బ్రిటన్: కన్సర్వేటివ్ పార్టీ అనూహ్య విజయం


బ్రిటన్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. అత్యంత నిఖార్సయిన, అభివృద్ధి చెందిన సర్వే ల నిర్వాహకులుగా చెప్పుకునే పశ్చిమ సర్వేలు సైతం ఊహించని ఫలితాలు వచ్చాయి. పాలక కన్సర్వేటివ్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీల మధ్య నువ్వా-నేనా అనట్లుగా పోటీ ఉంటుందని సర్వేలన్నీ ఊహించగా అందుకు విరుద్ధంగా ప్రధాని డేవిడ్ కామెరాన్ నేతృత్వంలోని పాలక పార్టీ అత్యధిక స్ధానాలు గెలుచుకోవడంతో పాటు సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ సాధించింది.

పాలక, ప్రతిపక్ష పార్టీలలో దేనికీ మెజారిటీ రాదని, ప్రతిపక్ష లేబర్ పార్టీకే 1 శాతం ఎక్కువ ఓట్లు రావచ్చని ఎన్నికల ముందు జరిపిన సర్వేలు అంచనా వేశాయి. ఏ పార్టీకి మెజారిటీ రాక హంగ్ పార్లమెంటు ఏర్పడితే ప్రభుత్వం ఏర్పాటుకు వారాలు, నెలలు పట్టవచ్చని కూడా పత్రికలు అంచనా వేశాయి. అంచనాలను తల్లకిందులు చేస్తూ అత్యంత కఠినమైన పొదుపు విధానాలను తమ నెత్తిపై రుద్దిన కన్సర్వేటివ్ పార్టీనే బ్రిటన్ ఓటర్లు తిరిగి నెత్తిన పెట్టుకున్నారు.

స్కాట్లాండ్ లో యు.కె నుండి విడిపోవడం కోసం డిమాండ్ చేస్తున్న స్కాటిష్ నేషనల్ పార్టీ (ఎస్.ఎన్.పి) స్కాట్లాండ్ లో దాదాపు అన్ని సీట్లనూ కైవసం చేసుకోవడం ఎన్నికల్లో ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. లేబర్ పార్టీ విజయవాకాశాలు ఎస్.ఎన్.పి వల్లనే కొడిగట్టాయని తాజాగా పత్రికలు విశ్లేషిస్తున్నాయి.

ఎన్నికల ఫలితాల ప్రకారం తుది ఫలితాలు వెలువడిన సమయానికి కన్సర్వేటివ్ పార్టీ 36.9 శాతం ఓట్లతో 330 సీట్లు గెలుచుకోగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన లేబర్ పార్టీ 30.5 శాతం ఓట్లతో 232 సీట్లు గెలుచుకుంది. స్కాటిష్ నేషనల్ పార్టీ కేవలం 4.7 శాతం ఓట్లతో 56 స్ధానాలు గెలుచుకుంది. ఈ ఓట్లన్నీ స్కాట్లాండ్ లోనే కేంద్రీకృతం కావడంతో ఎస్.ఎన్.పి ఇన్ని స్ధానాలు గెలుచుకోగలిగింది.

కన్సర్వేటివ్ పార్టీతో కలిసి పాత ప్రభుత్వం ఏర్పరిచిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్.డి.పి) ని బ్రిటన్ ప్రజలు చావు దెబ్బ కొట్టారు. 7.8 శాతం ఓట్లతో 8 స్ధానాలు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు ఎల్.డి.పి కి ఆ పార్టీ ఓటర్లు విధించిన దండన అని కొందరు విశ్లేషిస్తున్నారు. మితవాద కన్సర్వేటివ్ పార్టీతో కూటమి కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఆ పార్టీ ఓటర్లకు నచ్చలేదని, అందుకే శిక్ష వేశారని వారి విశ్లేషణగా ఉంది. తీవ్ర మితవాద పార్టీ అయిన యు.కె ఇండిపెండెన్స్ పార్టీ (యుకిప్) 12.6 శాతం ఓట్లు సంపాదించినప్పటికీ కేవలం 1 స్ధానం మాత్రమే గెలుచుకుంది. యుకిప్ పార్టీకి వచ్చిన ఓట్లు దేశవ్యాపితంగా విస్తరించడంతో అవి సీట్లుగా మారలేదు.

650 సీట్లు గల బ్రిటన్ కామన్స్ సభలో (దిగువ సభ) ఇప్పుడు పాలక పార్టీకి సంపూర్ణ మెజారిటీ సిద్ధించింది. బ్రిటన్ ఆర్ధిక వ్యవస్ధలో క్రమ శిక్షణను అమలు చేసి 2008 నాటి ఆర్ధిక సంక్షోభం నుండి బైటపడవేయగల పార్టీగా కన్సర్వేటివ్ పార్టీని జనం నమ్మారని పశ్చిమ పత్రికలు ఫలితాలకు భాష్యం చెబుతున్నాయి. వాస్తవంలో పొదుపు విధానాలకు లేబర్ పార్టీ కూడా వ్యతిరేకం ఏమీ కాదు. స్కాట్లాండ్ లో సంప్రదాయక ఓటర్లను కలిగి ఉన్న లేబర్ పార్టీని తీవ్ర స్ధాయికి చేరిన స్కాటిష్ జాతీయవాదం దెబ్బ కొట్టడమే కన్సర్వేటివ్ పార్టీ మెజారిటీకి కారణంగా కనిపిస్తోంది.

యు.కె నుండి స్కాట్లాండ్ విడిపోకుండా సకల చర్యలు తీసుకుంటామని ప్రధాని కామెరాన్ ఇచ్చిన హామీకి ఇతర యు.కె ప్రజలు నమ్మినట్లు కనిపిస్తోంది. స్కాట్లాండ్ విడిపోతే బ్రిటన్ కు చమురు నిల్వలు దూరం అవుతాయి. అది యు.కె ఆర్ధిక వ్యవస్ధను ఇంకా దెబ్బ తీస్తుందని, ఈ ప్రమాదాన్ని నివారించాలంటే కన్సర్వేటివ్ పార్టీయే అధికారంలో కొనసాగడం ఉత్తమమని స్కాటిషేతర ప్రజలు భావించి ఉండవచ్చు. బలమైన ప్రత్యామ్నాయ ఆర్ధిక విధానాలను అమలు చేయగలమన్న హామీ లేబర్ పార్టీ నుండి లభించకపోవడంతో కామెరాన్ ఆర్ధిక విధానాలపై ఆ పార్టీ చేసిన విమర్శలను బ్రిటన్ ప్రజలు విశ్వసించలేదు.

ఓటమికి బాధ్యత వహిస్తూ లేబర్ పార్టీ, లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, యుకిప్ ల నేతలు రాజీనామా చేయగా కన్సర్వేటివ్ పార్టీ నేత కామెరాన్ ప్రజలకు కృతజ్ఞతలు ప్రకటించారు. అమెరికా ఒత్తిడిని తోసిరాజని చైనా సొంత అంతర్జాతీయ బ్యాంకు ‘ఆసియా ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్’ లో వ్యవస్ధాపక సభ్య దేశంగా చేరడంలో చొరవ చూపిన కామెరాన్ ప్రభుత్వం భవిష్యత్తులో అంతర్జాతీయంగా చైనా అనుకూల వైఖరికి మరింత పదును పెడుతుందా అన్నది వేచి చూడవలసిన విషయం. బ్రిటన్ ప్రజలకు మాత్రం ఎన్నికల ఫలితాలు ఒరగబెట్టేది ఏమీ లేదు. ‘ఏ రాయయితేనేం పళ్ళూడగొట్టుకోవడానికి?’ అనుకుని సంతృప్తిపడడమే వారికి మిగిలింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s