నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు


నేపాల్ ను తాకిన భారీ భూకంపం ఆ చిన్న దేశంలో విలయాన్ని సృష్టించింది. ఇటీవలి వరకూ కొనసాగిన శతాబ్దాల నాటి భూస్వామ్య రాచరిక పాలన దేశ సంపదలను కొన్ని కుటుంబాల చేతుల్లోనే కేంద్రీకరింపజేయడంతో ఇప్పుడది ప్రకృతి విలయానంతర రక్షణ ఏర్పాట్లు చేయడంలో కూడా ఘోరంగా విఫలం అవుతోంది. సంపన్న కుటుంబాలు ప్రభుత్వాన్ని, ప్రజలను పేదరికంలోకి నెట్టడంతో రక్షణ పరికరాలు కొరవడి, తగిన శిక్షణ లేని భద్రతా సిబ్బంది తెల్లమొఖం వేయడంతో జనమే పూనుకుని తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు.

నేపాల్ రాజధాని ఖాట్మండును భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు ఖాట్మండు వీధుల్లో మనుషులు నడిచేందుకు కూడా దారి లేదు. దానిక్కారణం ప్రజలు ఇళ్ళు వదిలి రోడ్లపై శరణు తీసుకోవడమే. కనీసం తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేయగల పరిస్ధితిలో కూడా ప్రభుత్వం లేకపోవడంతో జనం రోడ్లపై ఆరు బయట బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు.

నేపాల్ హోమ్ శాఖ ప్రకారం ఇప్పటివరకు 2,263 మంది శవాలను శిధిలాల నుండి వెలికి తీశారు. మరిన్ని మృత దేహాలు వెలికి తీయవలసి ఉందని అధికారులు చెబుతున్నారు. విదేశీ టూరిస్టులు కనీసం 200 మంది వరకు జాడ తెలియడం లేదని తెలుస్తోంది. హిమాలయాల పాదాల చెంతనే భూకంపం కేంద్రం ఉండడంతో పర్వత శ్రేణులపై హిమపాతాలు (avalanche) సంభవించాయి. ఈ హిమపాతాల కింద ఇరుక్కుని అనేకమంది టూరిస్టులు చనిపోయారు.

ముందే తెలుసు

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.8 గా నమోదయింది. కొన్ని పత్రికలు దీనిని 7.9 గా చెబుతున్నాయి. భూకంప కేంద్రం ఖాట్మండుకు 50 మైళ్ళ దూరంలో, భూ ఉపరితలానికి 10 మైళ్ళ లోతున ఉన్నట్లు జియాలిస్టులు తేల్చారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే నేపాల్ లో భూకంపం సంభవిస్తుందని ప్రపంచవ్యాపితంగా జియాలిస్టులకు ముందే తెలుసు. భూగర్భం లోని టెక్టోనిక్ పలకల కదలికలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసే భూగర్భ శాస్త్రవేత్తలు త్వరలో నేపాల్ లో భూకంపం సంభవిస్తుందని అంచనా వేశారు. అయితే అది ఇంత త్వరగా సంభవిస్తుందని వారు అంచనా వేయలేదని తెలుస్తోంది.

ఒక వారం రోజుల క్రితమే ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన 50 మంది భూగర్భ శాస్త్రవేత్తలు నేపాల్ కు వచ్చి అధ్యయనాలు జరిపారు. సమావేశాలు జరిపి భూకంపం ఆగమనం గురించి చర్చించారు. ఇప్పుడు ఏయే ప్రాంతాలైతే భూకంపం తాకిడికి గురయ్యాయో సరిగ్గా అవే ప్రాంతాలను, రోడ్లను వారు సర్వే చేశారు.

“సరిగ్గా భూకంపం సంభవించిన ప్రాంతంలోనే వారం రోజుల క్రితం నేను నడిచాను. ఆ ప్రాంతమే త్వరలో కష్టాలు ఎదుర్కొనుందని తలచాను” అని ఇంగ్లండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి వచ్చిన భూకంప శాస్త్రవేత్త జేమ్స్ జాక్సన్ చెప్పారని ది హిందు తెలిపింది. “ఇది సంభవించడానికి ఎదురు చూస్తున్న పీడకల! భౌతికంగా, భూగర్భ శాస్త్ర పరంగా ఏది జరుగుతుందని మేము అనుకున్నామో అదే జరిగింది” అని జాక్సన్ చెప్పారు.

ఖాట్మండు భూకంప విధ్వంసం భూగర్భ పలకల కదలికల వల్లనే కాకుండా మానవ పరంగా కూడా సంభవించిన వినాశనం అని అమెరికా సిస్మాలజిస్టు డేవిడ్ వాల్డ్ అభిప్రాయం. భూకంపం ప్రకృతిపరంగా సంభవించినదే అయినా దానివల్ల సంభవించిన మానవ నష్టం మాత్రం మానవులు చేసుకున్నదే అని ఆయన ఎత్తి చూపారు. స్ధానికంగా ఉన్న సంప్రదాయాల వలన ఆస్తులను కొడుకుల మధ్య సమానంగా పంచాల్సి ఉంటుందని దానితో ఇళ్లను నిలువుగా విభజిస్తూ పోవడం వల్ల ఇరుకుగా మారి తక్కువ స్ధలంలో ఎక్కువమంది నివశించవలసిన పరిస్ధితి వచ్చిందని, ఇది ఒత్తిడిని మరింత తీవ్రం చేసి ఎక్కువమంది శిధిలాల్లో చిక్కుకుపోవడానికి కారణం అయిందని డేవిడ్ వివరించారు.

“ఆసియాలో వాస్తవ సమస్య ఏమిటంటే ప్రజలు ప్రమాదకర ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీకృతం అయి ఉన్నారు” అని ఆయన చెప్పారు. “విధ్వంసం జరగనుందని వారికి (నేపాల్ పాలకులకు) తెలిసినప్పటికీ అంత పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ఏర్పాట్లను ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని పరిస్ధితిలో ఉన్నారు” అని డేవిడ్ తెలిపారు.

భూకంపానంతర కంపాలు (aftershocks) సైతం తీవ్ర స్ధాయిలో సంభావిస్తున్నాయి. దానితో ప్రజలు మరింతగా భయాందోళనలకు గురవుతున్నారు. ఆదివారం సంభవించిన ఒక ఆఫ్టర్ షాక్ తీవ్రత 6.7 గా నమోదు కావడం బట్టి పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. వీటివల్ల మిగిలి ఉన్న ఇళ్లలోకి వెళ్ళేందుకు ప్రజలు సుతారాము ఇష్టపడడం లేదు. భయకంపితులై రోడ్లపైనే జీవనం సాగిస్తున్నారు.

న్యూ యార్క్ టైమ్స్ పత్రిక ప్రకారం అత్యంత తీవ్రమైన, వినాశకరమైన ఆఫ్టర్ షాక్ లు ఇంకా రావలసి ఉందన్న పుకార్లు నేపాల్ లో దావానలంలా వ్యాపించాయి. ఇవి గ్రామాలను మరింత విధ్వంసం కావిస్తాయని, భీకర వినాశనం తప్పదని పుకార్ల సారాంశం. కనీసం ఫోన్ లైన్లకు కూడా దూరంగా ఉన్న గ్రామీణులను ఈ పుకార్లు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కూలిపోకుండా మిగిలిన గ్రామాలు చాలా ఉన్నాయని నేపాలీ పత్రిక రిపబ్లికా ఎడిటర్ చెప్పారని టైమ్స్ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఖాట్మండులో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఖాట్మండు ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోనున్నారు. వారికిక వీధులు కూడా కరువవుతాయి.

ఎవరెస్ట్ పర్వతారోహకులు అనేకమంది హిమపాతాల్లో చిక్కుకున్నారు. ఆదివారం వెతుకులాట జరిపిన హెలికాప్టర్లు 18  మంది మృత దేహాలను కిందికి తెచ్చాయి. పదుల కొద్దీ గాయపడిన పర్వతారోహకులను హెలికాప్టర్లు కాపాడి కిందికి తెచ్చాయి. కనీసం 41 మంది గాయపడ్డవారిని హెలికాప్టర్లు కాపాడాయని టైమ్స్ తెలిపింది. ఎవరెస్ట్ బేస్ క్యాంపులో మిగిలిపోయిన 800 మంది మరిన్ని హిమపాతాలను ఎదుర్కోవలసిన ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. బేస్ క్యాంపుల నుండి బైటపడేందుకు బయలుదేరిన 25 మంది పర్వతారోహకులు, సహాయకులు కనిపించకుండా పోయారని తెలుస్తోంది.

నేపాల్ లో పని చేస్తున్న ప్రభుత్వం లేకపోవడం భూకంప బాధితుల కష్టాలను రెట్టింపు చేసింది. రాచరికం రద్దయిందని ప్రకటించిన తర్వాత దేశానికి రాజ్యాంగం రాయడమే పూర్తి కాలేదు. వరుసగా మూడు రాజ్యాంగ సభలు ఎన్నికల ద్వారా ఏర్పాటయినప్పటికీ రాజ్యాంగ రచనలో ప్రతిష్టంభన ఏర్పడింది. రాజకీయ పార్టీల మధ్య కనీస ఏకాభిప్రాయం కొరవడడంతో రాజ్యాంగ సభ కూడా పని చేయడం లేదు. పేరుకే ప్రధాన మంత్రి నియమితులయ్యారే గాని ఆయనకు అధికారాలు పెద్దగా లేవు. అధికారాలు ఇవ్వగల రాజ్యాంగ రచన సాగడం లేదు.

దేశంలో అణచివేతకు గురవుతున్న మైనారిటీ జాతుల ప్రజలకు అధికారంలో తగిన వాటా ఇవ్వడానికి మావోయిస్టేతర ప్రధాన పార్టీలు నిరాకరిస్తున్నాయి. రాజ్యాంగంలో వారి హక్కులను కాపాడే అవకాశాలు పొందుపరిచేందుకు తిరస్కరిస్తున్నాయి. వారి తిరస్కరణను మావోయిస్టు పార్టీ ప్రతిఘటిస్తోంది. మావోయిస్టులను కాదని ముందుకు వెళ్తే కోరి కోరి మావోయిస్టుల ప్రతిష్ట పెంచినవారం అవుతామని అధికార నేపాలీ కాంగ్రెస్ తదితర పార్టీలు భయపడుతున్నాయి. ఈ నేపధ్యంలో భూకంపం విధ్వంసం నుండి ప్రజలకు ఉపశమనం కూడా ప్రభుత్వం నుండి లభించే పరిస్ధితి లేదు. ఇండియా, చైనా దేశాలు, ఇతర అంతర్జాతీయ సంస్ధలు అందిస్తున్న సహాయం పైనే నేపాల్ భూకంపం అనంతర రక్షణ చర్యలు ఆధారపడి కొనసాగుతున్నాయి.

ఇండియాలో కూడా

నేపాల్ భూకంపం ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించడంతో విధ్వంసం భారత్ కు కూడా పాకింది. కనీసం 5 రాష్ట్రాలలో ప్రజలు మృత్యువాత పట్టారు. అనేక భవనాలు సైతం నేలమట్టం అయ్యాయి. నేపాల్ కు అనుకుని ఉన్న బీహార్ లో అత్యధికంగా 42 మంది చనిపోయారు. 156 మంది గాయపడ్డారు. 53 భవనాలు కూలిపోయాయి. ఉత్తర ప్రదేశ్ లో 12 మంది చనిపోగా 46 మంది గాయపడ్డారు. కనీసం నాలుగైదు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి. పశ్చిమ బెంగాల్ లో 54 మంది గాయపడ్డారు. చనిపోయిన వారి సంఖ్య ఇతమిద్ధంగా తేలలేదు. మొత్తం మీద ఇండియాలో 57 మంది మృత్యువాత పడ్డారని తెలుస్తోంది. సిక్కిం, రాజస్ధాన్ రాష్ట్రాలు కూడా నేపాల్ భూకంపంకు ప్రభావితం అయ్యాయి.

Photos: The Atlantic

One thought on “నేపాల్ భూకంపం: మృతులు 2200 పైనే -ఫోటోలు

  1. నేపాల్ భూకంప ఫోటోలు చూస్తుంటే పరిస్థితి దయనీయంగా కనిపిస్తోంది. మొన్న పాక్ లో,ఇప్పుడు నేపాల్ లో….మునుముందు భారత ఉపఖండం జాగ్రత్త పడాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. శేఖర్ గారు…మీరు చెప్పిన ప్రకారం భూకంపం గురించి తెలిసీ అసహాయంగా ఉండడం ఘోరం. పేద దేశాల ప్రజల ప్రాణం అంటే లెక్కలేదన్న మాట. అదే ఏ యూరప్ లోని దేశంలో భూకంపం వస్తుందని తెలిసినా చూస్తూ ఉండేవారా .?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s