అయిదేళ్ళ పాటు కొనసాగిన ప్రక్రియ అనంతరం, గూగుల్ కంపెనీ అనుచిత (వ్యాపార) పద్ధతులను పాటిస్తున్న ఆరోపణలపై విచారణ చేయనున్నట్లు యూరోపియన్ కమిషన్ లాంఛనంగా ప్రకటించింది. యూరప్ లో ఇంటర్నెట్ శోధన సేవల మార్కెట్ లో తనకున్న గుత్తస్వామ్యాన్ని తన స్వార్ధ ప్రయోజనాలకు గూగుల్ కంపెనీ వాడుకుంటోందన్నది ఆరోపణ. ప్రధాన ఆరోపణల్లో ఒకటి, గూగుల్ లో పోలిక కొనుగోళ్ళ (comparison shopping) పని పద్ధతికి సంబంధించినది. ‘ఉత్పత్తుల పోలిక కొనుగోలు’ విధానం, వినియోగదారులకు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్లను శోధించి వివిధ అమ్మకందారులు ఇవ్వజూపే ధరలను పోల్చుకుని నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తన సొంత షాపింగ్ వెబ్ సైట్ అయిన ‘గూగుల్ షాపింగ్’ అందిస్తున్న సేవలకు ఒక పద్ధతి ప్రకారం ప్రత్యర్ధి షాపింగ్ సేవల కంటే అధిక ప్రాధాన్యతను గూగుల్ కల్పిస్తోందని యూరోపియన్ కమిషన్ ప్రాధమిక విచారణలో తేలింది.
ఈ పద్ధతి వల్ల వివిధ వెబ్ సైట్ల మధ్య ట్రాఫిక్ ను వినియోగదారులకు నష్టం కలిగించే రీతిలో, నూతన ఆవిష్కరణలను నిర్మూలించ్ రీతిలోను కృత్రిమంగా దారిమళ్లిస్తోంది. యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి పోటీ-వ్యతిరేక ధోరణిలో వ్యవహరిస్తున్నదన్న ఆరోపణను కూడా గూగుల్ ఎదుర్కొంటోంది. తద్వారా ఓపెన్-సోర్స్ ఆపరేటింగ్ సిస్టం గా ఉండవలసిన యాండ్రాయిడ్ పై డెవలపర్లు స్వేచ్ఛగా పని చేయనివ్వకుండా ఆంటంకం కలిగిస్తోందని గూగుల్ పై వచ్చిన ఆరోపణ. యూరప్ లో ఆన్ లైన్ శోధన వ్యాపారంలో 90 శాతం వాటా గూగుల్ ఆధీనంలో ఉన్నందున “తన గుత్తస్వామ్యాన్ని దుర్వినియోగం చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. కమిషన్ తన పరిశోధనను చివారికంటా తీసుకెళ్లినట్లయితే కంపెనీపై విధించే జరిమానా గూగుల్ వార్షిక యూరప్ వ్యాపారంలో 10 శాతం, లేదా 6 బిలియన్ యూరోలు జరిమానాగా విధించే అవకాశం ఉంది.
అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ కూడా గూగుల్ కంపెనీపై యాంటీ-ట్రస్ట్ కేసు విషయమై పరిశోధన జరిపింది. అయితే తన పని పద్ధతిలో కొన్ని మార్పులు చేసుకోవడానికి గూగుల్ అంగీకరించడంతో అసలు లాంఛనప్రాయమైన ఫిర్యాదు లేకుండానే పరిశోధనను ముగించేశారు. ఆన్ లైన్ శోధన ప్రకటనల వ్యాపారం మార్కెట్ లో గూగుల్ “ఆధిపత్య స్ధానాన్ని” కలిగి ఉన్నదని భారత కాంపిటీషన్ కమిషన్ (సి.సి.ఐ) కనుగొంది. ఈ పరిస్ధితిని గూగుల్ దుర్వినియోగపరుస్తున్నదా అన్న అంశాన్ని సి.సి.ఐ పరిశోధిస్తోంది. ఇండియాలో కూడా శోధనా ప్రకటనల సేవల వ్యాపారంలో వివక్షాపూరితంగా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు గూగుల్ కి వ్యతిరేకంగా దాఖలయ్యాయి. తన వర్టికల్ భాగస్వాముల సంబంధించిన శోధన ఫలితాలను తన జెనెరిక్ మరియు సమాంతర అంతర్జాల శోధనా ఫలితాలతో కలిపివేసి ప్రదర్శిస్తూ తన శోధనా భాగస్వాములకు ప్రోత్సహించే విధంగా శోధనా పరివర్తక నిర్మాణ ప్రక్రియ (search alogorithms)లను మార్పు చేయడం (మానిపులేట్ చేయడం) ఇందులో ఒక భాగం.
ఉదాహరణకి యూ ట్యూబ్, గూగుల్ న్యూస్, గూగుల్ మ్యాప్ లు గూగుల్ కంపెనీకి వర్టికల్ భాగస్వాములు. ఇవన్నీ నిర్దిష్ట శోధనకు సంబంధించిన జెనెరిక్ సమాంతర శోధనకు చెందినవా లేదా అన్నదానితో సంబంధం లేకుండానే లేదా అది అత్యంత ఆదరణ పొందిన సందర్భ సహిత శోధనా ఫలితమేనా అన్నదానితో సంబంధం లేకుండానే అధిక ప్రాచుర్యం కల్పిస్తూ ప్రదర్శించబడతాయి. గూగుల్ పై వచ్చిన మరో ఆరోపణ గూగుల్ యూజర్ భద్రత మరియు యాడ్ వర్డ్ విధానాలు ఇష్టానుసారం రూపొందించారని అవి అనిర్ధిష్టంగా పక్షపాత పూరితంగా ఉన్నాయని గూగుల్ పై వచ్చిన మరో ఆరోపణ. దీని ద్వారా ప్రకటనల క్యాంపెయిన్ ను అది అర్ధంతరంగా రద్దు చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ప్రజానీకంలోని అత్యధిక భాగంపై భారీ ప్రభావం పడవేసేదిగా గూగుల్ అవతరించిందనడంలో అనుమానం లేదు. గూగుల్ తన విధానాలను మరింత పారదర్శకంగా మార్చాలని వాదించేందుకు తగిన భ్హూమిక నేడు స్పష్టంగానే ఏర్పడి ఉంది. కానీ ఇక్కడ విశ్వసనీయత సమస్యలు నెలకొని ఉన్నందున సమీప భవిష్యత్తులో ఇది జరగే అవకాశం అయితే లేదు.