ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి


Om Prakash Dhankar

భూ సేకరణ చట్టం సవరణల ద్వారా తన రైతు వ్యతిరేక, ప్రైవేటు బహుళజాతి కంపెనీ అనుకూల స్వభావాన్ని చాటుకున్న బి.జె.పి ఇప్పుడు ఏకంగా రైతులపై నేరుగా దాడి చేసేందుకు సైతం వెనుదీయడం లేదు. ఢిల్లీలో ఎఎపి నిర్వహించిన రైతుల ర్యాలీలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడడాన్ని ‘నాటకం’గా అభివర్ణించిన హర్యానా వ్యవసాయ మంత్రి, ఆత్మహత్యకు పాల్పడే రైతులు ‘పిరికిపందలు’ అనీ, ‘నేరస్ధులు’ అనీ తిట్టిపోసాడు.

“భారత చట్టం ప్రకారం ఆత్మహత్యకు పాల్పడడం నేరం. ఆత్మహత్యకు పాల్పడే ఏ రైతైనా తన బాధ్యతల నుండి తప్పించుకుని తన భారాన్ని అమాయకులైన భార్యా పిల్లల మీదికి తోసినట్లే. అలాంటి రైతులు పిరికిపందలు” అని బి.జె.పి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షుడు, హర్యానా వ్యవసాయ మంత్రి ఓ.పి.ధనకర్ వ్యాఖ్యానించాడు.

ఆత్మహత్య చేసుకున్న రైతులపై ఆధారపడిన కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారా అన్న ప్రశ్నకు ఆయన “ప్రభుత్వం లాంటి సంస్ధలు పిరికి పందల వెనుక మద్దతుగా నిలిచేది లేదు. అలాంటి నేరస్ధులతో ప్రభుత్వం ఉండడం కుదరదు” అని ధ(హ)నకర్ తెగేసి చెప్పాడు. మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీలు, వివిధ సంఘాలు ప్రకటనలు ఇచ్చినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. “నా మాటల్లో తప్పేమీ లేదు. నా మాటలకు కట్టుబడి ఉంటాను. ఆత్మహత్యలను ఎక్కువ చేసి చూపుతున్నారు. దాని వెనుక దురుద్దేశం ఉంది” అని ఆయన ప్రకటించాడు.

ధనకర్ ఇంకా ఇలా వ్యాఖ్యానించాడు “ఆత్మహత్య, ఆత్మహత్య… అంతా డ్రామా. రైతులకు సహాయం చేసేందుకు నేను చేయగలిగిందంతా చేస్తున్నా. గత పదేళ్లుగా నేను రైతులతో ఉన్నాను. పంటలు పండడంలో వైఫల్యం ఉంది నిజమే, కానీ ఆత్మహత్య అందుకు పరిష్కారం కాదు కదా…. వారు మళ్ళీ సున్నా నుండి మొదలు పెట్టేందుకు సౌకర్యాలు ఉండాల్సిందే. మేము రైతులతోనే ఉన్నాము…. ఢిల్లీలో ఒక డ్రామా నడిచింది. అందరూ దాన్ని చూశారు. అది జరగకూడదు” అని ఎఎపి రైతు ర్యాలీలో జరిగిన ఆత్మహత్యను ఉద్దేశిస్తూ ధనకర్ ఎద్దేవా చేశాడు. నాటకం కోసమే రైతు అందరి ముందు ఉరివేసుకున్నాడని ఆయన తేల్చేశాడు.

బి.జె.పి మంత్రి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రస్తావిస్తూ ఖండించారు. “హర్యానాలో మీ మంత్రి ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే రైతులు పిరికిపందలు అంటున్నారు. వారి పంటలు గాలివానకు దెబ్బ తిన్నప్పుడు మీరు వారికి సాయం చేయలేదు. రైతులే నష్టం భరించారు. వారి బోనస్ చెల్లింపులను మీరు నిలిపివేశారు. అప్పుడూ రైతులు భరించారు. వారికి ఎరువులు ఇవ్వలేదు. అదేమని అడిగిన రైతులపై లాఠీ చార్జి జరిపించారు. అయినా వారు భరించారు. ఇప్పుడు వారి ఉత్పత్తి మార్కెట్ లో పడి ఉన్నాయి” అని రాహుల్ గాంధీ విమర్శించారు.

“రైతుల పట్ల బి.జె.పి ప్రభుత్వం యొక్క కరకు మనస్తత్వాన్ని ఇది చూపుతోంది. ఖత్తార్ ప్రభుత్వం ఇకనైనా దీర్ఘ నిద్ర వదిలి మేలుకుంటుందా లేక మరింతమంది రైతులు జీవితాల్ని చాలించుకునేదాకా ఎదురు చూస్తుందా?” అని హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వర్ ప్రశ్నించాడు. విచిత్రం ఏమిటంటే గత యు.పి.ఎ పాలనలో ఇదే ధనకర్ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను యు.పి.ఎ, హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడం  లేదని విమర్శించడం.

ఆత్మహత్య పరిష్కారం కాదు! ఆత్మహత్య నేరం! ఈ నీతి బోధ చేయనిది ఎవరు? రైతుల భూములు లాక్కుని, వారి పంటలకు గిట్టుబాటు ధరల్ని రద్దు చేసి, వారికి ఇవ్వాల్సిన బోనస్ రద్దు చేసి, వారి పిల్లలకు చదువులు లేకుండా చేసి, వారి మార్కెట్ ను దళారీలకు అప్పజెప్పి, వారి బ్రతుకుల్ని భారం చేసి… చివరికి ‘నువ్వు ఉరేసుకుంటే పిరికిపందవు’ అని తేల్చిపారెయ్యడం ఎంత తేలిక! కేవలం ప్రజల పట్ల, ఆరుగాలం కష్టపడే రైతుల శ్రమ పట్ల చులకన భావం ఒంటి నిండా నింపుకున్న ధన మదాంధులు మాత్రమే ఇలాంటి మాటలు చెప్పగలరు!

రైతుల పట్ల పాలకులు ఇలాంటి హృదయవిహీన వ్యాఖ్యలు చేయడం ఈ దేశంలో కొత్తకాదు. 1990ల్లోనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనా, ఆయన మంత్రులు రైతుల ఆత్మహత్యలను తీవ్రంగా చులకన చేస్తూ ప్రకటనలు చేశారు. అసలు వ్యవసాయమే దండగ! అన్ని ఇజాలలోనూ టూరిజం గొప్పది! నేను ఆంధ్ర ప్రదేశ్ సి.ఇ.ఓ ను! అంటూ కష్ట జీవుల్ని చులకన చేసిన చరిత్ర టి.డి.పి నేతకు, ఇతర నాయకులకు ఉన్నది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు లక్ష రూపాయలు పరిహారం ప్రకటించి ఆ లక్ష కోసమే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ప్రకటించిన చరిత్ర టి.డి.పి ప్రభుత్వం సొంతం. అలాంటి టి.డి.పి మళ్ళీ బి.జె.పితో మిత్రత్వం నెరపడం, ఆనాటి టి.డి.పి నేతల వ్యాఖ్యలే ఈనాటి బి.జె.పి నేతలు చేయడం యాదృచ్ఛికం కాదు.

మన పాలకుల ప్రయోజనాలు మన ప్రజల ప్రయోజనాలతో ముడిపడి లేవు. దేశంలోకి వరదలా ప్రవహించాలని ఆశిస్తున్న విదేశీ పెట్టుబడుల ప్రయోజనాలే తమ ప్రయోజనాలుగా మన పాలకులు నమ్ముతున్నారు. కనీసం ఈ దేశంలో వనరులు ఈ దేశ పెట్టుబడిదారులకు, ధనికులకు సొంతం అన్న భావన కూడా వారికి లేదు. ఇందుకు కాంగ్రెస్, బి.జె.పి, టి.డి.పి, ఎస్.పి, బి.ఎస్.పి, డి.ఎం.కె, జనతా పరివార్…. ఇలా ఎవ్వరూ మినహాయింపు కాదు.

అందువల్లనే వాళ్ళు ప్రతిపక్షంలో రైతులకు, ప్రజలకు అనుకూలంగా కబుర్లు చెప్పి, వాగ్దానాలు ఇచ్చి, పాలక పక్షాన్ని తిట్టిపోసి అధికారం లోకి వచ్చాక మళ్ళీ పాత ప్రభుత్వ విధానాలనే రెట్టింపు ఊపుతో అమలు చేయడమే కాకుండా పచ్చి రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బుద్ధుల్ని దాచుకోకుండా ప్రకటిస్తారు. వాళ్ళ మొఖాలే వారు గానీ ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది చెప్పినట్టల్లా నాట్యం చేస్తూ ఉంటుంది. ధనకర్ లో దాగిన ఆత్మ కూడా సామ్రాజ్యవాద పెట్టుబడి అనే పరమాత్మలోని ఒక శకలం. ఈ శకలం ఓ అయిదేళ్లు (వీలైతే పదేళ్ళు) ఒక పార్టీ జీవుడిని ఆశ్రయించి, ఆ తర్వాత మరో అయిదేళ్లు లేదా మరో పదేళ్ళు మరో పార్టీ జీవుడిని ఆశ్రయిస్తుంది. ఈ ఆత్మ/దెయ్యంను వదిలించుకుంటే తప్ప భారత రైతులకు, కార్మికులకు, ఇంకా కోటాను కోట్ల కష్ట జీవులకు నిష్కృతి లేదు.

రైతుల ఆత్మహత్యకు కారణం వారికి తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడం. దానికి కారణం వ్యవసాయ మార్కెట్టు క్రమంగా, వేగంగా రైతుల లాభదాయకత నుండి దేశీయ దళారుల, సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల లాభదాయకత వైపుకి ప్రయాణించడం. ఎరువుల సబ్సిడీలు రద్దు చేయడం లేదా తగ్గించడం వెనుక ప్రభుత్వాల లక్ష్యం ఏమిటి? ప్రభుత్వ ఎరువులకు, మార్కెట్ లో ఎరువులకు తేడా లేకుండా చేసి రైతులంతా బహుళజాతి కంపెనీల ఎరువులను తప్పనిసరిగా కొనుగోలు చేసేలా మళ్లించడం. డీజెల్, పెట్రోల్, కిరోసిన్, గ్యాస్ తదితర ఇంధనాల సబ్సిడీ రద్దు/కోత లక్ష్యం ఏమిటి? యు.పి.ఎ నియమించిన రంగరాజన్ కమిటీ సదరు లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పింది. దేశంలో ఇంధన ధరల్ని అంతర్జాతీయ ధరలతో సమానం చేసి తద్వారా విదేశీ పెట్టుబడులకు ఇండియా ఇంధన మార్కెట్ ను ఆకర్షణీయంగా మార్చడం అని ఆ కమిటీ చెప్పింది. అంటే భారత ప్రజల కొనుగోలు శక్తితో సంబంధం లేకుండా, వారి ఆదాయాలు పెంచే మార్గాలు చూడకుండా, సొంతగా ఏర్పాటు చేసుకున్న ఆదాయ మార్గాలను కూడా మూసివేసి మొత్తాన్ని తీసుకెళ్లి విదేశీ బహుళజాతి కంపెనీల మార్కెట్ గా అప్పగించడమే సబ్సిడీల రద్దు/కోత లక్ష్యం.

ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఆదాయ పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలి. ఆదాయం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి. పరిమిత వనరుల్ని కాపాడుకుంటూ అవి ప్రజలకే ఉపయోగపడేలా జాగ్రత్త తీసుకోవాలి. కానీ కాంగ్రెస్, బి.జె.పి, ఎస్.పి. టి.డి.పి… ఇలాంటి ప్రభుత్వాలన్నీ చేస్తున్నది ఇందుకు పూర్తిగా విరుద్ధం. ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు విదిలించే అప్పుల మెతుకుల కోసం సమస్త ఆదాయ వనరులని తీసుకెళ్లి విదేశీ బహుళజాతి కంపెనీలకీ, వారి సేవకులైన దేశీయ దళారీ పెట్టుబడిదారులకి, ఇతర భూస్వామ్య ధనికవర్గాలకి అప్పగించడమే మన పాలకులు సాగిస్తున్న ప్రజా పాలన! వ్యవసాయాన్ని దండగ చేసిన ఇలాంటి రాకాసుల పాలనలో దారులన్నీ మూసుకుపోయిన పరిస్ధితిలో, ప్రైవేటు రుణాలను తీర్చలేని పరిస్ధితిలో రైతు ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని తలపోస్తే దాన్ని నేరంగా చెప్పగల హృదయరాహిత్యం బి.జె.పి, టి.డి.పి పాలకులకే చెల్లింది.

ప్రధాని నరేంద్ర మోడి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మంచి రోజులు (అచ్చే దిన్) భారత రైతులకు, కార్మికులకు, ఇతర శ్రమ జీవులకు కాదని, స్వదేశీ-విదేశీ సంపన్నులకేనని చెప్పడంలో ఇంకా అనుమానమా?!!

One thought on “ఆత్మహత్య రైతులు పిరికిపందలు, నేరస్ధులు -బి.జె.పి

  1. సాయం చేయరు సరికదా……ఆఖరికి సానుభూతి కూడా లభించకుండా కుట్ర చేస్తున్నారన్నమాట. రైతులు పిరికి పందలు ఎప్పటికీ కారు. ప్రభుత్వం సాయం కోసం ఏ రైతూ ఎదురు చూడడు.
    రైతు ప్రకృతిని నమ్ముకుంటాడు కానీ ప్రభుత్వాన్ని కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s