అభివృద్ధి పేరుతో భారత పాలకులు రైతుల మనుగడను ఏ స్ధాయిలో ప్రశ్నార్ధకం చేస్తున్నారో పట్టిస్తున్న కార్టూన్ ఇది!
పాలకులు నిత్యం అభివృద్ధి మంత్రం జపిస్తారు గానీ ఆ అభివృద్ధి ఎవరికి చెందినదో ఎప్పుడూ చెప్పరు. అసలు 66 యేళ్ళ స్వతంత్రావనిలో అభివృద్ధి లేకుండా ఎలా పోయిందో మొదట వారు చెప్పాలి. ఈ ప్రశ్నకు సమాధానాన్ని వారు పార్టీల మధ్య తగాదా స్ధాయికి కుదించి జనాన్ని కూడా అదే నమ్మమంటారు.
పాలకవర్గ పార్టీలన్నింటి వెనుకా ఉన్నది ఒకే దోపిడీ వర్గం అనీ, వారి ప్రయోజనాలు ఒకటేనని తెలియకపోతే ఈ అభివృద్ధి మంత్రం వెనుక దాగిన మతలబు ఏమిటో అంతుబట్టదు. వివిధ పాలకవర్గ గ్రూపుల మధ్య తలెత్తే వైరుధ్యాలను ప్రజల మీద రుద్ది పబ్బం గడుపుకోవడం సదరు వర్గాలకు వెన్నతో పెట్టిన విద్య. లేదంటే యు.పి.ఏ-ఎన్.డి.ఏ లు సంయుక్తంగా ఆమోదించిన భూ సేకరణ బిల్లుకు ఎన్.డి.ఏ సవరణలు తేవడం ఏమిటి? ఆ సవరణలపై కాంగ్రెస్ యుద్ధం ప్రకటించడం ఏమిటి?
కొద్ది మంది స్వదేశీ, విదేశీ ప్రైవేటు బహుళజాతి కంపెనీల ‘అభివృద్ధి’ మంటల్లో సామాన్య జనం శలభాల్లా మాడిపోతున్నా సరే, అది అభివృద్ధి కాబట్టి భరించాలంటారు. ప్రైవేటు ఆస్తికి చట్టపరమైన రక్షణ ఇచ్చి అదే చేత్తో రైతుల భూమి హక్కులను లాక్కోవడం కూడా ప్రజాస్వామ్య అభివృద్ధిలో భాగం అని నమ్మ బలుకుతారు. గిరిజనాన్ని అడవుల నుండి తన్ని తగలేసి వారి నివాస, ఆస్తి హక్కులను కాలరాచి, అదేమని అడిగితే, ‘మరి అభివృద్ధి ఎలా?’ అని అమాయకంగా ప్రశ్నిస్తారు.
ఒక పక్క దేశంలో సంపదలన్నీ ధనికవర్గాల పరం చేసేస్తారు. దానితో సంపదలన్నీ కొద్దిమంది దగ్గరే కేంద్రీకృతం అవుతాయి. మరో పక్క ప్రజల కొనుగోలు శక్తిని పీల్చి పిప్పి చేస్తారు. అనగా సరుకులకు మార్కెట్ లేని పరిస్ధితిని తామే కల్పిస్తారు. ఇది అనివార్యంగా సామాజిక అసంతృప్తికి దరిమిలా ఘర్షణలకు, ఉద్యమాలకు దారి తీస్తుంది.
భారత సామాజిక వ్యవస్ధ అటూ ఇటూ కానీ నడమంత్రపు సంబంధాల వ్యవస్ధ. సామాజిక దశలన్నీ కొలువు తీరినట్లు కనపడే మధ్యరకం వ్యవస్ధ. పెట్టుబడిదారీ సంబంధాలు, భూస్వామ్య సంబంధాలతో పాటు పైకి కనపడని వెట్టి చాకిరీ బానిసత్వం కూడా నెలకొని ఉన్న వ్యవస్ధ. ఈ దేశ సామాజిక వ్యవస్ధ తన దారిన తాను అభివృద్ధి చెందకుండా బ్రిటిష్ వలస పాలన ఆటంకపరచడం వలన ఇలాంటి ఇతమిద్ధమైన రూపం లేని అయోమయ వ్యవస్ధ వెలిసి కొనసాగుతోంది.
ఈ అయోమయంలో ఆలోచనాపరులు కూడా పడి కొట్టుకుపోవడం శోచనీయం. రైతాంగం పరిస్ధితి మెరుగుపడకుండా దేశం పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి ఎలా ప్రయాణం కడుతుందో చెప్పేవారు లేరు. భూస్వామ్యానికి పట్టుగొమ్మ అయిన కుల వైరుధ్యం కొనసాగుతుండగానే భూమి లేని పేద రైతు కూలి చెంతకు అభివృద్ధి ఎలా చేరుతుందో చెప్పగల మెదడు లేదు. మార్పు మాత్రం వచ్చేసిందని, అభివృద్ధి విరగ కాస్తోందని సూత్రీకరించే ‘మేతావుల’కు మాత్రం కొదవలేకుండా పోయింది.
జాతి భూమిని బలి గోరుతున్న స్వదేశీ దళారీ పెట్టుబడి, విదేశీ సామ్రాజ్యవాద పెట్టుబడి ముట్టడిలో రైతు భవిష్యత్తుకు గ్యారంటీ లేదు. అలాగని రైతుకు ప్రత్యామ్నాయం చూపే వ్యవస్ధా కాదు. దానితో రైతులు కూలీలై వలస కార్మికులుగా స్ధిరపడిపోతున్నారు. అదీ దక్కనివారు సైతం ఎంతో మంది! వెరసి పరిశ్రమల కోసం అంటూ గ్రామాలు, అటవీ సంపదలోకి చొరబడుతున్న బూటకపు అభివృద్ధి దేశాన్ని బహుళజాతి సామ్రాజ్యవాద కంపెనీలకు అనుబంధంగా మార్చివేశారు. ఉరిని ఆహ్వానించడమా లేక ప్రతిఘటించడమా అన్నది తేల్చుకోవలసిన అగత్యం రైతును సమీపించింది.
రైతాంగం పరిస్ధితి మెరుగుపడకుండా దేశం పెట్టుబడిదారీ వ్యవస్ధలోకి ఎలా ప్రయాణం కడుతుందో చెప్పేవారు లేరు.
ఐరోపా,ఉత్తర అమెరికా లలో రైతుపరిస్థితి మెరుగుపడినతరువాతే పెట్టుబడీవ్యవస్థ అభివృద్ధిచెందిందా?
అవును. పశ్చిమ దేశాల్లో మొదట ప్రజాస్వామిక విప్లవాలు జరిగాయి. పెట్టుబడిదారుల నాయకత్వంలో రైతులు, కార్మికులు సాగించే విప్లవం ప్రజాస్వామిక విప్లవం. ఇక్కడ పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా అభివృద్ధి చెందకుండా వలస పాలకులు అడ్డుకున్నారు. వారిని తమ జూనియర్ భాగస్వాములుగా చేర్చుకున్నారు. జాతీయ పెట్టుబడిదారీ వర్గం స్వతంత్రంగా అభివృద్ధి చెందడం అంటే ఏమిటో ఇరాన్, సిరియా, పాత లిబియా, క్యూబా, ఇప్పటి వెనిజులా, ఈక్వడార్ లాంటి దేశాలను చూసి తెలుసుకోవచ్చు. అలాంటి దేశాలపైన సామ్రాజ్యవాదులు కత్తి కడతారు. సాధిస్తారు. వారి ఒత్తిడికి లొంగితే వారు దళారీ పెట్టుబడిదారులు అవుతారు. ప్రజాస్వామిక విప్లవాల్లో భూ పంపిణీ ప్రజాస్వామికంగా జరుగుతుంది. అది క్రమంగా వ్యవసాయం లోనూ పెట్టుబడిదారీ విధానం ప్రవేశించడానికి దారి తీస్తుంది. కాస్త అటు ఇటూగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో ఇదే క్రమం నడిచింది.
రైతుల పరిస్ధితి మెరుగుపడడం అంటే ప్రజాస్వామిక విప్లవం అర్ధంలో చూడాలి.