ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉండగా తెచ్చిన గార్ చట్టం (General Anti-Avoidance Rule) ను దేశంలో పెట్టుబడుల వాతావరణాన్ని ధ్వంసం చేసిన వేధింపుల చట్టంగా తిట్టిపోసిన మోడి ప్రభుత్వం అదే చట్టాన్ని ప్రయోగించి విదేశీ ద్రవ్య కంపెనీ ‘అబర్దీన్ అసెట్ మేనేజ్ మెంట్’ ను పన్ను కట్టమని తాఖీదు పంపింది. పన్ను డిమాండ్ చాలా తక్కువే అయినప్పటికీ దానిపై ముంబై హై కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా అబర్దీన్ కంపెనీ సంచలనానికి తెర లేపింది.
పాత ఒప్పందాలకు కూడా వర్తింపజేసే విధంగా తయారు చేసిన గార్ చట్టం ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి పని చేయదని మోడి/జైట్లీ ప్రభుత్వం చెప్పినప్పటికీ ఆచరణలో అందుకు విరుద్ధంగా జరుగుతోందని ఇప్పుడు విదేశీ కంపెనీలు ఆక్షేపిస్తున్నాయి. ప్రభుత్వం విధించిన 50,000 డాలర్ల (దాదాపు రు. 31 లక్షలకు సమానం) పన్ను మొత్తం కంటే కోర్టు ఖర్చులే తడిసి మోపెడు అవుతాయని తమకు తెలుసని, కానీ సూత్రబద్ధమైన గెలుపు కోసం ప్రభుత్వ పన్ను డిమాండ్ ను కోర్టులో సవాలు చేస్తున్నామని అబర్దీన్ కంపెనీ చెప్పడం గమనార్హం.
అబర్దీన్ అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీ స్కాట్లాండ్ కు చెందిన ద్రవ్య కంపెనీ. ఇది ద్రవ్య పెట్టుబడులను నిర్వహించే ప్రైవేటు కంపెనీ. అనగా వివిధ ప్రైవేటు కంపెనీల, వ్యక్తుల ద్రవ్య పెట్టుబడులను నిర్వహించడం, సలహాలు ఇవ్వడం, లావాదేవీలు జరపడం చేస్తుంది. స్కాట్లాండ్ లోని అబర్దీన్ లో ప్రధాన కార్యాలయం నుండి పని చేసే ఈ కంపెనీ యు.కె, ఆస్ట్రేలియా, అమెరికాలతో పాటు యాభైకి పైగా దేశాలలో ద్రవ్య వ్యాపారాలు సాగిస్తోంది.
ఈ కంపెనీ గతంలో ఇండియాలో నిర్వహించిన ఒక లావాదేవీలో ఆర్జించిన ఆదాయంపై 50,000 డాలర్ల మేరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను కట్టాలని మోడి ప్రభుత్వం తాఖీదు పంపింది. ప్రణబ్ ముఖర్జీ ప్రవేశ పెట్టిన గార్ చట్టం ఈ తాఖీదు పంపినట్లు తెలుస్తోంది. నిజానికి ఏప్రిల్ 1, 2015 నుండి గార్ చట్టం వర్తించదని మోడి ప్రభుత్వం విదేశీ కంపెనీలకు హామీ ఇచ్చింది. గార్ చట్టం విదేశీ పెట్టుబడులకు వ్యతిరేకం అనీ, పెట్టుబడిదారులను వేధించే చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని, ఈ చట్టం వలన భారత దేశ అభివృద్ధి కుంటుబడిందని జైట్లీ, మోడీ తదితర పెద్దలు తీవ్రంగా విమర్శించారు. బడ్జెట్ ప్రసంగాల్లో సైతం చట్టాన్ని తిట్టి పోశారు. కానీ ఆచరణలో పాత ఒప్పందాలకు సైతం చట్టాన్ని వర్తింపజేస్తూ పన్ను తాఖీదు పంపడంతో మోడి ప్రభుత్వం ఉద్దేశాలపై విదేశీ కంపెనీలు ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేస్తుండడం ఒక విశేషం.
దాదాపు 350 బిలియన్ పౌండ్ల పెట్టుబడులను నిర్వహించే బడా కంపెనీకి 50,000 డాలర్ల పన్ను చెల్లించడం పెద్ద విషయం ఏమీ కాదు. ఆ మాటకొస్తే పన్ను మొత్తం కంటే కోర్టు ఖర్చులే ఎక్కువ అవుతాయి. కానీ ఒక డిమాండ్ కు తల ఒగ్గితే భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లు రావచ్చని అందుకే ప్రభుత్వ డిమాండ్ ను సూత్ర రీత్యా ఎదుర్కొని నిలువరించడానికే నిశ్చయించుకుని కోర్టుకు ఎక్కామని అబర్దీన్ ఆసియా మేనేజింగ్ డైరెక్టర్ హగ్ యంగ్ స్పష్టం చేశారు (రాయిటర్స్, 04/05/2015).
“టాక్స్ డిమాండ్ ను మేము చట్టపరంగా సవాలు చేసినందు వల్ల అయ్యే కోర్టు ఖర్చులే పన్ను డిమాండ్ మొత్తాన్ని మించిపోయే పరిస్ధితిని మేము ఎదుర్కోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఇవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే, వాటిని సవాలు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని డిమాండ్లు రావచ్చు. ఇది సూత్రబద్ధతకు సంబంధించిన వ్యవహారం. సూత్ర రీత్యా ఎదుర్కోవడానికే మేము కోర్టుకు వెళ్ళాం” అని హగ్ యంగ్ చెప్పారు.
వోడా ఫోన్ కంపెనీ హచ్ కంపెనీని కొనుగోలు చేసిన కేసులో 10,000 కోట్ల పన్ను కట్టాలని ప్రణబ్ ముఖర్జీ ఆర్ధిక మంత్రిగా ఉండగా ఆదాయ పన్ను శాఖ సమన్లు పంపింది. ఈ డిమాండ్ ను కంపెనీ కోర్టులో సవాలు చేయడంతో కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. కింది కోర్టులు భారత ప్రభుత్వం పక్షాన నిలిచినప్పటికి ఉన్నత కోర్టు మాత్రం వొడా ఫోన్ కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. వోడాఫోన్ పై పన్ను విధించగల అవకాశాలు భారత చట్టాలలో లేవని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ నేపధ్యంలో పాత వ్యాపార ఒప్పందాలకు, లావాదేవీలకు కూడా వర్తించేలా GAAR చట్టాన్ని యు.పి.ఏ ప్రభుత్వం తెచ్చింది.
GAAR చట్టంతో పశ్చిమ బహుళజాతి కంపెనీలన్నీ గగ్గోలు మొదలు పెట్టాయి. ఐరోపా, అమెరికా దేశాల అధినేతలు సైతం జోక్యం చేసుకుని GAAR చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దానితో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రంగంలోకి దిగారు. సమీక్ష పేరుతో GAAR చట్టం అమలును నిరవధికంగా నిలిపివేశారు. చట్టంలోని అనేక అంశాలను తిరగదోడారు. చట్టం వల్ల దేశంలో పెట్టుబడులకు వ్యతిరేక వాతావరణం ఏర్పడిందని ఆయన కూడా ఒప్పేసుకున్నారు. చివరికి ఆ చట్టమే ప్రణబ్ ముఖర్జీని ఆర్ధిక శాఖ నుండి తప్పించి, ఆ తర్వాత ఏకంగా ప్రభుత్వం నుండే తప్పించడానికి, రాష్ట్రపతిగా బరిలో నిలపడానికి దోహదం చేసిందని పత్రికలు భాష్యం చెప్పాయి.
ఏప్రిల్ 1 నుండి చట్టం వర్తించబోదని మోడి ప్రభుత్వం చెప్పినప్పటికీ పాత లావాదేవీలకు చట్టం వర్తించబోదని మాత్రం చెప్పలేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. భారీ పన్నులు విధించి వ్యతిరేకత తెచ్చుకోకుండా, అలాగని పన్నులు వేయకుండా విమర్శలు ఎదుర్కోకుండా ఉండేందుకు నామమాత్ర పన్నుతో సరిపెట్టి మధ్యేమార్గాన్ని వెతుక్కున్నామని మోడి ప్రభుత్వం తలపోసినట్లు స్పష్టం అవుతోంది. అయితే నామమాత్ర పన్ను కూడా కట్టడకుండా అబర్దీన్ ఎదురు తిరిగడంతో GAAR చట్టం మరోసారి పత్రికలకు ఎక్కింది. ఈ వ్యవహారానికి మోడి ప్రభుత్వం సమాధానం ఏమిటో తెలియవలసి ఉంది.
భారీ పన్నులు విధించి వ్యతిరేకత తెచ్చుకోకుండా, అలాగని పన్నులు వేయకుండా విమర్శలు ఎదుర్కోకుండా ఉండేందుకు నామమాత్ర పన్నుతో సరిపెట్టి మధ్యేమార్గాన్ని వెతుక్కున్నామని మోడి ప్రభుత్వం తలపోసినట్లు స్పష్టం అవుతోంది
ఏప్రిల్ 1 నుండి గార్ చట్టం వర్తించబోదని/రద్దుచేస్తామని ప్రకటించినపుడు గార్ చట్టం ద్వారా పన్నులు వేయకపోతే విమర్షలెందుకు వస్తాయి?
ఏప్రిల్ 1 నుండి చట్టం వర్తించబోదని మోడి ప్రభుత్వం చెప్పినప్పటికీ పాత లావాదేవీలకు చట్టం వర్తించబోదని మాత్రం చెప్పలేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
పాతలావాదేవీలకు చట్టం ఎలావర్తిస్తుంది?
చూస్తుంటే ప్రభుత్వానికీ,అధికారులకూ అంతరాలున్నట్లు తెలుస్తుంది!