జర్మనీ: రోబోట్ల వల్ల 1.8 కోట్ల ఉపాధి హుళక్కి!


పారిశ్రామికంగా అత్యంత అభివృద్ధి చెందిన దేశం జర్మనీలో రోబోట్ల భయం కొత్తగా వచ్చి చేరుతోంది. ఇప్పటికే పలు రంగాల్లో రోబోట్ల చేత పని చేయించుకుంటున్న జర్మనీ పరిశ్రమలు ప్రజల ఉపాధిని హరించివేస్తున్నాయి. రోబోట్ టెక్నాలజీ దినదినాభివృద్ధి చెందుతుండడంతో జర్మనీ ఉద్యోగాలలో 18 మిలియన్ల మేర రోబోట్లు ఆక్రమిస్తాయని ఐ.ఎన్.జి-డిబా నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

జర్మనీలో పూర్తి కాలం ప్రాతిపదికన గానీ పార్ట్ టైమ్ ప్రాతిపదికన గానీ మొత్తం 30.9 మిలియన్ల మంది (3.09 కోట్లు) వివిధ రంగాలలో ఉపాధి పొందుతుండగా వారిలో 18 మిలియన్ల మంది రోబోట్ల వల్ల ఉపాధి కోల్పోతారని అధ్యయనం తెలిపింది. అనగా మొత్తం ఉపాధిలో 59 శాతాన్ని రోబోట్లు హరించివేస్తాయన్నమాట!

రోబోట్లు అనగానే అచ్చంగా మెకానికల్ గా పని చేసే మర మనుషులు మాత్రమే కాదు. కంప్యూటర్ టెక్నాలజీ, ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి రోబోట్లను మరింత సమర్ధవంతంగా తయారు చేయడానికి దోహదం చేస్తోంది. మర మనుషులను సాఫ్ట్ వేర్ ను జమిలిగా ఉపయోగించి మనుషులకు పోటీగా, మనుషుల కంటే మిన్నగా కూడా రోబోట్లను తయారు చేయగల పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.

సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి కొత్త కొత్త పుంతలను తొక్కుతున్న నేపధ్యంలో రోబోట్లు శారీరక శ్రమల స్ధానంలో మాత్రమే ప్రవేశపెట్టే పరిస్ధితి కాదు. మెదడు ఉపయోగించి చేసే పనులకు కూడా రోబోట్లను అభివృద్ధి చేస్తున్నారు. జర్మనీ ఈ రంగంలో అన్ని దేశాలకంటే ముందున్నట్లు సమాచారం.

ఉదాహరణకి ఆఫీసులో కూర్చొని చేసే పనులను కూడా రోబోట్లు చేయగల పరిస్ధితి వస్తోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్యాధునిక కార్ల కంపెనీలు వోక్స్ వ్యాగన్, బి.ఎం.డబ్ల్యూ లు తమ కార్మికులు, పాలనా సిబ్బంది స్ధానంలో రోబోట్లు ప్రవేశపెట్టే శక్తివంతమైన అల్గారిధమ్స్ ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ఆధునికమైన యంత్రాలలో మానవ మెదడును తలదన్నే సాఫ్ట్ వేర్ ను ప్రవేశపెట్టి మనుషుల కంటే వేగంగా, సమర్ధవంతంగా పని చేయించగల పరిజ్ఞానాన్ని ఈ కంపెనీలు అభివృద్ధి చేశాయి.

అధ్యయనం ఒక్క జర్మనీకి మాత్రమే పరిమితం కాలేదు. ఫిన్లాండ్, నెదర్లాండ్స్… ఇంకా ఇతర యూరోపియన్ దేశాలలోనూ అధ్యయనం జరిగింది. అయితే వాటన్నింటిలోనూ అత్యంత ఘోరమైన స్ధాయిలో ఉపాధి కోల్పోయే పరిస్ధితి జర్మనీలోనే ఉన్నదని అధ్యయనం తెలిపింది. శక్తివంతమైన పారిశ్రామిక రంగం జర్మనీ కలిగి ఉండడమే దానికి ప్రధాన కారణం.

జర్మనీలో చివరికి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ పోస్టులను కూడా రోబోట్లే నిర్వహించనున్నాయి. సెక్రటరీ, సెక్రటరీ తరహా పోస్టులలో దాదాపు అన్నింటినీ రోబోట్లు ఆక్రమిస్తాయని అధ్యయనం తేల్చింది. మెకానిక్కులు, మెషీన్ డ్రైవర్లు, మెకానికల్ టెక్నీషియన్లు మొదలైన శారీరక శ్రమల రంగంలో 2/3 వంతు ఉపాధిని రోబోట్లు లాగేసుకుంటాయి.

అయితే డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదని తెలుస్తోంది. డాక్టర్ల పనిని రోబోట్లు ఎలాగూ చేయలేవు. విద్యా రంగంలో 4 మిలియన్ల మంది ఉపాధి పొందుతుండగా వారిలో అర మిలియన్ మాత్రమే ఉపాధి కోల్పోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నత స్ధానాల్లో ఉన్నవారికి కూడా రోబోట్ల వల్ల పెద్దగా భయం లేదుట. ఈ స్ధానాల్లో ఉన్న 1.4 మిలియన్ ఉద్యోగుల్లో 160,000 మంది ఉపాధి కోల్పోతారని అధ్యయనం అంచనా వేసింది.

అయితే గియితే తక్కువ మంది ఉపాధి కోల్పోవడమే తప్ప అసలు రోబోట్ల వల్ల ప్రభావితం కానీ రంగమే లేదని అధ్యయనంలోని అంశాలను బట్టి తెలుస్తోంది.

అధ్యయన నివేదికను రూపొందించిన కారస్టెన్ బ్రిజెస్కీ ప్రకారం మానవ ఉపాధిని రోబోట్లు స్వాధీనం చేసుకునే క్రమం ఇప్పటికే ఆరంభం అయిపోయింది. “టేకోవర్ ఇప్పటికే మొదలైంది. రోబోట్లే పూర్తి ఉపాధిని ఆక్రమించిన పారిశ్రామిక రంగాలు ఇప్పటికే ఉనికిలోకి వచ్చాయి” అని బ్రిజెస్కీ తెలిపాడు.

ఆసియాలో కూడా రోబోట్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోందని అధ్యయనం తెలిపింది. అయితే ఇది జపాన్, చైనాల లోనే ప్రధానంగా కేంద్రీకృతం అయి ఉంది. ఉదాహరణకి తోషీబా కంపెనీ అచ్చం మనుషులు లాగానే కనపడే రోబోట్లను సెక్రటరీ పోస్టుల కోసం అభివృద్ధి చేసింది. గత ఏప్రిల్ నెల నుండి అవి పనిలోకి చేరిపోయాయి కూడాను. టోక్యోలోని తోషిభా కంపెనీ ప్రధాన స్టోర్ లో కస్టమర్లను ఆహ్వానిస్తూ, వారికి కావలసిన సమాచారం అందిస్తూ రోబోట్ సెక్రటరీలు పని చేస్తున్నారు.

రోబోట్ల నిర్వహణకు కూడా మనుషులు కావాలి గనుక ఆ రంగంలో కొత్త ఉపాధి సృష్టించబడుతుందని అధ్యయనం ఊరడించింది. కానీ కాకులను కొట్టి గద్దలకు వేస్తూ గద్దలూ బతకాలిగా అని ఊరడించడం ఎలా సమర్ధనీయం. మర మనుషుల చేతనే అన్నీ పనులు చేయించగల సామర్ధ్యం మనిషికి వస్తే అది ఉన్నత సాంకేతిక పరిజ్ఞానానికి తార్కాణం కావచ్చు గానీ మానవ సమాజం మాత్రం వాటివల్ల లబ్ది పొందలేదు. రోబోట్ల వల్ల అంతిమ ఫలితం పొందేది కంపెనీల యజమానులు మాత్రమే. అనగా సంపదల కేంద్రీకరణ మరింత తీవ్రమై, ప్రజలు అధిక సంఖ్యలో ఉపాధి కోల్పోయి సామాజిక రుగ్మతలు మరింతగా విస్తరించే ప్రమాదం పొంచి ఉంటుంది.

హాంగ్ కాంగ్ కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ తయారు చేసిన హాన్ అనే హ్యూమనాయిడ్ రోబోట్ కొన్ని భావాలను సైతం వ్యక్తం చేయడాన్ని కింది ఫొటోల్లో చూడవచ్చు. ఫ్రబ్బర్ అని పిలిచే ఎలాస్టిక్ పాలిమర్ తో ఈ రోబోట్ చర్మాన్ని తయారు చేశారు. 40 రకాల మోటార్లు (మెదడుకు సంబంధించినవి, యంత్రానికి సంబంధించినవి కావు) ఈ రోబోట్ మొఖంలో అమర్చడం ద్వారా భావ వ్యక్తీకరణను సుసాధ్యం చేశారు. ప్రస్తుతానికి ఈ భావ వ్యక్తీకరణ మనుషులు ఇచ్చే కమాండ్ ద్వారానే సాధ్యం అవుతుంది.

 

3 thoughts on “జర్మనీ: రోబోట్ల వల్ల 1.8 కోట్ల ఉపాధి హుళక్కి!

  1. అయితే డాక్టర్లు, లెక్చరర్లు లాంటి వారి ఉపాధికి వచ్చిన భయం ఏమీ లేదని తెలుస్తోంది. డాక్టర్ల పనిని రోబోట్లు ఎలాగూ చేయలేవు.

    ఇది నిజం కాదు. త్వరలో డాక్టర్ల ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఐ.బి.యం. డాక్టర్ వాట్సన్ రోబో రేడి అవుతున్నాది. మీరు google lO సర్చ్ చేస్తే దాని గురించి ఎన్నో వివరాలు తెలుసుతాయి. రానున్న రోజులలో పేషంట్ ను ప్రేమతో స్పర్సించటానికి తప్పించి డాక్టర్ల అవసరంలేదు. మనుషులు వారి జబ్బుని చెపితే మందులను రోబోనే సూచిస్తుంది. ఆపరేషన్ ల లో కూడా రోబో లను ఉపయోగిస్తారు. హైదరాబాద్ అపోలో లో రోబో తో ఆపరేషన్లు మొదలైనట్లున్నాయి.

    వైద్య రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మునుపటివలే అలోపతి వైద్యం మాత్రమే డామినేట్ చేసే రోజులకు కాలం చెల్లింది. రానున్న రోజులలో హోమియోపతి, ఆయుర్వేదం మొదలైన వాటిని కూడా ఉపయోగించి చికిత్స చేయటం ఎక్కువౌతుంది. ఇప్పటికే భారతీయ ఆయుర్వేద వైద్య శాస్త్రాన్ని, యోగ, మొదలైన వాటన్నిటినన్నిటిని కలిపి పర్సనల్ వైద్యం (వ్యక్తి శరీర ధర్మానికనుగుణంగా) ప్రజలకందించటానికి కృషి చేస్తున్నారు. వారి లో శివ అయ్యాదురై ఒకడు. కొందరు భారతీయ వైద్యులు అల్లోపతి వైద్యవిధానంలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చి ప్రజలకు వివరించటంలో విజయం సాధించారు.

    శివ అయ్యాదురై అమెరికాలో యం.ఐ.టి. లో పి.చ్.డి చేశాడు. మొట్టమొదటి ఈమైల్ సిస్టం కనుకొన్న వ్యక్తి. అతనికి రావలసిన పేరును రాకుండా అడ్డుకొంట్టుంటే, నోం చోంస్కి వంటి వాళ్లు అతనికి మద్దతు ఇచ్చరు. ప్రస్తుతం ఆయన ఆయుర్వేద వంటి సాంప్రదాయ మేడిసిన్ ల తో కూడిన వైద్యం విధానంపై పనిచేస్తున్నారు.
    http://www.inventorofemail.com/

    Va Shiva Ayyadurai- Sages and Scientists

    The Clinician’s View of Holistic Medicine – B.M. Hegde

    Professor Rustum Roy on Whole Person Healing

    లెక్చరర్లు గిరాకి ఏ క్షణమైనా పడిపోవచ్చు. ఇప్పటికే ఐ.ఐ.టి. మొదలు కొని మాసచూసేట్స్, హార్వర్డ్ వరకు క్లాస్ రూం కోర్స్ లు యుట్యుబ్ లో అప్లోడ్ చేస్తున్నారు. కోర్స్ వేర్ లాంటి ఎన్నో ఆన్ లైన్ కోర్స్ లు అందుబాటులో ఉన్నాయి. పరిక్ష పేపర్లు దిద్దటానికి వాళ్లు అవసరం కావచ్చు. రేపు మార్కెట్ లో జాబ్స్ దొరకక పోతే లక్షలు పోసి చదువుకొనే వారుండరు. ఆన్ లైన్ కోర్స్ లు చేయటం మొదలుపెడతారు. ఆటొమేటిక్ గా కాలేజిలు మూతపడతాయి. లెక్చర్ల జాబ్స్ మాయమౌతాయి.

  2. పి.ఎస్ గారూ కొంతవరకు చూశాను, వారు చెబుతున్నవి గతంలో కొన్నిసార్లు విన్నవి, చదివినవి. డబ్బు కోసమే జబ్బులు, మందులు సృష్టిస్తున్నారని చెప్పిన మాట కఠిన వాస్తవం. నా ఉద్దేశ్యంలో వివిధ వైద్య విధానాలను సమగ్రం కావించి సరికొత్త వైద్య విధానాన్ని తయారు చేయగల శక్తి మానవుడికి ఉంది. కానీ వీడియోలో పెద్దలు చెప్పినట్లు డబ్బుతో కూడిన సమాజం అందుకు ఆటంకంగా ఉంది. ఈ పరిస్ధితి మారాలంటే సామాజిక వ్యవస్ధ సమూలంగా మారడమే పరిష్కారం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s