యు.పి.ఏ పాలనలో దావూద్ ఇబ్రహీం ను ఇండియా రప్పించలేకపోయినందుకు బి.జె.పి నేతలు చెయ్యని అపహాస్యం లేదు. చెయ్యని ఆరోపణ లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో యు.పి.ఏ ఘోరంగా విఫలం అయిందంటూ బి.జె.పి చేసే ఆరోపణలో దావూద్ ఇబ్రహీం వ్యవహారం కూడా కలిసి ఉంటుంది. పాక్ లో ఉన్న దావూద్ ని అరెస్టు చేసి ఇండియా రప్పించడం చేతకాలేదని బి.జె.పి నేతలు అనేకసార్లు ఆరోపించారు. అలాంటి దావూద్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని అధికారం లోకి వచ్చాక బి.జె.పి చెబుతోంది.
1993 నాటి ముంబై పేలుళ్లకు దావూద్ కారణం అని భారత నిఘా వర్గాల అంచనా. ఈ అంచనాను భారత ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. యు.పి.ఏ ప్రభుత్వమే పాక్ లో ఉన్న దావూద్ ను ఇండియా రప్పించే అంశాన్ని ద్వైపాక్షిక చర్చల అంశాల్లో ఒకటిగా చెప్పింది. ఇక బి.జె.పి అయితే చెప్పనే అవసరం లేదు.
గత సంవత్సరం నవంబర్ లో సైతం భారత హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ దావూద్ ఇబ్రాహీం పాకిస్తాన్ లో ఉన్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. “పాకిస్తాన్ ప్రధాని ఇండియా వచ్చినప్పుడు దావూద్ ని అప్పగించాలని మన ప్రధాని ఆయనను కోరారు. మేము ఆ విషయమై సంప్రదింపులు జరుపుతున్నాము. దౌత్య ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నాము… ఆయన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కనుక… ఇప్పుడైతే ఆయన పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్నాడు” అని నవంబర్ 22 తేదీన హోమ్ మంత్రి రాజ్ నాధ్ సింగ్ న్యూ ఢిల్లీలో ఒక ఫంక్షన్ లో మాట్లాడుతూ చెప్పారు.
ఒక్క రాజ్ నాధ్ సింగ్ గారే కాదు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు కూడా ఈ విషయంపై ప్రకటన జారీ చేశారు. దావూద్ ఇబ్రహీం పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉన్నాడని హోమ్ మంత్రి నిర్ధారించిన నెల రోజుల తర్వాత ఓ సందర్భంలో మాట్లాడుతూ ఆయన దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్ (జమాత్-ఉద్-దవా నేత) లను పాకిస్తాన్ వెంటనే అరెస్టు చేసి ఇండియాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తద్వారా దావూద్ పాక్ లోనే ఉన్నాడని వెంకయ్య నాయుడు ధ్రువపరిచారు.
అలాంటి దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదని ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మోడి ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఈ రోజు సమాధానం ఇచ్చింది. నిత్యానంద రాయ్ అనే ఎం.పి అడిగిన ప్రశ్నకు సమాధానంగా “1993 నాటి ముంబై వరుస పేలుళ్ళ కేసులో దావూద్ ఇబ్రహీం ఒక నిందితుడు. ఆయనకు వ్యతిరేకంగా A0135/4-1993 నెంబరుతో రెడ్ కార్నర్ నోటీసు జారీ అయి ఉంది. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఇప్పటివరకూ ఆచూకీ దొరకలేదు. ఆచూకీ అంటూ దొరికాక దావూద్ ఇబ్రహీం ను (ఇండియాకు) రప్పించే ప్రక్రియ మొదలవుతుంది” అని హోమ్ శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పరతిభాయ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ప్రభుత్వ సమాధానంపై అన్ని వైపుల నుండి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డాయి. దానితో ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని హోమ్ శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్ ప్రకటించవలసి వచ్చింది. అసలు ఒకసారి సమాధానం ఇచ్చాక దానిపై విమర్శలు వచ్చాయి కాబట్టి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? పార్లమెంటులో సమాధానం ఇచ్చేందుకు వీలుగా ఎన్నో రోజులు ముందే సభ్యులు తమ ప్రశ్నలను ప్రభుత్వానికి పంపుతారు. వాటిని సంబంధిత శాఖలకు ముందే పంపి ఫలానా రోజు సమాధానం ఇవ్వాలని ముందే నిర్దేశించబడి ఉంటుంది. సభలో లేచి సమాధానం ఇవ్వడమే కాకుండా కొన్ని ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కూడా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. పైగా దావూద్ ఇబ్రహీం ఆచూకీ లాంటి (బి.జె.పికి) ముఖ్యమైన అంశంపై బి.జె.పి మంత్రులు అంత ఉదాసీనంగా సమాధానం ఎలా ఇస్తారు?
బి.జె.పి రెండు నాల్కల వైఖరికి ఇంకా సాక్ష్యాలు కావాలా?