
Relatives welcome Swiss survivors of Saturday’s earthquake in Nepal after their arrival at Bern airport
నేపాల్ భూకంపం ఒక్క నేపాల్ ప్రజలకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాపితంగా అనేకమందికి విషాధాన్ని మిగిల్చింది. యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు చెందిన 1000 మంది వరకు కనిపించకుండా పోయారని యూరోపియన్ యూనియన్ అధికారులు తెలిపారు. పర్వతారోహకులకు హిమాలయ పర్వతాలు ఆకర్షణీయం కావడంతో ఈ పరిస్ధితి ఏర్పడింది.
1000 మంది వరకూ ఆచూకీ తెలియకుండా పోగా 12 మంది మరణించినట్లు ధృవపడిందని నేపాల్ సందర్శించిన ఈ.యు బృందం తెలిపింది. “వాళ్ళు ఎక్కడ ఉన్నదీ తెలియదు. కనీసం ఎక్కడ ఉండవచ్చో కూడా తెలియదు” అని ఈ.యు బృందం నాయకుడు, నేపాల్ లోని ఈ.యు రాయబారి రెంజే టీరింగ్ పత్రికలకు తెలిపారు.
ఆచూకీ దొరకనివారిలో ఎక్కువమంది టూరిస్టులని టీరింగ్ వివరించారు. లాంగ్ టాంగ్, లుక్లా ఏరియాలకు వారు వచ్చి ఉండవచ్చని ఆయన తెలిపారు. లాంగ్ టాంగ్ ప్రాంతం ట్రెక్కింగ్ (పర్వతారోహణ) టూరిస్టులకు నిలయం. ఖాట్మండుకు ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతాన్ని భూకంపం వల్ల సంభవించిన హిమపాతం అల్లకల్లోలం చేసింది.
వాకర్లకు, ఆరోహకులకు ఎత్తు నుండి దూకే అనుభవాన్ని ఇచ్చే లుక్లా ప్రాంతం కూడా టూరిస్టులకు ఆకర్షణీయ కేంద్రం. ఇక్కడి నుండే టూరిస్టులు ఎవరెస్టు బేస్ క్యాంప్ కు ట్రెక్కింగ్ చేస్తుంటారు. లుక్లా నుండి 9 రోజుల పాటు ట్రెక్కింగ్ చేస్తే గాని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు చేరుకోలేరు. ఈ ప్రయాణంలో ఉండగా హిమపాతం సంభవించడం వల్ల వారంతా మంచులోను, మట్టి పెళ్ళల కిందా కప్పబడిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
నేపాల్ భూకంపం మృతుల సంఖ్య తాజాగా 6,260 గా నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య 10,000 దాటవచ్చని నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా హెచ్చరించడం గమనార్హం. భూకంపంలో తల్లకిందులైన అనేక మారుమూల గ్రామాలకు రక్షణ బృందాలు ఇప్పటికీ చేరుకోలేదు. అక్కడ ఎంతమంది చనిపోయారో, ఎంతమంది సజీవంగా ఉన్నారో సమాచారం తెలియదు. పర్వత ప్రాంతాల వెంబడి ఎత్తైన చోట్ల నెలకొన్న ఈ గ్రామాలకు మామూలుగానే రోడ్డు సౌకర్యం ఉండదు. ఇక భూకంపం వల్ల ఎక్కడికక్కడ దారులు తెగిపోయి, కప్పబడి మూసుకుపోవడంతో గ్రామాలకు వెళ్ళడం రక్షణ బృందాల వల్ల కావడం లేదు.
ఇలాంటి చోట్లకు హెలికాప్టర్ల ద్వారా వెళ్లడానికి బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని చోట్లకు మాత్రమే హెలికాప్టర్లు దిగగలుగుతున్నాయి. నేపాల్ కు సహాయం అనే పేరుతో పశ్చిమ దేశాలు పంపుతున్న హెలికాప్టర్లు ఇతర వాయు వాహనాలను తమ పౌరులను రక్షించుకోవడానికే ఆసక్తి చూపుతున్నాయి. దానితో స్ధానికులకు, టూరిస్టులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఫలితంగా ‘ఇక విదేశీ సహాయం చాలు’ అని నేపాల్ ప్రధాని ప్రకటించవలసి వచ్చింది.
యూరోపియన్ దేశాల నుండి వచ్చే టూరిస్టులు తమ తమ దేశాలకు చెందిన ఎంబసీల వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉండగా అధికులు అలా చేయరని ఈ.యు బృందం చెబుతోంది. దానితో వారిని వెతకడం మరింత కష్టం అవుతోందని బృందం తెలిపింది. వీపుకు ట్రెక్కింగ్ సరంజామా తగిలించుకుని నేరుగా టూరిస్టు కేంద్రాలకు వెళ్తారని అదే ఇప్పుడు వారి రక్షణకు ఆటంకం అయిందని తెలుస్తున్నది.