ఢిల్లీ బస్సులో నిర్భయపై జరిగిన అత్యాచారం ఉదంతం దరిమిలా భారత ప్రభుత్వం తెచ్చిన సో-కాల్డ్ కఠిన చట్టాలు మహిళలకు ఏ మాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్న సంగతి మళ్ళీ మళ్ళీ రుజువవుతోంది. కావలసింది కఠిన చట్టాలు కాదని, సామాజిక వ్యవస్ధ నిర్మాణంలోనే సమూల మార్పులు వస్తే తప్ప మహిళలతో పాటు ఇతర అణగారిన సెక్షన్ ప్రజలకు రక్షణ ఉండదని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, ముఖ్యంగా సమాజం మార్పును కోరేవారు చెప్పిన మాటలు ప్రత్యక్షర సత్యాలని పంజాబ్ లో వరుసగా జరుగుతున్న దురాచారాలు నిరూపిస్తున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రి బాదల్ కుటుంబానికి చెందిన ప్రైవేటు ట్రావెల్ బస్సులో కండక్టర్ తో సహా ఇతర ప్రయాణికులు సాగించిన వేధింపులకు ఎదురు తిరగడంతో మోగా వద్ద బస్సు నుండి తల్లీ కూతుళ్లను బైటికి నెట్టడంతో కూతురు చనిపోగా ఆమె తల్లి తీవ్ర గాయాలతో ఎలాగో బ్రతికి బయటపడింది. ఈ దుర్ఘటనపై ఏఏపి, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన చేపట్టడంతో అల్లరికి పాల్పడిన వారిని ఆగమేఘాలపై అరెస్టు చేశారు. బాలిక (13 సం.లు) కుటుంబానికి రు. 20 లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి ప్రజల ఆగ్రహం నుండి తప్పించుకున్నారు.
మోగా ఉదంతం మరువక ముందే ఖన్నా నుండి లూధియానా వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఓ మధ్య వయస్కురాలయిన మహిళపై ఆమె పక్కనే కూర్చున్న ఓ యువకుడు లైంగిక వేధింపులకు దిగాడు. సదరు మహిళ కండక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన యువకుడిని వేరే సీట్లో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆ యువకుడి ఆగడాలు తగ్గకపోగా మహిళపై బూతు కూతలు మొదలు పెట్టాడు. సదరు మహిళ సాహసం చేసి అతడి చెంప చెళ్లుమనిపించింది కూడాను. యువకుడిపై ఫిర్యాదు చేసేందుకు మహిళ ఉద్యుక్తం కావడంతో బస్సును మధ్యలో ఆపి యువకుడిని దించివేశారని తెలుస్తోంది.
అయినప్పటికి సదరు మహిళ వెనక్కి తగ్గలేదు. ఖన్నా పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. డ్రైవర్, కండక్టర్ లు యువకుడిని కాపాడేందుకు బస్సు నుండి దించి పంపేశారని ఆమె ఆరోపించింది. వారి సహాయంతోనే యువకుడు తప్పించుకున్నాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా బస్సు డ్రైవర్, కండక్టర్ లను అరెస్టు చేశామని యువకుడి కోసం వెతుకుతున్నామని లూధియానా రేంజ్ డి.ఐ.జి ఎన్.ఎస్.ధిల్లాన్ పత్రికలకు చెప్పారు. బస్సును కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.
అయితే ప్రధాన నిందితుడైన యువకుడు మాత్రం ఇంకా పోలీసులకు దొరకలేదు. అతని కోసం వేట సాగిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
గత గురువారం (ఏప్రిల్ 30) జరిగిన మోగా ఉదంతంలో యువతి మరణించడం దైవేచ్ఛ అని ప్రకటించడం ద్వారా భారత రాజకీయ నాయకులు ఫ్యూడల్ యుగాల నుండి దాటిరాలేదని పంజాబ్ విద్యా మంత్రి సూర్జిత్ సింగ్ రాఖ్రా మరోసారి చాటాడు. “ప్రమాదాల్ని ఎవరూ ఆపలేరు. ఏది జరిగినా అది దేవుడి ఇష్టం ప్రకారమే జరుగుతుంది. మేము ప్రజల కోసం ఇంక చాలా చేస్తాం… జరిగిన ఘటన దురదృష్టకరం. కానీ ప్రకృతి ఇష్టానికి వ్యతిరేకంగా మీరు వెళ్లలేరు కదా!” అని మంత్రివర్యులు సెలవిచ్చారు.
మంత్రి గారు చెప్పిన దేవుడు ఎవరి పక్క ఉన్నాడో మంత్రి గారే తన మాటల ద్వారా స్పష్టం చేశాడు. దేవుడి ఇచ్ఛ, ప్రకృతి ఇష్టం… ఇత్యాదివన్నీ కూడా బాధితులకు వ్యతిరేకంగానూ, బాధపెట్టేవారికి అనుకూలంగానూ ఉన్నాయని కనుక భరించక తప్పదని ఆయన ధర్మ సూక్ష్మం ఏమిటో వివరించారు.
గీత, బైబిల్, ఖురాన్… ఇత్యాది వన్నీ స్త్రీలను పురుషులకు లొంగి ఉండాలనే చెబుతాయి. స్త్రీలకు పాతివ్రత్యాన్ని, పురుషులకు ఆధిపత్యాన్ని అప్పగించిన మతగ్రంధాలు మంత్రి వర్యులకు అక్కరకు రావడం యాదృచ్ఛికం ఏమీ కాదు. ఒక మతం స్త్రీలకు బురఖాల్ని తగిలిస్తే మరొకమతం ‘పురుషుడి నుండి స్త్రీ జన్మించెను గానీ స్త్రీ నుండి పురుషుడు జన్మించలేదు’ అని బోధించింది. ఇంకో మతం కుటుంబం, సమాజం పురువు ప్రతిష్టలను కాపాడేందుకు స్త్రీలు ఏ స్ధాయిలో అణిగి మణిగి ఉండాలో చెప్పే నీతి శాస్త్రాలు రచించింది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన ‘ఆర్బిట్ ఏవియేషన్’ ట్రావెల్ కంపెనీపైన కేసు పెట్టాలన్న బాధితుల డిమాండ్ ను తిప్పి కొట్టడానికి ఏకంగా దేవుడి ఇచ్ఛను అడ్డం తెచ్చుకోవడం యాదృచ్ఛికం ఎందుకవుతుంది?
దేవుడి ఇష్టం ప్రకారమే చిల్లర వెధవలు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని మంత్రి గారు తీర్మానించాక ఇక నేరము-శిక్ష, సామాజిక విలువలు, స్త్రీ-పురుష సమానత్వం ఇత్యాది అంశాలన్నీ ప్రభుత్వాల బాధ్యతలో ఉండనే ఉండవు. ఒకవేళ ఉన్నా నామమాత్రంగానే ఉంటాయి తప్ప సామాజిక చెడుగులను నిర్మూలించే నిబద్ధత ఆ ప్రభుత్వాలకు ఉండవు. ఇప్పటి సామాజిక విలువలు ఆధిపత్య వర్గాల ప్రయోజనాలను కాపాడేవి మాత్రమే. అందువలన వాటిని సంస్కరించే ఉద్దేశం పాలకులకు ఏ కోశానా ఉండదు.
నేరస్తుడు తనకి తప్పకుండాశిక్షపడుతుందనిపిస్తే లేదా తొందరగా శిక్ష పడుతుందనిపిస్తే భయపడతాడు. ఆ పరిస్థితి కల్పించలేని చట్టాలు ఎన్ని ఉన్నా అవి వృధా.
సామాజిక వ్యవస్ధ నిర్మాణంలోనే సమూల మార్పులు వస్తే తప్ప మహిళలతో పాటు ఇతర అణగారిన సెక్షన్ ప్రజలకు రక్షణ ఉండదని పలువురు సామాజిక శాస్త్రవేత్తలు, ఆలోచనాపరులు, ముఖ్యంగా సమాజం మార్పును కోరేవారు చెప్పిన మాటలు-
అవిఏమిటో,ఎలాఉంటాయో వాటిపర్యవసానాలు గురించి సూచనప్రాయంగా చెప్పగలరా?