గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?


Anti-Troika protest in Greece

Anti-Troika protest in Greece

ఋణ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఐరోపా రాజ్యాలు గ్రీసు దివాలా తీసే పరిస్ధితికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. యూరో జోన్ (యూరోను ఉమ్మడి కరెన్సీగా కలిగి ఉన్న 17 ఈ.యు సభ్య దేశాల సమూహం) నాయకురాలైన జర్మనీ ఆర్ధిక మంత్రి ఈ మేరకు తగిన సూచనలు ఇస్తున్నట్లు వాణిజ్య పత్రికలు, పరిశీలకులు భావిస్తున్నారు.

గ్రీసు తన జాతీయ కరెన్సీ డ్రాక్మాను రద్దు చేసుకుని యూరోను తమ కరెన్సీగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 2008 నాటి ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభం దరిమిలా 2010 నుండి ఐరోపా దేశాలు ముఖ్యంగా యూరో జోన్ దేశాలు ఋణ సంక్షోభంలో కూరుకుపోయాయి. ఐరోపా దేశాల సంక్షోభాన్ని ఋణ సంక్షోభంగా ప్రత్యేకంగా చెప్పినప్పటికీ వాస్తవానికి అది కూడా ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభంలో భాగమే.

సామ్రాజ్యవాద దేశాలు ఎదుర్కొంటున్న సాధారణ సంక్షోభం ప్రపంచ ద్రవ్య-ఆర్ధిక సంక్షోభంగానూ, యూరో జోన్ ఋణ సంక్షోభం గానూ వ్యక్తీకృతం అవుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్ధ నిరంతరం సంక్షోభాలు ఎదుర్కొంటుందన్న నిజాన్ని కప్పిపుచ్చేందుకు ఇలా వివిధ పేర్లతో పిలుస్తూ వేటికవే ప్రత్యేకం అన్నట్లుగా, వేటికవే ప్రత్యేక కారణాలు ఉన్నట్లుగా పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు చెబుతుంటారు.

ఋణ సంక్షోభం అంటే జాతీయ ప్రభుత్వం లేదా జాతీయ ఆర్ధిక వ్యవస్ధ భారీ ఋణ భారాన్ని ఎదుర్కొంటూ, మరింత రుణం ఇస్తే తిరిగి చెల్లించలేదేమో అన్న భయాల రీత్యా, మళ్ళీ కొత్త రుణాలను మార్కెట్ నుండి సేకరించలేకపోవడం. బెలూన్ లో పరిమితికి మించి గాలి నింపితే బలహీనంగా ఉన్న చోటు చూసుకుని బెలూన్ నుండి గాలి ఒక్కసారిగా బైటపడుతుంది. అది పెద్ద శబ్దంతో బెలూన్ పేలుడుగా మనకు కనిపిస్తుంది. యూరో జోన్ ఋణ సంక్షోభమూ అంతే. యూరో జోన్ సభ్య దేశాలన్నీ ఏటికేడూ రుణాలు పెంచుకుంటూ పోయాయి. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం దరిమిలా ఇది మరింత తీవ్రమై బలహీన ఆర్ధిక వ్యవస్ధగా మారిన గ్రీసు ఋణ సంక్షోభం ద్వారా బద్దలయింది.

ఉమ్మడి యూరో కరెన్సీ వలన గ్రీసు ఋణ సంక్షోభం ఇతర యూరో జోన్ దేశాలకూ క్రమంగా పాకిపోయింది. పోర్చుగల్, ఐర్లాండ్, సైప్రస్, స్పెయిన్, ఇటలీ… ఇలా వరుసగా యూరో దేశాలను ఋణ సంక్షోభం చుట్టుముట్టింది. అనగా ఈ దేశాలకు రుణం ఇవ్వడానికి లేదా ఆ దేశాలు జారీ చేసే ట్రెజరీ బిల్లులు/సావరిన్ బాండ్లు/సార్వభౌమ రుణపత్రాలను కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్ ప్లేయర్లు (వ్యక్తిగత ధనికులు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు, ఇతర ద్రవ్య సంస్ధలు, ఇతర జాతీయ ప్రభుత్వాలు…) ముందుకు రావడం తగ్గిపోయింది. గ్రీసు, ఐర్లాండ్, సైప్రస్ లాంటి దేశాలకైతే అసలు రుణమే పుట్టని పరిస్ధితి వచ్చింది.

ఈ దశలో యూరో జోన్ లోని ఋణ పీడిత దేశాలను ఆదుకుంటామని ఐ.ఎం.ఎఫ్, యూరోపియన్ కమిషన్ (ఇ.సి), యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు -ఇ.సి.బి- (ఈ మూడింటిని కలిపి యూరోపియన్ ట్రొయికా లేదా సింపుల్ గా ట్రొయికా అని పిలుస్తారు) ముందుకు వచ్చాయి. ఇవి ముందుకు రావడంలో వాటి లక్ష్యం గ్రీసును ఆదుకోవడమే అని భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. గ్రీసుకు అప్పు ఇచ్చిన సంస్ధల్లో ఐరోపాలోని ప్రధాన రాజ్యాలయిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం… మొదలయిన దేశాల బ్యాంకులు, కంపెనీలు, ద్రవ్య సంస్ధలు ఉన్నాయి. వాల్ స్ట్రీట్ కంపెనీలు, ద సిటీ బ్యాంకులు ఉన్నాయి. గ్రీసు దివాలా తీస్తే లేదా అప్పు ఎగ్గొడితే నష్టపోయేది వారే. అందుకే గ్రీసును ఆదుకుంటామని అవి అర్జెంటుగా ముందుకు వచ్చాయి.

అనేక చర్చోప చర్చలు జరిపి, గ్రీసుపై సవాలక్షా షరతులు విధించి ఇప్పటిదాకా 230 బిలియన్ యూరోల రుణాలను సమకూర్చాయి. పేరుకు గ్రీసుకు ఇవ్వడమే గానీ ఆ రుణం తిరిగి పాత అప్పులు తీర్చడానికే సరిపోలేదు. కానీ సరసమైన రుణం పేరుతో ఇచ్చిన ఈ బెయిలౌట్ రుణంలోని ప్రతి విడతను విడుదల చేసేముందు దశలవారిగా విషమ షరతులను అమలు చేస్తూ పోయాయి. ఈ షరతుల సారాంశం రద్దులు, కోతలు, పెంపులు! గ్రీకు ప్రజలకు ఇస్తున్న సబ్సిడీలు, సౌకర్యాలు తదితర ప్రయోజనాలను రద్దు చేయడం, పెన్షన్-వేతనాలు-సదుపాయాలలో కోత పెట్టడం, పన్నులు-ధరలు-ఛార్జీలు అలవిగాని స్ధాయికి పెంచి వేయడం. చివరికి గ్రీసు బడ్జెట్ ను సైతం పెత్తందారీ దేశాలు (ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్ వారి కింద ఉన్న ఇసిబి, ఐ.ఎం.ఎఫ్, ఇ.సి) తమ చేతుల్లోకి తీసుకున్నాయి. రుణం పొందాలంటే గ్రీసు తన సార్వభౌమాధికారాన్ని పాక్షికంగా వదులుకోక తప్పదని బహిరంగంగా ప్రకటించడానికి సైతం జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వెనుదీయలేదు.

ట్రొయికా విధించిన విషమ షరతుల వల్ల గ్రీసు రుణం తగ్గకపోగా మరింతగా పెరిగింది. గ్రీసు జి.డి.పి 100 యూరోలు అయితే ఆ దేశ రుణం 175 యూరోలకు చేరుకుంది. నిరుద్యోగం 25 శాతానికి చేరుకుంది. యువకుల్లో నిరుద్యోగం ఏకంగా 50 శాతంగా నమోదవుతోంది. యూరో జోన్ లో సగటు నిరుద్యోగం 11.4 శాతం ఉంటే, సగటు యువత నిరుద్యోగం 23 శాతం ఉండడం విశేషం. అప్పటికీ గ్రీసు ఋణ భారం చుక్కల్ని తాకడంతో ఆ దేశంపై విధిస్తున్న షరతులకు ప్రజల ఆమోదం పొందడానికి కొంత రుణాన్ని రీ షెడ్యూల్ చెయ్యడమో, రద్దు చేయడమో చేశాయి. అంత చేసినా ఋణ భారం తగ్గకపోగా పెరిగిందంటే ట్రొయికా ఇచ్చిన బెయిలౌట్ రుణం ఎంత మోసమో అర్ధం చేసుకోవచ్చు. ఈ రుణాలను గ్రీసు ప్రజలు తీరుస్తుండగా రుణాలు మాత్రం మళ్ళీ సామ్రాజ్యవాద బహుళజాతి గుత్త కంపెనీల జేబుల్లోకే వెళ్లిపోయాయి.

ఈ నేపధ్యంలో గత జనవరిలో జరిగిన ఎన్నికల్లో రాడికల్ వామపక్ష కూటమిగా పేరు పొందిన సిరిజా కూటమి గెలుపొందింది. ట్రొయికా విధించిన షరతులను తిరస్కరిస్తామని, బలవంతంగా రుద్దిన రుణాలను చెల్లించబోమని, కోతలు, రద్దులు పాటించబోమని హామీలు ఇవ్వడం వల్ల గ్రీసు ప్రజలు సిరిజాను గెలిపించారు. అయితే అధికారం లోకి వచ్చాక సిరిజా కూటమి తాను ఇచ్చిన హామీల నుండి వెనక్కి తగ్గింది. జర్మనీ, ఫ్రాన్స్ తదితర రాజ్యాల ఒత్తిడిని హామీ ఇచ్చిన రీతిలో ఎదుర్కొనలేకపోతోంది. వద్దు వద్దు అంటూనే బెయిలౌట్ రుణం చివరి విడత 7.2 బిలియన్ యూరోల కోసం బేరసారాలు సాగిస్తోంది.

గ్రీసు కొత్త ప్రభుత్వం చేస్తున్న బేరాలకు జర్మనీ, ఇ.సి.బి, ఐ.ఎం.ఎఫ్ లు ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. తమ షరతులను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిందేనని పట్టుబట్టాయి. లేకపోతే 7.2 బిలియన్ యూరోలలో ఒక్క పైసా ఇచ్చేదీ లేదని తెగేసి చెప్పాయి. లాత్వియా రాజధాని రిగాలో జరుగుతున్న యూరో జోన్ ఆర్ధిక మంత్రుల సమావేశంలో గ్రీసుకు తీవ్ర స్ధాయి హెచ్చరికలు జారీ చేశాయి. తమ సంస్కరణల పధకాన్ని పూర్తిగా అమలు చెయకుండా చివరి విడత రుణం ఇవ్వబోమని హెచ్చరించారు.

జర్మనీ ఆర్ధిక మంత్రి వొల్ఫ్ గాంగ్ షాబుల్ అయితే తాము ‘ప్లాన్ బి’ కి సిద్ధపడుతున్నామని సూచన ఇచ్చాడు. ప్లాన్ బి అంటే గ్రీసు దివాళా తీసే పరిస్ధితికి తాము సిద్ధపడడం. దివాళా తీయడం అంటే గ్రీసు ఇవ్వాల్సిన ఋణ చెల్లింపులను తగిన సమయంలో చెల్లించలేకపోవడం. గ్రీసు వద్ద ధనం వేగంగా నిండుకుంటోంది. అప్పు గడువు సమీపిస్తోంది. ట్రొయికా 7.2 బిలియన్ యూరోలు విడుదల చేస్తే తప్ప గడువు నాడు ఇవ్వాల్సిన వడ్డీలు ఇవ్వలేని పరిస్ధితి! తమ అప్పుపై విధించిన షరతులను సడలిస్తే తప్ప సంస్కరణలు/షరతులు అమలు చేయలేమని గ్రీసు ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగాలు మరిన్ని రద్దు చేయడం, పెన్షన్ లలో ఇంకా కోతలు పెట్టడం, తద్వారా బడ్జెట్ మిగులును కృత్రిమంగా చూపడం తమ వల్ల కాదని వారు చెబుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు వెన్నాడుతుండడంతో ఈ మాత్రం గట్టిగా అయినా గ్రీసు పాలకులు మాట్లాడవలసి వస్తోంది.

గ్రీసు గడువు లోపు రుణం చెల్లించలేకపోతే ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలిస్తారా అన్న ప్రశ్నకు జర్మనీ ఆర్ధిక మంత్రి “మీరు బాధ్యతాయుత రాజకీయ నాయకులను ప్రత్యామ్నాయం గురించి అడగకూడదు” అని బదులిచ్చారు. అనగా తాను బాధ్యతాయుత రాజకీయవేత్తను గనుక ప్లాన్ బి గురించి బహిరంగంగా ఎందుకు చెబుతాను అని ఆయన ఎదురు ప్రశ్నించారు. 1989లో జర్మనీల ఐక్యత గురించి తాము గోప్యత పాటించామని, అప్పటిలాగే ఇప్పుడూ గోప్యత పాటిస్తున్నామని ఆయన చెప్పారు. అనగా గ్రీసుకు 7.2 బిలియన్ యూరోల రుణాన్ని విడుదల చేయడం జరగదని ఆయన దాదాపు చెప్పినట్లే.

ఇదే జరిగితే రుణాల చెల్లింపు గ్రీసుకు సాధ్యం కాదు. గ్రీసు గడువు తేదీన నిర్వహించవలసిన రుణ సేవలను (వడ్డీ చెల్లింపులను) నిర్వహించలేకపోతే ఏమి జరుగుతుంది? మరొకసారి సంక్షోభం వాకిట ప్రపంచం నిలబడుతుంది. ఎందుకంటే గ్రీసు రుణం ఎగవేస్తే అది యూరో జోన్ నుండి గ్రీసు నిష్క్రమణను ఖాయం చేస్తుంది. గ్రీసు తన జాతీయ కరెన్సీని డ్రాక్మాను పునరుద్ధరిస్తుంది. ట్రొయికా విష కౌగిలి నుండి ఆ దేశం, ముఖ్యంగా ఆ దేశ ప్రజలు బైటపడతారు. గ్రీసు ఆర్ధిక సార్వభౌమత్వం పాక్షికంగా పునరుద్ధరించబడుతుంది. ఇది ఇతర యూరో జోన్ ఋణ పీడిత దేశాలకు మరింత నమ్మకం కలిగిస్తుంది. అవి కూడా యూరో జోన్ నుండి బైటికి వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. యూరో జోన్ లో ఉండడం కంటే (యూరో కరెన్సీ కంటే) బైట ఉండడమే (సొంత కరెన్సీ కలిగి ఉండడమే) బెటర్ అని అర్ధం అయ్యాక ఏ దేశం మాత్రం ఊరుకుంటుంది గనక? చివరికి యూరో జోన్ విచ్ఛిన్నానికి ఇది దారి తీయవచ్చు.

యూరో జోన్ విచ్ఛిన్నం అయితే ప్రపంచంలో ఒక ప్రధాన ఆర్ధిక కేంద్రం/ఒక ధ్రువం/ఒక సామ్రాజ్యవాద కేంద్రం బలహీనపడినట్లే.  అమెరికాకు ముఖ్యమైన తోడు దూరం అవుతుంది. ఇది చైనా, రష్యాలకు మరింత ఊపు ఇస్తుంది. ప్రపంచ ఆర్ధిక కేంద్రం పశ్చిమం నుండి తూర్పుకు జరిగే ప్రక్రియ ఇంకా వేగం అవుతుంది.

అందువల్ల గ్రీసును యూరో జోన్ లో ఉంచడానికే యూరో జోన్ పెద్దలు తీవ్రంగా ప్రయత్నిస్తారు. అలాగని గ్రీసు డిమాండ్లకు తల ఒగ్గినా కూడా యూరో జోన్ మనుగడ కష్టం అవుతుంది. ఇతర సభ్య దేశాలు సైతం అదే తరహా రుణాలు డిమాండ్ చేయవచ్చు. అలా చేస్తే యూరో జోన్ ఆర్ధిక శక్తి బలహీనం అవుతుంది. ముందు నుయ్యి వెనుక గొయ్యి!

పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దేశాల ఆర్ధిక వ్యవస్ధల లక్షణమే ఇది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలకు పెట్టుబడి ఒప్పుకోదు. పెట్టుబడి నిరంతరం బలి కోరుతూనే ఉంటుంది. సంతృప్తి అనేది అది ఎరగదు. ఆ క్రమంలో తనను తాను మింగివేసుకోవడానికి కూడా అది తెగిస్తుంది. కానీ అది జరగాలంటే కార్మికవర్గ పోరాటాలు మరింత తీవ్రంగా జరగాలి. లేదంటే పెట్టుబడికి మరింత ఆయుషు, ఎన్ని జబ్బులతోనైనా, సమకూరుతుంది.

One thought on “గ్రీసు దివాలాకు యూరప్ ఏర్పాట్లు?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s