బాబా రాందేవ్ మందు తింటే మగ పుట్టుక గ్యారంటీ(ట)!


RAMDEV

భారత సామాజిక వ్యవస్ధ ప్రయాణం పైకి ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ వాస్తవంలో మధ్య యుగాల చెంతకు ప్రయాణిస్తోందని చెప్పేందుకు మరో దృష్టాంతం ఇది! పురోగమనం, ప్రగతి, అభివృద్ధి, ముందడుగు… ఇలాంటి పదాలు తమ అర్ధాన్ని కోల్పోవడమే కాదు, విచిత్రార్ధాల్ని సృష్టిస్తున్న కాని కాలంలో ఉన్నామని బాబా రాందేవ్ గారి దివ్య ఔషధ వ్యవస్ధ స్పష్టం చేస్తోంది.

బాబా రాందేవ్ నెలకొల్పిన ఆయుర్వేద ఔషధ కంపెనీ ‘పతంజలి ఆయుర్వేద కేంద్ర ప్రైవేట్ లిమిటెడ్’ ఒక ఔషధం తయారు చేసింది. దాన్ని తీసుకుంటే జంటలకు మగ పిల్లాడు పుట్టడం గ్యారంటీ అని రాందేవ్, ఆయన కంపెనీ ప్రచారం చేస్తున్నారు.

ఈ ఔషధానికి రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రధాని మోడి గారి ‘బేటీ బచావ్’ నినాదానికి సంబంధించినది. రెండోది శాస్త్రబద్ధతకు సంబంధించినది.

మోడి ప్రభుత్వం తాము లింగ వివక్షతకు, మహిళల అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ నినాదంతో ఒక పధకం ప్రకటించింది. దాన్ని మొదటిసారి బి.జె.పి ప్రభుత్వ ఏలుబడిలోని హర్యానా లోనే ఆరంభించింది. కూతుర్ని కాపాడండి, కూతుర్ని చదివించండి అని నినాదం ఇచ్చిన మోడి ప్రభుత్వం అదే చేత్తో ‘కూతుళ్లని కాదు, కొడుకులని కనండి!’ అని చెప్పే ఔషధ తయారీకి ఎలా అనుమతి ఇచ్చింది?

మరో విషయం: బాబా రాందేవ్ ప్రస్తుతం హర్యానా ప్రభుత్వానికి ‘బ్రాండ్ అంబాసిడర్’ గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఆయన్ను నియమించుకుంది. అలాంటి రాష్ట్రం లోనే ‘బేటీ బచావ్, బేటీ పఢావ్’ పధకాన్ని ప్రారంభించడం లేదా, అలాంటి పధకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ కొడుకుని కనే మందు తయారు చేస్తే దానికి కేంద్రం లైసెన్స్ ఇవ్వడం… దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? హిపోక్రసీ అనడం చాలా చిన్న మాట. బూటకపు నినాదాల ప్రభుత్వం అని సందేహం లేకుండా అనవచ్చు. ఉత్తుత్తి పధకాలతో ప్రజల్ని దగా చేయడం అంటే అస్సలు తప్పు లేదు.

ఇక శాస్త్రబద్ధత విషయానికి వస్తే. ఆడ పిల్ల పుట్టుక, మగ పిల్లాడి పుట్టుక ఔషధాలు తయారు చేయగలరా? అది శాస్త్రానికి సాధ్యం అవుతుందా? శాస్త్రం ప్రకారం పురుషుల వీర్య కాణాల్లో X, Y క్రోమోజోములు ఉంటే, స్త్రీల అండంలో కేవలం X క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. వీర్య కణం X క్రోమోజోమ్ ని ఇస్తే అది అండంలోని X క్రోమోజోమ్ తో జత కలిసి ఆడ పిండం తయారవుతుంది. అలా కాక పురుషుడి నుండి Y క్రోమోజోమ్ అండంతో కలిస్తే X-Y లు కలిసి మగ పిండం తయారవుతుంది. అనగా పిండాల్ని చంపుకునే దరిద్రాల్ని పక్కన పెడితే ఆడ, మగ పుట్టుక అన్నది ఎంపిక (ఆప్షన్) కాదు, అది ఛాన్స్ మాత్రమే. ఇది శాస్త్రం.

బాబా రాందేవ్ ప్రకారం ఆయన ఔషధం తింటే గనుక వీర్య కణం నుండి ఖచ్చితంగా Y క్రోమోజోమ్ మాత్రమే అండం లోని X క్రోమోజోమ్ తో కలవడానికి వెళ్తుంది. వీర్యకణం లోని X క్రోమోజోమ్ ని పిండంతో కలవకుండా నివారిస్తుంది. ఇది సాధ్యమా? సాధ్యం అయితే ఔషధ రంగాన్ని కూడా ఆడ పిల్లలకు వ్యతిరేకంగా నిలబెట్టిన కీర్తి బాబా రాందేవ్ కు ఇచ్చేయ్యొచ్చు. కానీ అంతపాటి ఆధునిక టెక్నాలజీ చడీ చప్పుడు లేకుండా బాబా రాందేవ్ ఆశ్రమం/కంపెనీలోనే ఎందుకు దాగున్నట్లు? మగ పుట్టుకే గొప్ప అనుకుంటే ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి ఎందుకు అందించకూడదు? వేదాల శాస్త్ర పరిజ్ఞానాన్ని తవ్వి తీయడానికి నానా తంటాలు పడుతున్న మోడి ప్రభుత్వం ఇంతటి ఘనతను యు.జి.సి పాఠ్యగ్రంధాలకు ఎక్కేలా ఎందుకు చర్యలు తీసుకోదు?

ఇంతకీ బాబా రాందేవ్ ప్రపంచం నిండా పురుషులే ఉండాలని తపిస్తున్నారా? విదేశాల్లో నల్లధనం దేశానికి తేవడానికి పురుష పుంగవులే సరైనవారని ఆయన ఉద్దేశమా? ఆడ జనం లేనినాడు అసలు మగ పుట్టుకలు కూడా ఉండవన్న కొద్ది జ్ఞానం కూడా బాబా రాందేవ్ కి లేదా? లేక పురుషులు సైతం గర్భం దాల్చే దివ్యౌషధం బాబా గారి ఫ్యాక్టరీలో తయారవుతోందా?

ఏమిటీ దేశానికి పట్టిన ఈ విచిత్ర పీడ! హతవిధీ!

8 thoughts on “బాబా రాందేవ్ మందు తింటే మగ పుట్టుక గ్యారంటీ(ట)!

  1. అసలు కాకలుతీరిన వైద్య ఘనాపాఠీలే సంతానం కలిగించే విధానం అర్థం కాక తలలు పట్టుకుంటే…ఈయన గారు ఇచ్చే బూడిదకు పిల్లలు పుడతారా…..జనం మరీ వెంగళప్పలు అనుకుంటున్నారా?

  2. రాందేవ్ చేస్తున్నది తప్పే కానీ ఆ వ్యాపారానికి patronage ఉండబట్టే కదా అతను అది చేస్తున్నాడు. మన దేశంలో ప్రతివాడూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటాడు కానీ తన పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువు వద్దంటాడు. అందరూ ప్రభుత్వ ఉద్యోగులైతే వ్యాపారం, వ్యవసాయం ఎవరు చేస్తారనే అనుమానం ఎవడికీ రాదు. ఇలాగే, అందరూ మగవాళ్ళైతే మగవాళ్ళకి కడుపులో కృత్రిమ గర్భాశయాలు పెట్టడం సాధ్యమా, కాదా అనే అనుమానం ఎవరికీ రాదు. రాందేవ్ లాంటి దొంగ సన్నాసులని తయారు చేసేది మనవాళ్ళలోని సంకుచితత్వమే కదా.

  3. ప్రకృతికి విరుద్ధంగా ఏదీ జరగదు. కృత్రిమంగా మగపిండాలనే కడుపులో తయారయ్యేలా చేస్తామని ఎవరైనా చెపితే దాన్ని నమ్మక్కరలేదు. ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్ళు “గే మేరిజెస్” చేసుకుంటారా, “గే మేరిజెస్”ని హిందూ సమాజం ఆమోదిస్తుందా? ఆ …………… ఈ అనుమానాలేమీ రాకే ఆ మందు అమ్ముతున్నాడు.

  4. కంటి చూపుతోనే గర్భం చేయగల పురాణ పురుషులున్నారు అని నమ్మే ఈ దేశంలో. లేహ్యాల వాడకంతో మగపిల్లలు పుడతారు అంటే నమ్మక చస్తారా? అశాస్త్రీయమైన ఆలోచనలు నమ్మినంత కాలం రామ్ బాబా లాంటి 420 గాళ్ళు చలామణిలో వుంటారు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s