ఉడుకుతున్న నల్లజాతి ఆగ్రహమే బాల్టిమోర్ అల్లర్లు! -ఫోటోలు


అమెరికా ఇప్పుడు భూతల స్వర్గం కాదు భూతల నరకం! ప్రపంచంలో రెండో పెద్ద ప్రజాస్వామ్య రాజ్యం కాదు, ప్రపంచంలోనే అత్యంత కరుడుగట్టిన పోలీస్ స్టేట్! ఆ రాజ్యంలో మైనారిటీ జాతులు మనుషులు కానక్కరలేదు. వారు నల్లజాతి వారు కావచ్చు, లాటినోలు కావచ్చు, తలపాగా ధరించే భారతీయులు కావచ్చు, ముస్లింలు కావచ్చు. వారెవరికీ పౌర హక్కులు సరే, మానవ హక్కులే ఉండవు!

నానాటికీ సంక్షోభాల ఊబిలో కూరుకుపోతున్న అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం ఆ ఊబి నుండి బైటపడేందుకు ఇతర ప్రపంచ దేశాలపై ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలపై అచ్చోసిన ఆంబోతులా తెగబడడమే కాదు, తన సొంత నేలపై నడయాడే ప్రజల ఆర్ధిక మూలుగులను కూడా పీల్చి పిప్పి చేస్తోంది. ఓ పక్క ఎకనమిక్ రికవరీ చూపించేందుకు నానా తంటాలు పడుతూ, ఆ దారిలో ప్రజల ఆర్ధిక వనరులను కుచింపజేస్తూ, మరో పక్క కంపెనీల అధిపతులకు వందల మిలియన్ల డాలర్లను రెమ్యూనరేషన్ గా జమ చేస్తోంది. కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఏమిటో అక్షరాలా అమలు చేసి చూపుతోంది.

ఆర్ధిక సంక్షోభం, ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్యం… ఇత్యాది ఆర్ధిక రోగాలన్నీ కలిసి మూకుమ్మడిగా అమెరికన్ ప్రజానీకంపై విరుచుకుపడుతుండగా, వారిలో బలహీనులైన ప్రజలు కనీస రక్షణ, ఆధారం లేక అల్లాడుతున్నారు. సంపదలు కేంద్రీకృతం అయ్యే కొద్దీ ఉపాధి వనరులు కుచించుకుపోయి బలహీన వర్గాలైన నల్లజాతి ప్రజలను అక్కరలేని ప్రజానీకంగా మార్చబడుతున్నారు.

ఆధునిక అమెరికా అభివృద్ధి నమూనాలో పేద నల్లజాతి పౌరుడుగా పుట్టడమే ఒక శాపం. వారికి విద్యా సౌకర్యం ఉండదు. ఉన్నత విద్య అసలే అందదు. ఫలితంగా ఉపాధికి వారంటే చిన్నచూపు. వెరసి నల్లజాతి యువత దొరికిన ఉపాధిని దొరకబుచ్చుకుంటున్నారు. చివరికి అది చిన్నపాటి నేరం అయినా సరే. నేరస్ధులను సృష్టించే సమాజం వారికి ‘జైలు’ పేరుతో ప్రత్యేక స్ధలాన్ని కేటాయించి వారి శ్రమను అత్యంత చౌకగా కొల్లగొట్టడం కూడా బాగా తెలుసు.

మూడు శతాబ్దాల క్రితం నల్లజాతి బానిసల శ్రమతో సంపదలు మూటగట్టిన అమెరికా ఇప్పుడు అదే నల్లజాతిని ఖైదీలుగా మార్చి వారి శ్రమను చౌకగా కొల్లగొడుతోంది. ఖైదీలతో శ్రమ చేయించుకోవడం అక్కడి కార్పొరేట్లకు లాభసాటి వ్యాపారం ఇప్పుడు! మనిషి రక్తం రుచి మరిగిన పులిని ‘మేన్-ఈటర్’ అంటారు. ఒకసారి మానవ రక్తం రుచి మరిగాక పులి ఇక మనుషులనే వేటాడుతుంది. ఖైదీల శ్రమలతో పండుతున్న విపరీత లాభాలను రుచిమరిగిన కార్పొరేట్లు మరింత మంది ఖైదీలు కావాలని సహజంగానే కోరుకుంటాయి. ఫలితంగా బ్లాక్ కాలనీలు నేరగాళ్ల కార్ఖానాలుగా మార్చేసే వ్యూహాలు అత్యున్నత స్ధానాల్లో/స్ధాయిల్లోనే రచించబడ్డాయి. ఇక నల్ల నేరస్ధులకు కొదవ ఉండకూడదు.

మరోవైపు ఉపాధి అవకాశాలు కుచించుకుపోయిన స్ధితిలో… ఉన్న ఉపాధి ఆధిపత్య తరగతుల ప్రజలకు మాత్రమే పరిమితమై బలహీన తరగతుల ప్రజలు రాజ్యం చూపించని (నిజానికి చూపించిన) ప్రత్యామ్నాయం వైపు మరలుతున్నారు. కానీ ఇది పరిమిత సంఖ్యలోనే. ఒకటి రెండు చోట్ల నల్ల నేరస్ధులకు బహుళ ప్రచారం కల్పిస్తే ఇక నల్లజాతిని అంతటినీ నేరగాళ్లుగా ప్రచారం చేయడం అంత కష్టం ఏమీ కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆంధ్ర ప్రదేశ్ స్టూవర్టుపురం నేరగాళ్ల ఊరుగా స్ధిరపడిపోవడం గుర్తుకు తెచ్చుకోవచ్చు. టెర్రరిస్టులు అందరూ ముస్లింలే అన్న ప్రపంచ రాజ్యాల ప్రచారం వర్తమానం లోనిదే. కనుక అమెరికాలో నేరాలు చేసేది ఎవరూ అంటే నల్లజాతి యువకులే. అమెరికా జైళ్ళలో 28 లక్షల నల్లజాతి యువకులు అండర్ ట్రయల్ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతున్నారంటే ఎందుకు మగ్గరు?

ఈ పరిస్ధితుల నేపధ్యంలోనే ఒక ట్రేవాన్ మార్టిన్, ఎరిక్ గార్నర్, మైఖేల్ బ్రౌన్, జాన్ క్రాఫర్డ్, తమీర్ రైస్, బ్రాండన్ ట్రేట్ బ్రౌన్…. ఇంకా ఫ్రెడ్డీ గ్రే….! బాల్టిమోర్ పౌరుడు ఫ్రెడ్డీ గ్రే ఏప్రిల్ 12 తేదీన అరెస్టు అయ్యాడు. అతన్ని పోలీసు వ్యాన్ లో పడేసి తీసుకెళ్లారు. పోలీసు స్టేషన్ కి వెళ్ళేసరికి అతన్ని అపస్మారక స్ధితిలో వ్యాన్ నుండి దించారు. అక్కడి నుండి ఆసుపత్రికి తీసుకెళ్ళాక ఏప్రిల్ 19 నాటికి ఆయన శవంగా మిగిలాడు.

తలపైన బలమైన గాయం తగలడంతో ఫ్రెడ్డీ గ్రే చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. చివరికి, పత్రికల ప్రకారం (పోలీసులు ఇంకా తేల్చలేదు), తేలింది ఏమిటంటే వ్యాన్ లో తీసుకెళ్తూ పోలీసులు ఫ్రెడ్డీ గ్రేను ఒక ఆట ఆడుకున్నారు. అమెరికాలో ఆ ఆటను ముద్దుగా ‘రఫ్ రైడ్’ అంటారు. ఈ ఆటలో ప్రత్యర్ధి టీంలు అంటూ ఉండవు. ఒకే ఒక్క టీం ఉంటుంది. టీం సభ్యులు ఎంతమందైనా ఉండవచ్చు. ఆటను వాహనంలోనే ఆడాలి. అది కూడా పోలీసు వాహనం లోనే. ఆట నియమాల ప్రకారం ఆట వస్తువుని (అనగా బందీని) మామూలుగా కూర్చోబెట్టినట్లు సీటు బెల్టు బిగించి కూర్చోబెట్టకూడదు. అలా ఫ్రీగా వదిలేయాలి. ఇక వ్యాన్ ని రఫ్ గా పరుగెత్తించాలి. టీం సభ్యులు తలా ఒక చేయ్యో, కాలో వేస్తుంటారు. ఆ క్రమంలో ఆట వస్తువు వ్యాన్ లోపల ఆధారం లేక ఎనిమిది మూలలకీ స్వేచ్ఛగా పడుతూ, లేస్తూ, తాకుతూ, ఢీ కొడుతూ… ఎవరికి వారు ఊహించుకోవచ్చు.

ఇలాంటి రఫ్ రైడ్ కు ఫ్రెడ్డీ గ్రే గురయ్యాడు. ఆ క్రమంలో వ్యాన్ వెనుక తలుపుకు ఉండే బోల్ట్ కు అతని తల బలంగా తాకి మెడ దాదాపు విరిగి పోయింది. అతని మెడ/తలకి తగిలిన గాయం బోల్ట్ షేపుతో సరిపోలిందని డాక్టర్లు చెప్పినట్లు బ్రిటన్ పత్రిక గార్డియన్ వెల్లడి చేసింది. ఏప్రిల్ 19 తేదీన ఫ్రెడ్డీ ఆసుపత్రిలో చనిపోగా ఏప్రిల్ 27 తేదీన అంత్యక్రియలు జరిగాయి. ఫ్రెడ్డీ చనిపోయినప్పటి నుండి అంత్యక్రియలు జరిగే వరకూ బాల్టిమోర్ అట్టుడికిపోయింది. నల్ల జాతి యువత వీధుల్లో పోలీసులతో యుద్ధాలు చేశారు. గాజా పౌరుల నిత్య జీవన సంఘర్షణను తలపిస్తూ రాళ్ళనే ఆయుధంగా మలుచుకున్నారు. పోలీసు వాహనాలను తగలబెట్టారు. షాపుల్ని దహనం చేశారు. కొందరు పనిలో పనిగా లూటీలు చేశారు.

ప్రజల తీవ్ర నిరసనలతో తలఒగ్గిన స్ధానిక ప్రభుత్వం వ్యాన్ లో ఉన్న పోలీసులు అందరిపైనా (ఆరుగురని సమాచారం) హత్య కేసు నమోదు చేసింది. విచారణ సాగిస్తున్నామని పోలీసులు, న్యాయ శాఖ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ గతంలో ఇలాగే నమోదైన కేసుల్ని ఉదాహరణగా తీసుకుంటే ఫ్రెడ్డీ హంతకులు నిర్దోధులుగా విడుదల కావడమే మిగిలి ఉన్న తంతు.

విచిత్రంగా బాల్టిమోర్ అల్లర్లను భారత మీడియా పెద్దగా కవర్ చేయలేదు. నేపాల్ భూకంప బాధితులకు భారత సైనికులు సహాయం చేస్తున్న వార్తలను నేపాల్ ప్రజలే విసిగిపోయేట్లుగా కవర్ చేసిన భారత మీడియాకు బాల్టిమోర్ అల్లర్లు వార్త కాకుండా పోయింది. పశ్చిమ కార్పొరేట్ మీడియా బాల్టిమోర్ వార్తలను ప్రచురించాయి కానీ తమదైన కలర్ వేసి మరీ ప్రచురించడం మర్చిపోలేదు. ఆ కలర్ సారాంశం ఏమిటంటే బాల్టిమోర్ నల్లజాతి నేరస్ధులకు కేంద్రం. అక్కడ నల్లజాతి వారు పేదవారు. కనుక నేరాలు చేస్తారు. ఫ్రెడ్డీ మృతిపై నిరసనల పేరుతో వారు షాపులను దోచుకున్నారు. ఫ్రెడ్డీ కుటుంబం నిరసనలు వద్దని వారిస్తున్నా వినకుండా నిరసనలకు దిగి చివరికి అల్లర్లకు పాల్పడ్డారు. చాలా మందికి ఈ కలర్ అంటేనే ఎక్కువ ఇష్టం.

కింది ఫోటోలను ది అట్లాంటిక్ పత్రిక ప్రచురించింది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s