్టు జడ్జి జస్టిస్ సి.ఆర్.కుమార స్వామి తన 919 పేజీల తీర్పులో జయలలిత అక్రమ ఆస్తి కలిగి ఉన్నప్పటికీ ఆమె నిర్దోషి ఎలా అవుతారో చెప్పడానికే ప్రధాన భాగం కేటాయించినట్లు కనిపిస్తోంది. కోర్టులు ఉన్నది దోషిత్వాన్ని కనిపెట్టడానికా లేక నిర్దోషిత్వాన్ని కనిపెట్టడానికా అన్న ధర్మ సంకటం కర్ణాటక హై కోర్టు తీర్పు వల్ల కలుగుతోంది.
“నిందితుల ఆస్తులు, సంస్ధలు, కంపెనీల ఆస్తులన్నింటిని ట్రయల్ కోర్టు కలిపేసింది. రు. 27,79,88,945 ల నిర్మాణ వ్యయాన్ని కూడా ఆదాయం కింద జమ కట్టింది. రు. 6,45,04,222 ల వివాహ ఖర్చులను కూడా ఆస్తుల కింద లెక్క కట్టింది. ఫలితంగా మొత్తం ఆస్తి రు. 66,44,73,573 లు గా తప్పుగా లెక్క వేసింది” అని హై కోర్టు తీర్పు పేర్కొంది.
“ఎక్కువ చేసి చూపిన నిర్మాణ వ్యయం విలువ, వివాహ ఖర్చులను తొలగించినట్లయితే ఆస్తుల విలువ రు. 37,59,02,466 లు గా తేలుతుంది. నిందితుల, సంస్ధల మరియు కంపెనీల మొత్తం ఆదాయం రు 34,76,65,654 లు. కనుక ఆదాయంతో సరిపోలని ఆస్తి మొత్తం కేవలం రు 2,82,36,812 లు. ఆదాయానికి మించిన ఆస్తుల పర్సెంటేజీ 8.12 శాతం. ఇది సాపేక్షికంగా చాలా చిన్న మొత్తం” అని కోర్టు తీర్పు విశ్లేషించింది. జయలలిత, ఆమె సంస్ధలు కంపెనీల మొత్తం ఆదాయంలో అక్రమ ఆస్తి 10 శాతం కంటే తక్కువే కనుక ఆమె నిర్దోషిగా విడుదల అయేందుకు అర్హురాలు అని హై కోర్టు తేల్చేసింది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే జయలలితకు చెందిన రు. 2.82 కోట్ల ఆస్తి అక్రమ ఆస్తి అని హై కోర్టు కూడా నిర్ధారించింది. కానీ అక్రమ ఆస్తి ‘సాపేక్షికంగా చిన్న మొత్తం’ కాబట్టి ఆమె నిర్దోషి అని తేల్చింది. ఆమె అసలు అక్రమంగా ఎలాంటి ఆస్తీ సంపాదించలేదు కనుకనో లేదా ట్రయల్ కోర్టు అక్రమంగా తేల్చిన ఆస్తి సక్రమమే అని రుజువు అయింది కనుకనో జయలలిత నిర్దోషి కాదు. కేవలం ఆ అక్రమ ఆస్తి ఆదాయంలో 10 శాతం కంటే తక్కువగా ఉంది కనుక ఆమె శిక్ష తప్పించుకునేందుకు అర్హురాలు అని కోర్టు అభిప్రాయపడింది. భారత ప్రజాస్వామ్య వ్యవస్ధలో కోర్టులు సైతం ధనికుల పక్షమే అని చెప్పడానికి ఇంకా ఏమి రుజువులు కావాలి?
హిందు కార్టూన్ జయలలిత కేసుకు చక్కగా సరిపోతుంది.
భారతదేశ ఉన్నత న్యాయస్థానాలు సామాన్యుల కళ్ళుతెరిపిస్తున్నాయి-మొన్న సల్మాన్ కేసులో,నిన్న జయలలిత కేసులో బహుషా రేపు జగన్ కేసులోకూడా ఇదే జరగవచ్చునేమో!
ప్రముఖ దళితవాద రచయిత కలేకూరి ప్రసాద్ గారు అన్నారు “చట్టం ముందు అందరూ సమానులే కానీ వ్యక్తులు వ్యవస్థకి అతీతులు కారు” అని. SC/ST Atrocity కేస్‌లలో నిందితులందరినీ కావాలని వదిలేసిన ఒక Atrocities Special Court న్యాయమూర్తిని ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు ఇవి.